క్యూబాలో జెట్ చమురు నిల్వలు నిండుకున్నాయి. హవానాకి ఎగిరివచ్చే గాలి ఓడలు(విమానాలు) తిరిగి వెళ్లడానికి కావాల్సిన చమురు దొరకదు, కాబట్టి వాటి రాకపోకలు పడిపోయాయి.
దీంతో క్యూబా పర్యాటక రంగానికి పెద్ద దెబ్బ తగిలింది.
టూరిజం వల్ల కొన్ని ఇబ్బందులున్నప్పటికీ, అది తెచ్చే విలువైన విదేశీ మారక ద్రవ్యం క్యూబాకి కీలకం. చెప్పాలంటే క్యూబా పరిస్థితి ఇప్పుడు అత్యంత గడ్డుగా ఉంది.
1991లో సోవియట్ రష్యా కూలిపోయినప్పటి కన్నా, క్యూబాకు ఈనాడు పొంచి ఉన్న ముప్పు మరింత పెద్దది.
త్వరలోనే అక్కడ రవాణాకు, చలికాగడానికి, ఆసుపత్రులలో మన్కికాపు మరలు(life-saving machines) నడవడానికి, ప్రజల అవసరాలకు కావాల్సిన తక్కిన రకాల చమురు నిల్వలూ అడుగంటిపోనున్నాయి.
క్యూబా వల్ల అమెరికాకు ఎలాంటి ముప్పూ లేదని క్యూబా అధ్యక్షుడు మిగేల్ దియజ్ కనెల్ అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే, “మేము ఉగ్రవాదులకు చోటు ఇవ్వం. వేరే దేశాలు లేదా వేరే కూటములకు చెందిన పోరుబలగాలు(armed forces) క్యూబా నేలపై లేవు. క్యూబా నేలపై ఒక దండుపట్టు(military base) ఉన్న మాట వాస్తవమే. అయితే అది, క్యూబా ప్రజల అంగీకారం లేకుండా గ్వంటనామొ మండలంలో అమెరికా అక్రమంగా నెలకొల్పిన స్థావరం. ఎటువంటి మునుకట్టుబాట్లు(preconditions) లేకుండా అమెరికాతో చర్చలు జరపడానికి క్యూబా ఆయితపడి ఉంది. కానీ ఏలుబడి మార్పు(regime change)పై ఎటువంటి చర్చా జరగబోదు”అని దియజ్ కనెల్ స్పష్టం చేశారు.
క్యూబా ప్రజలు లొంగుబాటుకు ఎన్నడూ ఒప్పుకోరు. ఇది క్యూబా అంతటా మనకు కనిపిస్తుంది. అమెరికా తమపై బిగించిన కట్టడి ఉచ్చులో నలిగిపోతున్నా, వారు తన్పేరిమి(self-respect)ని వదులుకోరు.
2025, డిసెంబర్ నెల చివర్లో నలుగురు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధులు(Special Rapporteurs) క్యూబా మీద అమెరికా బిగించిన చుట్టుకట్టడి(blockade)పై ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ నలుగురిలో ఆస్ట్రేలియా నుంచి బెన్ సాల్(మానవ హక్కులు), గ్రీస్ నుంచి జార్జ్ కట్రుగాలోస్ (అంతర్జాతీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యం, సమత), భారతదేశం నుంచి సూర్య దేవ(అభివృద్ధి హక్కులు), కొలంబియాకు చెందిన జీనా రొమీరో (శాంతియుత సమావేశాల హక్కులు) ఉన్నారు.
ఐరాస చార్టర్ 2(4)వ ఆర్టికల్ ప్రకారం ఇటువంటి చుట్టుకట్టడి నిషిద్ధమని వారన్నారు.
ఇంకా చుట్టుకట్టడి చేసి, ఒంటెత్తు ఆంక్షలు పెట్టే హక్కు ఏ దేశానికీ లేదని; అలా చేయడం బలిమి వాడకమేననీ; ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1974 నిర్వచనం ప్రకారం ఇది ‘చట్టమెదిరి అరుముకోలు'(illegal aggression) కిందకే వస్తుందని వారు పేర్కొన్నారు.
