“ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. నా సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రోజో, రేపో ఆ సమయం ప్రతి ఒక్కరికీ తప్పనిది. కానీ, వెళ్లిపోయేలోపు చేయాల్సిన పనులను చేయగలుగుతున్నామా? ఆ దిశగా ప్రయత్నిస్తున్నామా? మన జీవితం, ఆలోచనలు మన కుటుంబానికే, ఆత్మీయులకే పరిమితమైతే ఎలా?
మన కోసం జీవించడం జీవితం.. సమాజం కోసం జీవించడం సార్థకమైన జీవితం.
మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మిగిలేది మనం కూడబెట్టిన సంపద కాదు, సమాజానికి చేసిన సేవ.
మనుషుల హృదయాల్లో నిలిచే జ్ఞాపకం.. అది మాత్రమే. అందుకే, సమయం ఉన్నప్పుడే మేల్కొందాం.
మన కోసం మాత్రమే కాదు, సమాజం కోసం కూడా జీవిద్దాం.” – అక్టోబర్ 4న గోవాలోని డోనాపౌలాలో జరిగిన చివరి మీటింగ్‌లో నానా పటేకర్ మాట్లాడిన మాటలివి. ఆయన సమయం అక్టోబర్ 8 అర్ధరాత్రి దాటాక వచ్చేసింది. ఆయన చెప్పినట్టుగానే సార్థక జీవితం ముగిసిపోయింది.
బాల్యం, కష్టాలు
1951 జనవరి 1న, మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లాలోని మురుడ్–జంజీరాలో దినకర్ పటేకర్, నిర్మల దంపతుల ముగ్గురు సంతానంలో ఒకరిగా జన్మించాడు.
మిగతా ఇద్దరూ మంచి రంగుతో పుట్టగా, నానా పటేకర్ నల్లగా ఉండేవాడు. తన రూపం పట్ల ఏర్పడిన ఆత్మన్యూనతాభావాన్ని అధిగమించడానికి నాటకాలు వేసేవాడినని, తద్వారా వచ్చే పేరువల్ల వారికన్నా అధికుడుగా గర్వపడే వాడినని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
విశ్వనాథ్ గజానన్ పటేకర్గా పిలవబడే నానా పటేకర్ ఏడో తరగతిలో ఉండగా, కుటుంబం బొంబాయికి తరలిపోవాల్సివచ్చింది. అక్కడ కొత్త స్కూల్లో నానాకు స్నేహితులెవరూ ఏర్పడలేదు.
తొమ్మిదో తరగతి చదివేటప్పుడు, తండ్రి ఆర్థిక స్థితి దిగజారిపోయినందున, కుటుంబ పోషణ నానా భుజస్కంధాలపై పడింది.
సినిమా వాల్‌పోస్టర్లు ముద్రించే పనిలో చేరాడు. రోజూ మధ్యాహ్నం వరకు స్కూల్‌కు వెళ్లి, ఆ తరువాత, నెలకు 35 రూపాయల జీతం, ఒక పూట భోజనం కోసం ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడు.
నాటక రంగం నుంచి సినిమాల్లోకి
బాంబే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో కమర్షియల్ ఆర్ట్ ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు నాటకరంగంలో విస్తృతంగా పనిచేశాడు.
1978లో ప్రముఖ రంగస్థల ప్రయోక్త విజయ మెహతా దర్శకత్వంలో “వాల్మీకి” నాటకంలో నటించడంతో ఆయన కెరీర్ విజయపథంలోకి అడుగుపెట్టింది. 1979లో అతని మొదటి కమర్షియల్ నాటకం “హామీదాబాయీచీ కోఠి”. విజయ్ మెహతా దర్శకత్వంలో మహాసాగర్, పురుష్ నాటకాలు అతనికి నటుడిగా ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.
ఆ నాటకంలోని అతని హావభావాలు, భావోద్వేగ భరితమైన డైలాగులు అతనిలోని విభిన్నమైన ప్రతిభను ప్రముఖుల దృష్టిలో పడేలా చేశాయి. సినిమా రంగం పిలిచింది.
