కేంద్ర ఎన్నికల సంఘం జరుపుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రకారం, ఉత్తరప్రదేశ్లో 12.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలో 12.56 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు.
న్యూఢిల్లీ: బారబంకీ లోక్సభ ఎంపీ తనుజ్ పునియా ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా విషయంలో లేవనెత్తిన సందేహాలపై కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు జనవరి 15న ఆదేశించింది. రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఓటర్ల జాబితా సవరణలు- రెండు భిన్నమైన నిర్ధారణలతో ముందుకొచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రకారం, నమోదైన గ్రామీణ ఓటర్ల సంఖ్య కేంద్ర ఎన్నికల సంఘం జరుపుతున్న సవరణలో నమోదైన గ్రామీణ ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉందంటూ పునియా ఆరోపించారని ది హిందూ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రకారం, రాష్ట్రంలో 12.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టుగా నమోదయ్యింది- ఇది గతంలో ఉన్న ఓటర్ల సంఖ్య కంటే 2.89 కోట్లు తక్కువ. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక సవరణ కసరత్తు ప్రకారం, కేవలం గ్రామీణ ప్రాంతంలోనే 12.69 కోట్లమంది ఓటర్లు ఉన్నారని తేలింది.
పునియా లేవనెత్తిన ప్రశ్నలు ఆధారంగా- ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఇటువంటి గందరగోళం మొత్తం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కసరత్తునే ప్రశ్నార్థకం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఖుర్షీద్తో పాటు షారిక్ అహ్మద్ కూడా తన వాదనలు వినిపించారు.
ఇటువంటి వ్యవహారం మొత్తం ఎన్నికల క్రమాన్నే ప్రశ్నార్థకం చేస్తుందని ఖుర్షీద్ వాదించారు. ఈ రెండు సవరణల్లో ఏదో ఒకటే వాస్తవమై ఉంటుందనీ, రెండూ వాస్తవమయ్యే అవకాశాలు లేనందున ఈ రెండింటిలో ఏది వాస్తవమైనదో, ఏ ప్రకారం వాస్తవమైనదో వివరించాలని ఖుర్షీద్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించినట్టుగా ది హిందూ పత్రిక వెల్లడించింది.
ఇదే విషయంలో మరో కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, కేరళలో జరుగుతున్న కసరత్తులో 24 లక్షలమంది ఓటర్లను తొలగించారని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ విధంగా తొలగించబడిన ఓటర్ల వివరాలతో కూడిన జాబితాలు ప్రకటించకపోవటంతో ఓటు హక్కు కోల్పోయిన వారు తగు చర్యలు తీసుకోవటం, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవటం సాధ్యం కావటం లేదని రంజిత్ కుమార్ వివరించారు.
ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తొలగించిన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయటంతో పాటు, పంచాయితీ కార్యాలయాల వద్ద బహిరంగంగా అందుబాటులో ఉంచాలని ధర్మాసనం ఆదేశించిందని ది హిందూ కథనం తెలిపింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
