ఇటీవల కాలంలో జరిగిన ప్రముఖ మావోయిస్టు పార్టీ నాయకుల లొంగుబాటును, లొంగుబాటనే అర్థానికి అతీతంగా రాజకీయ కోణంలో పరిశీలించాలి.
సీనియర్ మావోయిస్టు నాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆసన్నల ఇటీవలి లొంగుబాట్లు; లొంగుబాటు రాజకీయ అర్థం గురించి ఒక సంక్లిష్టమైన చర్చను రేకెత్తించాయి. ఒకప్పుడు భారతదేశంలోని అణగారిన వర్గాల విప్లవ అగ్రగామి దళంగా తనను తాను ప్రకటించుకున్న ఒక ఉద్యమానికి, ఈ పరిణామం ఊహించనిది కాదు. సహజంగానే ప్రభుత్వం దీనిని శాంతిభద్రతల సమస్యగా ముద్ర వేసింది. ఇది తిరుగుబాటు అణిచి వేసే ప్రభుత్వ ప్రచారంలో ఒక భాగం.
గతితార్కిక దృష్టితో చూస్తే విప్లవ రాజకీయాలలో ఒక మలుపు. మార్క్సిస్ట్-లెనినిస్ట్ దృక్కోణం నుంచి చూసినప్పుడు, లొంగుబాటనేది ఒక వ్యూహాత్మక వెనకడుగు. ఇది ఒక వ్యక్తి ఎంపిక కాదు. ఇది రాజకీయ వ్యూహంలో ఉన్న లోతైన సంక్షోభ లక్షణం. వ్యక్తులు ఎందుకు లొంగిపోతారనేది ప్రశ్నకాదు. భారత దేశ విప్లవానికి నాయకత్వం వహించే చారిత్రక లక్ష్యం తమ మీద ఉందని చెప్పుకునే ఒక ఉద్యమం, తన రాజకీయ మనుగడకు ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించుకోవడానికి బదులుగా, పార్టీ విచ్ఛిన్నమయే స్థితికి ఎందుకు చేరుకుంది?
నక్సల్బరీ తిరుగుబాటు ఒక దావాగ్నిలా దేశమంతా వ్యాపించి, అప్పటికే ఉన్న వామపక్ష పార్టీలకంటే భిన్నమైన ఒక రాజకీయ సంస్థగా ఆవిర్భవించింది. ఇది అప్పటికే ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల పార్లమెంటరీ భ్రమలకు వ్యతిరేకంగా పుట్టింది.
1967 నాటి నక్సల్బరీ తిరుగుబాటును దాని ప్రారంభకులు భారతదేశపు జింగాంగ్షాన్గా, రూపు దిద్దుకుంటున్న ఒక ఎర్ర కోటగా అభివర్ణించారు. దశాబ్దాలుగా, ఈ ఉద్యమం మధ్య భారతదేశంలోని గిరిజన ప్రాంతమంతటా విస్తరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీర్ఘకాలిక ప్రజా యుద్ధాన్ని కొనసాగించడం ఒక ముఖ్యమైన వ్యూహంగా పార్టీ స్వీకరించింది. నక్సలబరీ ఉద్యమ సారథులు భారతదేశాన్ని అర్ద భూస్వామ్య- అర్ధవలస సమాజంగా వర్గీకరించారు. ఇది 1930ల చైనా గురించి మావో జెడాంగ్ చేసిన సామాజిక విశ్లేషణ మీద ఆధారపడి చేసిన సూత్రీకరణ. ఈ కాలంలోనే భారతదేశంలోని ఉత్పత్తి సంబంధాలలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఒక ప్రబలమైన ఉత్పత్తి విధానంగా మారడం ప్రారంభించింది. ఈ సందర్భంగా అనేక మంది మేధావులు, విద్యావేత్తలు ‘ఉత్పత్తి విధానంపై చర్చ’గా ప్రసిద్ధి చెందిన ఈ చర్చలో పాల్గొని భారత దేశంలో ఉన్న ఉత్పత్తి విధానాన్ని నిర్వచించడానికి ప్రయత్నించారు.
