అక్టోబర్ 12 సోమవారం ఢిల్లీ పోలీస్ విభాగం జారీ చేసిన ఒక ప్రకటనలో ఇకమీదట జంతర్ మంతర్‌లో చేపట్టదలుచుకున్న నిరసనలు, ప్రతిఘటనలు అన్నీ రామ్ లీలా మైదానానికి లేదా ఢిల్లీ ఉత్తర భాగంలో ఉన్న బురారి మైదానానికో లేక తూర్పు ఢిల్లీ ప్రాంతంలో ఉన్న సీబీడీ గ్రౌండ్కో మార్చాలి అని స్పష్టం చేసింది.
నాటి జ్ఞాపకం.. జంతర్ మంతర్ విశిష్టత
1986-87 అనుకుంటాను. హై స్కూల్లో సోషల్ సైన్స్ టీచర్ అయిన గాదె మర్రెడ్డి భారతదేశ భౌగోళిక చిత్రపటాన్ని పరిచయం చేస్తూ ప్రధాన నగరాలు అందులోని విశేషాల గురించి చెప్పారు.
ఆరోజు మర్రెడ్డి టీచర్ జంతర్ మంతర్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ఆందోళనలు నిరసనలకు కేంద్రం మాత్రమే కాదు అక్కడ మాన్సింగ్ నిర్మించిన ఒక గడియారం కూడా ఉన్నది అని చెప్పారు. ఆ గడియారం కారణంగానే ఈ ప్రాంతానికి జంతర్ మంతర్ అని పేరు వచ్చింది.
తర్వాత కాలంలో ఎంచుకున్న వృత్తిరీత్యా నా జీవితంలో ముఖ్యమైన భాగం ఢిల్లీలో గడపాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కొన్ని వందలసార్లు జంతర్ మంతర్‌లో జరిగే ఆందోళనలు పోరాటాలు, ఉద్యమాలలో భాగస్వామిని అయ్యాను. కొన్ని వేల సార్లు జంతర్ మంతర్ గుండా ప్రయాణించాను.
పార్లమెంటుకు పెరిగిన దూరం
2001లో పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ప్రజాశక్తి విలేకరిగా పార్లమెంటు పరిసర ప్రాంతాలలో భద్రత ఏర్పాట్లకు సంబంధించిన పరిణామాలపై కొన్ని ప్రత్యేక కథనాలు రాశాను.
ఆ సందర్భంలో 1970 దశకంలో ఆరెస్సెస్ వ్యూహరచనతో జరిగిన గో సంరక్షణ ఉద్యమకారులు పార్లమెంటు గేట్ల వరకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారని తెలుసుకున్నాను. ఆ తర్వాతనే దేశంలో ఉన్న సాధువులు మఠాలు, పీఠాలు గురువులు ప్రవక్తలు ప్రచారకులు అందర్నీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చిన ఆరెస్సెస్ విశ్వహిందూ పరిషత్ అనే మరో సంస్థకు జన్మనిచ్చింది.
తర్వాత కాలంలో జరిగిన అనేక పరిణామాలతో నిరసనకారులకు పార్లమెంటు గేటుకు మధ్య సుమారు మూడు నాలుగు కిలోమీటర్లు దూరం పెరిగింది. తాజా నిర్ణయంతో ఈ దూరం కొన్ని పదుల కిలోమీటర్లు పెరగనున్నది.
నిపుణుల బృందం సిఫార్సులు – సమాధానం లేని ప్రశ్నలు
కేంద్ర హోంశాఖ నియమించిన నిపుణుల బృందం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు విభాగం జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడిస్తోంది. త్వరలో ఈ మూడు ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించదల్చుకున్న వారు పాటించాల్సిన విధివిధానాల గురించి ఖరారు చేయనున్నట్టు ఆ నోటిఫికేషన్లో వెల్లడించారు.
అయితే ఆ నిపుణుల బృందాన్ని ఎప్పుడు నియమించారు, ఆ బృందం ఈ నిర్ణయానికి రావడానికి అనుసరించిన పద్ధతులు ప్రమాణాలు సేకరించిన ప్రజాభిప్రాయం నిపుణుల అభిప్రాయం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. ఇదే విషయంపై సుప్రీంకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నది.
పోలీసుల దమనకాండ.. ప్రజా వ్యతిరేకత
అక్టోబర్ 10వ తేదీ సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో సమీకరించబడుతున్న నిరసనకారులను చెదరగొట్టడానికి ఢిల్లీ పోలీసులు ప్రయోగించిన తీవ్రమైన దమనకాండ నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ కావడం గమనించాల్సిన విషయం.
