శబరిమలను హిందువులు పుణ్యక్షేత్రంగా భావిస్తారు. అది పెరియార్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పశ్చిమ కనుమల కొండల్లో ఉంది.
చుట్టూ ఉన్న 18 కొండల మధ్య దట్టమైన అడవుల్లో ఒక కొండ మీద అయ్యప్ప గుడి ఉంది.
సముద్ర మట్టానికి 4,133 ఫీట్ల ఎత్తులో- పతనంతిట్ట జిల్లాలో పెరునద్ గ్రామ పంచాయతి పరిధిలో ఉంది.
ప్రతి యేటా ఈ దేవాలయాన్ని 45- 50 మిలియన్ల భక్తులు దర్శించుకుంటున్నారు. అయప్పను సస్ట అని, ధర్మ సస్ట అని కూడా పిలుచుకుంటారు.
పన్నెండో శతాబ్దంలో పండలం రాజవంశీకుడు, యువరాజు మణికందన్ శబరిమలలో తపస్సు చేశాడని, ఆయన అయ్యప్ప అవతారమనీ భక్తులు భావిస్తారు.
పండలం రాజవంశీకుల కాలం(1821)నాటికే ఈ గుడి అతిపురాతనమైందని చెపుతారు. ఇప్పుడున్న అయప్ప విగ్రహాన్ని 1910లో ప్రతిష్టించారు.
కేరళలోని శబరిమలలో ప్రతి సంవత్సరం మకర విళక్కు అనే పండగ జరుగుతుంది. ఇందులో తిరువాభరణం, మకర జ్యోతి అనే రెండు ముఖ్యమైన కార్యక్రమాలుంటాయి.
తిరువాభరణం అంటే అయప్ప స్వామి ఆభరణాలని ఊరేగించడం. రెండోది మకరజ్యోతి దర్శనం. వీటిని చూడడానికే భక్తులు శబరిమలను చేరుకుంటారు.
రామాయణ కావ్యంలో ఆదివాసి భక్తురాలైన శబరిని ప్రస్తుత శబరిమల ప్రాంతంలో కథానాయకుడు శ్రీరాముడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు కలుసుకున్నందుకు శబరిమల అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెపుతుంది.
అక్కడ శబరి పండ్లు మంచివా కాదాని ఒక్కొక్కటి రుచి చూసి, మంచి పండ్లు ఏరి రామునికి సమర్పించుకుందని కూడా స్థల విశేషాల్లో ఉంది.
కొద్ది దూరంలో తపస్సు చేసుకుంటున్నది ఎవరని శబరిని రాముడు అడిగితే, అతను సస్ట అని చెపుతుంది. రాముడు సస్ట దగ్గరికి వెళతాడు. సస్ట లేచి నిలబడి రాముడికి స్వాగతం పలుకుతాడు. ఆ సస్ట ఎవరో కాదు. అయ్యప్పే అని తెలుస్తుంది.
ఇక్కడ పూజింపబడుతున్న అయ్యప్పకు హరిహర పుత్ర అనే మరో పేరు ఉంది. అంటే ఈయన హరికి- హరుడికి కలిగిన సంతానం. మహా విష్ణు- శంకరుల సంతానమన్నమాట! మన హిందూ దేవుళ్లకున్న మహిమల్లో ఇదొకటి. ఇద్దరు మగవాళ్లకు అయ్య- అప్పకు పుట్టడమేమిటని అమాయకంగా ఎవరూ అడగొద్దు. కల్పించుకున్న దైవ మహిమలు ఎలాగైనా ఉంటాయి. అసంబద్ధమైన అంశాలనే మన భక్తులు భక్తి పారవశ్యంతో పూజిస్తుంటారు.
హేతుబద్ధత కోసం అంగలార్చేవారికి అదొక సమస్య. కానీ, కళ్లు మూసుకుని విశ్వసించే వారికి అది సమస్యే కాదు.
హిందువులు ఏర్పరుచుకున్న రాశులలో మకరాశి ఒకటి.
మకర జ్యోతి అంటే మకర రాశి వెలుగు. అయ్యప్ప “మకర జ్యోతి”గా మారి ప్రతి సంవత్సరం జనవరి 14న భక్తులకు ఒక నక్షత్రంగా(వెలుగుగా) కనిపించి దీవిస్తాడని స్థల పురాణం(ఒక విశ్వాసం) ఉంది.
ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తర దిశగా ఆరు నెలల పాటు ప్రయాణిస్తాడని, మకర సంక్రాంతి(జనవరి 14) రోజు ప్రారంభమైన ప్రయాణం కర్క సంక్రాంతి(జూలై 14) రోజున ముగుస్తుందనీ చెపుతారు.
