దేశంలో ఎరువులకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం పదేపదే హామీ ఇస్తుంది కానీ వాస్తవ పరిస్థితి మరొక విధంగా ఉంది.
సెప్టెంబర్ 28న విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ న్యూయార్క్‌లో ఆసియా సొసైటీ అనే లాభాపేక్ష లేని సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన భారతదేశంలోని మీడియాలో పతాక శీర్షికలో ప్రచురితమైంది.
“ధాన్యాలు ఎక్కువగా ఎగుమతి చేసే దేశాలు ప్రధానంగా నల్ల సముద్రం ద్వారా ఇక ధాన్యాలు ఎగుమతి చేయలేక పోవచ్చు” అని ఆయన అన్నారు. రానున్న నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం రావచ్చని ఆయన ముగింపు ఉపన్యాసంలో చెప్పడం ఆశ్చర్యకరం.
ఆ మరుసటి రోజు జైశంకర్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడుతూ “గ్లోబల్ సౌత్ ఆర్థిక వ్యవస్థలపై పశ్చిమ ఆసియా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలను నివారించడానికి కృషి చేయాలని” కోరినట్లుగా పత్రికల్లో వెలువడింది.
మే నెలలో ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పశ్చిమాసియాలోని ఇంధన సంక్షోభం దృష్ట్యా ఇంధనం తక్కువగా వాడాలని, విదేశీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవాలని, దేశ ఆర్థిక పరిస్థితి దిగజారకుండా కాపాడాలని చెప్పారు.
జైశంకర్ ప్రకటన ప్రత్యేకించి భారతదేశంలో ప్రధాని చెప్పిన పరిస్థితికి ప్రత్యక్ష నిదర్శనం.
నిల్వలపై ప్రభుత్వ అంచనాలు
భారతదేశంలో ఇంధన సవాళ్ల గురించి చాలా ఘాటైన చర్చ జరుగుతున్నది. కానీ అంతే ప్రధానమైన ఎరువులు, దాని ప్రభావం ఆహార భద్రతపై ఎలా ఉంటుంది అనే దానిపై తక్కువగా అంచనా వేయబడుతున్నది.
అధికారుల లెక్కలు అలాంటి ఆందోళన అవసరం లేదని తెలియజేస్తున్నాయి. భారతదేశంలో రబీ సీజన్ ప్రారంభమైంది.
ఎరువుల నిల్వలు గత సంవత్సరంతో పోలిస్తే 38 శాతం ఎక్కువగా పదిహేడు పాయింట్ సున్నా ఒకటి మిలియన్ టన్నులు ఉన్నట్లుగా అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.
ప్రస్తుత నిల్వలు 38 మిలియన్ టన్నులు రబీ సీజన్ ఆరు మాసాలకు సరిపడే విధంగా ఉన్నాయి.
యూరియా 54 శాతం, డీఏపీ తొమ్మిది శాతం, ఎన్పీకేఎస్ ముప్పై ఆరు శాతం గత సంవత్సరం కంటే ఎక్కువగా ఎరువుల నిల్వలు ఉన్నాయని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.
2026-27 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి(గత సంవత్సరం కంటే రెండు పాయింట్ ఆరు మూడు మిలియన్ టన్నులు తక్కువగా) మొత్తం మూడు వందల డెబ్భై మూడు మిలియన్ టన్నులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉన్న కరువు పరిస్థితులు, అలాగే ఎల్ నినో ప్రభావం వల్ల ఉత్పత్తి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పదే పదే ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు హామీ ఇస్తున్నది.
ముందస్తు ప్రణాళిక, దేశీయ ఉత్పత్తి, భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతుల ఏర్పాట్లు చేయడం ద్వారా ఎరువులకు ఎలాంటి ఇబ్బంది లేదనే ప్రభుత్వ హామీని మరొక మారు ధ్రువపరుస్తూ జూలై 21వ తారీఖున రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రభుత్వ ప్రకటనలు మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ ఎరువుల సరఫరాకు సంబంధించినంతవరకు అంత సజావుగా లేవు.
