హెర్మీస్ ట్రిస్మెజిస్టస్ అనేది గ్రీకు దేవుడు హెర్మీస్, ఈజిప్టు దేవుడు తోత్ ఈ ఇద్దరి లక్షణాలను ఒకే రూపంలో కలిపి సృష్టించిన సమ్మిళిత దైవస్వరూపం.
అంటే గ్రీకు, ఈజిప్టు మత–తాత్విక సంప్రదాయాల సంగమానికి ప్రతీకగా ఈ రూపం రూపొందించబడింది.
ఈ కొత్త దైవస్వరూపాన్ని కొందరు దేవుడిగా మరికొందరు ప్రాచీన జ్ఞానిగా భావించారు. ఆయన ఈజిప్టు పురాతన రాజ్య కాలంలో అత్యున్నత వైభవంలో జీవించాడని నమ్మకం ఉండేది.
మానవులకు దైవ జ్ఞానాన్ని అందించిన మహర్షిగా రహస్య విద్యల మూలపురుషుడిగా ఆయనను గౌరవించారు.
ఈ విధంగా హెర్మీస్ ట్రిస్మెజిస్టస్ ఆల్కెమీతో పాటు ఇతర గూఢ తాత్విక సంప్రదాయాలకు ప్రామాణిక గురువుగా, ఆద్యాచార్యుడిగా స్థానం సంపాదించాడు.
హెర్మెటికా అనే తాత్విక గ్రంథాల సంకలనాన్ని రచించాడని సంప్రదాయం చెబుతుంది.
ఈ రచనలు అత్యంత ప్రాచీన కాలానికి చెందినవని ప్రచారం జరిగినప్పటికీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అవి ఎక్కువగా క్రీస్తు శకం వంద నుంచి మూడు వందల మధ్యకాలంలో రచించబడినవిగా భావిస్తారు.

అంటే విశ్వమంతా ఒక అంతర్గత సామరస్యంతో, పరస్పర సంబంధంతో నడుస్తుందనే భావన.
జ్యోతిష్య శాస్త్రం లాంటి అనేక విశ్వాసాలకు తాత్విక పునాదిగా ఈ సిద్ధాంతమే నిలిచింది.
ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలు, ఇతర ఖగోళ వస్తువుల కదలికలు భూమిపై జరిగే సంఘటనలను, అక్కడి శక్తులను ప్రతిబింబిస్తాయని లేదా ప్రభావితం చేస్తాయని విశ్వసించే భావన కూడా ఇదే తాత్విక దృక్పథం నుంచి ఉద్భవించింది.
ప్రారంభం నుంచే జ్యోతిష్య శాస్త్రం, ఆల్కెమీ పరస్పరం ముడిపడి అభివృద్ధి చెందాయి. రసవాదులు (ఆల్కెమీ) తమ ప్రయోగాలు, రూపాంతర క్రతువులను నిర్వహించేటప్పుడు గ్రహాల స్థితిగతులు, జ్యోతిష సంబంధిత కాల నిర్ణయాలను ఎంతో ప్రాముఖ్యంగా పరిగణించేవారు.
విశ్వంలోని ఖగోళ శక్తులు భూమిపై జరిగే పరివర్తనలను ప్రభావితం చేస్తాయని వారు నమ్మేవారు.

అంతేకాదు ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్ట లోహాన్ని కూడా అనుసంధానించారు. ఈ అనుసంధానం యాదృచ్ఛికం కాదు.
ప్రతి గ్రహానికి ఉన్నట్లు భావించిన లక్షణాలు ఆ లోహం స్వభావంతో సంబంధం కలిగి ఉన్నాయని వారు విశ్వసించేవారు.
ఉదాహరణకు సూర్యుడు బంగారానికి, చంద్రుడు వెండికి, శని సీసానికి ప్రతీకలుగా పరిగణించబడ్డారు.
ఈ విధంగా ఆల్కెమీ దృష్టిలో లోహాలు, గ్రహాలు, ప్రకృతి, మానవుడు ఇవన్నీ ఒకే విశ్వ వ్యవస్థలో పరస్పరం అనుసంధానమైన భాగాలుగా భావించబడ్డాయి.
అందువల్ల ఒక లోహంలో జరిగే రూపాంతరం కూడా విశ్వంలోని గొప్ప క్రమంలో భాగమేనని రసవాదులు విశ్వసించేవారు.

