గత దశాబ్ద కాలంలో భారతదేశంలో సామాజిక పథకాలపై వ్యయం గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలే. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ రాష్ట్రాలు మాత్రం సంక్షేమానికి గణనీయంగా నిధులు వెచ్చించాయి.
తన హయాంలో సంక్షేమం కోసం పెద్దఎత్తున నిధులు వెచ్చించామని మోదీ ప్రభుత్వం దేశ విదేశాల్లో డప్పు కొట్టుకొంటోంది. ఈ సంక్షేమ వ్యయం కారణంగానే ఓటర్ల ప్రాపకం పొందగలుగుతున్నామని చెప్పటం ఒకటైతే, మిగిలిన ప్రభుత్వాలు కూడా తమను అనుసరించొచ్చన్న సూచన చేయటం- ఈ ప్రచారంలో రెండో అంశంగా ఉంది.
కోవిడ్ వ్యాప్తి కాలంలో ఆహార సబ్సిడీ పెంచటం, 80 కోట్ల మంది జనాభాకు సబ్సిడీతో ఆహార ధాన్యాలు అందించటం; ఎంపిక చేసిన మహిళలకు, రైతులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయటం వంటివన్నీ భారీ సంక్షేమ పథకాలుగా, లబ్దిదారులకు మోదీ ఇస్తున్న బహుమానాలుగా ప్రచారం జరిగింది. ప్రజల కనీస సామాజిక, ఆర్థిక అవసరాలు తీర్చటం ప్రభుత్వాల బాధ్యతన్న అవగాహనకు తాజా ప్రచారం పూర్తి భిన్నమైనది.
ఇటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయటం ప్రభుత్వ బాధ్యత, లబ్ది పొందటం ప్రజల హక్కని యూపీఏ ప్రభుత్వం భావించింది కనుకనే- ఉపాధి హామీ, ఆహార భద్రత వంటి చట్టాలను ఆమోదించి అమలు చేసింది.
విచిత్రమేమిటంటే, యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన ఈ చట్టాల ఆధారంగానే మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అదనంగా ఆధార్ కార్డుతో అన్ని పథకాలనూ అనుసంధానం చేస్తోంది. ఆధార్ కార్డుల వినియోగానికి సంబంధించిన చట్టం కూడా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినదే.
చాలామంది పరిశీలకులు, విశ్లేషకులు, రాజకీయ ఆర్థిక వ్యాఖ్యాతలు ప్రభుత్వం చేస్తున్న ప్రచారమే వాస్తవమని నమ్ముతున్నారు. నిజానికి, ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తరచి చూసి- వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన వారే ఈ విధంగా ప్రచార పటాటోపానికి బలవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత, భ్రాంతి ఎంతో తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా విడుదల చేస్తున్న వివరాలను గమనిస్తే సరిపోతుంది. ఈ గణాంకాలను పరిశీలించినప్పుడు గత పదేళ్లల్లో బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చులో సంక్షేమం వాటా అంతకు ముందు పదేళ్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కంటే తక్కువగానే ఉన్నదన్న వాస్తవం కనిపిస్తుంది.
గత పదేళ్లల్లో సామాజిక రంగాల్లో ఖర్చులు పెరిగాయంటే దానికి ప్రధాన కారణం రాష్ట్రాలు చేస్తున్న ఖర్చే తప్ప కేంద్రం చేస్తున్న ఖర్చు కాదు. గత పదేళ్ల కాలంలో వివిధ సామాజిక సంక్షేమ పథకాలపై పెట్టే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు గణనీయంగా పెంచాయి.
సహకార సమాఖ్య విధానం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులను కుదిస్తూ వస్తున్నప్పటికీ రాష్ట్రాలు సంక్షేమ వ్యయాన్ని పెంచాయి. జీఎస్టీ చట్టాన్ని కేంద్రీకృత స్థాయిలో అమలు చేయటం వంటి అనేక రూపాల్లో యావత్ వనరుల సమీకరణనూ కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంది. అదనంగా రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సిన అవసరం లేని రీతిలో వివిధ సుంకాలపై సెస్సులు, వినియోగ సుంకాలు విధించి కేంద్రం ఈ కాలంలో బాగా దండుకుంది.
రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదికల ఆధారంగా రూపొందించిన ఈ పట్టిక పై విషయాలను మరింత వివరంగా వెల్లడిస్తుంది.
పట్టిక- 1
పట్టిక- 2
మొదటి పట్టికను గమనిస్తే, 2021- 22లో కోవిడ్ మహమ్మారి కమ్ముకొచ్చే వరకూ కేంద్ర ప్రభుత్వం సామాజిక వ్యయం తగ్గుముఖం పడుతూ వచ్చిందన్న విషయం అర్థమవుతుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో సామాజిక అవసరాలు, సంక్షేమంపై యూపీఏ ప్రభుత్వం కాలంలో 8.5 శాతం ఖర్చు జరిగితే పదకొండేళ్ల మోదీ పాలనలో ఈ వాటా 5.3 శాతానికి పడిపోయింది.
మరోవైపు ఈ పదకొండేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సంక్షేమంపై పెట్టే ఖర్చు పెరిగింది. సంక్షేమంపై రాష్ట్రాలు పెట్టే ఖర్చు యూపీఏ కాలంలో కేంద్రం పెట్టే ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటే మోదీ ఏలుబడిలో ఎనిమిది రెట్లకు పెరిగింది.
