దేశంలో విద్యావ్యవస్థ అక్రమాలకు, నీట్ 2026 పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ ధర్నా చేపట్టింది.
దీనికి మద్దతు తెలుపుతూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
2026 జులై 17 నాటికి ఆయన దీక్ష ఇరవై రోజులకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి.
హైదరాబాదులోని సామాజిక-పౌర సంస్థలెన్నో వాంగ్ చుక్ దీక్షకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి.
నెక్లెస్ రోడ్లో 2026 జులై 16 సాయంత్రం రెండు గంటల పాటు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి.
ఆ తర్వాత అక్కడి భారీ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించాయి.
ప్రభుత్వానికి హితవు – యువతకు అండ..
లక్షల మంది యువతీ యువకుల భవిష్యత్తు అంధకారమైపోతున్న తరుణంలో ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజెప్పడానికే తాను ఈ నిరాహార దీక్ష చేస్తున్నానని, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదని, ప్రభుత్వానికి సహాయపడేదేనని సోనమ్ వాంగ్ చుక్ దీక్షాస్థలిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
పేపర్ లీక్‌లతో భవిష్యత్తు కోల్పోయిన యువతీ యువకుల బాధతో, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల బాధతో, వారి తల్లిదండ్రుల బాధతో పోలిస్తే తన బాధ చాలా చిన్నదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సాగదీయకుండా సానుకూలంగా వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
ప్రభుత్వ మొండి వైఖరి..
కానీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వపు మొండి వైఖరి ఈ దేశ ప్రజలకు తెలుసు. గతంలో ఢిల్లీ సరిహద్దులో వందల మంది రైతులు ప్రాణాలర్పించినా ఈ ప్రభుత్వం చలించలేదు, స్పందించలేదు.
పైగా, రైతుల న్యాయమైన కోరికలను గుర్తించి తాము తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నామని కూడా ప్రకటించలేదు.
ఆ చట్టాల వల్ల కలగబోయే లాభాలు తాము రైతు నాయకులకు సరిగా చెప్పలేక పోయామని, వాటి మీద మరింత దృష్టి పెట్టి పరిశీలించాల్సిన అవసరం ఉందని, అందుకే ప్రస్తుతానికి రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానం వెలువరించింది.
వందల ప్రాణత్యాగాలకు విలువ ఇవ్వలేదు. రైతుల న్యాయమైన కోరికలకు విలువ ఇవ్వలేదు. తమ మూర్ఖత్వాన్ని అలాగే కొనసాగిస్తూ రైతు చట్టాలు మాత్రం వెనక్కి తీసుకున్నారు.
అందువల్ల, ఇప్పుడు సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష గురించి గానీ, లక్షల మంది యువతీ యువకుల భవిష్యత్తు గురించి గానీ ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నది అనుమానమే. చదువు విలువ ఏమాత్రం తెలియని ప్రభుత్వ పెద్దలు విద్యావ్యవస్థ గురించి ఆందోళన పడగలరని ఎలా అనుకోగలం?
బహుముఖ ప్రజ్ఞాశాలి సోనమ్ వాంగ్ చుక్..
సోనమ్ వాంగ్ చుక్ వంటి మేధావులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఒక ఇంజనీయర్, విద్యావేత్త, సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త. జమ్మూ కాశ్మీర్ కు చెందిన వాంగ్ చుక్ లడఖ్ ప్రాంతంలో పలు విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు.
స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్ మెంట్ ఆఫ్ లడఖ్ (సెక్మోల్) అనే సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నారు. మంచు స్థూపం(ఐస్ స్థూపా) సాంకేతికతను అభివృద్ధి చేసి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
2018లో రామన్ మెగసెసే పురస్కారం లభించినప్పుడు ఆయన పేరు బాగా వెలుగులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో మట్టి భవనాల నిర్మాణం చేసి, అందులో తన సెక్మోల్ క్యాంపస్‌ను మొత్తానికి మొత్తంగా సౌరశక్తితో నిర్వహించారు. అక్కడ వెలుతురు కోసం గానీ, వేడి కోసం గానీ, వంట చేసుకోవడానికి గానీ దేనికి శిలాజ ఇంధనాలు ఉపయోగించరు. పూర్తిగా సౌరశక్తినే ఉపయోగిస్తారు.
