హిందూ, అస్సామీ గుర్తింపులను ఏకం చేస్తూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రోత్సహించాలనే బీజేపీ వ్యూహం ఆ రాష్ట్రంలో పార్టీకి నిర్ణయాత్మక విజయాన్ని చేకూర్చింది.
అసోంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. 126 స్థానాలున్న అసెంబ్లీలో అధికార కూటమి సీట్ల సంఖ్య, ఓట్ల శాతం గణనీయంగా పెరిగాయి.
రాజకీయ ధ్రువీకరణ, చారిత్రక మార్పులు..
అసోం రాజకీయాల్లో భాషా, మతపరమైన, జాతి వైవిధ్యం కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా రాజకీయ ధ్రువీకరణకు తగిన అవకాశాన్ని కల్పించింది.
చారిత్రకంగా చూస్తే, ఈ రాష్ట్రం 1970ల మధ్య వరకు కాంగ్రెస్ ఆధిపత్యం నుంచి, 1980ల మధ్యలో ప్రాంతీయవాదం పెరుగుదల వరకు వివిధ రాజకీయ మార్పులకు లోనైంది.
ఆ తర్వాత 21వ శతాబ్దపు మొదటి దశాబ్దాలలో మళ్ళీ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.
ఒకప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ)కు కంచుకోటగా పరిగణించబడిన ఈ రాష్ట్రం, ఇప్పుడు బీజేపీకి బలమైన కేంద్రంగా మారింది.
అందువల్ల, ప్రస్తుత ఎన్నికల తీర్పును ఇప్పటికే ఉన్న రాజకీయ ఆధిపత్యానికి, బలపడిన సైద్ధాంతిక మూలాలకు లభించిన పునరుద్ధరించబడిన ఆమోదంగా పరిగణించాల్సి ఉంటుంది.
‘కాంగ్రెస్ వ్యవస్థ’లో పగుళ్లు – ఏఐయూడీఎఫ్ ఆవిర్భావం..
2011లో తరుణ్ గొగోయ్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే, అసోంలో ఒకప్పుడు తిరుగులేనిదిగా భావించబడిన ‘కాంగ్రెస్ వ్యవస్థ’లో పగుళ్లు మొదలయ్యాయి.
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ, అసోంలోని ప్రధాన తిరుగుబాటు సమూహాలతో చర్చలు జరిపి ‘శాంతి, అభివృద్ధిని’ నెలకొల్పిందన్న పేరుతో ఆ పార్టీ అప్పట్లో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది.
అయితే, ఆ ఎన్నికల్లో ఒక ముఖ్యమైన పరిణామం ఏమిటంటే.. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఉద్భవించడం. ఆ పార్టీ 18 స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, అప్పటివరకు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ‘ముస్లిం ఓట్లను’ భారీగా చీల్చింది.
కాంగ్రెస్కు ముస్లిం సందిగ్ధత – బీజేపీ డిజిటల్ వ్యూహం..
అయితే, ఆ సమయంలో ‘ముస్లిం ఓట్లు’ దూరం కావడం కాంగ్రెస్కు ఒక విధంగా మేలు చేసింది. ఎందుకంటే ఆ పార్టీ పట్ల హిందూ ఓటర్లలో సానుభూతి పెరిగి ఓట్లు లభించాయి.
లేదంటే ఆ ఓట్లు అప్పటికే అసోం రాజకీయాల్లో నెమ్మదిగా, స్థిరంగా ఎదుగుతున్న బీజేపీకి వెళ్లి ఉండేవి. ఏఐయూడీఎఫ్తో జరిగిన ఈ క్లిష్టమైన బేరసారాలు, ‘ముస్లిం ఓట్ల’ ప్రశ్న రాబోయే సంవత్సరాల్లో అసోంలో కాంగ్రెస్కు ఒక పెద్ద ‘ముస్లిం సందిగ్ధతను’ సృష్టించాయి.
తాజా నివేదికల ప్రకారం, ప్రస్తుత ఎన్నికల తీర్పులో కాంగ్రెస్ పార్టీ అసోంలోని హిందూ మెజారిటీ ప్రాంతాలలో దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనే వాస్తవంతో దీనిని కలిపి చూడాలి. ఆ పార్టీ గెలుచుకున్న మొత్తం 20 స్థానాల్లో కేవలం ఒకే ఒక్క హిందూ అభ్యర్థి ఎన్నికయ్యారు.
బీజేపీ అత్యంత చాకచక్యంగా రూపొందించిన డిజిటల్ ప్రచారం ద్వారా కాంగ్రెస్ను ఒక “మియా పార్టీ”గా(బెంగాలీ మాట్లాడే ముస్లింలను కించపరిచే పదం) చిత్రీకరించడంలో విజయం సాధించింది. ప్రతిపక్షాలు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాయి.
టీ తోటల కార్మికులు, తగ్గిన ప్రాంతీయ శక్తుల ప్రాభవం..
రాబోయే కాలంపై బలమైన ప్రభావం చూపే మరో ధోరణి ఏమిటంటే, టీ తోటల కార్మిక సంఘాలపై కాంగ్రెస్ పట్టు తగ్గడం. వేతనాల పెంపుదల, భూమి పట్టాల పంపిణీ, టీ తెగలకు షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) హోదా కల్పించడం వంటి హామీలను నెరవేర్చక పోవడమే ఇందుకు కారణం.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, గత ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం మొదటి రెండు డిమాండ్లను నెరవేర్చింది.
రాష్ట్రంలో ప్రాంతీయ శక్తుల ప్రాభవం తగ్గడం అనేది అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే స్పష్టమైంది. ఇప్పుడు అది మరింత స్థిరపడింది.
అసోం జాతీయ పరిషత్(ఏజేపీ), రైజోర్ దళ్లతో కాంగ్రెస్ కుదుర్చుకున్న ఒప్పందం ఆలస్యం కావడంతో ఆ కూటమి ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
ది హిందూ పత్రిక సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