ఈ దమనకాండను ప్రతిఘటిస్తూ నిరసనకారులు దేశ రాజధాని నగరంలో వేరు వేరు ప్రాంతాలలో ఆకస్మిక నిరసన సమీకరణలకు దిగారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 163 అమలులో ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ లేదా శాంతిభద్రతల విభాగం అనుమతి లేకుండా నిరసనలు చేపట్టరాదు. అయినా ఢిల్లీలో ఈ నియంత్రణలు లేని ప్రాంతాలలో నిరసనలు వ్యక్తం చేసిన విద్యార్థులు యువత ప్రజలను కూడా ఢిల్లీ పోలీసులు చెల్లాచెదురు చేయటానికి చేయని ప్రయత్నం లేదు.
నిరసనకారులను అరెస్టు చేసి నగరంలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేశారు. జాతీయ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన విమర్శలు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న అణచివేత చర్యల కారణంగా ఎదురైన ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని అరెస్టు అయిన మహిళలు, విద్యార్థినులను ఢిల్లీ పోలీసులు తమ వాహనాలలో వాళ్ల నివాసాల దగ్గర దించినట్లు వార్తా కథనాలు కూడా వచ్చాయి.
నిరసన కేంద్రాల బదిలీకి కారణాలివే..
ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ నిరసన కేంద్రాలను జంతర్ మంతర్ నుండి బదిలీ చేయడానికి ప్రధాన కారణం సరైన నియంత్రణలు అమలు చేయడానికి కావలసిన ఏర్పాట్లతో పాటు చుట్టుపక్కల నివసించే ప్రజల ప్రయోజనాలు భద్రత వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేయడం జరిగిందని ఢిల్లీ పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఆదివారం సుప్రీంకోర్టు ధర్మాసనం చేపట్టిన కేసుల విచారణ సందర్భంగా శాంతియుతంగా నిరసనను తెలియజేసే హక్కును నిరాకరించడం సమంజసం కాదని, ఇంటర్నెట్ రవాణా సేవలు మెట్రో సేవలు పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఒకరోజు వ్యవధిలో ఈ నోటిఫికేషన్ జారీ కావడం సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందా లేదా అనే ప్రశ్నలకు దారితీస్తోంది.
ఎక్కడ నిరసన వ్యక్తం చేయాలని ఎవరు నిర్ణయిస్తారు?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావవ్యక్తీకరణ, సంఘాలు పెట్టుకోవడం, సమావేశం జరుపుకోవడం ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంది.
అయితే ఈ ప్రాథమిక హక్కులన్నీ హేతుబద్ధమైన నియంత్రణల పరిధిలోనే అమలులో ఉంటాయి. ప్రత్యేకించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండే ఏ భావ ప్రకటన స్వేచ్ఛను అయినా సంఘం సమావేశం పెట్టుకునే హక్కును అయినా ప్రభుత్వం అంగీకరిస్తుంది.
అన్ని రాష్ట్రాలలోనూ ఆయా రాష్ట్రాలలో శాంతిభద్రతలకు సంబంధించిన విధివిధానాలు చట్టాలు నిర్ణయాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఢిల్లీలో మాత్రం ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఆ(3)(అ) ప్రకారం ఢిల్లీ శాసనసభకు శాంతిభద్రతలు, పోలీసు విభాగం నిర్వహణ, భూమి సంబంధిత అంశాలపై నిర్ణయాలు చేసే అధికారం లేదు.
ఢిల్లీ పోలీసు విభాగం కేంద్ర హోంశాఖ ఆధీనంలో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరు నిరసన వ్యక్తం చేయాలనుకున్నా వారికి అనుమతి ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయాల మొదలు ఎవరు ఎక్కడ ఎన్ని రోజులు నిరసన వ్యక్తం చేసే హక్కుని కలిగి ఉంటారు అనే విషయాలపై ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకోవచ్చు.
ఇప్పటివరకు అమలులో ఉన్న విధివిధానాల ప్రకారం జంతర్ మంతర్‌లో 1000 అంతకంటే తక్కువ మందితో నిరసన వ్యక్తం చేయాలంటే 10 రోజుల ముందే ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలి.
నిరసనకారుల సమీకరణ సామర్థ్యం 50 వేల వరకు ఉంటే వారు రామ్ లీలా మైదానంలో నిరసనలు చేపట్టవచ్చు.
శాంతిభద్రతలు – పౌర జీవనం
పోలీసులు తరచూ ఈ నిరసనలను నియంత్రించే క్రమంలో ప్రస్తావించే అంశం- శాంతిభద్రతలు అనే అంశం. కానీ రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే పౌర హక్కులను నియంత్రించాలి.
పౌర సమాజపు సేవలు సరఫరాకు అంతరాయం కలిగించకూడదు అన్న అవగాహన కూడా ఢిల్లీ పోలీసుల అవగాహనలో అంతర్భాగమే.
కానీ సుప్రీంకోర్టు శాంతిభద్రతలు, శాంతియుత పౌర జీవనాలను విభిన్నమైన రెండు అంశాలుగా పరిగణించింది.