భారతదేశం ఇకపై ఏ మాత్రం భూస్వామ్య లేదా అర్ధభూస్వామ్య దేశం కాదనే నిర్ధారణకు వచ్చారు. వ్యవసాయంలో పెద్ద భూఖండాల విచ్ఛన్నత, గ్రామీణ ప్రాంతాల్లోకి పెట్టుబడిదారీ విధానం చొచ్చుకు పోవడం, వస్తు మార్పిడి సంబంధాలలో డబ్బు పాత్ర పెరగడం, ప్రపంచ పెట్టుబడిదారీ విధానంతో సంధానం కావడం తదితర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తి సంబంధాలలో పెను మార్పులు సంభవించాయి.
అయితే, మావోయిస్టు పార్టీ స్థిరంగా తమ విశ్లేషణకు కట్టుబడి, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడిదారీ అభివృద్ధి గతిశీలత వల్ల జరిగిన మార్పులతో నిరంతరం రైతు పేదరికంలో ఉండటాన్ని సమన్వయం చేయలేకపోయింది. సైద్ధాంతికంగా ఒంటెద్దు పోకడ కారణంగా ఆచరణలో మొండితనానికి దారితీసింది. దాని రాజకీయ ప్రాబల్యం తగ్గినప్పటికీ, వర్గ శత్రువు నిర్మూలన పేరుతో ప్రారంభమైన ఉద్యమం, ఉద్యమాల కోసం ప్రజలను సమీకరించాలనే రకాల వ్యూహాల మధ్య ఊగిసలాడి, చివరికి మిలిటరీ పోరాటంగా స్థిరపడింది. అటువంటి పరిస్థితులలో లొంగిపోవడమనేది రాజ్యం చేతిలో ఓటమి మాత్రమే కాదు, పార్టీ ఆచరణ నిర్మాణాల వైఫల్యం అవుతుంది.
మార్పు జరిగే ప్రతి సమయంలోను ప్రతి ఉద్యమంలో సంక్షోభాలు వస్తాయి. ఇటువంటి సంక్షోభ సమయంలో లెనిన్ ప్రతిస్పందన ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. 1917-18లో జర్మన్ దండయాత్ర, ఎర్ర సైన్యం విచ్ఛిన్నతను ఎదుర్కొంటున్న సందర్భంలో; ఎంత అవమానకరమైన రాజీ అయినప్పటికీ, బ్రెస్ట్-లిటోవ్స్కీ ఒప్పందంపై సంతకం చేయాలని ఆయన వాదించారు. అతని వాదన చాలా సూటిగా ఉంది: “ఇప్పుడు విప్లవ యుద్ధాన్ని కొనసాగించడం అంటే సోవియట్ రిపబ్లిక్ను జర్మన్ సామ్రాజ్యవాదుల దయాదాక్షిణ్యాలపై వదలడం”. లెనిన్ చాలా స్పష్టంగా, “సంధి కారణంగా జరిగిన నష్టాన్ని, పార్టీ- విప్లవాన్ని కాపాడుకోవడం వల్ల, అధిగమించగలమని” చెప్పారు”. ఈ వ్యూహాత్మక దూరదృష్టి పిరికితనం కాదు, ఇది ఏ ఏ రాజకీయ ఉద్యమానికైనా ఒక గతితార్కిక వాస్తవం. మనుగడ , జీవించడం అంటే భవిష్యత్ పోరాటానికి అవకాశం అని లెనిన్ అర్థం చేసుకున్నాడు. బోల్షెవిక్ల తిరోగమనం తరువాత అధికార స్థిరీకరణ, ఆర్థిక పునర్నిర్మాణం, విప్లవ చొరవకు అవకాశం దొరికింది.
వ్యూహాలు- ఎత్తుగడలు
ఇందుకు భిన్నంగా, భారతదేశ మావోయిస్టులకు అలాంటి దూరదృష్టి కొరవడింది. ఏకపక్షంగా తమ వైపు నుంచి రాజకీయ చొరవను చూపించి, ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటిస్తూ, చట్టపరమైన రాజకీయ సంస్థగా మారి, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించడానికి బదులుగా వారు తమ తిరోగమనం ఏవిధంగా ఉండాలనే విషయంలో రాజ్యం తమ కఠినమైన షరతులను విధించడానికి అనుమతించారు. అదేవిధంగా గాంధీ, భారత స్వాతంత్ర సంగ్రామంలో, అనుసరించిన వ్యూహాలు- ఎత్తుగడలు కూడా పరిశీలించవలసిన అంశం.
