చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ మంత్రివర్గం అసైన్డ్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. తమ భూములను ఈ చట్ట సవరణ ద్వారా రైతులు లీజుకు ఇచ్చుకోవచ్చని, లీజు ద్వారా 30 నుంచి 40 వేలు పొందవచ్చని రైతాంగాన్ని తన మాయ మాటలతో ప్రభుత్వం మభ్యపెడుతుంది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కూటమి ప్రభుత్వం అసైన్డ్ భూములు కేటాయించనుంది. ఆయా కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రివర్గం ప్రకటించింది. ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇచ్చేందుకు 26,43,500 ఎకరాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేసే రూరల్ బోర్డు ద్వారా నెడ్ క్యాప్ లీజు ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే పరిశ్రమలు నెలకొల్పిన వారు, విస్తరణ అవసరాలకు భూములు తీసుకోవచ్చని తెలియజేసింది.
ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లోనూ కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. కంపెనీలు ప్రైవేట్ భూములను లీజుకు తీసుకొని ఉంటే, ఆ భూయజమానులు ప్రయోజనం పొందేలా విధివిధానాలు రూపొందించారు. లీజు కింద అసైన్డ్ రైతుల పొందినట్లే ఏడాదికి లీజు డబ్బులు పొందవచ్చు.
కౌలుకు ఇచ్చిన రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు. దీని వల్ల రైతుకు నికర ఆదాయం వస్తుందని చెప్పటమంటే, రైతులను మోసగించడమే అవుతుంది. అధికారం చేతులు మారక ముందు నుంచి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన వ్యవసాయ కూలీలు(వీరిలో ఎక్కువ మంది దళితులు ఉన్నారు), పేద రైతులు బంజరు, పోరంబోకు భూములు, సముద్ర తీర బంజరు భూములు ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్నారు.
ఈ భూములకు పట్టాలు ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ కూలీ సంఘాలు అనేక ఆందోళనల ఫలితంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కుడి- పట్టాలు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని భూములు వెంటనే సేద్యానికి అనుకూలంగా లేకపోవడంతో అలాంటి భూములు అన్యాక్రాంతమయ్యాయి. భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం బలంగా ముందుకు రావడంతో ఆనాటి ప్రభుత్వం 9/1977లో అసైన్డ్ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టంలో అసైన్డ్ భూములు అమ్మటం, కొనటం నేరం. అలా చేసిన వారు శిక్షలకు గురౌతారు.
సెజ్‌లకు కట్టబెట్టే చర్యలు..
అన్యాక్రాంతమైన భూమి తిరిగి గుర్తించటానికి ఇవ్వటం; అలాకాని పక్షంలో అర్హులైన మరో లబ్దిదారునికివ్వాలి. ఈ చట్టంచేసిన తర్వాత కూడా కొందరు బడాబాబులు అసైన్డ్ భూములు కజ్జా చేయటం జరిగింది. 2002లో అసైన్డ్ భూములు అమ్ముకోవటానికి అవకాశం కల్పిస్తూ జీవో తీసుకువచ్చే ప్రయత్నం చేయగా తీవ్ర వ్యతిరేకత వల్ల ఉపసంహరించుకుంది.
అసైన్డ్ ఉన్నా భూములు కబ్జా అవుతున్నా; దాన్ని నివారించకుండా రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అసైన్డ్ చట్టాన్ని సవరిస్తూ 2006లో ఆర్డినెన్స్‌ను జారీ చేసి శాసనసభ ద్వారా ఆమోదించింది. చట్టంలోని 4వ సెక్షన్ బీ క్లాజు సవరణ ద్వారా అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని తిరిగి పేదలకే ఇవ్వాలనే నిబంధన నుంచి మినహాయింపు పొంది అమ్మే హక్కు, ఇష్టమైన వారికి ఇచ్చే అధికారం ప్రభుత్వం పొందింది. ఈ చట్ట సవరణ పేదలను భూములకు దూరం చేయడమే కాకుండా సెజ్‌లకు కట్టబెట్టే చర్యలుతీసుకుంది.
కూటమి ప్రభుత్వం అసైన్డ్ భూముల లెక్కలు తేల్చేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తూ రెవిన్యూ శాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఆ మేరకు రెవిన్యూ ప్రత్యేక కార్యదర్శి, ఏపీల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమీషనర్ జీవో 104ను జారీచేశారు. ఈ జిల్లా కమిటీకి ఇన్చార్జ్ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. జిల్లాకు చెందిన మంత్రులు సభ్యులుగా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు. ఈ క్రమంలో నిషేదిత 22 ఏ జాబితా నుంచి తొలగించిన భూములు 13,59,000 ఎకరాలు ఉన్నాయని; ఇందులో 13,57,000 లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం వెరిఫై చేసిందని చెబుతున్నారు.
