కాంట్రాక్టు కార్మిక వ్యవస్థలోని ‘తేకేదారీ’ విధానం వల్లే ఎన్సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం)లో వలస కార్మికుల నిరసనలు తలెత్తుతున్నాయి.
కేవలం కార్మిక చట్టాల్లో వచ్చిన మార్పులే దీనికి కారణం కాదు. తాత్కాలిక పనిలో శాశ్వతంగా చిక్కుకుపోవడం, కార్మికుల నియామకం దోపిడీగా మారడం, యజమానులు–కాంట్రాక్టర్లు–ప్రభుత్వం మధ్య త్రికోణ ఉచ్చులో కార్మికులు బందీలవడం అనే మూడు వైరుధ్యాలు వారి అసంతృప్తికి, సమిష్టి పోరాటాలకు కారణమవుతున్నాయి.
2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు భారతదేశంలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో కార్మికుల నిరసనలు జరిగాయి. చమురు శుద్ధి కర్మాగారాల నుంచి గిగ్ పనులు, గృహ సంబంధిత పనుల వరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత వలస కార్మికులు ఈ నిరసనలకు ప్రధానంగా నాయకత్వం వహించారు.
వేతనాల పెంపు, సకాలంలో చెల్లింపులు, వృత్తిపరమైన భద్రతా పరికరాలు సమకూర్చడం, ప్రమాదాల్లో గాయపడిన వారికి పరిహారం చెల్లించడం, సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించడం వంటి అనేక డిమాండ్లను వలస కార్మికులు ముందుకు తెచ్చారు.
చాలా కాలంగా వారిలో పేరుకుపోతున్న అసంతృప్తి ఈ నిరసనల రూపంలో బయటపడింది. అదే సమయంలో వలస కార్మికుల దోపిడీకి బలంగా పాతుకుపోయిన వ్యవస్థాగత నిర్మాణాన్ని కూడా ఈ నిరసనలు బహిర్గతం చేశాయి.
భారతదేశ వలస కార్మికులు దేశంలోని అంతర్గత శ్రామికశక్తిలోనే కాకుండా, అస్థిరమైన ఉపాధి పరిస్థితుల్లో పనిచేస్తున్న అంతర్జాతీయ వలస కార్మికుల్లోనూ గణనీయమైన భాగంగా ఉన్నారు.
బ్రిటన్, అరేబియా గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ వంటి ప్రాంతాల్లోనూ భారతీయ వలస కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు.
ఈ నిరసనల స్వభావం, వాటి వెనుక ఉన్న కారణాలపై అనేక వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే వాటిలో ఎక్కువగా కార్మికుల ‘పోరాట శక్తి’, వారు లేవనెత్తిన డిమాండ్లపైనే దృష్టి పెట్టారు. ఆ డిమాండ్లను సాధించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్న పరిస్థితులపై అంతగా దృష్టి సారించలేదు.
‘కార్మికులు ఎందుకు నిరసనలు చేస్తున్నారు?’ అని ప్రశ్నించడానికి బదులుగా, ‘కార్మికుల నిరసనలకు అనుకూలమైన లేదా ప్రతికూలమైన పరిస్థితులను రూపొందిస్తున్న శ్రమ సంబంధాలను ఎలా అర్థం చేసుకోవాలి?’ అనే ప్రశ్నను నేను ముందుకు తెస్తున్నాను.
ఈ ‘ఎలా?’ అనే ప్రశ్న కార్మికుల్లో అసంతృప్తిని పెంచుతున్న నిర్దిష్ట పరిస్థితులను, అవి సమిష్టి పోరాటాలకు ఎలా దారితీస్తున్నాయో పరిశీలించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది (బ్రెమన్ 2026).
కేవలం కార్మిక చట్టాల్లో వచ్చిన మార్పుల వల్లనో, రాజకీయ సంస్థల ఉనికి లేకపోవడం వల్లనో కార్మికుల నిరసనలు జరుగుతున్నాయని వివరించే పరిమిత దృక్పథాన్ని ఇది అధిగమిస్తుంది.
భారతదేశంలోని వివిధ పని రంగాల్లో లోతుగా పాతుకుపోయిన కాంట్రాక్టు కార్మిక వ్యవస్థే ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ వ్యవస్థ కార్మికుల అసంతృప్తిని, వారు రాజకీయంగా సంఘటితమై పోరాటాలకు దిగే అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుందన్నది కీలకం.
