తెలంగాణ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ ప్రస్తుత పదవీకాలం 2026 అక్టోబర్ 3తో ముగిసిన నేపథ్యంలో తదుపరి కమిషన్ నియామకంపై చర్చకు సమయం ఆసన్నమైంది.
2023లో బక్కి వెంకటయ్యను చైర్మన్‌గా నియమించడంతో పాటు మాల, మాదిగ, గోండు, లంబాడా వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు.
ఇప్పుడు ప్రశ్న కేవలం “ఎవరిని నియమించాలి?” అన్నది కాదు. సామాజిక దృక్పథం, రాజ్యాంగ నిబద్ధత, ప్రజా సమస్యలపై అవగాహన, స్వతంత్ర ఆలోచన, అంతకు మించి కుల వ్యవస్థ పుట్టుక, పెరుగుదల, పరిణామాలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తులకు ఈ బాధ్యత అప్పగించాలి.
గత ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఉపకులాలు, ప్రాంతాలకు సముచిత అవకాశాలు కల్పించే రొటేషన్ విధానం కూడా ఉండాలి.
కేవలం ఫిర్యాదుల విచారణ కాదు.. సామాజిక పరిష్కారం కూడా
ఎస్సీ కమిషన్ దళితులపై దాడులు, భూముల అన్యక్రాంతం, పెండింగ్ కేసుల సమీక్షకు మాత్రమే పరిమితం కాకూడదు.
కుల బహిష్కరణ, సామాజిక వెలివేత, కులపరమైన వివక్ష, గ్రామస్థాయిలో జరిగే చిన్నచిన్న కుల ఘర్షణలు కూడా తీవ్రమైన సామాజిక సమస్యలుగానే పరిగణించాలి.
చిన్న సంఘటనను ప్రారంభ దశలోనే పరిష్కరించకపోతే అది పెద్ద ఘర్షణగా మారవచ్చు. అందువల్ల “ఎవరిపై కేసు పెట్టాలి?” అనే ప్రశ్నతో పాటు “ఈ సమస్య ఎందుకు వచ్చింది? సామాజిక సంబంధాల్లో ఎక్కడ లోపం ఉంది? మళ్లీ జరగకుండా ఏం చేయాలి?” అనే మౌలిక ప్రశ్నలకు కూడా సమాధానాలు వెతకాలి.
బాధితుడికి చట్టపరమైన న్యాయం చేయడంతో పాటు సమస్యకు దారితీసిన సామాజిక పరిస్థితులను మార్చే ప్రయత్నం జరగాలి.
ఈ ఆలోచనతోనే నా సారథ్యంలో కుల నిర్మూలన వేదిక, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం ప్రతినిధి బృందం 2024లో ఎస్సీ కమిషన్‌కు లేఖ సమర్పించింది.
దళితులపై మాత్రమే కాకుండా ఏ కులానికి చెందిన వ్యక్తిపైనా కులపరమైన వివక్ష, కులం పేరుతో తీవ్రమైన దౌర్జన్యాలను కేవలం ఒక్కో నేర సంఘటనగా కాకుండా కుల వ్యవస్థ, కులతత్వం, సామాజిక ఆధిపత్యం నేపథ్యంలో పరిశీలించాలని కోరింది.
కులం పేరుతో తీవ్రమైన వివక్ష, దౌర్జన్యాలకు పాల్పడేవారిని “దేశద్రోహులు”గా పరిగణించేలా చట్టపరమైన చర్యలను పరిశీలించాలని, అంటరానితనం, కుల వివక్ష, సామాజిక వెలివేత వంటి కుల వ్యవస్థ ఆధారిత ఆచారాలను నిర్మూలించే సమగ్ర చట్టం కోసం జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది.
అదే లేఖలో గ్రామస్థాయిలో కుల పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక సంస్థలతో సంభాషణలు నిర్వహించి సమస్యలకు సామాజిక పరిష్కారాలు రూపొందించాలని సూచించింది.
