భూమిపై ఉన్న ప్రజాస్వామ్యాలను ఒక భూతం వెంటాడుతోంది. అది ప్రైవేట్జెట్లలో ప్రయాణిస్తుంది. దానికి ఏ పార్టీతోనూ ప్రత్యేక అనుబంధం ఉండదు. ఎందుకంటే అది అన్ని పార్టీలనూ అద్దెకు తీసుకుంటుంది.
ప్రతి ప్రమాణస్వీకార మహోత్సవంలోనూ ముందు వరుసలో నిలబడి అన్ని జాతీయ జెండాలకూ సలాం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థను సొంతం చేసుకోవడం చాలా చిన్న ఆశయమని భావించి, ఏకంగా రాజ్యాన్నే సొంతం చేసుకోవడానికి పూనుకున్న కొద్ది వేల మంది వ్యక్తులు వారు.
వారిని లెక్కించండి, ఎందుకంటే లెక్కించడమే స్వేచ్ఛాయుత ప్రజల మొదటి చర్య. జనవరి 2026 నాటికి 3,000 మందికి పైగా బిలియనీర్లు రికార్డు స్థాయిలో 18.3 ట్రిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారని ఆక్స్‌ఫామ్ వెలువరించింది.
2020 నుంచి లెక్కిస్తే ఇది 81 శాతం పెరిగింది. కానీ ఇదే సమయంలో దాదాపు ఐదు వందల కోట్ల మంది ప్రజలు మరింత పేదలుగా మారారు. ఆ సంపదలో 60 శాతం వారసత్వం, గుత్తాధిపత్యం, ఆశ్రిత పక్షపాతం నుంచి ఒనగూడిందే.
స్వీయకృషితో ఎదిగిన మేధావి అనేది కేవలం మనల్ని జోకొట్టడానికి వినిపించే కథ మాత్రమే. ఆ కథ వినిపించినందుకు కూడా ప్రజల నుంచే సొమ్ము వసూలు చేస్తున్నారు.
పన్నుల దుర్వినియోగం
వాళ్లు పన్నులు చెల్లించడానికి నిరాకరిస్తారు. బిలియనీర్లు తమ సంపదలో ప్రతిసారీ ఏటా సున్నా నుంచి అర శాతం మధ్య మాత్రమే వ్యక్తిగత పన్ను చెల్లిస్తారు. కానీ వారి ఆఫీసులను శుభ్రం చేసే మహిళ తాను కొనే సబ్బు నుంచి వంట నూనె వరకు జీఎస్టీ రూపంలో తన వద్ద ఉన్నదానికంటే ఎక్కువ మొత్తాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తుంది. పన్ను దుర్వినియోగం వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచం 492 బిలియన్ డాలర్లు కోల్పోతోంది.
భారతదేశంలో ‘బిలియనీర్ రాజ్’
భారతదేశంలో ఈ లెక్కలకు ఒక పేరుంది, అదే ‘బిలియనీర్ రాజ్’. దేశంలోని అత్యంత ధనవంతులైన ఒక శాతం మంది ఇప్పుడు జాతీయ సంపదలో 40.1 శాతాన్ని కలిగి ఉన్నారు.
శతాబ్ద కాలపు నమోదుల్లో ఇదే అత్యధికం. ఇది బ్రిటిష్ వారి పాలనా కాలం కంటే కూడా ఎక్కువ. ఇందులో అత్యంత తీవ్రమైన పెరుగుదల 2014 తర్వాతే వచ్చింది. గోడీ చాయ్‌వాలాకు సమాజంలో ఒక స్థానం కల్పిస్తానని మాట ఇచ్చి, చివరికి ఆ వేదికను తన స్నేహితులకు అప్పగించాడు.
మరోవైపు ఒక బిలియనీర్ రాత్రి భోజనం బిల్లు కంటే తక్కువగా ఉన్న అప్పుల కోసం రైతులు ఉరివేసుకుని చనిపోతున్నారు.
నేరుగా సభలోకి కోటీశ్వరులు
మన యుగం ప్రత్యేకత ఏమిటంటే, ఈ యజమానులు ఇకపై మధ్యవర్తుల ద్వారా పాలించడం లేదు. జనవరి 2025లో 1.3 ట్రిలియన్ డాలర్ల సంపద కలిగిన బిలియనీర్లు అమెరికా ప్రమాణస్వీకార మహోత్సవంలో కేబినెట్ అభ్యర్థుల కంటే ముందు వరుసలో కూర్చున్నారు.
వారిలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి తన సొంత కంపెనీలపై విచారణ జరుపుతున్న ప్రభుత్వ సంస్థల్లోకే నేరుగా నడిచి వెళ్లాడు.
2024లో భారతదేశపు కొత్త లోక్‌సభలోని 93 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులే. ఒక కోటీశ్వరుడైన అభ్యర్థి గెలిచే అవకాశం సాధారణ వ్యక్తి కంటే 28 రెట్లు ఎక్కువ.
ధనవంతులు ఇకపై లాబీల్లో వేచి ఉండటం మానేసి నేరుగా సభలోనికే అడుగుపెట్టారు.
వీరిని మనం సూటూ బూటూ తొడుక్కున్న నరమాంస భక్షకులు అనవచ్చు. ఈ ఆర్థిక వ్యవస్థ తన వినియోగదారులను బతికించే వేతనాలను, ఆసుపత్రులను నడిపించే పన్నులను, తనను హెచ్చరించే పత్రికా రంగాన్ని మింగేస్తుంది; ఆ తర్వాత తనకు ఆటంకంగా మారిన ప్రజాస్వామ్యాన్నే మింగేస్తుంది.
అమెరికా 2025లో తన సహాయ కార్యక్రమాలలో 83 శాతాన్ని రద్దు చేసినప్పుడు, 2030 నాటికి 1.4 కోట్లకు పైగా అదనపు మరణాలు సంభవిస్తాయని— అందులో 45 లక్షల మంది చిన్నపిల్లలేనని ‘ది లాన్సెట్’ పత్రిక అంచనా వేసింది. కానీ ఆ బిలియనీర్ యజమానులు దానికి ‘సమర్థత’ అని పేరు పెట్టారు.
మనం ఓటు వేసింది దీనికోసమేనా?
ఆ బిలియనీర్ యాజమానుల సంఖ్య కేవలం కొద్ది వేల మంది మాత్రమే, కానీ మన సంఖ్య ఎనిమిది వందల కోట్లు. ఈ వారం మూడు సంఖ్యలను మీ వెంట ఉంచుకోండి—18.3 ట్రిలియన్ డాలర్లు, 40.1 శాతం, 93 శాతం—వాటిని మీ కుటుంబ వాట్సాప్ గ్రూప్‌లలో మీ సొంత పేరుతో పోస్ట్ చేయండి, దాని కింద ఒకే ఒక్క ప్రశ్న వేయండి. మనం ఓటు వేసింది దీనికోసమేనా?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