జబ్బార్ పటేల్ “సింహాసన్” అనే సినిమాతో మరాఠీ సినీ రంగప్రవేశం, ముజఫర్ అలీ దర్శకత్వంలో 1978లో వచ్చిన “గమన్” ద్వారా హిందీ సినిమా పరిచయం జరిగాయి.
“గమన్”లో నానాతో నటించిన స్మితా పాటిల్ అతన్ని సినీ రంగంలో ప్రోత్సహించింది. కానీ నానా పటేకర్‌కు ఎప్పుడూ నాటకరంగం కన్నా సినిమాల పట్ల ఆసక్తి ఉండేది కాదు.
వ్యక్తిగత జీవితం, విషాదాలు
బొంబాయిలో వాణిజ్య ప్రకటనల కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేసే నీలకాంతితో పరిచయం అయ్యింది. నాటకం వారిద్దరి మధ్య అనుబంధానికి పునాది వేసింది.
1978లో వారిద్దరికీ వివాహం జరిగింది. ఆ రోజుల్లో నానా పటేకర్‌కు నాటకానికి 75 రూపాయల పారితోషికం వచ్చేది.
నీలకాంతికి నెలకు 2,500 రూపాయల జీతం వచ్చేది. ఆమె తన సంపాదనతో కుటుంబాన్ని పోషించేది. వారికి దుర్వాస, మల్హర్ అనే ఇద్దరు కొడుకులు జన్మించారు.
నానా 28వ ఏట, తండ్రి దినకర్ పటేకర్ మరణించాడు. “పిల్లలు తినే వయసుకి వచ్చేసరికి నా దగ్గర ఏమీ లేకుండా పోయింది” అనే ఆయన వేదనాపూరితమైన మాటలు నానా ఎప్పుడూ తలచుకునేవాడు.
ఆ తరువాత రెండున్నర ఏళ్లకే, అంగిలి చీలిక సమస్యతో పుట్టిన ఆయన పెద్ద కుమారుడు దుర్వాస కూడా వెళ్లిపోయాడు. ఆయన జీవితంలోని వ్యక్తిగత విషాదాలు, వృత్తిపరమైన ఒడిదుడుకులకు ఆస్కారం ఇవ్వలేదు.
సినీ ప్రస్థానం, పురస్కారాలు
ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘సలాం బాంబే’(1988), విధు వినోద్ చోప్రా ‘పరిందా’(1989), ‘అంగార్’ (1992), ‘తిరంగా’ (1993), ‘క్రాంతివీర్’ (1994), ‘అగ్నిసాక్షి’ (1996), సంజయ్ లీలా భన్సాలీ మొదటి చిత్రం ‘ఖామోషీ’ (1996), మరాఠీ చిత్రం నట సామ్రాట్ (2016), రజనీకాంత్ ‘కాలా’ (2018), ‘వనవాస్ ’ (2024), శక్తి శాలిని వరకు ఆయన సినిమా ప్రయాణం అప్రతిహతంగా కొనసాగింది.
ఈ క్రమంలో ‘పరిందా’లో ఉత్తమ సహాయ నటుడిగా, ‘క్రాంతివీర్’లో ఉత్తమ నటుడిగా, ‘అగ్నిసాక్షి’లో ఉత్తమ సహాయ నటుడిగా మూడు సార్లు జాతీయ పురస్కారాలు లభించాయి.
1991లో ‘ప్రహార్ ది ఫైనల్ ఎటాక్’తో దర్శకుడిగా మారాడు. ఆ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్ర కోసం రెండున్నర సంవత్సరాలు సైనిక శిక్షణ తీసుకున్నాడు.