ఇదే విధంగా బీసీ సమాజంలో కులపరమైన వివక్ష, సామాజిక అసమానతలు, హక్కుల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించాలని కోరుతూ బీసీ కమిషన్‌కు కూడా 2025లో లేఖ సమర్పించాం.
ఎస్సీ, బీసీ కమిషన్లు కలిసి తొలుత రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో, ఆ తర్వాత జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎస్సీ, బీసీ కుల సంఘాలు, కుల పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, యువత, సామాజిక సంస్థలతో సమావేశాలు నిర్వహించాలని కోరాం.
అయితే ఈ ప్రతిపాదనలపై తదుపరి సమావేశాల ప్రక్రియ ముందుకు సాగలేదు. లేఖ ప్రారంభం మాత్రమే; దాని తర్వాత కార్యాచరణే అసలు పరీక్ష.
గ్రామ ప్రజల సమక్షంలో పరిష్కారం
కుల వివక్ష, బహిష్కరణ, గ్రామస్థాయి ఘర్షణలను కేవలం పోలీస్ స్టేషన్ లేదా అధికారిక ఫిర్యాదుతో ముగించే విధానం సరిపోదు. చట్టపరమైన చర్య అవసరమైన చోట అది తప్పనిసరిగా జరగాలి.
అదే సమయంలో పరిస్థితి అనుమతించే చోట గ్రామ ప్రజల సమక్షంలో సామాజిక సంభాషణ జరగాలి. గ్రామ పెద్దలు, కుల పెద్దలు, మహిళలు, యువత, ఉపాధ్యాయులు, శ్రామికులు, ప్రజాప్రతినిధులు, పౌరసమాజం, జర్నలిస్టులు కలిసి సమస్యను చర్చించాలి.
అన్యాయాన్ని కప్పిపుచ్చకుండా బాధితుడికి న్యాయం చేస్తూనే, సమస్యకు దారితీసిన సామాజిక కారణాలను గుర్తించాలి.
ఇలాంటి సమావేశాలకు అధికారిక రూపం ఇవ్వాలి. కమిషన్ తనకు ఉన్న విచారణ, సమాచారం కోరడం, అధికారుల నుంచి నివేదికలు తీసుకోవడం, ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం వంటి అధికారాలను ఉపయోగించి జిల్లా, మండల యంత్రాంగంతో సమన్వయం చేయవచ్చు.
సమావేశాలను నమోదు చేసి, నిర్ణయాలపై తదుపరి సమీక్ష చేయడం, అవసరమైతే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ద్వారా దీనిని నిరంతర ప్రక్రియగా మార్చవచ్చు.
సామరస్యం కాదు.. సమాన హక్కులు, శ్రమ గౌరవం
ఎస్సీ-బీసీ సమాజాల సంబంధాలను కూడా సమానత్వ దృక్పథంతో చూడాలి. గ్రామీణ జీవితం అనేక వృత్తుల శ్రమపై ఆధారపడి ఉంటుంది.
విషాదం, ఆనందం, పండుగ, సామాజిక కార్యక్రమం— ఏ సందర్భమైనా అనేక వృత్తుల శ్రమ అవసరం.
అయితే ఈ పరస్పర అవసరాన్ని చూపించి చారిత్రక కుల అసమానతలను కప్పిపుచ్చకూడదు. వృత్తి ఆధారిత కుల వ్యవస్థలో అవమానం, అంటరానితనం, ఆధిపత్యం కూడా ఉన్నాయన్న వాస్తవాన్ని గుర్తించాలి.
అందువల్ల లక్ష్యం పైపై సామరస్యం కాదు; ప్రతి వృత్తికి గౌరవం, ప్రతి మనిషికి సమాన హక్కులు, వివక్షకు ముగింపు. ఎక్కడ వివక్ష ఉంటే అక్కడ ప్రశ్నించాలి. ఆధిపత్యం ఎవరివద్ద ఉన్నా ఎదుర్కోవాలి.
