“నేను చిందులాడి నేను డప్పులుగొట్టి
యలసి సొలసి సత్తికొలువు గొలువ
ఫలితమెల్ల నొరులు భాగించుకొనిపోవు
నీచమైన భూమి జూచినావె” – గుఱ్ఱం జాషువ
సనాతన, నిరంకుశ, హిందూత్వ త్రివర్ణ ఆధిపత్య కుల, మగ, ప్రాంత, భాషా శక్తులు ఒకవైపు; ప్రజాస్వామ్య, లౌకికవాద, స్థానిక, ఆధునిక వాదాల ముసుగులో ఉన్న హిందూ ఆధిపత్య కుల, మగ, ప్రాంత, మత, సవర్ణ రాజకీయశక్తులు మరోవైపు నిలబడి, రాజక్రీడలు ఆడుతున్నాయి.
అధికారం “సవర్ణ వర్సెస్ సవర్ణ”గా నడుస్తోంది. దీనిని “సవర్ణ వర్సెస్ అవర్ణ”గా మార్చే రాజకీయ ప్రణాళిక జెంజీల వద్ద లేదు. ఉంటే బాగుంటుంది.
యథాతథవాద వ్యవస్థలో అవినీతికి తావులేని కార్యనిర్వాహక, శాసనిక శక్తులుగా వ్యవస్థలు నడిస్తే చాలు అనే సంస్కరణల కార్యక్రమం మాత్రమే ప్రస్తుతం జెంజీలది అనుకోవచ్చు. ఇప్పుడున్న వ్యవస్థలో ఇది కూడా విప్లవాత్మకమైనదే అని చాలామంది అనుకునే పరిస్థితి ఉంది. సరే, అన్నా హజారే యువ రాజకీయ ఉద్యమంగానే ఇప్పటి సీజేపీ ఉద్యమాన్ని చూడాలేమో?
బహుజనుల వాటాపై ప్రశ్నలు
సవర్ణుల ఉమ్మడి రాజకీయ ఆటలో స్వీయ అస్తిత్వ స్పృహ లేని బహుజన శక్తులు ఇరువైపులా కాల్బలం, బాహుబలం, సాంకేతికతతో మోహరించి, సవర్ణ రాజకీయ శక్తుల కోసం తమ బలగాలను దృశ్యాదృశ్యంగా ధారబోస్తున్నాయి.
ఎవరైనా నా బోటివాడు ఉద్యమం చివరాఖర్న రాబోయే రాజకీయ లబ్ధిలో ఎవరి వాటాలు ఎంత, బహుజనుల వాటాల మాటేమిటనే ప్రశ్నలను లేవదీయబోతే, ప్రతిపక్ష శిబిరంలో ఉన్న ప్రగతిశీల, కమ్యూనిస్టు, విప్లవ, స్వచ్ఛంద సంస్థల అనుకూల శిబిరాల నుంచి జెంజీ ఉద్యమంలో కులాల ప్రస్తావన ఇప్పుడా తీసుకొచ్చేదీ అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆదివాసీ, దళిత, మైనారిటీలతో ప్రగతిశీల వాదులు కలిసి పనిచేయడం ఇష్టంలేని స్వార్థపర శక్తులే అంతర్గత శిబిరాలను సృష్టిస్తున్నాయనే ఆశ్చర్యకరమైన, రాజకీయ గడుసు అభ్యంతరాలను, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
మారినది లేని సామాజిక వాస్తవికత
గ్రామాల్లో భూములున్న, ఆధిపత్య కులాల వారే ప్రభుత్వ అధికారాలను, సామాజిక అధికారాలను, చివరికి వివిధ ఉద్యమాల, రాజకీయ నాయకత్వాల ఆధిపత్యాలను చెలాయించారు. ఇప్పటికీ చెలాయిస్తున్నారు.
చరిత్రలో అణగారిన కుల ఉద్యమాలు వచ్చి, ప్రశ్నిస్తే గాని ఈ ఆధిపత్య శక్తుల బండారం బయటికి రాలేదు. బహుజన సమాజం ఈ అంశాలను అర్థం చేసుకోలేకపోయింది.
గ్రామాల్లో ఆస్తి సంబంధాలు ఇప్పటికీ ఏమీ మారలేదు. సాంప్రదాయక ఆధిపత్య వర్ణాలు, కులాలదే పై చేయిగా ఉంది.
ప్రభుత్వాల భూ సంస్కరణలు అయినా, కమ్యూనిస్టుల దున్నేవానికే భూమి నినాదమైనా, ఆధిపత్య సామాజిక భౌగోళిక భూ యాజమాన్యాల మార్పును మొక్కుబడి వ్యవహారంగా మార్చాయి. ఇప్పుడు నడుస్తున్న జెంజీ ఉద్యమంలో కూడా రాబోయే రాజకీయ అధికార లబ్ధిలో ఎవరి వాటా ఏమిటి అనే ప్రశ్నలు లేకుంటే, రాష్ట్ర సాధన ఉద్యమాలలో బహుజనుల శక్తి యుక్తులు వ్యవస్థీకృతంగా వ్యర్థమై, రాజకీయ అశక్తులుగా అంచులకు నెట్టబడి మిగిలిపోయిన మాదిరిగానే, జెంజీ ఉద్యమంలోని బహుజన యువత ఇప్పుడూ ఉత్త చేతులతోనే మిగిలి పోవలసి ఉంటుంది.
సవర్ణ వర్సెస్ సవర్ణ రాజకీయ క్రీడలో పాల్గొని, అలిసిపోయి, ఫలితాల భాగస్వామ్యానికి దూరమై పోయే ప్రమాదం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