కాంట్రాక్టు వ్యవస్థపై ఆధారపడిన వలస కార్మికశక్తి
2000వ దశకం ఆరంభం నుంచి భారతదేశ తయారీ రంగం కాంట్రాక్టు కార్మికులపైనే ఎక్కువగా ఆధారపడి నడుస్తోందని ఇటీవలి గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈ రంగంలో కాంట్రాక్టు కార్మికుల వాటా రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. దీనివల్ల కార్మికులు సంఘాలుగా ఏర్పడే అవకాశాలు తగ్గిపోయాయి.
అయితే నిర్మాణ రంగం, దుస్తుల తయారీ పరిశ్రమ వంటి అసంఘటిత రంగాల్లో పరిస్థితి మరోలా ఉంది. కార్మిక సంఘాలు ఏర్పడుతున్నప్పటికీ, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వలస కార్మికుల్లో అధిక శాతం ఎలాంటి లిఖితపూర్వక ఒప్పందాలు లేకుండానే పనిచేస్తున్నారు.
భారతదేశంలో అంతర్గతంగానే కాకుండా విదేశాలకు వలస వెళ్తున్న శ్రామికుల సంఖ్య కూడా భారీగానే ఉంది.
2025 నాటికి భారతదేశంలో మొత్తం 60 కోట్ల మంది వలస వెళ్లగా, వారిలో 20 కోట్ల మంది ఉపాధి కోసం వలస వెళ్లినవారు. వీరిలో అత్యధికులు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు. ఈ 20 కోట్ల మందీ శ్రామికులే.
భారతదేశంలోని అంతర్గత వలస కార్మికుల్లో అత్యధికులు ‘నౌకరీ’ (నెలవారీ జీతంతో కూడిన ఉద్యోగం) కాకుండా ‘కామ్’ (అభద్రతతో కూడిన, అస్థిరమైన పని) చేస్తున్నారు.
నౌకరీలో పనిచేసేవారికి వేతనంతో పాటు సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా లభిస్తాయి (ప్యారీ 2019). కానీ వివిధ రంగాల్లో ప్రతికూల పరిస్థితుల మధ్య ‘కామ్’ చేసే కార్మికులు కాంట్రాక్టు వ్యవస్థ ద్వారానే పనులు పొందుతున్నారు. వలస కార్మికులు అధికంగా పనిచేస్తున్న రంగాల్లో నిర్మాణ రంగం కూడా ఒకటి.
కార్మిక కాంట్రాక్టు వ్యవస్థను పరిశీలించాలంటే 19వ శతాబ్దం చివరి భాగం, 20వ శతాబ్దం ప్రారంభ కాలానికి తిరిగి వెళ్లాలి. అప్పట్లో మిల్లులు, కర్మాగారాలకు కార్మికులను నియమించే పనిలో మధ్యవర్తులు కీలక పాత్ర పోషించేవారు. వీరిని ‘జాబర్లు’, ‘ముకాదంలు’, ‘దఫాదార్లు’, ‘తేకేదార్లు’ అని పిలిచేవారు. కార్మికుల నియామకానికి మధ్యవర్తిత్వం వహించడమే వీరి ప్రధాన పని (రాయ్ 2008).
అయితే క్రమంగా నిర్మాణ రంగం వంటి వివిధ పని రంగాల్లో ఈ మధ్యవర్తుల్లో కొందరు కార్మికుల రోజువారీ పనులను నిర్వహించడంలో కూడా ప్రధాన భూమిక పోషించడం ప్రారంభించారు.
నిర్మాణ స్థలాలు, దుస్తుల తయారీ కర్మాగారాలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వంటి కర్మాగార సంబంధిత రంగాల్లోనే కాకుండా, గిగ్ పనులు, భద్రతా సిబ్బంది, ఇళ్ల వద్ద జరిగే ఎంబ్రాయిడరీ వంటి కర్మాగారాలతో సంబంధం లేని రంగాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
కార్మికుల శ్రమ నుంచి అదనపు విలువను పిండుకుంటూనే, భారతదేశంలో రాజకీయ పోరాటాలకు ఉన్న అవకాశాలను కూడా కాంట్రాక్టు వ్యవస్థ ప్రభావితం చేసిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.
సాధారణంగా ‘తేకేదారీ వ్యవస్థ’ అని పిలిచే ఈ కాంట్రాక్టు విధానంలో వరుసగా అనేక స్థాయిల్లో తేకేదార్లు ఉంటారు. వీరందరికీ పైన ఒక ‘ప్రధాన యజమాని’ ఉంటాడు. కొందరు కాంట్రాక్టర్లు కార్మిక చట్టాలకు అనుగుణంగా నమోదు చేసుకుని పనిచేస్తుండగా, మరికొందరు చట్టపరమైన వ్యవస్థకు వెలుపల పనిచేస్తుంటారు. ఈ విధంగా నిర్మాణ రంగంలో అధికారిక, అనధికారిక ఉపాధి మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతాయి.