ఐరాస చార్టర్ 51వ ఆర్టికల్ కింద ఇది కైదువారి దాడి(armed attack)గా పరిగణించబడుతుంది కాబట్టి, దాడికి గురైన దేశానికి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేయడం జరిగింది.
ఆ నివేదిక సారాంశం ఏమిటంటే, అమెరికా క్యూబాపై చేస్తున్న చుట్టుకట్టడి కేవలం చట్టమెదిరే కాక, బెదిరింపు అంచెను దాటి పోరునిల్క(state of war)లోకి దిగింది.
క్యూబా వక్కళం(revolution) తరువాత, క్యూబా వల్ల తనకు ఎటువంటి ముప్పూ లేకున్నా, క్యూబా ఎదురుదాడులు చేయకున్నా – అమెరికా దానిపై ఎడతెగని పోరు సల్పుతూనే వచ్చింది.
34 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాకి, కోటిన్నర మంది కూడా లేని క్యూబా అంటే ఎందుకంత భయం?
అమెరికా భయపడేది కేవలం క్యూబాని చూసి కాదు! అమెరికా పెత్తనానికి ఎదురు తిరిగిన క్యూబా వక్కళాన్ని చూసి. ఈ ఎదుర్తిరుక(defiance) మిగతా దేశాలకూ పాకుతుందన్న భయం వల్ల.
మెరుగైన ససిమి ఆలన(health care), విద్య, డాక్టర్లు, టీచర్లకు క్యూబా ఒక నమూనాగా నిలిస్తే; అమెరికా బాంబులకు, అక్రమ చొరబాట్లకు చిరునామాగా మారింది. ప్రపంచదేశాల ప్రజలు వ్రాయారికం(literacy) పొంది- ససి(health)తో, ఆశ, అవకాశాలతో నిండిన బ్రతుకులు గడపడం అమెరికాకు ఇష్టం లేదు. అందుకే క్యూబా వక్కళంపై దానికి అంతటి అక్కసు. ఎప్పుడూ ఆశలు కోల్పోయి, భయంతో అమెరికా పెత్తనం కింద అణిగిమణిగి ఉండే జనం దానికి కావాలి.
మన ముందు స్పష్టమైన రెండే దారులున్నాయి – ఒకవైపు తన్పేరిమి, మరో వైపు తలవంపు.
నువ్వు ఏది ఎంచుకుంటావు?
తన్పేరిమే నీ ఎంపికైతే, అహంకారానికి మారుపేరైన అమెరికా సామ్రాజ్యవాదం క్యూబా వక్కళంపై చేస్తున్న దాడిని నువ్వు తెగనాడాలి, ఎదురు చెప్పాలి!
వాళ్ళ దగ్గర కావాల్సినన్ని ట్యాంకులు ఉండొచ్చు. మన దగ్గర అవసరానికి తగినన్ని మాత్రమే ఉన్నాయి. అదనంగా ఒక్కటి కూడా లేదు. అయినా సరే, వేసంగి నడిపొద్దు కింద కరిగే మంచు ముక్కల్లా వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానాలంతా పిగిలిపోతాయి.
ఆనాడు మన వద్ద కేవలం ఏడు తుపాకులు, గుప్పెడు తూటాలే ఉన్నాయి. కానీ ఈనాడు ఏడుకు మించిన పోటుముట్లు మన దగ్గర ఉన్నాయి. వాటిని వాడకం నేర్చిన జనాలున్నారు. కొన్ని తప్పటడుగులు వేసినా – మిన్నయిన సంస్కృతి, చదువు, చైతన్యం నిండిన జాతిగా ఎదిగిన క్యూబన్లు, తమ దేశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మరోసారి వలస పాలన కిందకు పోనీయరు.
ఈ దేశమే తన్నికూల్చుకోగలదు. ఈ వక్కళం తనను తాను నాశనం చేసుకోగలదు తప్ప, మనల్ని వేరెవరూ కూలదోయలేరు. మనల్ని మనమే నాశనం చేసుకుంటే, ఆ తప్పు మనదే అవుతుంది.
ఫిడేల్ కాస్ట్రో, 2005.
ది ట్రైకాంటినెంటల్ సౌజన్యంతో..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