అందువల్ల ఈ లొంగుబాట్లు లెనినిస్ట్ లొంగుబాట్లు కావు. ఒక విధంగా ఇవి జారిస్ట్ పద్ధతి ప్రకారం విప్లవకారులను అంతం చేయడానికి రాజ్యం ఒత్తిడి వల్ల జరిగుతున్న లొంగుబాట్లు. జార్ కౄరమైన అణచివేత విధానాన్ని అమలు చేసి నరోద్నిక్లను నిర్మూలించడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ వారు మనుగడ కొనసాగించారు. తరువాత వారు సోషలిస్ట్ రివల్యూషనరీ పార్టీగా మారారు. 1917 విప్లవోద్యమం పురోగతికి దోహదపడ్డారు. అణచివేత ద్వారా కొందరు విప్లవకారుల ప్రాణాలను హరించవచ్చు. కానీ వారి ఆలోచనలను నాశనం చేయలేరు. భారతదేశ మావోయిస్టులకు నిజమైన ప్రమాదం వారి భౌతిక నిర్మూలన కాదు. వారిని రాజకీయంగా తటస్థీకరించడం. సిద్ధాంతానికి కట్టుబడని వారిగా తయారు చేయడం.
లొంగుబాటనేది విప్లవకారులను రకరకాలుగా మానసిక, సామాజిక ఒత్తిడికి గురి చేస్తుంది. నిరాయుధులైన తర్వాత కార్యకర్తలు కళంకిత ముద్ర, పరాయీకరణ- ఆశయరాహిత్యాన్ని ఎదుర్కొంటారు. వృద్ధాప్యం మీద పడుతున్న నాయకులను, కార్యకర్తలను , అనుభవజ్ఞులను ఉద్యమంలో ఇముడ్చుకునే సరైన విధానం లేకపోవడం వల్ల వారు నిరాశ నిస్పృహలలో కూరుకుపోవడం; ఉద్యమ విముఖులుగా మారడాన్ని వేగవంతం చేస్తుంది. విప్లవ సంస్థలు తమ సొంతవారి గురించి శ్రద్ధ వహించాలి. వారిని రాజ్యం అధికారస్వామ్యానికి వదిలి వేయకూడదు.
విస్తృతమైన వర్గ దృక్పథంలో, లొంగుబాటు ఒక వైపు వ్యవస్థీకృత ప్రాతినిధ్యం కోసం మన సామర్థ్యంలో క్షీణతను సూచిస్తుంది. కార్మికవర్గం, రైతులు తమ రాజకీయ నాయకత్వంలో కొంత భాగాన్ని కోల్పోతారు. “శ్రామిక వర్గం వాస్తవంలో జీవించాలి, అన్నిటి కన్నా భ్రమల్లో ఉండటం లక్ష్యానికి చాలా హానికరము” అని లెనిన్ హెచ్చరించాడు.
ఇక్కడ భ్రమ ఏమిటంటే, మావోయిజంపై ప్రభుత్వం సాధించిన విజయం వామపక్ష విప్లవ రాజకీయాల ముగింపుకు సమానం. వాస్తవానికి సమాజంలో ఉన్న వైరుధ్యాలు కొనసాగుతాయి . కొత్త రూపాలలో ,బహుశా వేర్వేరు, రూపాల్లో తిరిగి ముందుకు వస్తాయి. భారత ప్రభుత్వం లొంగుబాటు, పునరావాసం విధానం విప్లవ కార్యకర్తలను రాజకీయాల నుంచి వేరు చేసే ఉద్దేశంతో రూపొందించ బడింది. లొంగిపోయిన తర్వాత, మాజీ కార్యకర్తలు ప్రభుత్వ నిఘా నీడలో, అలాగే వారిని రాజకీయాలకు దూరంగా ఉంచడం కోసం రూపొందించిన ప్రభుత్వ కార్యక్రమాలలో కలిసిపోతారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి వ్యవస్థీకృత అసమ్మతి అవసరం, కానీ ప్రస్తుత దశలో భారత ప్రభుత్వం అలాంటి అవకాశాలను అనుమతించదు. వ్యవస్థీకృత విప్లవాత్మక రాజకీయాలను అణచివేయడం ద్వారా స్థిరత్వాన్ని నెలకొల్పగలనని ప్రభుత్వం భావించినప్పటికీ అది సాధ్యం కాదు. బదులుగా అది ప్రజలలో అసంతృప్తి, నిరాశా నిస్పృహలను పెంచుతుంది.