అదే సమయంలో 1970 నాటి కాంట్రాక్టు కార్మిక (క్రమబద్ధీకరణ, రద్దు) చట్టం, 1979 నాటి అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం వంటి చట్టపరమైన నిబంధనలు కూడా కాంట్రాక్టర్ల ద్వారా వలస కార్మికులను నియమించుకునే వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయి (ముంజాల్, బాంబా 2023).
కాంట్రాక్టు వ్యవస్థ అనేది కాంట్రాక్టర్లు, యజమానులు, ప్రభుత్వం కలిసి చారిత్రకంగా నిర్మించిన, కొనసాగిస్తున్న వ్యవస్థ (ముంజాల్, బాంబా 2023). ఈ వ్యవస్థ రెండు రకాల ఒప్పందాల ద్వారా క్రమంగా దోపిడీ సంస్కృతిని పెంపొందించింది (చక్రవర్తి 2001).
మొదటిది ‘లేబర్ కాంట్రాక్టు’. ఇందులో కాంట్రాక్టర్ నిర్ణీత కాలానికి కార్మికులను మాత్రమే సరఫరా చేస్తాడు. రెండోది ‘జాబ్ కాంట్రాక్టు’. ఇందులో కాంట్రాక్టర్ ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటాడు (బారిక్, సాహూ 2025).
కార్మికుల శ్రమ నుంచి అదనపు విలువను పిండుకునే ఈ విధానం దేశంలోని వలస కార్మికులు ఎదుర్కొంటున్న దోపిడీ పరిస్థితులను సాధారణమైనవిగా మార్చేసింది.
అంతేకాకుండా ఆ దోపిడీని కనిపించకుండా చేస్తోంది. కాబట్టి కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను కేవలం ‘కార్మిక చట్టాల’ నుంచి పుట్టుకొచ్చిన సంబంధంగా లేదా వాటిపైనే ఆధారపడిన వ్యవస్థగా చూడటం మానుకోవాలి. దానికి బదులుగా కార్మికుల శ్రమ నుంచి అదనపు విలువను రాబట్టుకునే ఒక సామాజిక సంబంధంగా దాన్ని అర్థం చేసుకోవాలి.
కార్మికుల శ్రమ నుంచి అదనపు విలువను పిండుకుంటూనే, భారతదేశంలో రాజకీయ పోరాటాలకు ఉన్న అవకాశాలను కూడా కాంట్రాక్టు వ్యవస్థ ప్రభావితం చేసిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది కాంట్రాక్టు ఆధారిత కార్మిక వ్యవస్థలోని వైరుధ్యాలను తెలియజేస్తోంది.
20వ శతాబ్దం ప్రారంభంలో జాబర్లే కార్మిక సంఘాల నాయకులుగా ఉంటూ వస్త్ర మిల్లుల కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించడం ఈ వైరుధ్యానికి నిదర్శనం (చందావర్కర్ 2008).
అయితే బారిక్, సాహూ (2025) ఇటీవలి పరిశోధన ప్రకారం, సంఘటిత రంగ కార్మికుల్లో పని ప్రదేశాల్లో జరిగే సమ్మెలు, యాజమాన్యాలు విధించే లాకౌట్లు గణనీయంగా తగ్గిపోయాయి.
హైదరాబాద్ నగరంలోని నిర్మాణ స్థలాల్లో నేను చేసిన పరిశోధనలో ఒక విషయం వెల్లడైంది. తేకేదార్లతో తమకున్న సంబంధాలు దెబ్బతింటాయనే భయంతో వలస కార్మికులు కార్మిక సంఘాల్లో చేరడానికి వెనుకాడుతున్నారు.
అంతేకాకుండా ఇలాంటి పని ప్రదేశాల్లో అసంఘటిత వలస కార్మికులు రాజకీయంగా స్పందించి పోరాటాలు చేస్తున్నప్పటికీ, అవి స్వల్పకాలికంగానే ఉంటున్నాయి. పెద్దగా గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదు. అయినప్పటికీ కార్మికుల్లో పేరుకుపోయిన అసంతృప్తి సమిష్టి పోరాటాలకు దారితీస్తోంది.
నిర్దిష్ట పరిస్థితుల్లో వలస కార్మికులను పెట్టుబడికి అనుసంధానం చేస్తూనే, వారి మధ్య దూరాన్ని కూడా కొనసాగించే కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ నుంచే ఈ పరిణామం ఉత్పన్నమవుతోంది. ఇవి పరస్పర విరుద్ధమైన శ్రమ సంబంధాలు. ఒకవైపు కార్మికుల దోపిడీకి వీలు కల్పిస్తూనే, మరోవైపు రాజకీయ పోరాటాలకు ఉన్న అవకాశాలను కూడా ఇవే ప్రభావితం చేస్తున్నాయి.