హెర్మెటికా గ్రంథ సంపుటిలో తాత్విక చర్చలతో పాటు రసవాదం (ఆల్కెమీ) లాంటి విషయాలపై ఆచరణాత్మక మార్గదర్శకాలు కూడా ఉన్నాయి.
ఈ రచనల ప్రకారం స్పష్టమైన సంకల్పం, ఆధ్యాత్మిక చైతన్యం, పవిత్ర క్రతువులు ద్వారా రూపాంతరం సాధ్యమని భావించబడింది.
ఈ రూపాంతరం రెండు విధాలుగా వ్యక్తమవుతుందని వారు వివరించారు. ఒకటి సీసం లాంటి సాధారణ లోహాలను బంగారం లాంటి పరిపూర్ణ లోహాలుగా మార్చే భౌతిక పరివర్తనం.
మరొకటి మనిషి తన అంతరాత్మలో నిజమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా దైవంతో మళ్లీ ఏకమయ్యే ఆధ్యాత్మిక పరివర్తనం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్నే వారు గ్నోసిస్ అని పిలిచారు.
ఇక్కడ గ్నోసిస్ అంటే సాధారణ జ్ఞానం కాదు స్వయాన్ని, విశ్వాన్ని, దైవాన్ని ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకునే పరమ ఆధ్యాత్మిక జ్ఞానం.
ఈ భావనలే తరువాత జ్ఞానమార్గం అనే తాత్విక–ఆధ్యాత్మిక సంప్రదాయానికి కూడా ప్రధాన పునాదులుగా మారాయి. ఈ సంప్రదాయం ప్రకారం మనిషికి విముక్తి బాహ్య ఆచారాల వల్ల కాకుండా గ్నోసిస్ అనే అంతర్ముఖ దైవజ్ఞానం ద్వారా లభిస్తుంది.

ఇదే ఆలోచన రసవాదంలోనూ ప్రతిధ్వనించింది. అందువల్ల రసవాదులు లోహాలను శుద్ధి చేయడాన్ని మానవ ఆత్మను శుద్ధి చేసే ప్రక్రియకు ప్రతీకగా కూడా అర్థం చేసుకున్నారు.
పనోపోలిస్కు చెందిన జోసిమస్..
రసవాదం (ఆల్కెమీ) క్రీస్తు శకం వంద ప్రాంతానికే ఈజిప్టులో రూపుదిద్దుకుందని స్పష్టమైన ఆధారాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ రసవాదంపై రచనలు చేసి వాటిలో కొన్ని నేటికీ అందుబాటులో ఉన్న తొలి చారిత్రక వ్యక్తిగా గుర్తింపు పొందినవాడు జోసిమస్.

అయితే క్రీస్తు శకం ఆరో శతాబ్దం ప్రారంభంలో కాన్స్టాంటినోపుల్కు చెందిన గ్రీకు చరిత్రకారుడు కూడా జోసిమస్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు.
ఈ ఇద్దరిని వేరు చేయడానికి రసవాద గ్రంథాల రచయితను పనోపోలిస్కు చెందిన జోసిమస్ అని పిలుస్తారు. ఆయన ఈజిప్టులోని పనోపోలిస్ (నేటి అఖ్మీమ్) ప్రాంతానికి చెందినవాడై ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.
క్రీస్తు శకం సుమారు మూడు వందల ప్రాంతంలో ఆయన అప్పటి రోమన్ ఈజిప్టులో అత్యంత సందడిగా, విజ్ఞాన–తాత్విక చర్చలకు కేంద్రంగా వెలుగొందిన అలెగ్జాండ్రియా నగరంలో నివసించాడు.
ప్రపంచం నలుమూలల నుండి పండితులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు చేరుకునే ఈ మేధో కేంద్రం, జోసిమస్ ఆలోచనలకు రూపమిచ్చిన ప్రధాన వేదికగా నిలిచింది.