ఐస్ స్థూప ప్రాజెక్ట్..
ఈయన కృషిలో మంచు స్థూపం చెప్పుకోదగ్గది. లడఖ్ ప్రాంతంలో వృధాగా పోయే శీతాకాలపు నీటిని అడ్డుకట్టి శంఖాకారపు మంచు కుప్పల రూపంలో నిలువ చేస్తారు. వేసవిలో నీటి కొరత ఉన్నప్పుడు, పంటలకు నీరు కావల్సినప్పుడు ఈ మంచును కరిగించి ఉపయోగిస్తారు.
నీటి పారుదల కోసం కాలువలు తవ్వడం, గడ్డ కట్టించడం ఆ ప్రాంతంలో వందల సంవత్సరాలుగా ఉన్నదే. కానీ, వాంగ్ చుక్ మళ్ళీ ఆ పద్దతిని పునరుద్ధరించి, ఆధునీకరించి, అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ను తన సెక్మోల్ సంస్థ ద్వారా నిర్వహించారు.
2013-2014లలో ప్రారంభమైన ఐస్ స్థూప ప్రాజెక్ట్ లడఖ్ ప్రాంతంలో విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చింది. ఫలితంగా 2016 నవంబర్ 16న సోనమ్ వాంగ్ చుక్కు రోలెక్స్ అవార్డ్ ఫర్ ఎంటర్ప్రైజ్ దక్కింది. దాంతో ఐస్ స్థూప ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
లడఖ్ ఒక చల్లని ఎడారి, ఇక్కడి నేల ఘనీభవించి ఉంటుంది. గాలి, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, ఇక్కడ శీతాకాలంలో వ్యవసాయం చేయలేరు.
ఆ తరువాత వసంత కాలంలో నీటి అవసరం పెరుగుతుంది. కానీ, అప్పటికి వాగులు ఎండిపోయి ఉంటాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి మంచు కరగడం ప్రారంభమవుతుంది. ఈ వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని అక్కడ సేద్యం చేయాల్సి ఉంటుంది.
సోనమ్ వాంగ్ చుక్ అనుకోకుండా మే నెలలో ఒక వంతెన కింద మంచును గమనించారు. ఆ మంచు పై ఎండ నేరుగా పడకపోవడం వల్ల, అది కరగకుండా అలా ఉండిపోయిందన్న విషయం గమనించారు. లడఖ్‌లో మంచు నీడలో ఉంటే కరగకుండా ఎక్కువ కాలం ఉంటుందన్న విషయం గ్రహించి, తన ఐస్ స్థూప ప్రాజెక్ట్(శంఖాకారంలో నీటిని గడ్డ కట్టించడం)కు రూపకల్పన చేసుకున్నారు.
శంఖాకారమే ఎందుకు అంటే, శంఖాకారంలో ఉపరితల వైశాల్యం చాలా తక్కువగా ఉంటుంది గనుక ఎండ నేరుగా పడినా కూడా కరిగే మంచు చాలా తక్కువగా ఉంటుంది.
మొదటిసారి వాంగ్ చుక్ 6 మీటర్ల ఎత్తు, లక్షన్నర లీటర్ల నిలువ సామర్థ్యం ఉన్న మంచు స్థూపాన్ని నిర్మించారు.
2019లో 12 స్థూపాలు, 2020లో 25 స్థూపాలు నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ స్థూపాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇవి అక్కడి వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చాయి. ఈ పనితో వాంగ్ చుక్ రైతు బాంధవుడిగా, పర్యావరణ వేత్తగా వెలుగులోకి వచ్చారు.
జీవిత విశేషాలు, ఉద్యమాలు..
జమ్మూ కాశ్మీర్‌లోని అల్చిలో వాంగ్యాల్(తండ్రి), త్సెరింగ్ వాంగ్మో (తల్లి)లకు 1966 సెప్టెంబర్ 1న జన్మించిన సోనమ్ వాంగ్ చుక్ శ్రీనగర్‌లో చదువుకున్నారు. అక్కడి ఎన్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. తర్వాత ఫ్రాన్స్‌లోని క్రేటర్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మట్టి నిర్మాణ శిల్పకళ పై ఉన్నత విద్యను ఆర్జించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విఫలమైన విద్యార్థులకు ప్రత్యామ్నాయ విద్యావకాశాలు కల్పించడానికి తర్వాత కాలంలో ఆయన స్థాపించిన సెక్మోల్ ఎంతో ఉపయోగపడింది. దీంతో ఆయన కొన్ని సంస్కరణలు కూడా తీసుకురాగలిగారు.