కాంట్రాక్టు ఆధారిత శ్రమ సంబంధాల్లో అంతర్లీనంగా ఉన్న వైరుధ్యాల వ్యక్తీకరణగానే ఈ నిరసనలను అర్థం చేసుకోవడం వల్ల కార్మికుల అసంతృప్తికి గల కారణాలను గుర్తించగలుగుతాం.
అంతేకాకుండా ఈ వైరుధ్యాల మధ్య రూపుదిద్దుకుంటున్న రాజకీయ శక్తులుగా వలస కార్మికులను గ్రహించడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
ఈ వైరుధ్యాలను మూడు ప్రధాన అంశాలుగా వివరించవచ్చు. వీటినే నేను ‘కార్మిక కాంట్రాక్టు వ్యవస్థలోని మూడు వైరుధ్యాలు’గా పేర్కొంటున్నాను.

తాత్కాలికతలో శాశ్వతత్వం
మొదటి వైరుధ్యం ఏమిటంటే, కాంట్రాక్టర్ల ద్వారా కార్మికులను పదేపదే తాత్కాలికంగా నియమించుకుంటూ, వారిని శాశ్వత కార్మికులుగా మార్చే ఒక భ్రమను ఈ వ్యవస్థ సృష్టిస్తోంది.
ఈ కాంట్రాక్టు వ్యాపారంలో ఎక్కువగా అగ్రకుల పురుషులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా వివిధ కులాలు, జాతులకు చెందిన వలస కార్మికులకు తమ గ్రామాలకు దూరంగా ఉపాధి పొందే అవకాశం కల్పిస్తున్నారు.
కార్మికులకు కొంత నగదును ముందుగానే ఇచ్చి, వారి సమయాన్ని, పనిచేసే సామర్థ్యాన్ని తమ కోసం కేటాయించుకునేలా చేసుకుంటారు. దానికి ప్రతిఫలంగా తేకేదారు నమ్మకం, కుటుంబ సంబంధాల ఆధారంగా కొనసాగుతున్న రాతపూర్వకంగా లేని ఒప్పందంలోని షరతులను నిర్ణయిస్తాడు.
కార్మికులకు ముందస్తుగా డబ్బు ఇవ్వడం ద్వారా అదనపు విలువ పోగుపడటానికి పునాది పడుతుంది. కార్మికులను వివిధ నిర్మాణ స్థలాలకు పంపిస్తారు. తేకేదారు వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి వారు తప్పనిసరిగా పనిచేయాల్సి వస్తుంది.
ఒక కార్మికుడు మరింత కాలం పనిచేయాలనుకుంటే, తేకేదారు మరోసారి కొంత నగదును ముందస్తుగా ఇస్తాడు. తద్వారా కార్మికుడి పని సామర్థ్యాన్ని తన కోసం కేటాయించుకుంటాడు. ఈ చక్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
కాంట్రాక్టు వ్యవస్థ కార్మికులకు ఉపాధి కల్పించే మార్గంగా కనిపిస్తున్నప్పటికీ, తరతరాలుగా కొనసాగే అప్పుల సంబంధాల్లో వారిని ఇరుక్కుపోయేలా చేస్తోంది.
ఈ కోణంలో చూస్తే, అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో వలస కార్మికుల భాగస్వామ్యం కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా వారిని చేర్చుకునే ప్రక్రియపై ఆధారపడి ఉంది.
అయితే ఈ వ్యవస్థ వలస కార్మికుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.
నిర్మాణ స్థలాల్లో పనిచేస్తున్న వివిధ తేకేదార్లతో మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. కార్మికులు దశాబ్దాల తరబడి ఒకే తేకేదారు వద్ద గానీ, వేర్వేరు తేకేదార్ల వద్ద గానీ, అనేక పని ప్రదేశాల్లో మారుతూ పనిచేస్తున్నారు. ఇది ఆయా పరిశ్రమల నిర్దిష్ట అవసరాల ఆధారంగా జరుగుతోంది.
ఈ విధంగా తేకేదారీ వ్యవస్థ కార్మికుల వలసలను నియంత్రించే ఒక కవాటంలా పనిచేస్తోంది. అంతర్గతంగా, అంతర్జాతీయంగా జరిగే వలసల్లో ఏది చక్రీయ వలసగా, ఏది కాలానుగుణ వలసగా, ఏది తాత్కాలిక వలసగా మారాలన్నదానిని కూడా ఈ వ్యవస్థ నిర్ణయిస్తోంది.