సుప్రీంకోర్టు స్పష్టత
1966లో రామ్ మనోహర్ లోహియాకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన కేసుల్లో సుప్రీంకోర్టు ఏదైనా ఒక చర్య శాంతియుత పౌర జీవనానికి విఘాతం కలిగించకుండానే శాంతిభద్రతలకు సమస్యగా మారవచ్చు అని వ్యాఖ్యానించింది.
ఈ తీర్పులో సుప్రీంకోర్టు శాంతిభద్రతలు, శాంతియుత పౌర జీవనం, రాజ్యం గురించిన భద్రతలను మూడు వేరువేరు విలక్షణమైన అంశాలుగా పరిగణించింది.
ఈ విషయాన్ని చర్చించేటప్పుడు ఎవరైనా మూడు భిన్న పరిధులను, వలయాలను దృష్టిలో పెట్టుకోవాలి. శాంతిభద్రతలు అన్నది అత్యంత విస్తృతమైన వలయం. తర్వాత అందులోనే ఉండే ఒక ఉపవలయం చట్టపరిధిలో ఉండే పౌర జీవనం, అంతకంటే చిన్న ఉపవలయం రాజ్యపు భద్రత. అంటే ఒక చర్య ఆందోళన లేదా ఉద్యమం ఇంకా చెప్పాలంటే ప్రతిఘటన శాంతిభద్రతలకు విఘాతం కలిగించేది అయినంత మాత్రాన చట్టపరిధిలో ఉండే పౌర జీవనానికి విఘాతం కలిగించకపోవచ్చు.
అదే సమయంలో మరొక చర్య చట్టపరిధిలో సాగే పౌర జీవనానికి విఘాతం కలిగించేదైనా రాజ్యపు భద్రతకు విఘాతం కలిగించేది కాకపోవచ్చు.
వివిధ నిరసనలు ఆందోళనలు ప్రదర్శనలు ఉద్యమాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరినిపై వివరణ నేపథ్యంలో విశ్లేషిస్తే ఏయే సందర్భాలలో ప్రభుత్వం రాజ్యపు భద్రత గురించిన తలకిందులు తర్కంతో సాధారణ స్థాయిలో జరిగే నిరసనలు ఆందోళనలు ప్రదర్శనలు ఉద్యమాల పట్ల కూడా ఉక్కుపాదంతో వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది.
ప్రాథమిక హక్కుల రక్షణ
2012లో రామ్ లీలా మైదానంలో జరిగిన సంఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో శాంతిభద్రతలు కాపాడటానికి విధించే నిర్బంధాలు నియంత్రణలు రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు విఘాతం కలిగించకూడదు. అదే సమయంలో చట్టబద్ధ పౌర జీవనానికి అంతరాయం కలిగించే చర్యలను మరింత తీవ్రంగా అదుపులో పెట్టాలి అని అభిప్రాయపడింది.
పబ్లిక్ ఆర్డర్‌కు ఒక ప్రాంతంలో సాధారణంగా సాగిపోయే జీవనానికి మధ్య చాలా తేడా ఉన్నది. పబ్లిక్ ఆర్డర్‌ను అతిక్రమిస్తే పరిస్థితులు అదుపుతప్పుతాయి. అంతమాత్రాన ప్రతి అతిక్రమణా పరిస్థితులు అదుపుతప్పటానికి దారి తీయదు.
ఏది ఏమైనా అటు శాంతిభద్రతలు కానీ పబ్లిక్ ఆర్డర్ కానీ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన కనీస ప్రాథమిక హక్కులు రద్దు చేయడానికి, వాటిపై నియంత్రణలు విధించడానికి కారణాలు కాకూడదు అని ప్రముఖ న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాస్వామ్యానికి ప్రమాదం
ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా రద్దు చేయడం, రకరకాల కారణాలతో నిరసన కేంద్రాలపై నిబంధనలు విధించడం, అనుమతి నిరాకరించడం వంటి ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యానికి రక్తమాంసాలుగా ఉండవలసిన నిరసనను శాశ్వతంగా పౌర జీవనం నుండి తొలగించి వేయడమే.
ఒక ప్రజాస్వామిక దేశంలో తమ అభిప్రాయాలు వెల్లడించడానికి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆందోళన వ్యక్తం చేయడానికి ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు మాత్రమే ప్రజలు వీధుల్లోకి వస్తారు.
అటువంటి సమయంలో వీధులలో ప్రజల సమీకరణపై నియంత్రణలు విధించడం అంటే ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే.
ఈ ప్రయత్నంలో రాజ్యాంగం హామీ ఇచ్చిన కనీస హక్కులు కూడా అమలుకు నోచుకోకుండా పోయే ప్రమాదం ఉన్నది.
ఇటువంటి పరిస్థితులలో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా నిరసనకు ప్రతిఘటనకు ప్రభుత్వాన్ని నిలదీయడానికి కేంద్రంగా ఉన్న జంతర్ మంతర్ ఇకపై వీటన్నింటికీ వీడ్కోలు పలకనున్నది. ఇది ప్రజాస్వామ్యానికి విషాదకరమైన వార్త.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