సామాజికంగా ఉన్నతమైన లక్ష్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న చాలా మందికి లొంగిపోవడం ప్రధానమైన మార్గంగా ఎందుకు మారిందో అర్థం చేసుకోవడానికి, మావోయిస్టుల అంతర్గత వ్యూహంలో ఉన్న సంక్షోభాన్ని అలాగే వారి కార్యాచరణ కార్యక్రమం ఆధారంగా ఉన్న సిద్ధాంత సంక్షోభాన్ని పరిశీలించాలి.
“నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట విశ్లేషణ” అవసరం అని లెనిన్ చెప్పారు. ఉనికిలో లేని సామాజిక విశ్లేషణను అంటిపెట్టుకుని ఉండటం ద్వారా, మావోయిస్టులు కార్మికవర్గాన్ని, పట్టణ పేదలను దూరం చేసుకున్నారు. మారుమూల అడవులకే పరిమితమయ్యారు. లెనిన్ అగ్రగామి దళ పార్టీ భావన ఎప్పటికీ స్థిరంగా ఉండే మారని సిద్ధాంతం కాదు, పరిస్థితులకు అనుగుణంగా మారే పట్టువిడుపులు ఉండాలని నొక్కి చెప్పింది. “పార్టీ అనేది ప్రజలను ముందుండి నడిపేది” అని ఆయన రాశారు.
లెనిన్ దృష్టిలో నాయకత్వం
“దాని కర్తవ్యం ప్రజల సగటు రాజకీయ స్థాయిని కేవలం ప్రతిబింబించడం కాదు. ప్రజానీకానికి నాయకత్వం వహించి ముందుకు నడపటం” ఈ వాక్యాల ద్వారా లెనిన్ దృష్టిలో నాయకత్వం అంటే ముందుచూపు, చొరవ కలిగి ఉండటమని అర్థమవుతుంది. మావోయిస్టులు ముందుగా చొరవ తీసుకోకుండా, కేవలం వారు ఎదురైన సమస్యలకు ప్రతిస్పందించే విధంగానే ఉన్నారు. వారు తమ బలం అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు కాల్పుల విరమణ ప్రకటించి, చట్టబద్ద రాజకీయ సంస్థగా మారి ఉంటే, వారు తమ మద్దతును విస్తరించుకుని, ప్రజల్లో తమ ఆదరణను నిలబెట్టుకో గలిగేవారు. భారతదేశంలో, పార్టీ సంస్థాగత నిర్మాణంపై లెనిన్ సూత్రం ఆచరించడం అంటే, చట్టబద్ధమైన రాజకీయాలలో పాల్గొనడంతో పాటు, ప్రజల పరిపాలన కోసం స్థానిక సంస్థలు, సహకార సంఘాలు, సాంస్కృతిక ఉద్యమాలను నిర్మించడమని అర్థం. మావో జెడాంగ్ స్వయంగా, ఏనాన్ కాలంలో, “ప్రజల నుంచి ప్రజలకు” అనే ప్రజాపంథాను అమలు పరిచి ప్రజల నుంచి నేర్చుకుని, నిరంతర సంప్రదింపులు ద్వారా తిరిగి వారిని చైతన్య పరిచేందుకు ప్రజాపంథాను అమలు పరిచారు.