రైతులు సాధారణంగా వినియోగించే డీఏపీ, ఇతర ఎరువుల ఉత్పత్తికి కీలకమైన సల్ఫర్ ఈ సంవత్సర ప్రారంభంతో పోలిస్తే రెట్టింపుకు పైగా ధర పెరిగి టన్నుకు వెయ్యి వందల అమెరికన్ డాలర్లకు చేరుకున్నది.
ఇంధనం, ఎరువులు, ఆహారం మధ్య సంబంధం
నైట్రోజన్ ఆధారంగా తయారయ్యే ఎరువులకు అవసరమైన అమ్మోనియా కానీ, ఫాస్పేట్ ఆధారంగా తయారయ్యే ఎరువులకు అవసరమైన సల్ఫర్ గాని ఎరువుల ఉత్పత్తికి ప్రధాన అవసరాలు.
ప్రపంచం మొత్తంగా ఇంధన మౌలిక సదుపాయాలలో ముఖ్యమైన పెట్రో కెమికల్ కేంద్రాలు పశ్చిమాసియా, రష్యా యుద్ధం వల్ల తీవ్ర అంతరాయం కలిగింది. పెట్రో కెమికల్ కేంద్రాలకు జరిగిన ఈ నష్టం కేవలం ఎరువుల సరఫరాలకు మాత్రమే కాకుండా ఆహార సరఫరాలపై కూడా తీవ్ర ప్రభావం కలిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ గ్యాస్ కేంద్రం అయిన ఖతార్‌లోని రస్ లాఫన్ పారిశ్రామిక నగరం కానీ, ఇరాన్‌లోని దక్షిణ పార్ట్స్ గ్యాస్ ఫీల్డ్ కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని సౌకర్యాలతో పాటు పశ్చిమ ఆసియా దేశాలలోని చమురు ఉత్పత్తి చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నైట్రోజన్ ఎరువుల తయారీకి అవసరమైన సహజవాయువు సరఫరాతో పాటు పొటాష్, యూరియా, ఫాస్ఫేట్ ఎరువుల ఎగుమతులలో రష్యా, ఉక్రెయిన్ అతి పెద్ద దేశాలు.
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంతో పరిస్థితి మరింత దిగజారింది.
కేవలం ఒక ఆగస్టు నెలలోనే రష్యాలోని 10 పెద్ద చమురు శుద్ధి కర్మాగారాలతో పాటు రష్యా చమురు ఉత్పత్తిని ఉక్రెయిన్ మిలిటరీ దళాలు అడ్డుకున్నాయి.
ఫలితంగా ప్రపంచ ముడిచమురు దిగుమతిలో దాదాపు 40 శాతం వాటా కలిగిన రష్యా తన దేశ అవసరాలను కాపాడుకోవడం కోసం ఇతర దేశాలకు ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులను కుదించింది.
ముందస్తు హెచ్చరికలు
దేశంలో ఎరువుల కొరతపై మొట్టమొదటగా కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయ స్వామి మే నెలలో హెచ్చరించారు.
పశ్చిమాసియా యుద్ధ కారణంగా ముప్పై ఎనిమిది వేల టన్నుల ఎరువుల కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అదే నెల చివరలో బెళగావిలోని రైతులు వీధుల్లోకి రావడం ద్వారా మంత్రి హెచ్చరిక నిజమని రుజువైంది.
దక్షిణ కర్ణాటకలోని కొడగు, హసన్, కోలార్ జిల్లాలు, ఉత్తర కర్ణాటకలోని బెళగావి, యాదగిరి, రాయచూర్ జిల్లాలలో డీఏపీ, యూరియా ఎరువుల కొరత తీవ్రంగా ఉందని వరుసగా పత్రికల్లో వార్తలు వచ్చాయి.
కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడిన ఈ ఎరువుల కొరత కాస్తా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీల మధ్య పరస్పర ఆరోపణలకు వేదికయింది.
బాగా ముమ్మరంగా నాట్లు వేసే సీజన్లో యూరియా, డీఏపీ కొరతపై ఉభయ పక్షాలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.
జూన్ నెలలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఎరువుల కొరతకు నిరసనగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
నల్ల బజారు వ్యాపారంలో యూరియా, ఇతర ఎరువుల అమ్మకాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.
ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలలో ఎరువుల కొరత కారణంగా రైతులలో పెరిగిన అసంతృప్తి, నిరసనలకు సంబంధించిన వార్తలు స్థానిక దిన పత్రికలలో వచ్చాయి.
భారతదేశంలో ఆహార భద్రతకు ప్రధాన కారణమైన ఎరువుల సరఫరాలో కొరత కారణమా లేదా యుద్ధం కారణమా అనేది స్పష్టంగా తెలియదు.
ఎరువులకు ఎలాంటి కొరత లేదని ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు.
ద్వంద్వ సంక్షోభం
భారతదేశంలో అవసరమైన ఎరువులలో 73 శాతం దేశీయంగా తయారవుతాయి. మిగిలిన 27 శాతం మాత్రమే దిగుమతులు చేసుకుంటున్నది.
అయితే దేశంలో తయారయ్యే ఎరువులకు అవసరమైన ఇంధనం, ఇతర ముడి సరుకుల దిగుమతి సంక్షోభానికి ప్రధాన కారణం అనే విషయాన్ని ప్రభుత్వ గణాంకాలు మరుగున పరుస్తున్నాయి.
ఉదాహరణకు దేశంలో విరివిగా వాడే యూరియా ఉత్పత్తికి అవసరమైన సహజవాయువు, అమ్మోనియాలలో 85 శాతం విదేశీ దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి.
మార్చి నెలలో హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భారతదేశానికి అవసరమైన లిక్విడ్ నేచురల్ గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో దేశంలో తయారయ్యే ఎరువుల తయారీకి తీవ్ర అవరోధాలు ఏర్పడ్డాయి.
ఫలితంగా నైట్రోజన్ ఎరువులు 2025 సంవత్సరంతో పోలిస్తే 52 శాతం అదనంగా అంటే ఒక పాయింట్ ఒక మిలియన్ టన్నులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగా ప్రత్యామ్నాయంగా భారతదేశం చైనా, వియత్నాం, ఈజిప్ట్ లాంటి దేశాలపై ఎక్కువగా కేంద్రీకరించింది.
భారతదేశంలో ఎరువుల సమస్య రాజకీయాలలో ఒక ప్రధాన భాగమైంది. ప్రపంచంలో ఆహార ధాన్యాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం, ఆహార భద్రత అంశాలలో ప్రపంచంలో భారతదేశం స్థానాన్ని లెక్కించడంలో ఎరువులు ప్రధానం కావడమే రాజకీయ సమస్యగా మారింది.
దేశంలో అత్యధిక రాయితీ ఉన్న సరుకు ఎరువులు మాత్రమే. ఉదాహరణకు నలభై ఐదు కిలోల యూరియా బస్తాకు రైతులు రెండు వందల నలభై రెండు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇది భారత ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యం ధరలో 10వ వంతు మాత్రమే.
ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరాలో ఏర్పడిన అవరోధాల నుంచి భారత దేశ గ్రామీణ ప్రజలను కాపాడటం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కష్టతరంగా ఉంది.
ఎరువుల సరఫరాలో జరిగిన అవాంతరాల కారణంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేటాయించిన ఒకటి పాయింట్ ఏడు ఒక లక్షల కోట్ల రూపాయలకు బదులుగా దానికి రెట్టింపు అంటే మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని ఎరువుల శాఖ ప్రభుత్వాన్ని కోరింది.
రబీ సీజన్ సందర్భంగా ఇటీవల జరిగిన రాష్ట్ర, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ ప్రాథమిక వివరాలను తెలియజేస్తూ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించడానికి ముందు కంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎరువుల ధరలు పెరిగిన కారణంగా యూరియా మీద సబ్సిడీ రెండింతలు పెరిగినట్లుగా ఆయన తెలియజేశారు.
యూరియాపై సబ్సిడీ నూట ఆరు శాతం, డీఏపీపై అరవై ఒక శాతం పెరిగినట్లుగా ఆయన తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ మూడు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంటుందని, ఇది విదేశీ ధరలపై ఆధారపడి ఉంటుందని కూడా ఆయన తెలియజేశారు.
