“మోంపానాస్లో నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోను
వించల్సీ దగ్గర హాయిగా నిద్రపోను
సస్సెక్స్ గరిక మైదానంలో నా దేహాన్ని మీరు ఖననం చేయవచ్చు
చాంప్ మెడీలో నా నాలుకను మీరు ఖననం చేయవచ్చు
నేనక్కడ ఉండను, నేను లేచి తిరుగాడుతాను
వూండెడ్ నీ దగ్గర నా హృదయాన్ని ఖననం చేయండి”– స్టీఫెన్ విన్సెంట్ బెనెట్(అమెరికన్ నేమ్స్ కవిత)
‘వూండెడ్ నీ’వాగు దగ్గర లకోటా తెగకు చెందిన మూడువందల మంది అమెరికన్ మూలవాసి ప్రజలను 1890 డిసెంబర్ 29న హతమార్చారు. నలుగురు మగవాళ్ళు, నలభైయేడు మంది ఆడవాళ్లు, పిల్లలు గాయపడ్డారు. ఆ తర్వాత అందులో కొందరు గాయాలతో చనిపోయారు. అది అమెరికా సైన్యపు పైన్ రిడ్జ్ క్యాంపెయిన్ దాడిలో భాగంగా జరిగిన ఘటన.
అమెరికన్ మూలవాసి ప్రజల నాగరికతనూ, సంస్కృతినీ నాశనం చేసిన దాడుల పరంపరకు అది ఒక తుది ఘట్టమని చెప్పుకోవచ్చు. ఆ విధ్వంసాన్ని ‘బరీ మై హార్ట్ ఎట్ వూండెడ్ నీ’ అన్న సుప్రసిద్ధ పుస్తకంలో అమెరికన్ రచయిత డీ బ్రౌన్ వివరంగా చిత్రించారు. నవాజో, శాంటీ డకోటా, హంక్ పాపా లకోటా, ఓగ్లాలా లకోటా, చెయెన్, అపాచీ, అరాపహో, మోడాక్, కయోవా, కొమాంచీ, నేజ్ పర్స్, పాంకా, యూట్, మినికాంజో లకోటా తెగలకు చెందిన ప్రజల విషాదాలను డీ బ్రౌన్ పుస్తకం వివరిస్తుంది.
1492లో కొలంబస్ అమెరికా గడ్డపైకి అడుగుపెట్టే సమయానికి దాదాపు యాభై లక్షల మంది అమెరికా మూలవాసి తెగల జనాభా ఉండేదని ఒక అంచనా. ఆ తర్వాత మూడు వందల యేళ్ళనాటికి, అంటే 1800 నాటికి వారి జనాభా కేవలం ఆరు లక్షలమందికి తగ్గిపోయింది. ఆ తర్వాత మరో వంద సంవత్సరాలకు అది మరింతగా పడిపోయి రెండు లక్షల నలభైయేడు వేలకి చేరుకుంది. పీక్వాట్, మోహిగాన్, మసాచ్యూసెట్స్ వంటి డజనుకు పైగా తెగలు పూర్తిగా మాయమైపోయాయి.
ఒక సుదీర్ఘ విషాద యాత్ర..
1800 నుంచి 1900 సంవత్సరాల మధ్యలో అమెరికన్ ఇండియన్ల జనాభా సంఖ్య సగానికి పైగానే తగ్గిపోయింది. యూరోపియన్లు అంటగట్టిన వ్యాధులు, దారుణ మారణకాండ కలగలిసి మూలవాసులను బలిగొన్న కన్నీటి కాలం అది. ‘అమెరికాలో బంగారం, వెండి నిక్షేపాలను కనిపెట్టడం, మూలవాసి ప్రజల నిర్మూలన, బానిసలుగా మార్చడం, గనులలో సమాధి చేయడం; నల్లజాతి ప్రజల వేటను వ్యాపారంగా మలచిన వేటభూమిగా ఆఫ్రికాను మార్చడం- ఇవి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ఆరంభ కాలాన్ని సూచిస్తాయ’ని కార్ల్ మార్క్స్ అన్నారు.
యూరప్ నుంచి వచ్చిన వలసవాదులు అమెరికన్ మూలవాసి తెగల ప్రజలను వాళ్ళ సొంత భూముల నుంచి వెళ్ళగొట్టారు. వారిని, ‘రిజర్వేషన్’ల పేరిట పరిమిత ప్రాంతాలకు నెట్టివేశారు. మళ్ళీ అక్కడ నుంచి కూడా సుదూర ప్రాంతాలకు తరిమివేశారు. ఎదిరించిన వారినీ, సొంత భూముల నుంచి కదల నిరాకరించిన వారినీ హింసాకాండతో, హత్యాకాండలతో బెదిరించి తరిమివేశారు.