ఇదే తరహా కాంట్రాక్టు విధానాలు అరేబియా గల్ఫ్ దేశాల్లో ఇటీవల పునర్వ్యవస్థీకరించిన ‘కఫాలా’ వ్యవస్థలోనూ కనిపిస్తాయి.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న ‘తాత్కాలిక కార్మిక వలస’ లేదా ‘కాలానుగుణ కార్మిక వీసా’ పథకాల్లోనూ ఇవి ఉన్నాయి.
మలేసియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఇలాంటి విధానాలు అమలవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తి రంగాల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో జరిగే కార్మిక వలసల్లోనూ ఇవి గోచరిస్తాయి.
ఈ కోణంలో చూస్తే, భారతదేశంలోని తేకేదారీ వ్యవస్థ కార్మికులకు తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, ఒక తేకేదారు వద్ద పనిచేయడంలో మాత్రం తాత్కాలికతే శాశ్వతంగా మారిపోయింది.
కార్మికుల నియామకం నుంచి దోపిడీని వ్యవస్థీకరించడం వరకు
తేకేదార్లను సాధారణంగా కార్మికులను నియమించే మధ్యవర్తులుగానే చూస్తారు. కానీ వాస్తవానికి వారు భవన నిర్మాణదారులతో కలిసి నిర్మాణ పనుల రోజువారీ నిర్వహణను చేపడుతూ కార్మికుల దోపిడీని వ్యవస్థీకరిస్తున్నారు.
అయితే తేకేదార్లు కూడా నిర్మాణదారుల చేతుల్లోనే ఉంటారు. నిర్మాణ స్థలాలకు ఎంతమంది కార్మికులు రావాలి, ఎంతమంది పనిచేయాలి అనే విషయాలను నియంత్రించడం ద్వారా ప్రతిరోజూ ఎంత అదనపు విలువ పోగుపడాలన్నదానిని నిర్మాణదారులే నిర్ణయిస్తారు.
చమురు శుద్ధి కర్మాగారాల్లో జరిగిన నిరసనలకు ప్రధాన కారణాల్లో ఒకటి ‘గేట్ పాస్’ విధానం ద్వారా కార్మికులను ఒకే పని ప్రదేశానికి పరిమితం చేయడం.
ఈ విధానంలో కార్మికులు తమ ఇష్టానుసారం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. గేట్ పాస్ అనేది ప్రధానంగా తేకేదార్లు, నిర్మాణదారుల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కార్మికుల ప్రవేశ, నిష్క్రమణలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
గేట్ పాస్‌ను పునరుద్ధరించకపోతే తేకేదార్లు ప్రత్యామ్నాయ పనులు వెతుక్కోవడం, కార్మికులను ఒక పని ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించడం సాధ్యం కాదు. ఇది కార్మికులను ఒకచోట కట్టిపడేయడంలా కనిపించవచ్చు.
అయితే నిర్మాణదారుల విస్తృత లక్ష్యం మాత్రం అదనపు విలువను పిండుకునే అవకాశాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడటమే. వాటిని మార్చడం గురించి వేరే చెప్పనవసరం లేదు.
అదనపు విలువను పోగుచేసుకోవడానికి నిర్మాణదారులు అనుసరించే మరో వ్యూహం తేకేదార్లకు చెల్లించాల్సిన బిల్లులను నాలుగు లేదా ఐదు నెలల వరకు ఆలస్యం చేయడం. దీనికి తోడు కార్మికులకు వేతనాలు చెల్లించే విధానం కూడా సూటిగా ఉండదు.
వలస కార్మికులకు పని ప్రారంభించే ముందే కొంత మొత్తం అడ్వాన్స్‌గా ఇస్తారు. ఆ తర్వాత తేకేదార్లు వారికి వారానికొకసారి జీవన ఖర్చుల కోసం కొంత డబ్బు ఇస్తుంటారు. కార్మికులు తీసుకున్న ఈ వారపు ఖర్చులను ముందుగా ఇచ్చిన అడ్వాన్స్‌లో సర్దుబాటు చేసిన తర్వాత, తేకేదారు నుంచి కార్మికుడికి రావాల్సిన మొత్తం ఎంత, లేదా కార్మికుడు తేకేదారుకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది తేలుతుంది.
దీనితో పాటు కార్మికుడు ఎన్ని రోజులు పనిచేశాడన్న వివరాలను కూడా నమోదు చేస్తారు. తేకేదార్లు నిర్ణయించిన రోజువారీ వేతనాల ఆధారంగా కార్మికుడి నుంచి గరిష్ఠ లాభం పొందేలా రావాల్సిన బకాయి వేతనాలను లెక్కిస్తారు. ఆ తర్వాత ముందుగా చేసిన లెక్కల ప్రకారం కార్మికుడు చెల్లించాల్సిన మొత్తానికి, రావాల్సిన వేతనాలను సర్దుబాటు చేస్తారు.