రెండో గ్రాఫ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే తలసరి సంక్షేమ వ్యయంలో ఉన్న తేడాను వివరిస్తుంది. ఈ లెక్కలు ఖరారు చేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ఖర్చును పెట్టినట్టుగానే పరిగణించటం జరిగింది. ఈ తలసరి లెక్కలు కూడా జనాభా పెరుగుదల గురించిన అంచనాల ఆధారంగానే రూపొందించబడ్డాయి. 2011 తర్వాత ఖచ్చితమైన జనాభా లెక్కలు అందుబాటులో లేవు.
స్థూలంగా చూసినప్పుడు, సామాజిక సంక్షేమంపై కేంద్రం పెట్టే ఖర్చు స్థంభించింది. గత పదకొండేళ్లల్లో విపరీతంగా పెరిగిన ధరల నేపథ్యంలో ఈ విధంగా సంక్షేమ వ్యయం స్థంభించటం అంటే ప్రజలకు చేరే ప్రయోజనాలు నామమాత్రంగానే ఉంటాయి.
ఏ రూపంలో చూసుకున్నా మోదీ ఏలుబడిలో సంక్షేమ వ్యయం అంతకు ముందున్న పదేళ్ల కంటే తక్కువగానే ఉంది. యూపీఏ కాలంతో పోలిస్తే సాధారణ తలసరి సంక్షేమ వ్యయం మోదీ కాలంలో 397 శాతం పెరిగింది. అంటే, ధరల పెరుగుదల రేటు కన్నా కొంచెం ఎక్కువగానే పెరిగింది. కానీ మోదీ పాలనలో ఈ పెరుగుదల కేవలం 76 శాతం మాత్రమే. వినియమ ధరల సూచీ పెరుగుదల రేటు కంటే ఇది చాలా తక్కువ. దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమంపై పెట్టిన ఖర్చు ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగానే ఉంది. ప్రత్యేకించి ఈ పెరుగుదల గత పదేళ్లల్లో ఎక్కువగా ఉంది.
పట్టిక- 3
ప్రభుత్వ వ్యయం విషయంలో మారిన నిబంధనలు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్యే వనరుల్లో నిరంతరం కోతలవంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ వ్యయం పెంచటం మరింత ప్రాధాన్యత కలిగిన విషయంగా మారింది. మూడో పట్టికలో ఈ మార్పులను చూడొచ్చు.
2014లో తుది నివేదిక సమర్పించిన 14వ ఆర్థికసంఘం సిఫార్సు మేరకు కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా పథకాలు రూపొందించి అమలు చేసుకునే వీలు కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలపైనే ఆధారపడాల్సిన దుర్గతి నుంచి రాష్ట్రాలు బయట పడతాయన్నది 14వ ఆర్థిక సంఘం అవగాహన.
పైకి చూస్తే మోదీ ప్రభుత్వం 14 ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేసినట్లే కనిపిస్తుంది. ఈ మేరకు మోదీ పాలన తొలినాళ్లలో రాష్ట్రాలకు ఎక్కువ నిధులే వచ్చాయి. కానీ రానురాను కేంద్రం పెద్దమొత్తంలో సెస్సులు, సర్ఛార్జుల రూపంలో వనరుల సమీకరణకు మళ్లింది. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారమే సెస్సులు, సర్ఛార్జుల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన పట్టింపు ఏమీ లేదు.
మోదీ ప్రభుత్వం కంటే ముందు మొత్తం కేంద్రానికి వచ్చే ఆదాయంలో సుమారు 10 శాతం సెస్సులు, సర్ఛార్జుల రూపంలో ఉండేది. కానీ మోదీపాలనలో ఈ మోతాదు 2021 నాటికి 20 శాతం వరకూ పెరిగింది. ప్రస్తుతం 15 శాతం మేర కేంద్రానికి వచ్చే ఆదాయంలో సెస్సులు, సర్ఛార్జుల నుంచి వచ్చే ఆదాయమే. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది కూడా ఎక్కువే.
పట్టిక- 4
ఈ లెక్కల సారాంశం ఏమిటి? 2016- 17లో మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు 32.8 శాతం ఉంటే 2022- 23 నాటికి ఈ వాటా 28.3 శాతానికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థికాధికారాలను, వనరులను గుప్పిట్లో పెట్టుకోవడమే కాక రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రణాళికా వ్యయానికి కావల్సిన నిధులు నిరాకరించటం ద్వారా వనరుల కేంద్రీకరణకు మోదీ ప్రభుత్వం పాల్పడింది.
అదనంగా పన్నేతర ఆదాయం నుంచి మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు సమకూరుస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చులపై అనేక కొత్త కొత్త షరతులు విధిస్తోంది. ఈ రకమైన కేటాయింపుల్లో కూడా పక్షపాతం చూపుతున్నట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్నన్ని నిధులు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇవ్వటం లేదు.
ఏతావాతా గమనించినప్పుడు భారీ సంక్షేమ పథకాలు అమలు జరిపినందువల్లనే మోదీ మూడు సార్లు నెగ్గారు అన్న అభిప్రాయం తప్పుడు అభిప్రాయమని రుజువు అవుతోంది. పదేపదే ఎన్నికల్లో విజయానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ఇతర అంశాలు, వ్యూహాలతో పాటు ప్రజల దృష్టిలో ప్రభుత్వం గురించి ఏ అభిప్రాయం కలిగించాలన్న కోణంలో జరుగుతున్న కసరత్తు కూడా ముఖ్యమైనదే.
సీపీ చంద్రశేఖర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎకనమిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్‌లో ఎమిరిటస్ ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. జయతిఘోష్ యూనివర్సిటీ ఆప్ మస్సాచుసెట్స్ అమ్మెరెస్ట్లో డెవలప్మెంట్ ఎకనమిక్స్ బోధిస్తున్నారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