రసవాదం (ఆల్కెమీ) గురించి తన సొంత పేరుతో రచనలు ప్రచురించిన తొలి రసవాదులలో జోసిమస్ ఒకడని చెప్పవచ్చు. అంతకుముందు అనేక మంది రచయితలు తమ అసలు పేర్లను దాచిపెట్టి మారు పేర్లతో రచనలు చేయడం ఆనవాయితీగా ఉండేది. కానీ జోసిమస్ మాత్రం ఆ సంప్రదాయానికి భిన్నంగా తన పేరునే ఉపయోగించాడు.
ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం చాలా తక్కువ. ఆయన గురించి మనకు తెలిసిన విషయాలన్నీ ప్రధానంగా ఆయన స్వీయ రచనల నుంచే తెలుస్తాయి.
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం జోసిమస్ రసవాదంపై ఇరవై ఎనిమిది గ్రంథాలు రచించాడు. వాటిలో గ్రీకు–రోమన్ రసవాద చరిత్రను, తనకంటే ముందు ఉన్న రసవాదుల ఆలోచనలను, వారి రచనలను సమగ్రంగా వివరించాడు.
దురదృష్టవశాత్తూ ఆయన రచనలన్నీ నేటి వరకు నిలవలేదు. క్రీస్తు శకం పదవ శతాబ్దం నుంచి పదిహేనవ శతాబ్దం మధ్యకాలానికి చెందిన అరబిక్, సిరియాక్ భాషా ప్రతులలో దాదాపు నూట డెబ్భై ఐదు పేజీల పరిమాణంలో ఉన్న కొన్ని భాగాలు మాత్రమే ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

అయినప్పటికీ మిగిలి ఉన్న ఈ చిన్న భాగాలే జోసిమస్ ఆలోచనల గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఆయన రచనలు తరువాతి తరాల రసవాదులపై గాఢమైన ప్రభావం చూపాయి. అందువల్ల రసవాద చరిత్రలో జోసిమస్ స్వరం ఇప్పటికీ అత్యంత ప్రభావవంతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది.
రసవాదాన్ని (ఆల్కెమీ) మానవ ఆత్మకు మోక్షం లేదా విముక్తిని ప్రసాదించే మార్గంగా స్పష్టంగా వివరించిన తొలి వ్యక్తిగా జోసిమస్ను అనేక మంది పరిశోధకులు గుర్తిస్తారు. అంటే ఆయన దృష్టిలో రసవాదం కేవలం లోహాలను మార్చే సాంకేతిక విద్య మాత్రమే కాదు అది మానవ ఆత్మను శుద్ధి చేసి, దైవంతో ఏకం చేసే ఆధ్యాత్మిక సాధన కూడా.