కార్మికులు యజమానులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వం అనే మూడు పక్షాల మధ్య ఏర్పడిన త్రికోణ సంబంధంలో చిక్కుకుపోతున్నారు. దీనివల్ల గుర్తింపు పొందిన శ్రమ సంబంధాలు లేకుండా పోతున్నాయి. సంఘటితమయ్యే హక్కు, మానవ హక్కులు కూడా వారికి దూరమవుతున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో వేతనాల పెంపునకు సంబంధించిన సంస్కరణలను అనుసరించి తమ వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్ చేసినప్పుడు, అసలు వేతనం ఎలా ఖరారవుతోందన్నదే ప్రధాన సమస్యగా మారింది.
కార్మికుడు తేకేదారుకు చెల్లించాల్సిన అప్పు, జీవన ఖర్చుల కోసం తీసుకున్న డబ్బు, ఆ రోజు చేసిన పనికి సంపాదించిన వేతనం మధ్య తేడా ఆధారంగా వేతనం నిర్ణయమవుతోంది.
ఈ విధానాన్ని కార్మికులు ‘హిసాబ్’ (లెక్కలు) అని పిలుస్తారు. అంటే వేతన చెల్లింపులు అనేవి కేవలం పనిచేసినందుకు డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు. తేకేదార్లు, కార్మికుల మధ్య అనేక రకాల లెక్కలు, బేరసారాలతో కూడిన సంక్లిష్టమైన ప్రక్రియ అని దీని ద్వారా తెలుస్తోంది.
నిర్మాణదారులు తేకేదార్లకు చెల్లింపులు ఆలస్యం చేస్తే, కార్మికులకు వారానికొకసారి ఇచ్చే జీవన ఖర్చుల డబ్బు కూడా తగ్గిపోవచ్చు. అయితే కొంతమంది తేకేదార్ల వద్ద పెద్ద మొత్తంలో నిల్వ పెట్టుబడి ఉంటుంది. దానివల్ల చెల్లింపుల ఆలస్యం ప్రభావం తమ కార్మికులపై పడకుండా కొంతవరకు భరించగలుగుతారు.
ఇంకా కార్మికులు ముందుకు తెచ్చిన మరో డిమాండ్ ఓవర్‌టైమ్ (అదనపు పని గంటలు) వేతనాలకు సంబంధించినది.
చట్టం ప్రకారం సాధారణ పని గంటలకు ఇచ్చే రోజువారీ కూలీ కంటే అదనపు పని గంటలకు ఎక్కువ వేతనం చెల్లించాలి.
అయితే తేకేదార్లు రెండు రకాలుగా వ్యవహరించవచ్చు. ఒకటి, రోజువారీ పని సమయాన్ని పొడిగించి కార్మికులతో రోజుకు పది గంటలకు పైగా పనిచేయించడం. రెండోది, పని తీవ్రతను పెంచడం. దీనివల్ల వివిధ రకాల పని ఒప్పందాలు అమల్లోకి వస్తాయి.
అయినప్పటికీ రోజువారీ వేతన రేటు మాత్రం మారదు. కార్మికుల్లో వివాదానికి కారణమవుతున్న అంశం ఇదే. నిర్మాణ సంస్థలు కార్మికులకు చెల్లించాల్సిన రోజువారీ వేతనాలను సూచిస్తూ పని ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, వాస్తవంగా వేతనాలను తేకేదార్లే నియంత్రిస్తున్నారు.
తేకేదార్లు, నిర్మాణదారుల నియంత్రణలో కొనసాగుతున్న ఈ వ్యవస్థ వల్ల కార్మికులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. ఇది వలస కార్మికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది (ప్రసాద్-అలెయమ్మ 2017; జయరాం, వర్మ 2020).
వలస కార్మికులకు త్రికోణ ఉచ్చు
కార్మిక కాంట్రాక్టు వ్యవస్థను సాధారణంగా ప్రామాణికం కాని ఉపాధి విధానంగా చూస్తారు. వాస్తవానికి యజమాని–ఉద్యోగి మధ్య సంబంధాన్ని అస్పష్టంగా మార్చడంలో ఈ వ్యవస్థ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది (బ్రెమన్, లిండెన్ 2014).
యజమానులు, కాంట్రాక్టర్లకు ఈ విధానం ఉభయతారకంగా మారింది. అదనపు విలువను ఇద్దరూ పోగుచేసుకుంటూనే, ఒకరిపై ఒకరు ప్రమాదాల భారాన్ని నెట్టుకుంటున్నారు.