సైనిక సేవ
నానా పటేకర్ భారతీయ టెరిటోరియల్ ఆర్మీలో మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌లో పనిచేశాడు. కార్గిల్ యుద్ధ సమయంలో సినిమాలకు విరామం ఇచ్చి, దాదాపు 60 రోజుల పాటు డ్రాస్, కుప్వారా, బారాముల్లా, సోపోర్ వంటి తీవ్రమైన ఘర్షణలు జరిగే సరిహద్దు ప్రాంతాల్లో సైన్యంతో కలిసి ఉన్నాడు.
సైనిక ఆసుపత్రుల్లో సహాయం అందించే క్విక్ రియాక్షన్ టీమ్‌లో కూడా భాగమయ్యాడు. ఆయన 2013లో ఆర్మీ నుంచి గౌరవ లెఫ్టనెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందాడు. అదే సంవత్సరంలోనే ప్రతిష్ఠాత్మకమైన “పద్మశ్రీ” పురస్కారం వరించింది.
సమాజ సేవ, దాతృత్వం
2010లో ‘పాఠశాల’ సినిమాకు వచ్చిన పారితోషికం మొత్తం బీహార్ వరద బాధితులకు విరాళంగా ఇచ్చేశాడు.
2013లో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రాజ్ కపూర్ అవార్డు ద్వారా లభించిన 10 లక్షల రూపాయలను కరువు బాధితులకు అందజేశారు.
విలాసవంతమైన కారు కొందామని దాచుకున్న కోటిన్నర రూపాయలను, విదర్భ ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యలు చూసి చలించిపోయి ఒక్కో బాధిత కుటుంబానికి 15 వేల రూపాయల చొప్పున పంచి ఇచ్చిన కరుణాహృదయుడు నానా పటేకర్.
మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి 2015లో ‘నామ్ ఫౌండేషన్’ స్థాపించి మహారాష్ట్రలోని మరాఠ్వాడా, విదర్భ, లాతూర్ ప్రాంతాలలో 2187 గ్రామాలలో, వాన్, వితలంగ్, ధామ్ వంటి 198 నదులకు పూడికతీయించి పునర్జీవింపజేశాడు.
నామ్ ఫౌండేషన్ ద్వారా 77 లక్షల మంది రైతులకు కరువు సాయం, నీటి వనరుల పునరుద్ధరణ వంటి పనులకు సహాయం అందించడమే కాకుండా, 4957 మంది విధవలకి కుట్టుమిషన్లు, గొర్రెలు ఇచ్చి వారికి స్వావలంబన కల్పించాడు.
క్రమశిక్షణ, తుది అంకం
రోజుకు 60 సిగరెట్లు కాల్చే నానా పటేకర్ 56 ఏళ్ల వయస్సు నుంచి పూర్తిగా మానేశాడు. ఆ క్రమశిక్షణ, నిబద్ధత అతని నటనా జీవితాన్ని కూడ ప్రభావితం చేశాయి.
బొంబాయిలోని అంధేరిలో సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లోనే నివసించేవాడు. భార్య నీలకాంతితో విభేదాలు వచ్చి 1991 నుంచి ఆమె నుంచి విడిగా జీవించాడు.
1990 నుంచి ప్రముఖ నటి మనీషా కోయిరాలాతో సంబంధంలో ఉన్నట్టు వార్తలు ఉన్నా, 1996 అగ్నిసాక్షి సినిమా షూటింగ్ సమయంలో అది మరింత బలపడి 2000 నాటికి ముగిసిపోయిందనే వాదన కూడా ఉంది.
జనవరి 2019లో, 99 ఏళ్ల వయసులో, తల్లి నిర్మలా పటేకర్ మరణించే వరకు ఆమెతో విడదీయరాని అనుబంధం ఉండేది.
ఆమె తనకు ఎప్పుడూ దూరం కాదని, మరణం తరువాత మరోమారు ఆమెతో కలిసి జీవించే అవకాశం ఉంటుంది అని భావోద్వేగంగా చెప్పేవాడు.
భారతదేశం గర్వించదగిన నటులలో ఒకడిగానే కాకుండా, ఒక ఉన్నతమైన మానవుడిగా జీవించిన నానా పటేకర్ సదా స్మరణీయుడు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