మానిఫెస్ట్ డెస్టినీ(నిశ్చితమైన విధి) సిద్ధాంతం పేరుతో ఇదంతా కొనసాగింది. యూరప్ నుంచి వచ్చిన శ్వేత జాతీయులకు మాత్రమే అమెరికాపై సర్వహక్కులూ ఉన్నాయని, శ్వేతేతరులకు, మూలవాసి ప్రజలకు అమెరికా ఖండపు భూములపై ఎలాంటిశాశ్వత హక్కులు లేవనే భావనే మానిఫెస్ట్ డెస్టినీకి పునాది. ఇది అమెరికన్ మూలవాసి తెగల ప్రజలను వాళ్ళ భూముల నుంచి బేదఖలు చేయడానికి ఊతమిచ్చిన జాత్యహంకార అవగాహన.
దురహంకారాన్ని తెలిపే రాతలు..
పిల్లల కథల పుస్తకాల రచయితగా, ప్రత్యేకించి ‘ది వండర్ఫుల్ విజార్డ్ ఆఫ్ ఓజ్’ పుస్తక రచయితగా ప్రఖ్యాతి పొందిన లీమన్ ఫ్రాంక్ బామ్; వూండెడ్ నీ సంఘటనకు కొద్ది రోజుల ముందు తన శాటర్ డే పయోనీర్ పత్రికలో ఒక సంపాదకీయాన్ని రాశారు. అందులో, ‘ఆక్రమణ చట్టం, నాగరికతా న్యాయం – వీటి ప్రకారం తెల్ల జాతీయులే అమెరికా ఖండానికి యజమానులు. అతి కొద్ది సంఖ్యలో మిగిలిన ఇండియన్ తెగల ప్రజలను సంపూర్ణంగా నిర్మూలించడం ద్వారా మాత్రమే స్థిరపడిన ఆవాసాలకు నిశ్చితమైన భద్రత లభిస్తుంది. వాళ్ళను నిర్మూలించకుండా ఎందుకుండాలి? వాళ్ళ గొప్పదనం నాశనమైపోయింది. వాళ్ళ స్థైర్యం శిథిలమైపోయింది, పౌరుషత్వం వట్టిపోయింది. దైన్యంలో మగ్గిపోతూ బ్రతకడం కంటే, చనిపోవడమే వాళ్లకి ఉత్తమం.’
వూండెడ్ నీ మారణకాండ తర్వాత అతను రాసిన మరో సంపాదకీయంలో మాటలు ఇవీ, ‘ఇండియన్ తెగల ప్రజలను సంపూర్ణంగా నిర్మూలించడం మీదనే మన భద్రత ఆధారపడి ఉందని పయోనీర్ పత్రిక ఎన్నడో పేర్కొన్నది. వందల శతాబ్దాలుగా మనం వాళ్ళకు అన్యాయం చేశాము. మన నాగరికతని పరిరక్షించుకోవాలంటే, ఇంకొక్క చిన్న పొరపాటు చేసేస్తే సరిపోతుంది. అది అదుపులేని, అదుపు చేయలేని ఈ మృగాలను భూమి మీద నుంచి శాశ్వతంగా తుడిచి పెట్టేయడమే.’ ఈ మాటలలోని దురహంకారాన్ని ఇంకా వివరించాల్సిన అవసరం లేదు.
మారణకాండ అమెరికాకే పరిమితం కాలేదు..
ఇది అమెరికాకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఆస్ట్రేలియాలోనూ అదే జరిగింది. నూటనలభై సంవత్సరాల ఆస్ట్రేలియా చరిత్రలో 270 మారణకాండలు జరిగాయని ప్రొఫెసర్ లిండాల్ ర్యాన్, ఆమె పరిశోధన బృందం జరిపిన అధ్యయనం వెల్లడి చేసింది. ఆస్ట్రేలియా మూలవాసి తెగల ప్రజలను నిర్మూలించడానికి చేసిన ఈ ప్రయత్నాలు వలసవాద ప్రభుత్వ ఆమోదంతో జరిగినవే.