అదే సమయంలో యజమాని–కార్మికుడి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ వ్యవస్థ కప్పిపుచ్చుతోంది. ఫలితంగా ఈ సంబంధం ఎవరికీ స్పష్టంగా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది (సింగ్ తదితరులు 2020).
కొవిడ్ సమయంలో ఈ వాస్తవం స్పష్టంగా బయటపడింది. వలస కార్మికులకు అసలు తమ యజమాని ఎవరో కూడా తెలియని దుస్థితి ఏర్పడింది.
వాస్తవానికి కార్మికులు యజమానులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వం అనే మూడు పక్షాల మధ్య ఏర్పడిన త్రికోణ సంబంధంలో చిక్కుకుపోతున్నారు (వెటెల్సెన్ 2016). దీనివల్ల గుర్తింపు పొందిన శ్రమ సంబంధాలు లేకుండా పోతున్నాయి. సంఘటితమయ్యే హక్కు, మానవ హక్కులు కూడా వారికి దూరమవుతున్నాయి (లెర్చే తదితరులు 2017: 3).
ఇటీవలి నిరసనలన్నింటిలోనూ కార్మికులు ప్రభుత్వాన్ని, తమ తేకేదార్లను నిందించారు. ఇది ఈ త్రికోణ ఉచ్చు ప్రభావాలను స్పష్టంగా తెలియజేస్తోంది.
అదేవిధంగా కార్మికుల డిమాండ్లు నెరవేరే అవకాశాలు కూడా ఈ త్రికోణ ఉచ్చుపైనే ఆధారపడి ఉన్నాయి. కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవి:
♦ ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలను సకాలంలో చెల్లించాలి.
♦ ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి.
♦ వేతనాలు చెల్లించడానికి ఒక నిర్ణీత రోజును ఖరారు చేయాలి.
♦ అదనపు పని గంటలకు రెట్టింపు వేతనం చెల్లించాలి.
♦ వృత్తిపరమైన భద్రతా పరికరాలు అందించాలి.
♦ సెలవులు వంటి ప్రయోజనాలు కల్పించాలి.
♦ రోజువారీ జీవనానికి అవసరమైన కనీస సౌకర్యాలు సమకూర్చాలి.
♦ ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన కార్మికులకు పరిహారం చెల్లించాలి.
వాస్తవానికి కార్మిక చట్టాలను కోడ్లుగా పునర్వ్యవస్థీకరించినప్పటికీ, నిశ్శబ్దంగా కార్మిక హక్కులను ఈ త్రికోణ ఉచ్చే క్షీణింపజేసింది.
ఇది వలస కార్మికుల సామాజిక భద్రతకు సంబంధించి మరిన్ని ప్రశ్నలను, సవాళ్లను ముందుకు తెస్తోంది. కార్మికుల సంక్షేమ బోర్డులు కూడా తమ పరిధిలోని కార్మికులను ఎందుకు రక్షించలేకపోతున్నాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక సూచనను అందిస్తోంది.
ఈ వ్యవస్థలో చర్చ కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. కార్మికుల నమోదు ప్రక్రియ దగ్గరే ఆగిపోతోంది.
కార్మికుల పోరాటాలకు లభించే పాఠాలు
కార్మిక కాంట్రాక్టు వ్యవస్థలో మూడు వైరుధ్యాలు ఉన్నప్పటికీ, దాని నుంచి పుట్టుకొస్తున్న అమానవీయమైన వ్యవహారశైలి, కార్మికులపై జరుగుతున్న దోపిడీ నిరసనలకు దారితీస్తున్నాయి. కార్మిక కాంట్రాక్టు వ్యవస్థలోని నెట్‌వర్క్‌లను రాజకీయ మధ్యవర్తిత్వ రూపాలుగా చూడాలి.
కార్మికుల ఉమ్మడి డిమాండ్లను రూపొందించడంలో సామాజిక మాధ్యమాల శక్తిని ఈ నెట్‌వర్క్‌లు ఉపయోగించుకుంటున్నాయి. ఇలాంటి నెట్‌వర్క్‌లు శ్రమను పెట్టుబడితో అనుసంధానించడంతో పాటు, వాటి మధ్య సంబంధాలను తెంచే పరిస్థితులను కూడా సృష్టిస్తున్నాయి. ఈ విధంగా ఒక పోరాటం మరో పోరాటానికి ఎలా దారితీస్తుందో నిర్ణయిస్తున్నాయి.
ఇటీవలి నిరసనలు ఈ మూడు వైరుధ్యాలతో కూడిన కార్మిక కాంట్రాక్టు వ్యవస్థ నుంచే ఉద్భవించాయి. కార్మిక హక్కులకు మార్గం సుగమం చేయాలంటే ఈ కాంట్రాక్టు వ్యవస్థలను అత్యవసరంగా ప్రశ్నించి, సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరాన్ని ఈ నిరసనలు ముందుకు తెస్తున్నాయి.
