అస్పష్టత, అస్థిరత, స్థానిక పరిస్థితులపై అవగాహన, ఐక్యతా లోపం, ఆధిత్యపోరు, ఓటు చీలిక బీహర్లో మహాఘట్బంధన్ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బీహర్లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించగా, ప్రతిపక్ష మహఘట్బంధన్ ఘోర పరాజయిన్ని చవి చూసింది. మహఘట్బంధన్ ఓటమికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి, విశ్లేషణలు వస్తున్నాయి.
మహఘట్బంధన్ ఏర్పాటు దశ నుంచి కూడా అస్పష్టత, అస్థిరత స్పష్టంగా కనిపించాయి. సీట్ల ఎంపిక, పంపకం నుంచి అన్ని స్థాయిలలో అయోమయం నెలకొంది. బీహార్ విషయానికి సంబంధించిన ఒక నిర్ధిష్టమైన ఎన్నికల ప్రణాళికంటూ జాతీయ పార్టీ కాంగ్రెస్కు లేకుండా పోయింది. అయినా కానీ తన చరిత్రను ఆధారంగా చేసుకొని ప్రాంతీయ పార్టీలపై ఇంకా పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తూనే ఉంది.
బీహార్లో కాంగ్రెస్ ఉనికి..
దేశంలోనే అతిపెద్ద పార్టీ, అతి పురాతన పార్టీ అని తనను తాను చెప్పుకుంటూ పోతున్న కాంగ్రెస్ పార్టీ, నిజానికి బీహార్లో తన ఉనికిని ఏనాడో కోల్పోయింది. ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోని స్థానికంగా బలంగా ఉన్న ఆర్జేడీ ఇతర భావసారూప్యత గల పార్టీలను ఒక పెద్దన్నగా కలుపుకొని పోవడానికి బదులుగా కూటమి ఏర్పాటుపై చర్చల దగ్గర నుంచి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానితో పాటు; ఎన్నికల ప్రణాళిక, ప్రచార అంశాల ఖరారు ఇలా అన్నిటికి తానే అంటూ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయిండం కూడా ఈ ఓటమికి ఒక కారణమని చెప్పవచ్చు.
దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన ఓటు చోరీ అంశాన్నిబీహార్ నుంచే వెలుగులోకి తీసుకు వచ్చి ప్రజల దృష్టిని ఆకర్శింపజేసుకున్న కాంగ్రెస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓట్ల రూపంలో తనవైపు తిప్పుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అందుకు కాంగ్రెసే బాధ్యత తీసుకోవాలి.
వివిధ రాష్ట్రాల్లో స్థానికంగా ఉండే పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఇతర అంశాల గురించి ఏమాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తూ, ఒకే అంశాన్ని ఎన్నికల ఏజెండాగా తీసుకోవడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఇంతకు ముందు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం, ఈసారి బీహార్ ఎన్నికలను పురస్కరించుకొని ఓటు చోరీ అంశం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు .
స్పష్టతనివ్వని మహాఘట్బంధన్..
కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి, రాష్ట్ర నాయకత్వాలపై నమ్మకం లేకపోవడంతో బీహార్లో మహఘట్బంధన్ ఏ విషయంలో ప్రజలకు స్పస్టత ఇవ్వలేకపోయింది. భాగస్వామ్య పార్టీల మధ్య కూడా స్పష్టమైన అవగాహనను కుదుర్చలేకపోయింది. పైగా ఆర్జేడీ అంటే కుటుంబ పార్టీ అని పడిన ముద్రను చెరిపి వేయలేకపోయింది.
మహఘట్బంధన్ అధికారంలోకి వస్తే మళ్లీ కుటుంబ రాజకీయాలు తెర పైకి వస్తాయి. దీంతో బీహార్లో ఇటు ప్రభుత్వంలో అటు అభివృద్ది విషయంలో మళ్లీ అస్థిరత ఏర్పడగలదనే ఆలోచనతోనే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చినట్టు కనబడుతుంది.
మహఘట్బంధనలో భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యత లోపించింది. ఎవరికి వారు సొంతంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసుకొని, ప్రచారం కూడా చేపట్టారు.
మహఘట్బంధన్లో కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలలో నెలకొన్న అంతర్గత పరిస్థితుల కారణంగా అస్పష్టత, అస్థిరత, ఐక్యతలోపం వంటి విషయాలు కాంగ్రెస్ పెత్తనం వల్ల చివరి దాకా బహిర్గతమై ఏ విషయంలోనూ ఖచ్చితమైన హమీ, భరోసా ఇవ్వలేకపోవడంతో మహఘట్బంధన్ను ప్రజలు విశ్వసించలేకపోయారు. దీనికి కాంగ్రెస్ బాధ్యత వహించవలసి ఉంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
