పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించడానికి షెడ్యూల్ చేయబడిన ‘యువ సాథి’ పథకం నిరుద్యోగ యువతకు ఆదాయ మద్దతు అందిస్తుంది.
అయితే, ఉత్పత్తి రంగం వృద్ధి స్తంభించడం, ఉద్యోగాలకు నానాటికీ రక్షణ లేకుండా పోవడం, అభద్రతా భావం పెరగడంతో నిరుద్యోగ సంక్షోభం రాష్ట్రంలో ఒక సవాలుగా మిగిలిపోనుంది.
ఐదు సంవత్సరాల పాటు లేదా లబ్ధిదారుడు ఉపాధి పొందే వరకు ప్రతి నెలా రూ 1,500 చెల్లించేలా హామీ ఇస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘యువ సాథి’ అనే ఒక నిరుద్యోగ సహాయ పథకాన్ని ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఈ పథకాన్ని ఏప్రిల్ 1కి ముందుకు జరిపారు. ఈ పథకానికి రూ 5,000 కోట్ల మొత్తాన్ని కేటాయించారు.
శ్రామికులకు నిరుద్యోగ ప్రయోజనాలు ముఖ్యమైన ఆధారంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. సిద్ధాంతపరంగా, అటువంటి ప్రయోజనాలు వ్యక్తులు నిరుద్యోగులుగా మిగిలిపోవడం వల్ల ఎదురయ్యే తక్షణ ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి.
వారు తమ నైపుణ్యాలు, సామర్థ్యాలకు సరిపోయే విధంగా మెరుగైన ఉద్యోగాలను మరింత సమర్థవంతంగా వెతుక్కోవడానికి ఇవి అవకాశం కల్పిస్తాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలో శ్రామిక వనరుల కేటాయింపు సామర్థ్యం మెరుగుపడుతుంది.
అదనంగా, నిరుద్యోగ సహకారం అనేది సురక్షితమైన ఉపాధిని పొందలేని వారికి ఆర్థిక మద్దతును అందించడం ద్వారా సామాజిక సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది.
అయితే, ఉపాధి అవకాశాల విస్తరణ పైనే స్థిరమైన ఆర్థిక పురోగతి ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధించాలంటే, ముఖ్యంగా ఉత్పత్తి రంగం అభివృద్ధి ద్వారా ఉద్యోగాల కల్పనపై సమాంతరంగా దృష్టిపెట్టవలసి ఉంటుంది.
ఉత్పత్తి రంగానికి ఉన్న శ్రమసాంద్రత(కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే) స్వభావం రీత్యా, ఈ రంగం వివిధ నైపుణ్య స్థాయిలు కలిగిన శ్రామికులను తనలో ఇముడ్చుకుని, సమ్మిళిత వృద్ధికి కీలక చోదకంగా పని చేస్తుంది.
తయారీ రంగంలో నిరాశాజనక వృద్ధి
అయితే, పశ్చిమ బెంగాల్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(జీఎస్డీపీ) వాటాలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగ విలువ జోడింపు నిరంతరం తక్కువగాను, స్తబ్ధుగాను ఉంటోంది. గడిచిన ఆరు సంవత్సరాలుగా ఇది 16-17 శాతం వద్దనే అటూఇటుగా ఉంటోంది.
2023-24 ఆవర్తన కార్మికశక్తి సర్వే ప్రకారం, రాష్ట్ర జీఎస్డీపీలో ఉత్పత్తి రంగ విలువ జోడింపు 16.36% మాత్రమే ఉంది.
మరోవైపు, సేవల రంగం విలువ జోడింపు జీఎస్డీపీలో ఎక్కువగా 51.35% ఉంది.
అయితే ఉత్పత్తి రంగంతో పోల్చుకున్నప్పుడు సేవల రంగం, దాని ఉప రంగాలు సాధారణంగా ఎక్కువ నైపుణ్యాలు కోరుకునేవిగా, తక్కువ శ్రమసాంద్రత కలిగినవిగా ఉంటాయి. కాబట్టి వీటి ఉపాధి కల్పన సామర్థ్యం పరిమితంగా ఉంటుంది.