ఆస్ట్రేలియాను బ్రిటిష్ వలసవాదులు ఆక్రమించుకున్న తర్వాత; అంతకు ముందు పది, పదిహేను లక్షల దాకా వుండిన మూలవాసి తెగల జనాభా, 1900 సంవత్సరం నాటికి కేవలం ఒక లక్షకు చేరుకుంది. వలసవాద ప్రభుత్వ హంతక దాడులలో, దారుణమారణకాండలలో స్థానిక ప్రజలు నాశనమై పోయారు. 1905 నుంచి 1970 దాకా ఆస్ట్రేలియా మూలవాసుల సంతానాన్ని వారి తల్లుల నుంచి బలవంతంగా వేరుచేశారు. ‘మిశ్రమ జాతీయులను శ్వేత జాతి పౌరులుగా మార్చడం కోసం’ ఈ పని చేశామని వాళ్ళు చెప్పుకున్నారు. తమ తల్లుల నుంచి బలవంతంగా దూరమైపోయిన వీరిని ‘అపహృత తరం’(స్టోలెన్ జనరేషన్) అని పిలుస్తారు.
బ్రిటిష్ వలస పాలనను వణికించిన పిలుపు..
ఇదే కాలంలో, 19వ శతాబ్ది అంతటా భారతదేశంలోని పలు ప్రాంతాలలో బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా ఆదివాసీ పోరాటాలు, తిరుగుబాట్లు తలెత్తడం యాదృచ్ఛికమైన విషయం కాదు.
‘మహారాణి పాలన అంతం చేద్దాం, మన రాజ్యాన్ని స్థాపించుకుందాం’అనే బిర్సా ముండా పిలుపు బ్రిటిష్ వలస పాలనను వణికించింది. జార్ఖండ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఆ పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది.
మానిఫెస్ట్ డెస్టినీ వంటి సిద్ధాంతాల పేరుతో మూలవాసులను/ ఆదివాసులను/ వివిధ తెగల ప్రజలను వాళ్ళ సొంత భూముల నుంచి బేదఖలు చేసే ప్రయత్నాల పరంపరను మనం చరిత్ర పొడవునా చూడవచ్చు.
విస్థాపన, విధ్వంసాలకు ‘అభివృద్ధి’ అనే కథనం మునుపటి మానిఫెస్ట్ డెస్టినీ సిద్ధాంతానికి మరొక కొత్త రూపం. ప్రజలను సంపూర్ణంగా నిర్మూలించాలని నిర్లజ్జగా, బహిరంగంగా పిలిపులిచ్చే ఫ్రాంక్ బామ్ వంటి దురహంకారులకు ఇప్పుడు కొదవలేదు. మారణకాండలో పాల్గొనే వారికి, హంతకదాడులలో పాల్గొనేవారికి నజరానాలు, ప్రశంసలు అందించి, నిర్మూలనకు నిశ్చితమైన తేదీలతో గడువు విధించే యుద్ధ మంత్రులకీ చరిత్రలో కొదవలేదు. ఖనిజ సంపద, గనుల వేట, పెట్టుబడి లాభాలు వాళ్ళను ఊరిస్తుంటాయి. ఆదివాసుల తరిమివేతకు వాళ్ళను తహతహలాడేలా చేస్తాయి.
కొన్ని సార్లు వాళ్ళు విజయం సాధించినట్లే కనిపిస్తుంది. ప్రజలు నిస్సహాయంగా ఓడిపోయినట్లు, తిరిగి కోలుకోవడం సాధ్యంకానట్లు కనిపిస్తుంది. ఇటలీకి చెందిన ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త కార్లో రోవెలి మాటలను మనం గుర్తు చేసుకోవచ్చు. భావాలు, నైతిక ఆదర్శాలు, ఆవేశాలు, ప్రపంచాన్ని చూసే దృక్పథాలు – ఇవి చారిత్రక ఉద్యమాలని రూపొందిస్తాయి. చాలాసార్లు అవి ముందుకుపోలేని, మూసుకుపోయిన దారులలోకి నడిపిస్తాయి. కానీ, కొన్నిసార్లు అవి తమ జాడలను వదిలి వెళ్తాయి. నాగరికత ఆలోచనలపై అవి లోతైన ముద్రలను వేసి, తిరుగులేని విధంగా వాటిని మార్చివేస్తాయి. విప్లవం, చరిత్ర భూమిలో లోలోపల జీవించే భూగర్భ క్షీరదం లాంటిది. అప్పుడప్పుడూ అది భూమిపైకి వస్తుంది. ఏదీ మారకుండా ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందనేది పాలకుల ఊహ. విప్లవం, ఆ భూగర్భ క్షీరదం, ఎవరూ ఊహించనప్పుడు తలెత్తుతుంది. మన నాగరికత, మనం నమ్ముతున్న విలువలు – ఇవన్నీ వర్తమానాన్ని అధిగమించి, తీక్షణతతో, తీవ్రతతో కలలు కనడానికి సాహసించిన మనుషుల దార్శనికత ఫలితం, అవి అనేకానేక ఆదర్శాల ఫలితం.