ఈ గతితార్కిక సూత్రాన్ని విడిచిపెట్టిన విప్లవోద్యమం ఒంటరిగా మారుతుంది. ఒంటరిపాటు అనివార్యంగా లొంగిబాట్లకు దారితీస్తుంది. దీనికి, మావోయిస్టులు బాధ్యత వహించాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి విప్లవోద్యమం తమ సంస్థాగత రూపాన్ని మార్చుకోవాలి. మిలిటరీ ఆశావాదం ఊహల్లో చిక్కుకోకుండా, వివిధ వర్గాల కొత్త సంఘాలను నిర్మించడమే పనిగా ఉండాలి. గెరిల్లా యుద్ధం కొన సాగించటమనే ఏకైక లక్ష్యం వల్ల, మావోయిస్టులు వివిధ తరగతుల వర్గ సంఘాలను నిర్మించే అవకాశాన్ని తమకు తామే మూసివేసుకున్నారు. సైద్ధాంతిక నిబద్ధతను, సంస్థాగత పునర్నిర్మాణాన్ని అనుమతించే రాజకీయ పరిష్కారం ఉద్యమానికి ఉపయోగపడుతుంది.
బహిరంగ, రహస్య పనిని ఏక కాలంలో నిర్వహించడమనే లెనినిస్ట్ సూత్రం మనకు శిరోధార్యం కావాలి: “చట్టపరమైన, చట్టవిరుద్ధమైన పనిని నిర్వహించటం మన పార్టీకి అత్యంత కష్టతరమైన కానీ అతి ముఖ్యమైన పనులలో ఒకటి.” మావోయిస్టులు దీనిని ఒక విలువైన సూచనగా తీసుకుని ఉండాల్సింది. దాని ప్రకారం, సైద్ధాంతిక నిబద్ధతను కొనసాగిస్తూ, ఈనాడు అమలులో ఉన్న రాజ్యాంగం అనుమతించబడిన చట్టపరమైన రాజకీయాల్లో పాల్గొనడం ముఖ్యమైన కర్తవ్యంగా ఉండాలి. పార్లమెంటరీ వామపక్షాల వైఫల్యాలు పార్లమెంటరీ రూపాలను పూర్తిగా తిరస్కరించడానికి దారి తీయకూడదు. కానీ ప్రజల సామూహిక రాజకీయాలను విప్లవోద్యమం వైపు నడపటానికి కృషి చేయాలి. వామపక్ష పార్లమెంటరీ పార్టీల వైఫల్యంపై అధ్యయనం అనేది ఒక ప్రత్యేక అంశం.
ఒక నిర్మాణాత్మక ప్రత్యామ్నాయం ఏమిటంటే, మావోయిస్టు ఉద్యమాన్ని రాజ్యాంగ చట్రంలో అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహించే చట్టపరమైన రాజకీయ సంస్థగా మార్చడానికి ప్రయత్నించాలి. అటువంటి పార్టీ భారత సమాజంలో సైద్ధాంతిక వైవిధ్యాన్ని ప్రజల ముందుకు తెస్తుంది. దీనికి క్షమాభిక్షలు, రాజ్యాంగ పరమైన హామీలు- వారి రాజకీయ కార్యకలాపాలకు చట్టపరమైన రక్షణ అవసరం. ప్రభుత్వం అణచివేతపై ఆధారపడకుండా, మానసిక పరివర్తనపై ఆధారపడిన విధానం అవలంబించాలి. లోతుగా ఆలోచిస్తే, లొంగిపోవడం- పునరావాసం అనేవి ప్రభుత్వం, ఉద్యమం రెండింటి వైఫల్యాలను బహిర్గతం చేస్తున్నాయి.
ప్రభుత్వం రాజకీయాలను శాంతి భద్రతల సమస్యగా కుదిస్తుంది. మావోయిస్టులు విప్లవాన్ని వ్యక్తిగత లేదా సాయుధ పోరాట స్థాయికి తగ్గిస్తున్నారు.