లోహాల శుద్ధీకరణను ఆత్మ శుద్ధీకరణతో పోల్చే భావనలు ఆయనకు ముందే ఉన్నప్పటికీ ఈ రెండింటినీ ఒకే సమగ్ర సాధనలో భాగాలుగా ప్రతిపాదించిన మొదటి వ్యక్తి జోసిమస్ అయి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.
ఆయన ప్రకారం లోహంలో జరిగే పరివర్తనం మనిషి అంతరంగంలో జరిగే ఆధ్యాత్మిక పరివర్తనకు ప్రతీక.
అంతేకాక ‘ఫిలాసఫర్స్ స్టోన్’ లేదా పరమ రసశిల అనే భావనను స్పష్టంగా ప్రస్తావించిన తొలి వ్యక్తిగా కూడా జోసిమస్ పేరు పొందాడు. ఆయన వర్ణనలో అది దివ్యజలం లాంటిది. ఆ దివ్య పదార్థం ద్వారా సాధారణ లోహాలను బంగారంగా మార్చవచ్చని మాత్రమే కాక, జీవనామృతంగా ఉపయోగించి దీర్ఘాయుష్షు లేదా అమరత్వాన్ని కూడా పొందవచ్చని ఆయన విశ్వసించాడు.
ఈ విధంగా జోసిమస్ రచనల్లో రసవాదం భౌతిక ప్రయోగం, తాత్విక అన్వేషణ, ఆధ్యాత్మిక విముక్తి ఈ మూడింటి సమన్వయంగా రూపుదిద్దుకుంది.
ఇదే దృక్పథం తరువాతి శతాబ్దాల్లో పాశ్చాత్య రసవాద సంప్రదాయానికి ప్రధాన ఆధారంగా నిలిచింది.
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం జోసిమస్ ఈజిప్టులోని ఒక స్థానిక దేవాలయంలో పూజారిగా కూడా పనిచేసి ఉండవచ్చు. దేవతల విగ్రహాల తయారీ ప్రక్రియతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఆయన రచనల ద్వారా తెలుస్తుంది.
విగ్రహాల రూపకల్పన లేదా లోహాన్ని కరిగించి పోతపోయే పనిని స్వయంగా చేశాడో లేదో స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ఆ ప్రక్రియ గురించి ఆయనకు లోతైన అవగాహన ఉండేది. అలాగే వాటికి సంబంధించిన మతపరమైన క్రతువులను నిర్వహించడంలో కూడా ఆయన పాత్ర వహించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఆ కాలంలో ఈజిప్టు దేవాలయాల పూజారులు పూర్తికాల సేవకులు కాదు. వారు కొంత సమయం మాత్రమే ఆలయ విధులు నిర్వహించేవారు. మిగిలిన సమయంలో చాలామంది ఉపాధ్యాయులుగా లేదా ఇతర వృత్తుల్లో పనిచేసేవారు. జోసిమస్ రచనలను పరిశీలిస్తే ఆయన రసవాదాన్ని (ఆల్కెమీ) బోధించిన గురువుగా కూడా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
తన గ్రంథాలలో జోసిమస్ ఇతర రసవాదులను విమర్శించాడు. వారి పద్ధతులు ప్రకృతి సహజమైనవి కావని అందువల్ల తన విధానాల కంటే తక్కువ స్థాయివని ఆయన వాదించాడు.
ఈ వ్యాఖ్యలు ఆ కాలంలో అలెగ్జాండ్రియాలో రసవాద విద్య బాగా వ్యాపించి ఉండటమే కాకుండా వివిధ గురువులు, సంప్రదాయాలు, పద్ధతుల మధ్య తీవ్రమైన పోటీ కూడా నెలకొని ఉందని సూచిస్తున్నాయి.
జ్ఞానం కనుమరుగైన కాలం..
క్రీస్తు శకం మూడు వందల ప్రాంతంలో అలెగ్జాండ్రియాలో రసవాదం (ఆల్కెమీ) బాగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రాచీన ప్రపంచంలోని ఈ విద్యకు సంబంధించిన విస్తారమైన జ్ఞానం కాలగర్భంలో కలిసిపోయింది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటిగా రోమన్ చక్రవర్తి డయోక్లీషియన్ పాలనను చరిత్రకారులు ప్రస్తావిస్తారు.
నాణేల విలువ తగ్గిపోవడం అలాగే లోహాలను మార్చగలమని చెప్పే రసవాదులు నకిలీ నాణేల తయారీలో పాత్ర పోషించే ప్రమాదం ఉందనే అనుమానం చక్రవర్తిలో ఏర్పడింది.
ఈ కారణంగా రసవాద కార్యకలాపాలపై ఆయన కఠిన ఆంక్షలు విధించినట్లు చెబుతారు.
అదే కాలంలో అలెగ్జాండ్రియాలోని ప్రముఖ గ్రంథ సంపద కూడా నాశనమైందని సంప్రదాయ కథనాలు పేర్కొంటాయి.
ఈ పరిణామాల ఫలితంగా, రసవాదానికి సంబంధించిన అనేక గ్రంథాలు, సాంకేతిక పరిజ్ఞానం, తాత్విక భావనలు శాశ్వతంగా కనుమరుగయ్యాయి.
అనువాదం: మనోహర రాజు
ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది రెండవ భాగం. మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