అందువలన రాష్ట్ర జీఎస్డీపీలో ఉత్పత్తి రంగానికి తక్కువ ప్రాముఖ్యత ఉండటం ఆందోళన కలిగించే విషయం.
ఉత్పత్తి రంగంలో ఉపాధి వాటా కూడా స్తబ్ధుగా ఉండటంతో పాటు గత ఆరు సంవత్సరాలుగా స్వల్పంగా పడిపోవడం ఆందోళనకు మరో కారణం.
2023-24లో వ్యవసాయ రంగంలో 38.16% మంది ప్రజలు ఉపాధి పొందుతుండగా, మొత్తం జీఎస్డీపీలో ఈ రంగం విలువ జోడింపు 9.81% మాత్రమే ఉంది.
అందువల్ల, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక స్పష్టమైన నిర్మాణాత్మక అసమతుల్యత నెలకొని ఉంది. అంటే, శ్రామికశక్తిలో గణనీయమైన భాగం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తికి అత్యంత తక్కువ వాటాను అందించే రంగంలోనే కేంద్రీకృతమై ఉంది.
అదే సమయంలో, ఉత్పత్తి రంగంలో ఉపాధి పొందుతున్న కార్మికుల శాతం కూడా 2017-18 నాటి 17.8% నుంచి 2023-24 నాటికి 16.66 శాతానికి పడిపోయింది.
ఉపాధి నాణ్యత – పెరుగుతున్న కాంట్రాక్ట్ విధానం
పశ్చిమ బెంగాల్లోని కార్మికులలో ఉపాధి నాణ్యత కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. రెగ్యులర్ వేతనం, జీతాలు పొందుతున్న కార్మికుల వాటా 2017-18లో 22.1% ఉండగా, అది 2023-24 నాటికి 20.4 శాతానికి పడిపోయింది.
ఇవి అధిక సంపాదనతో కూడిన, మరింత స్థిరమైన ఉద్యోగాలుగా పరిగణించబడతాయి.
తదనుగుణంగా, స్వయం ఉపాధి కార్మికులు, యజమానులుగా ఉపాధి పొందుతున్న వారి శాతం 2017-18లోని 38.7% నుంచి 2023-24 నాటికి 45 శాతానికి పెరిగింది.
వేతనం లేని కుటుంబ సహాయకుల శాతం 7.4% నుంచి 11.4 శాతానికి పెరగడం మరో ఆందోళనకర ధోరణి.
మెరుగైన ఉద్యోగాల నుంచి దూరమై, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల అనివార్యంగా శ్రామికశక్తిలో చేరాల్సిన పరిస్థితిని ఇది సూచిస్తుండవచ్చు.
ఉత్పత్తి రంగం సమగ్ర నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ ఆందోళనలకు మరింత బలం చేకూరుతుంది.
‘వార్షిక పరిశ్రమల సర్వే'(ఏఎస్ఐ) డేటా ఆధారంగా, పశ్చిమ బెంగాల్లోని రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ద్వి-అంకెల) రంగంలో పనిచేస్తున్న కార్మికుల కూర్పును పటం 1 (క్రింద) వివరిస్తుంది.
2008-09 నుంచి 2023-24 వరకు, మొత్తం ఉపాధిలో కాంట్రాక్టు కార్మికులు, ప్రత్యక్షంగా నియమించబడిన కార్మికుల వాటాను ఈ డేటా వెల్లడిస్తోంది.
కాలక్రమేణా శ్రామిక శక్తి కూర్పులో స్పష్టమైన నిర్మాణాత్మక మార్పు చోటుచేసుకుంది. ఇందులో కాంట్రాక్టు కార్మికుల వాటా 2008-09లో 23% నుంచి 2023-24 నాటికి 40%కి పెరిగింది.
అదే సమయంలో, ప్రత్యక్షంగా నియమించబడిన కార్మికుల వాటా 77% నుంచి 60%కి తగ్గింది.