సంక్రాంతికి పంటలు ఇళ్లకు రావడం- గ్రామాలన్నీ సంతోషంతో కళకళలాడడం జరుగుతుంది.
మనిషి ప్రకృతితో అనుసంధానమైన పండగ ఇదని అనుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. మళ్లీ రాముడు, శబరి, అయ్యప్ప అంటే మాత్రం కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.
మకర జ్యోతి వేరు, మకర విళక్కు అనేది వేరు.
మకర జ్యోతి భక్తుల విశ్వాసం. మకర విళక్కు అనేది కేవలం మనిషి వెలిగించే అఖండ దీపం. దాన్నే ఇప్పుడు భక్తులు “మకర జ్యోతి”గా పరిగణిస్తున్నారు.
శబరిమలలో అయ్యప్ప దేవాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పొన్నాంబలమేడు కొండ మీద గతంలో మలఆర్య అనే గిరిజన జాతివారు పూజ చేసి, పెద్ద దీపం వెలిగించేవారు. దాన్నే “మకర విళక్కు” అని అనేవారు.
పొన్నాంబలమేడు కొండ మీద కూడా ఒక చిన్న గుడి ఉంది. అక్కడి గిరిజనులు ఆ గుడిలోని దేవతా మూర్తికి హారతి ఇచ్చేవారు.
కర్పూరం, నెయ్యివంటి వాటితో పెద్ద దీపం వెలిగించి, అక్కడున్న విగ్రహం చుట్టూ మూడు సార్లు తిప్పి హారతి ఇచ్చేవారు.
ఇప్పుడు ఆ కొండ మీది దేవాలయం వైపు ఎవరినీ పోనివ్వడం లేదు. అది అటవీ శాఖవారి ఆధీనంలో ఉంది.
వాస్తవం- భ్రమ..
అటవీశాఖ, పోలీసు శాఖ, శబరిమల అయ్యప్ప దేవాలయ సిబ్బంది కలసి కట్టుగా- గుట్టుగా నిర్వహిస్తున్న కార్యక్రమమే మకర విళక్కు.
వీరు వెలిగించే అఖండ దీపమే మకరజ్యోతి. అంటే, కొండమీద నక్షత్రమనే ఒకప్పటి భ్రమే ఇప్పుడు వాస్తవంగా మారింది.
కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవోసం(దేవాలయ) బోర్డు, అటవీశాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కేరళ హైకోర్టు ధృవీకరించింది.
వాస్తవాలన్నీ బహిర్గతమయ్యాయి. కాబట్టి, ఇంకా ఈ విషయం మీద పరిశీలనలు అవసరం లేదని కూడా కోర్టు చెప్పింది.
ఒకప్పటి అమాయక గిరిజన సంప్రదాయాన్ని నేటి నాగరిక మూఢ భక్తాగ్రేసరులు కొనసాగిస్తున్నారు. దీనికి ప్రభుత్వ యంత్రాంగాలన్నీ తమ శాయశక్తులా సహకరిస్తున్నాయి.
మూఢభక్తి, ఒక ఆచారం- చాదస్తం కొనసాగడానికి ఎక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసకులే కారణం కాదు.
రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కారణమేనని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. భద్రాద్రికి వెళ్లే ముత్యాల తలంబ్రాలే కావొచ్చు. సమక్కసారక్క జాతరే కావచ్చు.
ఇంకా అలాంటి ఏ ఇతర సంప్రదాయాలైనా కావొచ్చు. అన్నిటికీ సూత్ర మొక్కటే, ఏ ప్రాంతంలోనైనా సూత్రధారులు ఒకేరకంగా వ్యవహరిస్తారనేది మనం తెలుసుకోవాలి.
మనిషి మహత్మ్యం
జనవరి 14, ఉదయం పొన్నాంబలమేడు కొండకు ఒక బృందం బయలుదేరి సాయంత్రానికి అక్కడికి చేరుకుంటుంది.
మధ్యలో మధ్యాహ్నం కాసేపు సేద తీరి, భోజనాలు చేసి మళ్లీ ప్రయాణమవుతుంది.
ఆ బృందంలో యాభై మంది అటవీశాఖవారు, యాభై మంది పోలీసులు, విద్యుత్ శాఖవారో పదిమంది.
అయప్ప ఆలయ సిబ్బంది మరో పదిమంది. సామాన్లు మోయడానికి కూలీలు వగైరా అంతా కలిసి ఒక బృందంగా వెళ్తారు.
సాయంత్రానికి కొండ మీదికి చేరిన ఆ బృందం సంధ్యవేళ 6- 16 నుంచి 6- 20 వరకు అఖండ జ్యోతి వెలిగిస్తుంది.
