ఇది పౌరసత్వాన్ని పునర్నిర్వచించటమే
మన ముందు జరుగుతున్నది ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు కాదు. పౌరసత్వ పునర్వ్యవస్థీకరణ. పౌరసత్వానికి పునర్నిర్వచనమిచ్చే ప్రయత్నం.
ఇప్పటివరకు దేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తికి రాజ్యాంగమిచ్చిన హక్కుగా ఉన్న పౌరసత్వం, ఓటు హక్కు- ఇప్పుడు పరిపాలనా యంత్రాంగం విచక్షణకు లోబడిన హక్కుగా మారుతుంది.
అంటే, పౌరులు నిరంతరం రుజువు చేసుకోవాల్సిన హక్కుగా మారుతుంది.
ఓటింగ్ హక్కు ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించే పత్రాలు, రుజువు చేసుకోగలిగిన అడ్రస్లు, ప్రభుత్వ అధికారుల స్పందన, విచక్షణా అధికారాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ మార్పు జరగటానికంటే ముందు పార్లమెంట్లో చర్చ, ఒక చట్టం, రాజ్యాంగ సవరణ లేదు.
సార్వత్రిక ఓటు హక్కు కాగితం మీదనే ఉంది. కానీ సర్క్యులర్లు, దాని విధివిధానాలు, పాలనా యంత్రాంగం ఆదేశాలు- ఆ కాగితానికి తూట్లు పొడుస్తున్నాయి.
ప్రజాస్వామ్యం క్షీణించేది ఇలాగే. రాజ్యాంగాన్ని భారీ ఎత్తున విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు.
దానికి బదులుగా విధివిధానాలు సవరించడం ద్వారా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అధికారం అనుమతించిన వారే ఓట్లు వేసే పరిస్థితి వస్తే; పాలనాపరమైన కసరత్తు పేరుతో కోట్లాదిమంది ఓటు హక్కును కోల్పోతే మిగిలేది ప్రజాస్వామ్యం కాదు.
ఎన్నికల సంఘ- వ్యవస్థాగత పతనం
వ్యవస్థాగత సంక్షోభం మరింత లోతైనది. ఎన్నికల సంఘం ఏర్పాటే నిరంకుశాధికారాన్ని అడ్డుకోవటానికి.
ఈ దేశపు ఎన్నికల క్రమం సమగ్రతను కాపాడే బాధ్యతను ఎన్నిలసంఘంపై రాజ్యాంగం పెట్టింది.
సంయమనం, నిస్పాక్షికతలతో కూడిన ఈ రాజ్యాంగపరమైన బాధ్యతను ఎన్నికల సంఘంపై పెట్టడమంటేనే రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సంఘంపై ఎంత విశ్వాసాన్ని ఉంచిందో అర్థమవుతుంది.
ఈ నమ్మకంతో ఎన్నికల సంఘమిప్పుడు ఆటలాడుకుంటుంది. జనాభా వివరాలు, పారదర్శకత, అర్థవంతమైన సమర్ధింపు లేకుండా కోట్లాదిమంది పౌరులను ఓటరు జాబితా నుంచి నిర్మూలించడం; ఈ రకమైన నిర్మూలనకు గురైన వారందరూ ఎక్కువగా బడుగు బలహీన మైనారిటీ తరగతులకు చెందిన వారే కావటంవంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం తన తటస్థతను విస్మరించిందని నిర్ధారించవచ్చు ఓటర్ల జాబితాను రాజకీయ అవసరాలకు అనుగుణంగా రీ-ఇంజనీరింగ్ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం శిరసా వహిస్తోంది.
ఇది స్వయంప్రతిపత్తి కాదు, వ్యవస్థాగత లొంగుబాటు.
ప్రభుత్వాల విచ్చలవిడితనాన్ని అదుపు చేయాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు- ఆ విచ్చలవిడితనాన్ని మరింత అడ్డగోలుగా అమలు జరపడానికి సహకరిస్తే, దాన్ని స్వయం ప్రతిపత్తి అనరు.
ఇది కేవలం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విషయంలోనే కాదు; ఎన్నికల సమయంలో ప్రవర్తన నియమావళి అమలు చేయటంలోనూ, పాలక పార్టీ ప్రయోజనాలు- ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యవహరించడంలోనూ, విద్వేష విష జ్వాలలను చూసి చూడనట్టుగా వెళ్లడంలోనూ, ఎన్నికల బాండ్ల విషయంలోనూ వ్యక్తమవుతోంది.