అదే సమయంలో శ్రామిక సమాజాల మధ్య ఉన్న సంబంధాలను శాశ్వత కుల వైరుధ్యాలుగా మార్చకుండా చూడాలి. ఈ దృక్పథంలో ఎస్సీ-ఎస్టీ కమిషన్‌తో పాటు బీసీ కమిషన్‌కూ బాధ్యత ఉంది.
నియామకంలో అర్హత ముందు.. ప్రాతినిధ్యం తర్వాత
కమిషన్ నియామకంలో మొదటి ప్రమాణం అర్హత కావాలి. రాజ్యాంగ విలువలపై నిబద్ధత, కుల వివక్షపై అవగాహన, అణచివేతకు గురైన వర్గాలతో పనిచేసిన అనుభవం, ప్రజా సమస్యలపై పరిజ్ఞానం, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేసే స్వతంత్రత ఉండాలి. ఆ తర్వాతే ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
గతంలో ఏ ఉపకులానికి, ఏ ప్రాంతానికి అవకాశం లభించిందో నమోదు చేసి రొటేషన్ విధానం రూపొందించాలి.
ఒకే ఉపకులం లేదా ఒకే ప్రాంతానికి వరుసగా అవకాశాలు కేంద్రీకృతం కాకూడదు. మాదిగ, మాలలతో పాటు ఇతర ఎస్సీ ఉపకులాలకు కూడా ప్రాతినిధ్యం విస్తరించాలి. ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ మధ్య ప్రాంతీయ సమతుల్యత ఉండాలి.
అర్హతల ప్రమాణాలను ముందుగానే ప్రకటించి, అభ్యర్థుల సామాజిక సేవా రికార్డును పరిశీలించాలి.
రాజకీయ విధేయతకు బదులుగా సామాజిక నిబద్ధత, రాజ్యాంగ విలువలపై విశ్వాసం, ప్రజా సమస్యలపై అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
రాజకీయ విధేయత కాదు.. రాజ్యాంగ నిబద్ధత
కమిషన్ ఏ ప్రభుత్వానికైనా అనుకూలంగా ఉండే సంస్థగా కనిపించకూడదు. ప్రభుత్వం తప్పు చేసినా ప్రశ్నించగలగాలి. పరిపాలనా యంత్రాంగంలో వివక్ష జరిగినా స్పందించాలి. ప్రభావశీలమైన సామాజిక వర్గం నుంచి అన్యాయం జరిగినా బాధితుడి పక్షాన నిలబడాలి.
అదే సమయంలో ఆరోపణ వచ్చిన ప్రతిసారీ ముందస్తు తీర్పు ఇవ్వకుండా ఆధారాల ఆధారంగా విచారణ జరపాలి.
అధికారానికి దగ్గరగా ఉండే కమిషన్ కాదు… అధికారాన్ని కూడా రాజ్యాంగం ముందు నిలబెట్టగల కమిషన్ కావాలి.
ఎస్సీ-ఎస్టీ కమిషన్ నియామకం కేవలం ఒక పదవి భర్తీ కాదు. కుల బహిష్కరణలు, వివక్ష, గ్రామస్థాయి ఘర్షణలకు ప్రారంభ దశలోనే పరిష్కార మార్గాలు చూపుతూ, ప్రజలతో కలిసి సామాజిక అవగాహన పెంచి, సమాన హక్కులు, శ్రమ గౌరవం, రాజ్యాంగ న్యాయాన్ని బలపరిచే సంస్థగా అది ఎదగాలి. అందుకే తదుపరి నియామకంలో అర్హతకు మొదటి స్థానం, ఉపకులాలు–ప్రాంతాలకు సమతుల్య ప్రాతినిధ్యం, రాజకీయ ఒత్తిళ్లకు అతీతమైన సామాజిక నిబద్ధతకు ప్రాధాన్యం దక్కాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