పోరాటాలకు ప్రతీకగా బిర్సా ముండా..
లకోటా ప్రజల నుంచి భూములు లాక్కోవడం చట్ట విరుద్ధమైనదనీ, అందుకు వడ్డీతో కలుపుకుని 75.7 కోట్ల డాలర్లను వారికి పరిహారంగా చెల్లించాలని 1980లో అమెరికా సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించింది. అయితే, ఆ తీర్పులో భూములు వారికే తిరిగి ఇవ్వాలని మాత్రం చెప్పలేదు. లకోటా ప్రజలు ఆ పరిహారాన్ని తిరస్కరించి, తమ భూములు తమకే తిరిగి ఇవ్వాలని కోరారు.
న్యాయంకోసం కొనసాగే పోరాటానికి వూండెడ్ నీ ఒక శక్తివంతమైన నిదర్శనంగా నిలబడింది. ఆ చరిత్ర నెత్తుటి మరకలను మాత్రం ఇంకా తుడిచివేయాల్సే ఉంది. వంద సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలోనూ మూలవాసులకు చేసిన మునుపటి దారుణ అన్యాయాలను నెమ్మదిగానైనా గుర్తించే క్రమం మొదలైంది.
మే 26న జాతీయ క్షమాపణ దినంగా ప్రకటించారు. 2008లో అపహృత తరాలకు ఆస్ట్రేలియా పార్లమెంటు క్షమాపణ ప్రకటించింది. కానీ దారుణ మారణకాండలను ఇంకా అధికారికంగా ఒప్పుకోలేదు. ఇవాళ భారతదేశంలో అన్యాయాలనూ, అణచివేతనూ ప్రతిఘటించే పోరాటాలకు బిర్సా ముండా ఒక ప్రతీకగా మారారు.
వంద సంవత్సరాలకు పైగా కాలం దొర్లిపోయినా, చర్చలు, వాదోపవాదాలు ఇంకా తీవ్రంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలకు అన్యాయం జరిగిందని అంగీకరించడాన్ని మనం చూస్తున్నాం. ఆలస్యంగానే కావచ్చు, అర్ధ మనస్కంగానే కావచ్చు అలా గుర్తించక తప్పడంలేదు. మానిఫెస్ట్ డెస్టినీ లాంటి సిద్ధాంతాలు చరిత్ర చెత్తబుట్టలోకి చేరిపోతాయి. మరుగున పడిన ప్రతీకలు ముందుకు వస్తాయి. భూమి పొరలలో నుంచి విప్లవాలు మళ్ళీ మొలకెత్తుతాయి.
వివరణలు
♦ మోంపానాస్, వించల్సీ, సస్సెక్స్, చాంప్ మెడీ మొదలైనవి యూరప్‌లోని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలలో స్థలాల పేర్లు. స్టీఫెన్ విన్సెంట్ బెనెట్ కవిత యూరోపియన్ పేర్లనూ, అమెరికన్ మూలవాసులపేర్లనూ పీల్చుతుంది. స్థలాలకూ, మనుషులకూ అమెరికన్ మూలవాసులు పెట్టిన పేర్లు అర్ధస్ఫోరకంగా ఉన్న విషయాన్ని ‘అమెరికన్ నేమ్స్’ కవిత ఎత్తి చూపుతుంది. ఉదాహరణకు ‘వూండెడ్ నీ'(గాయపడిన మోకాలు) వాగు అన్న పేరు, ఒక యుద్ధంలో మోకాలికి గాయమైన ఘటనను తలచుకుంటూ దానికి పెట్టిన పేరు.
♦ మానిఫెస్ట్ డెస్టినీ – జాన్ లూయీ సూయివూ(John Louis O’Sullivan) 1845లో ప్రతిపాదించిన భావన, సిద్ధాంతం. అది అమెరికాలో స్థిరపడిన వలసవాదులు ఉత్తర భాగం నుంచి పడమటివైపుకు విస్తరిస్తూ పోవడాన్ని సమర్ధించిన సిద్ధాంతం. అది స్పష్టంగా విదితమైన విషయమనీ, ఆ విస్తరణయే నిశ్చితమైన విధియనీ మానిఫెస్ట్ డెస్టినీ సిద్ధాంతం భావిస్తుంది. అమెరికా విస్తరణవాదానికి కూడా ఇది ఒక భూమికగా పనిచేసింది. వివాదాస్పదమైన ఈ మానిఫెస్ట్ డెస్టినీ భావనను, సిద్ధాంతాన్నీ అబ్రహాం లింకన్ వంటివారు కూడా వ్యతిరేకించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
