ఒక నిద్రలేని రాత్రి. విద్యార్థులను మోసం చేయడానికి నిరాకరించిన ఒక కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడు నీట్ లీకేజీని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి తెలియజేశారు.
పరీక్ష రోజు ముగిసిన తర్వాత భారతదేశమంతటా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఓఎంఆర్ షీట్లలో బబుల్స్‌ను నింపి ర్యాంకులు, కటాఫ్‌ల కోసం ఎదురుచూశారు.
వైద్య రంగంలో ఒక అవకాశం కోసం అభ్యర్థులు ప్రయత్నించారు. కానీ అప్పుడే మోసం తలుపు తట్టింది.
రాజస్థాన్ కోచింగ్ పవర్‌హౌస్ సికార్‌లోని ఒక ఫోన్ స్క్రీన్‌పై పీడీఎఫ్ అటాచ్మెంట్గా ఈ మోసం ప్రత్యక్షమైంది.
అలసిపోయిన ఒక ఉపాధ్యాయుడు ఆ పీడీఎఫ్‌ను తెరిచారు. ఒకసారి చూశారు. మరోసారి తనిఖీ చేశారు.
సహోద్యోగికి ఫోన్ చేశారు. ప్రశ్నలను లైన్ బై లైన్ సరిపోలుస్తూ రాత్రంతా కూర్చున్నారు. తెల్లవారేసరికి, నీట్ యూజీ- 2026 ప్రశ్నార్థకమైంది. పరీక్షా విధానం తన స్వంత పరీక్షలోనే విఫలమైంది.
ఆన్లైన్లో చక్కర్లు కొట్టిన పీడీఎఫ్..
మే 3 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు నీట్ కోసం జవాబు కీని సిద్ధం చేయడంలో సహాయం చేసిన తర్వాత తన అద్దె గదికి తిరిగి వెళ్లారు. కీ పేపర్‌ను తయారు చేయడం వల్ల ఆయన పూర్తిగా అలసిపోయారు. ఇటువంటి సమయంలోనే ఒక సాధారణ హెచ్చరిక వచ్చింది.
“నా ఇంటి యజమాని నాతో- ‘సర్, ఏదో పీడీఎఫ్ చక్కర్లు కొడుతోంది’ అని చెప్పారు. నేను దానిని తనిఖీ చేశాను. షాక్‌కు గురయ్యాను” అని సికార్‌లో నీట్ అభ్యర్థులకు 13 ఏళ్లుగా కోచింగ్ ఇస్తున్న ఆ ఉపాధ్యాయుడు చెప్పారు.
మొదటి చూపులో ఆ పేపర్ అనుమానాస్పదంగా, చాలా బాగా తెలిసినట్టు అనిపించింది. “నేను పీడీఎఫ్‌లోని కెమిస్ట్రీ ప్రశ్నలను అసలు పేపర్‌తో సరిపోల్చినప్పుడు, రెడ్ ఫ్లాగ్‌లు కనిపించాయి” అని ఆయన తెలియజేశారు.
“ప్రశ్నలు పూర్తిగా ఓవర్‌లోడ్ అయ్యాయి. అప్పుడు నేను నా ఇంటి యజమానిని జీవశాస్త్ర ప్రశ్నలు కూడా ఉన్నాయా అని తనిఖీ చేయమని కోరాను. తీరా చూస్తే, అక్కడ జీవశాస్త్ర ప్రశ్నలు కూడా ఉన్నాయి. పరీక్షల సీజన్లో కోచింగ్ హబ్‌లలో ఇలాంటి పుకార్లు సర్వసాధారణం. ఇక్కడ ఫైనల్ పరీక్షలకు ముందు నోట్స్ కంటే ఆందోళన వేగంగా వ్యాపిస్తుంది. కానీ ఆయన దీనిని కొట్టి పారేయలేదు. బదులుగా, ఆయన ఫోన్ తీసి ఒక బయాలజీ ఫ్యాకల్టీ సహోద్యోగికి కాల్ చేశారు. రాత్రంతా, వారు లీకైన పీడీఎఫ్‌ను అసలు నీట్ పేపర్‌తో లైన్ బై లైన్, ప్రశ్నల వారీగా, సమాధానాల వారీగా క్రాస్-చెక్ చేశారు. అర్ధరాత్రి కల్లా, పజిల్ ముక్కలన్నీ ఒకదానికొకటి సరిపోయాయి. పేపర్ లీక్ అయిందనే విషయం నాకు ఖచ్చితంగా అర్థమైంది” అని ఆయన చెప్పారు.