సుమారు పది కిలోల కర్పూరం వెలిగించే సరికి పెద్ద జ్యోతి పైకి లేస్తుంది. ఆ వెలుగు అడ్డంగా కొందరు లావుపాటి దుప్పటిని మూడుసార్లు అడ్డం పెట్టి తొలగిస్తారు.
దీంతో శబరిమల ఆలయంలో ఉన్న భక్తులకు, ఇంకా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్నవారికి ఆకాశంలో నక్షత్రం మూడుసార్లు మినుకుమని వెలిగి మాయమైందన్న భ్రమ కలుగుతుంది.
అదే మనిషి చేసే మకర జ్యోతి మహత్మ్యం!
ఈ కార్యక్రమాన్ని సన్నిధానం(అయప్ప గుడి ఆవరణ)నుంచి, పండితవలం, పుల్మేడు, కొండపై నుంచి చలకయం, అట్టతోడు, సరంకుత, నీలిమల, మరకుటమ్వంటి నిర్ణీత స్థలాల నుంచి భక్తులు మకరజ్యోతిని దర్శించుకుంటూ ఉంటారు.
పొన్నాంబలం(యిడు) కొండ మీద హారతి కార్యక్రమం అయిపోగానే, కొండ కింద అయ్యప్ప గుడి గోపురం నుంచి అర్చకులు భక్తులకు సంకేతాలిస్తారు. దీంతో కార్యక్రమం ముగిసిందని భక్తులు తెలసుకోని, ఎవరి దారిన వారు వెళ్లిపోతారు.
అయప్ప దర్శనానికి సంబంధించి- మహిళల విషయమొకటి కోర్టు కెక్కింది.
1991లో కేరళ హైకోర్టు 10-50 సంవత్సరాల మధ్య గల బాలికల/ మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఆ వయసులో వారు ఋతుక్రమంలో ఉంటారని, వారి ప్రవేశం వల్ల ఆలయం మైలపడుతుందనే కారణంతో కోర్టు ఆ ఉత్తర్వునిచ్చింది.(అదీగాక, అయప్పకు తల్లి లేదు. ఆయన అయ్యకు, అప్పకు పుట్టిన వాడు కదా? స్త్రీలు అపవిత్రులయితే, పుట్టుకే అపవిత్రం. మనుషులంతా అపవిత్రులే- మరి దానికేమంటారు?) ఈ విషయం అక్టోబరు 2017లో కాన్సిటిట్యూషన్ బెంచ్‌కి వెళ్లింది.
జ్యోతి నేపథ్యం..
పొన్నాంబలం కొండమీద 1950 కంటే ముందు ఆదిమ తెగలు నివసిస్తూ ఉండేవారు. సంక్రాంతి రోజున దేవుడికి పెద్ద దీపం వెలిగించి పూజలు చేసుకోవడం ఆనాటి సంప్రదాయం. అది ఆకాశంలో నక్షత్రమని చుట్టు పక్కల ప్రాంతాల్లోని వారు అనుకుంటూ ఉండే వారు. హైడల్ ప్రాజెక్ట్ కట్టడం మూలాన ఆ కొండ ప్రాంతం వారు నిర్వాసితులయ్యారు.
మూడు నాలుగేళ్ల పాటు అక్కడ ఎవరూ దీపం వెలిగించలేదు. ఎవరికీ ఏ నక్షత్రమూ కనిపించలేదు. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని అలాగే నిలపడానికి కేరళ ప్రభుత్వమే మకరజ్యోతిని వెలిగించడం ప్రారంభించింది.
1983- 84 సంవత్సరాల్లో కేరళ రాష్ట్ర హేతువాద- మానవవాద సమాఖ్య(ఫారా) పూనుకుని, పొన్నాంబలం కొండపైకికెక్కి రాకెట్లు, బాణాసంచను పేల్చారు. ఆ రోజుల్లో దూరదర్శన్ ప్రేక్షకులు ఈ దృశ్యాలను చూశారు. ఈ రచయిత కూడా ఆ ప్రేక్షకుల్లో ఒకరు.
ఈ విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే మకర జ్యోతి మాయ బట్టబయలవుతుందని, ఇప్పుడు ఎవరినీ ఆ కొండపైకి వెళ్లనివ్వరు. మకర జ్యోతిపై నమ్మకం సడలితే భక్తులు తగ్గుతారు. శబరిమల కేంద్రంగా సాగుతూ వస్తున్న అనేక వ్యాపారాలు దెబ్బతింటాయి. ఏ ప్రభుత్వ లక్ష్యమైనా ప్రజలను తమ గుప్పిట్లో ఉంచుకోవడమే కదా? ఆ ప్రయత్నంగా వస్తున్న రాబడిని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు?
వ్యాసరచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొపెసర్(రి)