గ్రామ్స్కీ మనకు గుర్తు చేసినట్లుగా, రాజకీయాలనేవి “నైతిక- మేధో నాయకత్వ ఆధిపత్య కళ “అని ఇద్దరూ మర్చిపోతారు. సైద్ధాంతిక విద్య, సాంస్కృతిక పనిని విస్మరించడం ద్వారా మావోయిస్టులు ఈ పనిని బూర్జువా రాజకీయాలకు అప్పగించారు. తమ ప్రాభవాన్ని తిరిగి పొందడానికి, విప్లవోద్యమం మరోసారి ప్రజలలో సైనిక సంరక్షకుడిగా కాకుండా, వారి రాజకీయ ప్రతినిధిగా నిలబడాలి. అది ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, సాంస్కృతిక సంస్థలను పునర్నిర్మిండం ద్వారా జరగాలి. తక్షణ కర్తవ్యం తిరుగుబాటు కాదు, పునర్నిర్మాణం. 1905 తర్వాత లెనిన్ సూచించినట్లుగా: “ఒక విప్లవకారుడిగా, సోషలిజం కోరుకునే వాడిగా ఉండటం సరిపోదు. కొత్త విప్లవ సంస్థలను ఓపికగా ఎలా నిర్మించాలో తెలుసుకోవాలి.”
వేణుగోపాల్- ఆశన్న వంటి నాయకుల లొంగుబాటు విప్లవ రాజకీయాల ముగింపును సూచించదు. ఒక నిర్దిష్ట రకమైన రాజకీయ కార్యకలాపాల వైఫల్యాన్ని సూచిస్తుంది. వారి లొంగుబాటు రాజ్యాంగ, రాజ్యాంగేతర పద్ధతులను అనుసంధానం చేయడంలో వైఫల్యాన్ని సూచిస్తుంది. జీవితం కొనసాగించడానికి, విప్లవకారులు సైద్ధాంతికంగా లొంగి పోకూడదు. తమ కార్యక్రమం సరైన దిశలో మార్చుకుని వ్యూహాత్మకంగా ముందుకు నడవాలి.
ఏ ప్రభుత్వమూ ఆలోచనలను అణచి వేయలేవు. ఆ ఆలోచనలను కొనసాగించే సంస్థలను అది నాశనం చేయగలదు. ఒకసారి అటువంటి సంస్థలు నిర్మూలించబడినప్పుడు ఆ ఆలోచనలకు ఆలంబనకరవై కొంత కాలం తర్వాత కనుమరుగమవుతాయి. అందువల్ల, లెనిన్ చెప్పినట్లుగా, “బలవంతులకు వ్యతిరేకంగా బలహీనుల ఆయుధం సంస్థ” అందుకే సాధ్యమైనంత వరకు ఏదో ఒక రూపంలో సంస్థను సంరక్షించడం విధి. అది లేకుండా, అత్యంత ఉద్వేగభరితమైన భావజాలం కూడా నిలబడలేదు.
చివరికి, మావోయిస్టు నాయకుల లొంగుబాటుతో ప్రభుత్వ విజయంగా పరిగణించకూడదు అలాగే దానిని విప్లవ ద్రోహంగా చూడకూడదు. ఇది ఒక గతితార్కిక క్షణం, విఫలమైన ఆచరణకు సంకేతం. నిజమైన విషాదం లొంగుబాటులో కాదు, ఓటమిని విజయంగా మార్చగల రాజకీయ వ్యూహం, స్పృహ లేకపోవడంలో ఉంది. ఒకప్పుడు రాజ్యాన్ని సాయుధ పోరాటం ద్వారా కూలదోయాలని ప్రయత్నించిన ఉద్యమం, దూరదృష్టి చూపి, అదే రాజ్యంలో ఒక విప్లవకరమైన రాజకీయ శక్తిగా మారగలదు, ఎదగ గలదు.
నేటి పరిస్థితులు గుడ్డి మిలిటెన్సీని కానీ నిష్క్రియా పరమైన విరమణను కానీ కోరుకోవడం లేదు. సృజనాత్మకంగా విప్లవం పునర్నిర్మాణం కావాలని కోరుతున్నాయి. సైనిక పరమైన ఓటమిని రాజకీయ పునఃనిర్మాణంగా మార్చడం ద్వారా మాత్రమే విప్లవోద్యమం దాని చారిత్రక కొనసాగింపును కాపాడుకోగలదు. మనుగడ సాగించడం అంటే లొంగిపోవడం కాదు. అది తనను తాను పునర్వ్యవస్థీకరించుకోవడం అంటే విముక్తి కోసం జరిగే సుదీర్ఘ పోరాటంలో మరొక దశకు సిద్ధం కావడం మాత్రమే.
రచయిత ది వైర్ తెలుగు సంపాదకీయ బృందంలో ఒకరు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