మే 4 తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో, ఫిర్యాదు చేయడానికి ఆయన ఒక పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. “పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత తిరిగి రావాలి” అని పోలీసులు ఆయనకు సలహా ఇచ్చారని ఆయన చెప్పారు.
“కొన్ని లోపాలు ఉండి ఉండవచ్చు. అందుకే నేను పోలీసు స్టేషన్ నుంచి తిరిగి వచ్చి మెటీరియల్‌ని పరిశీలించడం కొనసాగించాను” అని ఆయన చెప్పారు.
తిరిగి తన గదిలోకి వచ్చి, పరిశీలన మళ్లీ ప్రారంభమైంది. స్క్రీన్షాట్లు, పోలికలు, ప్రశ్నల వరుసక్రమాన్ని సరిపోల్చారు.
సామాజిక బాధ్యతగా..
మే 6 సాయంత్రానికి, ఆయన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, సీబీఐకి ఈమెయిల్ పంపారు.
“మే 7 నాటికి, నాకు ఎన్టీఏ నుంచి స్పందనలు రావడం ప్రారంభమయ్యాయి. గృహ మంత్రిత్వ శాఖ కూడా నన్ను సంప్రదించింది” అని ఆయన చెప్పారు.
ఆ ఉపాధ్యాయునికి, మాట్లాడటం చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్న విషయం.
చెదిరిపోయిన టైమ్‌లైన్స్, పదేపదే ప్రిపరేషన్ సైకిల్స్, కోచింగ్ సెంటర్ ఫ్లోరోసెంట్ లైట్ల క్రింద మరొక సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులకు ఎదురుకాబోతోంది.
మే 3న జరిగిన పరీక్షకు సంబంధించి విస్తృతంగా అవకతవకలు, పేపర్ లీక్ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో నీట్-యూజీ 2026ను రద్దు చేసినట్టు మే 12న ఎన్టీఏ ప్రకటించింది.
“నీట్-యూజీ కోసం రెండు నుంచి మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది విద్యార్థుల కలలు ముక్కలవుతాయని నాకు తెలుసు” అని ఆయన తీవ్ర నిరాశతో తెలియజేశారు.
“వారు చదువుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ పరీక్ష కోసం తమ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను” అని చెప్పుకొచ్చారు.
అద్భుతమైన విద్యా కేంద్రంగా సికార్..
ఇంజనీరింగ్, మెడికల్ అభ్యర్థుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో రాజస్థాన్‌లోని మరొక ప్రధాన కేంద్రమైన “కోట”తో పోల్చబడే భారతదేశపు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కోచింగ్ కారిడార్లలో ఒకటైన సికార్పై ఈ వ్యవహారం తీవ్రమైన ప్రభావం చూపింది.
సికార్ కనబరుస్తున్న బలమైన నీట్ ఫలితాల వెనుక ఏదో మోసం దాగి ఉందనే ఆరోపణలపై ఆ ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“సికార్ కొన్నేళ్లుగా ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసింది. మంచి అధ్యాపకులు, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ వ్యవస్థలు, బలమైన కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. సికార్‌ను బ్లేమ్ చేయడం తప్పు” అని ఆయన చెప్పారు.
విజయం అనేది ఒక అనుమానంగా మారిపోవడాన్ని ఆ ఉపాధ్యాయుడు తిరస్కరించారు.
“ఇటీవలి కాలంలో సికార్ చాలా బాగా రాణించినందున, దీని వెనుక ఏదో కుట్ర కోణం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. అది అన్యాయం. కష్టపడి పనిచేసే విద్యార్థులు, ఉపాధ్యాయుల ద్వారా సికార్ తన సత్తా చాటుకుంది” అని ఆయన నొక్కి చెప్పారు.
ఈ సికార్ నగరం చీటింగ్ స్కాండల్‌కు ప్రధాన ముఖచిత్రం కాకూడదని ఆయన పేర్కొన్నారు.
దిశాంక్ రోహిత్ రాసిన ఈ వ్యాసాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
స్వేచ్ఛానువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