కార్మికుల పోరాటాలకు సంబంధించి ఇక్కడ నేర్చుకోవాల్సిన విస్తృతమైన పాఠాలు కార్మిక రాజకీయాల అవకాశాలు, పరిధికి సంబంధించినవి.
ఒక సామాజిక సమూహం రాజకీయంగా చురుగ్గా ఉందా, నిష్క్రియంగా ఉందా అని అంచనా వేయడానికి సంప్రదాయంగా ఉపయోగించే కొలమానం ఏమిటంటే, ఆ సమూహం ప్రభుత్వంతో సంబంధాలు నెరపగలుగుతోందా? ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేయగలుగుతోందా? అన్నదే.
అయితే ఒక సామాజిక సమూహం ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకోలేనట్లుగా కనిపించవచ్చు. లేదా ప్రభుత్వంతో తనకున్న సంబంధాల నుంచి వెనక్కి తగ్గవచ్చు. దీనికి కారణం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని, తమపై అణచివేతకు పాల్పడుతోందని ఆ సమూహం విమర్శనాత్మకంగా తన ఆందోళనలను వ్యక్తం చేయడమే కావచ్చు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు రాజకీయాల స్వరూపం మరో మలుపు తిరుగుతుంది.
అప్పుడు రాజకీయాలు కేవలం పాలనా సంస్థకే పరిమితం కావు. ఆ సంస్థలను నియంత్రిస్తున్న అధికార శక్తుల వరకు విస్తరిస్తాయి.
ఈ సందర్భంలో ఆ అధికార శక్తులు అంటే శ్రమ–పెట్టుబడి మధ్య ఉన్న సంబంధాలే. కార్మికుల జీవన మనుగడ నిరసనలకు ఒక కారణంగా ఉన్నప్పటికీ, వారి మనుగడకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పనిచేస్తున్న పరిస్థితులు, సంబంధాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అందువల్ల నా వాదన ఏమిటంటే, ఈ సందర్భంలో వలస కార్మికులు సమిష్టిగా సంఘటితమవడానికి ప్రధాన కారణం తేకేదారీ వ్యవస్థ కింద వ్యవస్థీకృతమైన దోపిడీ సంబంధాలపై జరుగుతున్న తమ పోరాటాన్ని వారు గుర్తించడమే.
కార్మికులు ప్రమాదాల్లో మరణించడం, వారిపై దాడులు జరగడం వంటి సంఘటనలు భద్రత, గౌరవప్రదమైన జీవితం గురించి ప్రశ్నలను లేవనెత్తాయి. ఇవి వలస కార్మికుల్లో ఐక్యతను పెంపొందిస్తూ రాజకీయ పోరాటాలకు దారితీశాయి.
కార్మికులు దోపిడీని ఎలా అనుభవిస్తున్నారు? దానికి వ్యతిరేకంగా వారు ఏమి చేస్తున్నారు? ఇంకా ఏమి చేయగలరు? అనే అంశాలు వివిధ పని రంగాల్లో శ్రమ సంబంధాలను ప్రభావితం చేస్తున్న కాంట్రాక్టు వ్యవస్థ స్వభావంపై ఆధారపడి ఉంటాయి.
మొత్తంగా చూస్తే, ఇటీవలి ఆందోళనలన్నీ ఈ మూడు వైరుధ్యాలతో కూడిన కాంట్రాక్టు వ్యవస్థ గర్భం నుంచే పుట్టుకొచ్చాయి.
శ్రామికుల హక్కులను కాపాడాలంటే ఈ కాంట్రాక్టు విధానాలను లోతుగా ప్రశ్నించి, సమూలంగా సమీక్షించాల్సిన తక్షణ ఆవశ్యకతను ఇవి చాటిచెబుతున్నాయి.
అదే సమయంలో డిజిటల్ కార్మిక వేదికల వంటి సమాంతర లేదా కొత్త మధ్యవర్తిత్వ వ్యవస్థలు పెరుగుతున్న తీరును కూడా పరిశీలించాలి. అవి ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు వ్యవస్థలను పక్కన పెడుతున్నాయా? లేక వాటినే కొనసాగిస్తున్నాయా? అన్నది అధ్యయనం చేయాలి.
భారతదేశంలోని కార్మికవర్గ జీవితాల పట్ల, వారి శక్తిసామర్థ్యాల పట్ల నిజమైన శ్రద్ధ చూపాలంటే ఇలాంటి సమగ్ర పరిశీలన ఎంతో అవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