విరుద్ధంగా కూటమి ప్రభుత్వం..
నిషేదిత 22 ఏ భూములంటే ప్రభుత్వ యాజమాన్యం, చట్టపరమైన వివాదాలు, సీలింగ్ పరిమితుల కారణాల వల్ల రిజస్ట్రేషన్ కాకుండా నిషేధించబడిన భూములు. ఈ భూములు అమ్మడం, కొనడం, రుణం కోసం తనఖా పెట్టడం సాధ్యం కాదు. ఇవి రిజిస్ట్రేషన్ చేయబడవు. అలాంటి భూములను నిషేధం నుంచి తొలగించి వాటిని లీజుకు ఇచ్చుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే, ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకే పంపిణీ చేయాలి. కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన చర్యలు తీసుకుంది. అన్యాక్రాంతం పేరుతో అసైన్డ్ భూములను, నిషేధం నుంచి తొలగించిన 22 ఏ భూములు 13.59,000 ఎకరాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. కార్పొరేట్లకు ఆ భూములను 99 సంవత్సరాల లీజుకు ఇవ్వటం అంటే, శాశ్వతంగా భూములు వారికి కట్టబెట్టటమే; తమ భూములకు పేదలను దూరంచేసి వారిని కూలీలుగా మార్చడమే అవుతుంది.
గతంలో చంద్రబాబు ప్రోద్బలంతో కుప్పంలో కాంట్రాక్ట్ వ్యవసాయానికి భూములు ఇచ్చిన రైతులకు వచ్చిన చేదు అనుభవాలు ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సాగుకు యోగ్యమైన భూమికోటి, లక్షఎకరాలు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 37% ఉంది. సాగు యోగ్యం కాని భూమి మూడు లక్షల ఎకరాలు ఉంది. సాగు భూమి సేద్యం చేసే వారికి చెందాలి. దీనికి విరుద్ధంగా సేద్యం చేయని పరాన్నబుక్కులైన భూస్వాముల వద్ద దేశంలో, రాష్ట్రంలో భూమి బంధించబడి ఉంది.
1973లో చేసిన భూసంస్కరణల చట్టం ద్వారా మిగులు భూమి 18 లక్షల ఎకరాలు. దాన్ని కుదింపులతో 7.9 లక్షలుగా తేల్చారు. అందులో 6.46 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని 5.92 లక్షల ఎకరాలను 4 లక్షల, 79 వేల మందికి పంపిణీ చేసినట్టుగా పాలకులు లెక్కలు చెబుతున్నారు. దీన్ని గమనిస్తే భూసంస్కరణల చట్టం ఎంత బూటకంగా అమలు జరిగిందో తెలుస్తున్నది.
చంద్రబాబు నాయుడు భూసంస్కరణలకు, చిన్న రైతుల వ్యవసాయానికి వ్యతిరేకం. వ్యవసాయం దండగని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. దాన్ని ఆచరణలో పెట్టటానికే లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు అమలు చేస్తున్నారు. ఆ విధంగా రాష్ట్రంలో కార్పొరేట్, కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ముమ్మరం చేయిస్తున్నారు.
లీజుకు తీసుకున్న భూముల్లో తమ ఇష్టం వచ్చిన పంటలను కార్పొరేట్లు పండిస్తారు. ఫలితంగా ఆహార పంటల కొరత ఏర్పడుతుంది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా భూసంస్కరణలు అమలు జరపకుండా పారిశ్రామిక అభివృద్దిని సాధించలేవు. రాష్ట్రంలో భూసంస్కరణల అమలు బూటకంగా మారి పేదలకు భూమిదక్కలేదు. భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు రాలేదు. పాలక ప్రభుత్వాలు పేదలకు భూములు పంచకుండా, అసైన్డ్ భూములు, నిషేధిత భూములు; చిన్న, సన్నకారు రైతుల భూములు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధాలు అమలు చేస్తున్నది. కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములు, నిషేధిత 22 ఏ భూములు, మిగులు భూములు, అటవీ బంజరు భూములు పేదలకు పంపిణీ చేయాలని గ్రామీణ పేదలు, పేద రైతులు ఉద్యమించాలి.
(వ్యాస రచయిత రైతు కూలీ సంఘం(ఆంప్ర)రాష్ట్ర కార్యవర్గసభ్యులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
