అయ్యలారా..
ఘనత వహించిన పెద్దలారా ..
నేను కుందాలపల్లిని మాట్లాడుతున్నా
వేంగి రాజ్య కొంగు బంగార గౌతమీ పుత్రులరా..
ఆహా! ఎంత మంచి చావు
‘కులభేద రక్కసులు సంచరించే దేశం ఇది’
మా కోనసీమ గండు చీమకూడా
బహు సుతారంగా కుడుతుంది సుమండీ
మా గోదారి నల్లత్రాచు
బుసలు కొడుతూ రగులుతోంది
గరగపర్రు గాయం మాననేలేదు
దోవ నాది ధనం నాది దారే లేదంటారా?
నక్కల గుంపులా నలుమూలలా చేరి
పేట పేటను ముక్కలు చేశారే
అంతరంగ పగ అట్టే పెట్టుకొని
అలయ్ బలయ్ అంటారా?
అన్నన్నా ఎంతమాట ఎంతమాట?
నీ సేవకుడినన్నావే
దండాలు పెట్టావే
దారి చూపించామే
ప్రజ్ఞానేత్రుడవనుకున్నా
గుంట నక్కలా దాగున్నావా
కూట సాక్షులు గొప్పగా ఉన్నారు
నేనెరుగని సంగతులా?
కాపు కాసే నన్ను
కాపు కాసి దారి మళ్లించారే
అన్నన్నా ఎంతమాట అయ్యవార్లూ..
మనమంతా సోదరులం
మనమంతా సహోదరులం అంటారా
‘ఇదిగో ఇతడు ఫలానావాడు
అని గుర్తుపట్టని రోజు కావాలి’
నిజం తల్లీ.. నమ్మమంటారా..!
కొంగ భక్తిలా కారుమేఘం కమ్మకుంది
మా కోనసీమ కావ్యాలంకార చూడామణి కాదు
ప్రకృతి ఒడిలో
కులోన్మాద మత్తులో జోగుతోంది
ఏ మూల ఏ గ్యాస్ పైప్లైన్ పేలుతుందో
ఏ పేట మీద దావానంలా ఎగసిపడతారో
పచ్చని పైరులా మాడిపోతుంది నా శరీరం
‘ఎంత వయసొచ్చినా
ఎదగని గొర్రె తోక’లా
ఉందీ సమాజం
నాకూ స్వేచ్ఛ కావాలి
అజ్ఞానపు బానిసత్వం పోయేలా
పుష్కర స్నానం చేసి వస్తా
నా ఈ కథ మళ్లీ మొదలు పెడతా..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