దీనిని బట్టి భారతదేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందుల కంటే ఆర్థిక వ్యవస్థపై పడే సంక్షోభమే ప్రధాన సమస్యగా ఉన్నట్లు అర్థమవుతున్నది. ప్రత్యేకంగా ఎరువులపై ఇస్తున్న భారీ సబ్సిడీల కారణంగా ప్రభుత్వం ఆయిల్ కంపెనీలను ధరలు తగ్గించాలని ఒత్తిడి చేస్తున్నది. ప్రపంచంలో ఈ విధంగా ధరల పెరుగుదల కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు ఎల్లకాలం భరించలేనంతగా ఉంది.
పశ్చిమ ఆసియా, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు భరించలేనంత తీవ్రస్థాయికి పరిస్థితులు దారితీస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధనం ఉత్పత్తి చేసే దేశమైన సౌదీ అరేబియా కూడా ఈ యుద్ధంలోకి లాగబడింది.
సౌదీ అరేబియా దేశానికి చెందిన తూర్పు పశ్చిమ పైప్‌లైన్‌పై సెప్టెంబర్ 11న ఇరాక్ స్థావరాల నుంచి సౌదీ అరేబియాపై డ్రోన్ దాడులు జరిగాయి. హార్మోజ్ జలసంధి ద్వారా ఈ పైప్‌లైన్ గుండా రోజుకు ఐదు మిలియన్ బ్యారల్స్ ఇంధన సరఫరా అవుతుంది. ఇది మొత్తం ప్రపంచ ఇంధన సరఫరాలో నాలుగు నుంచి ఐదు శాతం దాకా ఉంటుంది. ఇదే సందర్భంలో ప్రపంచ ఇంధన సరఫరాలో పది నుంచి పన్నెండు శాతం దాకా జరిగే ఎర్ర సముద్రంలో యెమెన్‌కు చెందిన బాబ్ అల్-మండెబ్‌ను హౌతీలు మూసివేశారు.
భారతదేశానికి అవసరమైన డీఏపీలో 30 శాతం అంటే మొత్తం దేశంలో అవసరమైన 10-11 మిలియన్ టన్నులలో మూడు పాయింట్ ఒక మిలియన్ టన్నులు సౌదీ అరేబియా నుంచి దిగుమతి అవుతుంది.
భారతదేశం అత్యధికంగా ఆధారపడుతున్న గల్ఫ్ దేశాలలో ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు భారతదేశానికి ఒక తీవ్రమైన హెచ్చరికగా మారాయి.
ఇదే సందర్భంలో రష్యన్ పార్లమెంటు ఎన్నికల చివరి రోజయిన సెప్టెంబర్ 20న మాస్కో, దాని పరిసర ప్రాంతాలలో ఉక్రెయిన్ డ్రోన్, మిస్సైల్స్ దాడులు చేసింది. దేశ రాజధాని అయిన మాస్కో నగరంలో 450 డ్రోన్లతో సహా మొత్తం 1900 డ్రోన్, మిస్సైల్ ద్వారా ఉక్రెయిన్ బాంబు దాడులు నిర్వహించినట్లు రష్యా మిలిటరీ అధికారులు ప్రకటించారు.
ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధనం, గ్యాస్, ఎరువులు ఉత్పత్తి చేసే దేశమైన రష్యాపై ఇంత భారీ ఎత్తున దాడులు జరగటం భవిష్యత్తులో ప్రపంచ జియోపొలిటికల్ స్థిరత్వానికి పరిష్కారం లేదని తెలియజేస్తున్నాయి.
దీని పర్యవసానం చాలా స్పష్టం. భారతదేశం రెండు సంక్షోభాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవైపున ఎరువులు, ఇంధనంపై సబ్సిడీల భారం పెరగడంతో దేశం ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. రెండో వైపున ఇంధనం, ఎరువుల సరఫరా సంక్షోభంతో కింది స్థాయిలో ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటారు.
వ్యాస రచయిత సజై జోష్(కేరళకు చెందిన ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్); అనువాదం : డి. వెంకన్న.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