ఆ విధంగా, రెగ్యులర్/ప్రత్యక్ష ఉపాధి స్థానాన్ని క్రమంగా కాంట్రాక్టు ఒప్పందాలు భర్తీ చేస్తున్నాయి. 2018 తర్వాత కాలం ఈ విషయంలో ఒక నిర్మాణాత్మక మలుపుగా కనిపిస్తోంది.
కోవిడ్-19 అనంతర దశ (2020 నుంచి) కూడా ఈ ధోరణిని వెనక్కి తిప్పలేకపోయింది. బదులుగా, కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది.
కార్మిక మార్కెట్లో చట్టబద్ధమైన రక్షణలు, దీర్ఘకాలిక స్థిరత్వం కొరవడిన శ్రామికశక్తి వాటా పెరుగుతోందని ఈ డేటా స్పష్టం చేస్తోంది.
ఊహించినట్లుగానే, పెరుగుతున్న ఈ కాంట్రాక్టు పద్ధతితో పాటు యజమానులు భరించే కార్మిక వ్యయాలు, సామాజిక భద్రతా బాధ్యతలు కూడా తగ్గాయి(పటం 2, క్రింద).

అందువల్ల, ఈ పరివర్తన కేవలం పరిమాణాత్మకమైనది(లేదా కార్మికుల రకానికి సంబంధించినది) మాత్రమే కాదు; గుణాత్మకమైనది కూడా – కార్మికుల ఉపాధి రక్షణ, వేతన పరిహార నిర్మాణాలు కూడా మారిపోయాయి.
మూతపడుతున్న పరిశ్రమలు
రాష్ట్రంలో రిజిస్టర్ చేయబడిన, నిర్వహణలో ఉన్న ఫ్యాక్టరీల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఏఎస్ఐ అందిస్తోంది.
అయితే అన్ని ఫ్యాక్టరీలను పని చేస్తున్నట్లుగా పరిగణించలేము, ఎందుకంటే కొన్ని మూతపడి లేదా లాకౌట్ చేయబడి ఉండవచ్చు.
2022-23, 2023-24 మధ్య పశ్చిమ బెంగాల్లో సుమారు 465 ఫ్యాక్టరీలు ఉత్పత్తిని నిలిపివేయడం ఆందోళన కలిగించే విషయం.
2023-24లో రాష్ట్రంలోని మొత్తం ఫ్యాక్టరీలలో పని చేయని(నాన్ ఆపరేషనల్) ఫ్యాక్టరీల వాటా ఏకంగా 16.7% ఉండటం గమనార్హం.
పశ్చిమ బెంగాల్లోని ఉత్పత్తి రంగంలో ఉద్యోగాల కల్పనపై తగినంత దృష్టి పెట్టడం లేదనే విషయాన్ని ఈ మొత్తం పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
నిరుద్యోగ భృతి స్వల్పకాలంలో ఒక ఉపయోగకరమైన సంక్షేమ యంత్రాంగంగా ఉన్నప్పటికీ, ఉద్యోగ కల్పనతో, ముఖ్యంగా శ్రమ-సాంద్రత కలిగిన ఉత్పత్తి రంగంలో ఉపాధి కల్పనతో జత చేసినప్పుడు మాత్రమే ఇవి నిలకడగా ఉంటాయి.
పశ్చిమ బెంగాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(ఎంజీఎన్ఆర్ఈజీఏ) నిలిపివేయడం ఈ సవాలును మరింత తీవ్రతరం చేస్తోంది.
ఎందుకంటే ఇది అట్టడుగు వర్గాల కుటుంబాలకు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయ ఉపాధిని, ఆదాయ మద్దతును దూరం చేస్తోంది.
(బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యులుగా సాత్యకి దాస్ గుప్తా, నమ్రతా సింఘరాయ్ ఉన్నారు.)
అనువాదం: పి నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్
ఈ వ్యాసాన్ని ఇంగ్లీషులో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
