బొలీవియా అడవుల్లో పోరాడుతున్న క్రమంలో సీఐఏ ఉచ్చులో చిక్కుకున్న చే గువేరాను తప్పించడానికి 1967 చివరలో సోవియట్ యూనియన్ చిట్టచివరి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం విఫలమైన దశాబ్దాల తర్వాత తాజాగా బయటపడింది. నిరంతర ప్రతిఘటన మరణానికి దారితీస్తుందని, బొలీవియా విడిచి వెళ్ళమని సోవియట్ అధికారులు చేసిన సూచనను చే తిరస్కరించారు. సహచరులను వదిలి వెళ్లడమంటే ద్రోహం చేయడమే అని చే భావన. చివరకు చేని ఒప్పించి, సోవియట్ బృందం కొంతమంది తన సహచరులను తమ వెంట తీసుకెళ్లిపోయిన మూడు రోజులకే చేగువేరా శత్రువు చేత చిక్కి అమరుడయ్యారు. ఆలస్యంగా బయటపడిన ఈ చారిత్రక ఉదంతం కొన్ని వాస్తవాలను బయటపెడుతోంది.
బోలీవియాలో చిక్కుకుపోయిన చే బృందాన్ని కాపాడటానికి సోవియట్ రక్షణ శాఖ తీసుకున్న చర్య అంతర్జాతీయ కార్మికవర్గ సహకారానికి అసలైన ప్రతీక. సహచరులను వదిలి వెంటనే బయట పడాలని సోవియట్ బృందం ఇచ్చిన సలహాను చే నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, తోటి సహచరులపట్ల తాను చూపించిన సహోదర భావానికి తిరుగులేని సంకేతం.
“వీరంతా నా సోదరులు. వారిని వదిలి వెళ్ళడం అంటే ద్రోహం చేయడమే” అంటూ చే చెప్పిన మాట ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న శక్తులకు శాశ్వత స్ఫూర్తిగా ఉంటుంది. మరణాన్ని ఎదుర్కొంటున్న తన సహచరులను విడిచిపెట్టడానికి ఆయన చేసిన చివరి తిరస్కరణ, విప్లవ మానవతావాదానికి, పీడిత వర్గాల విముక్తిపై శాశ్వత విశ్వాసానికి నిదర్శనంగా మిగిలిపోయింది. సీఐఏ ఉచ్చులో చిక్కుకున్న విప్లవకారుడిని తప్పించడానికి ఆనాడు సోవియట్ యూనియన్ ప్రదర్శించిన అంతర్జాతీయ సహకారం ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సమాచారం పోరాడే శక్తులందరికీ ప్రేరణగా ఉంటుంది.
1967 అక్టోబర్‌లో ఎర్నెస్టో “చే”గువేరా, అతని చిన్న గెరిల్లాల బృందం బొలీవియా పర్వతాలలో చివరి యుద్ధం చేస్తున్నప్పుడు, సామ్రాజ్యవాద నిఘా ద్వారా కాకుండా– అతని హత్యను నిరోధించడానికి నిశ్చయించుకున్న సహచరుల ద్వారా ఒక రహస్య మిషన్ జరుగుతోంది.
కోడ్ పేరు మేజర్..
సోవియట్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారుల నుంచి వచ్చిన ప్రత్యక్ష సూచనల మేరకు, ప్రధాన నిఘా డైరెక్టరేట్(జీఆర్యూ)గువేరాను బొలీవియా నుంచి విడిపించి సురక్షితంగా తీసుకురావడానికి “𝘔𝘢𝘫𝘰𝘳” అనే (కోడ్-నేమ్) సంకేత నామం గల రహస్య ఆపరేషన్‌ను ప్రారంభించింది. పురావస్తు శాస్త్రవేత్తల వేషంలో, సోవియట్ అధికారుల బృందం చిలీలోకి ప్రవేశించి, చే– అతని పోరాట యోధులలో ఒకరైన మాన్యుయెల్ అగుఫాస్టా కోసం నకిలీ పాస్‌పోర్ట్‌లను తీసుకొని బొలీవియాలోకి ప్రవేశించడానికి సిద్ధమైంది. విప్లవ నాయకుడిని అతని చుట్టూ ఉన్న ఉచ్చు నుంచి తొలగించడం వారి లక్ష్యం. ఈ ఉచ్చు యూఎస్ సలహాదారులు, సీఐఏ నిపుణుల పర్యవేక్షణలో బొలీవియన్ సైన్యం రూపొందించిన ఉచ్చు.
ఎస్టోనియాలో ప్రస్తుతం నివసిస్తున్న రిటైర్డ్ జీఆర్యూ అధికారి వ్లాదిమిర్ ఆర్; తరువాత ఇచ్చిన సాక్ష్యం ప్రకారం, ‘చే’ను కాపాడటానికి ఇది రెండవ సోవియట్ ప్రయత్నం. మునుపటి కేజీబీ ప్రయత్నం నష్టాలతో విఫలమైందని ఆయన నివేదించారు. 1967 నాటికి, సోవియట్ సైనిక నిఘా దక్షిణ అమెరికా అంతటా బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించింది. చిలీ ప్రధాన కార్యకలాపాల స్థావరంగా పనిచేస్తోంది.