అలాగే ఆపరేషన్ న్యూ హోప్(1994) అనే కార్యక్రమం ద్వారా లడఖ్ విద్యా వ్యవస్థలో ఆయనే మరికొన్ని సంస్కరణలు తేగలిగారు.
1993 – 2005 మధ్య కాలంలో వాంగ్ చుక్ లడగ్ మెలాంగ్ అనే పత్రికను తన స్వీయ సంపాదకత్వంలో నిర్వహించారు. ఇది లడఖ్ ప్రాంతంలో అచ్చయి వెలువడిన తొలి పత్రిక, ఏకైక పత్రిక.
సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి జె అంగో ఒడిశాలోని బాలాసోర్‌లో పంజాబీ జైన కుటుంబంలో పుట్టారు. ఆమె భువనేశ్వర్‌లో ఎంబీఏ పూర్తి చేసి, వాంగ్ చుక్ ను వివాహమాడి లడఖ్‌కు వచ్చారు. ఆ తర్వాత అక్కడ హెచ్ఐఏఎల్(హిమాలయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్) వ్యవస్థాపకురాలయ్యారు. దీనికి సీఈఓగా, డీన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ రకంగా విద్యావేత్తగా, సామాజిక పారిశ్రామిక వేత్తగా రాణించారు.
విద్య, సామాజిక అభివృద్ధి రంగాలలో చేసిన విశేష కృషికి గీతాంజలి అంగో భారత ప్రభుత్వం నుంచి ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డు(2022) అందుకున్నారు.
సోనమ్ వాంగ్ చుక్ గతంలో కూడా అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, పర్యావరణ రక్షణ, లడఖ్ ప్రాంత ప్రజల హక్కుల రక్షణ కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు.
2024లో లడఖ్‌కు ప్రత్యేక హోదాకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ప్రారంభమైన క్లైమేట్ ఫాస్ట్ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందులో భాగంగా 2025 సెప్టెంబర్ 24న లేహ్‌లో జరిగిన ఒక విధ్వంసానికి వాంగ్ చుక్‌ను బాధ్యుణ్ణి చేస్తూ పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద(ఎన్ఎస్ఏ) అరెస్ట్ చేసి, జైల్లో 170 రోజుల పాటు నిర్బంధించారు.
2026 మార్చి 14న విడుదలై బయటికి వచ్చారు. అందువల్ల, ఉద్యమాలు, జైలు జీవితం వాంగ్ చుక్కు కొత్తకాదు.
ప్రజాస్వామ్య స్వేచ్ఛకు ప్రతీక..
ప్రస్తుతం (జూన్-జూలై 2026) ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ తననుతాను గౌరవ కాక్రోచ్‌గా పేర్కొంటూ తాను నిరుద్యోగిని కానీ, సోమరిపోతును గానీ కాకపోయినా యువత ఆవేదనకు తన సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు.
ఆ రకంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛకు సంబంధించి దేశంలో వాంగ్ చుక్ ప్రముఖ స్వరంగా మారారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనకు సంఘీభావం తెలియజేశాయి.
నేటి ప్రభుత్వ విధానాలు తెలుసు కాబట్టి, దీక్ష విరమించి ప్రాణం కాపాడుకోవాలని కొందరు హితవు పలికారు. సోనమ్ వాంగ్ చుక్‌ను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి, ఆయన ప్రాణాలు కాపాడ వలసిందిగా ఢిల్లీ హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ దేశంలో మేధావుల్ని వేధించడం, వారి ప్రాణాలు తీయడం ఈ ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రభుత్వానికి కొత్తకాదు. అందువల్ల, ప్రజలే పూనుకుని సోనమ్ వాంగ్ చుక్ వంటి మేధావుల్ని కాపాడుకోవాలి. కరుడు గట్టిన ప్రభుత్వ పెద్దల మూర్ఖత్వాన్ని బద్దలు కొట్టడానికి ప్రజలే నడుం బిగించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