“మా మార్గం బ్రెజిల్ ద్వారా కాకుండా చిలీ ద్వారా ఎంపిక చేయబడింది” అని వ్లాదిమిర్ అన్నారు. అంతేకాకుండా, “పురావస్తు పరిశోధన పేరుతో మా(కదలికలను) ప్రయాణానికి ఏర్పాటు చేసి, అధికారిక పత్రాలను క్లియర్ చేసిన ఆర్టూరియో అనుసంధాన కర్త మాకు ఉన్నారు”అని గుర్తుచేసుకున్నారు.
లాజిస్టికల్ అడ్డంకులు ఉన్నప్పటికీ, జీఆర్యూ బృందం అతని ఉరిశిక్షకు మూడు రోజుల ముందు– 1967 అక్టోబర్ 6న చేగువేరా శిబిరాన్ని చేరుకోగలిగింది, అలసిపోయిన స్థితిలో, సీఐఏ శిక్షణ పొందిన బొలీవియన్ రేంజర్లతో చుట్టుముట్టబడిన చే, మిగితా యోధులు సోవియట్ సందర్శకులను మౌనంగా అనుమానంతో స్వీకరించారు. “అక్కడ వారు ముప్పై నలుగురు ఉన్నారని, చే సన్నగా చిక్కిపోయి అలసటతో ఉన్నారని, తన ముఖాన్ని పెరిగిన గడ్డం మూసివేసిందని, కానీ అతని చూపు స్పష్టంగా ఉందని, వెంటనే తమని తను గుర్తించాడని” వ్లాదిమిర్ జ్ఞాపకం చేసుకున్నారు.
చేని బొలీవియా విడిచి వెళ్ళమని సోవియట్ అధికారులు కోరారు. నిరంతర ప్రతిఘటన మరణానికి దారితీస్తుందని హెచ్చరించారు. వారు అతనిని, తన సహచరుడు అగువాఫాస్టాను మాత్రమే ఖాళీ చేయమని తమకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ విషయం కమాండర్‌కు(చే గువేరాకు) కోపం తెప్పించింది. “నా కామ్రేడ్లను వదిలేయాలా? అది ఎప్పటికీ జరగదు. వీరంతా నా సోదరులు. వారిని వదిలి వెళ్ళడం అంటే ద్రోహం చేయడమే” అని ‘చే’ జవాబిచ్చాడు.
డానికి బదులుగా నిధులు, ఆయుధాలు, లాటిన్ అమెరికా అంతటా విప్లవ సమూహాలతో సమన్వయాన్ని పునరుద్ధరించడం ద్వారా మరింత మద్దతు ఇవ్వాలని అతను పట్టుబట్టాడు. “కాంగోలో తప్పు జరిగిందని” కానీ ఇది లాటిన్ అమెరికా అనీ, ఇక్కడ ప్రతిదీ సాధ్యమేననీ” అతను చెప్పాడు. అలసిపోయిన స్థితిలో, (గెరిల్లాల)సంఖ్య తగ్గుతున్నప్పటికీ, చే నమ్మకం విచ్ఛిన్నం కాలేదు. ఖండాంతర విముక్తి కోసం పోరాటాన్ని వదిలివేయలేదు.
మాస్కో ప్రతిస్పందన తర్వాత చర్చలను తిరిగి ప్రారంభించాలనే ఒప్పందంతో సమావేశం ముగిసింది.
అయినప్పటికీ చరిత్ర జోక్యం చేసుకుంది. సోవియట్ బృందం అగువాఫాస్టా నేతృత్వంలోని చే యూనిట్లో సగం మందిని చిలీ సరిహద్దు వైపు తీసుకెళ్లింది. అయితే చే, మిగిలిన యోధులు అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల్లోనే అమెరికా ఆదేశాల మేరకు పనిచేసిన బొలీవియన్ సైన్యం, లా హిగువేరా గ్రామంలో అతన్ని బంధించి సైన్యాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం కాల్చి చంపింది.
ఆ విధంగా “తన తోటి యోధుల పట్ల, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాటం పట్ల విశ్వాసంతో, రక్షించబడటానికి నిరాకరించిన వ్యక్తిని రక్షించడానికి సహచరులు చేసిన ప్రయత్నంగా 𝘔𝘢𝘫𝘰𝘳” ఆపరేషన్ విప్లవాల చరిత్రలో ఒక నెరవేరని ఘట్టంగా మారింది.
చేగువేరా మరణం అతని పోరాటానికి ముగింపు కాదు. కానీ అది ఒక చిహ్నంగా రూపాంతరం చెందింది. మరణాన్ని ఎదుర్కొంటున్న తన సహచరులను విడిచిపెట్టడానికి ఆయన చేసిన చివరి తిరస్కరణ, విప్లవ మానవతావాదానికి, పీడిత వర్గాల విముక్తిపై శాశ్వత విశ్వాసానికి నిదర్శనంగా మిగిలిపోయింది.
చేగువేరా కదలికలను క్యూబా నుంచి ఆయన అదృశ్యమైన 1965వ సంవత్సరం నుంచి అమెరికా తీవ్రంగా ట్రాక్ చేయడం, ఆయన మరణం గురించి ప్రారంభ సందేహాలు, ఆయన మరణం లాటిన్ అమెరికాలోని విప్లవకారులను నిరుత్సాహపరుస్తుందనే అమెరికా ఆశలను అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్(ఎన్ఎస్ఏ) 2020లో బహిర్గతం చేసిన రికార్డులు(Declassified Records)వివరిస్తాయి.
రెండేళ్ల పాటు క్యూబా నుంచి బొలీవియా వరకు చేగువేరా జాడను సీఐఏ ట్రాక్ చేసిన సమగ్ర సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