నచ్చిన వాళ్లను బాధ్యతాయుత స్థానంలో నియమించటం, ఏలే వారికి అనుకూలంగా నచ్చిన పనులు చేయించుకోవటం; ప్రత్యర్థుల ప్రశ్నలపై స్పందించకపోవడం, పౌర సమాజాన్ని కళ్ళు కప్పే ప్రయత్నం చేయటం వంటివన్నీ రాజ్యాంగపరమైన సంస్థల లొంగుబాటుకు నిదర్శనాలు.
ఇది ఏదో పొరపాటు కాదు.. పాలకుల వ్యవహార శైలి..
ఈ కసరత్తును సమర్ధించే వారు ఈ మొత్తం కసరత్తులో ఎక్కడైనా పొరపాట్లు దొర్లితే అభ్యంతరాలు లేవనెత్తవచ్చనీ, మళ్లీ తనిఖీ జరిపించి ఈ పొరపాట్లను సరిదిద్దవచ్చని వాదిస్తున్నారు.
ఈ వాదన ఓ కీలకమైన అంశాన్ని విస్మరిస్తోంది. ఇక్కడ సమస్య పొరపాటు కాదు. రూపొందించిన విధానం.
విస్తృత ప్రజానీకాన్ని తమ ఓటు హక్కుకు దూరం చేసేదిగా ఉంది. నిర్ణయించిన వేగం పునఃపరిశీలనకు అవకాశం ఇచ్చేదిగా లేదు.
పరిశీలనను గందరగోళం మరింత సంక్లిష్టం చేస్తుంది. నిరూపించే బాధ్యత ప్రజలపైకి నెట్టేస్తుంది.
మరి ముఖ్యంగా ఎవరికైతే ఈ కాగితాలన్నీ సమకూర్చుకోవటం కష్టంగా మారుతుందో అటువంటి వారిపైనే భారాన్ని మోపుతుంది.
ఓటు హక్కు రద్దు చేసిన తర్వాత పరిష్కార మార్గాలు చూపించటం హక్కుల సంరక్షణ కానే కాదు. ఉల్లంఘనను అంగీకరించడమే.
6:30 కోట్ల మంది ప్రజానీకాన్ని ఓటు హక్కు కోసం మళ్లీ అప్లై చేసుకోమని కోరడం అంటే వారందరికీ రాజ్యాంగం గ్యారెంటీ చేసిన హక్కును పదేపదే పునరుద్ధరించుకోవాల్సిన అవకాశంగా మార్చడమే.
ఈ పరిష్కారాలు అసమానతలను మరింతగా పునరుద్ధరిస్తాయి. ఈ పరిష్కారాల ద్వారా లబ్ధి పొందాలంటే వాళ్లకు అక్షరాస్యత ఉండాలి.
కావల్సినంత సమయం ఉండాలి. అవసరమైన ఖర్చు పెట్టగలగాలి. నిరంతరాయంగా అధికారుల వెంటపడాలి.
అయితే, ఈ ఓటు హక్కు కోల్పోయిన వారికి ఇన్ని వనరులు అందుబాటులో ఉండవు.
ఈ కసరత్తులో రెండంచెల వెలివేత తర్వాత మిగిలేది సార్వత్రిక ఓటు హక్కు కాదు. నియంత్రిత ఓటు హక్కు.
ఎవరైతే తమ శాశ్వస నివాసాన్ని నిరూపించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారో, అటువంటి వారికి మాత్రమే దక్కే హక్కు.
ఇక్కడ జరుగుతున్న సవరణ ఓటరు జాబితా సవరణ కాదు. తాము ఈ దేశానికి చెందిన వారిమేననే భావనను సవరిస్తున్నారు.
రాజకీయ తర్కం: గొంతు నొక్కి నీళ్లు పోయటం
ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ తర్కం సుస్పష్టంగానే ఉన్నది.
విశాల జన సామాన్య ప్రజాస్వామ్యంలో తమకంటూ ఒక ప్రాతినిధ్యం కలిగి ఉండేందుకు బదులుగా కేవలం ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి అమలు జరిగే సంక్షేమ పథకాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఆహార భద్రత, నగదు బదిలీలు, గృహ నిర్మాణ పథకం- ఇటువంటి కార్యనిర్వాహకవర్గం దయతో అమలు జరిగే పథకాలు.
ప్రజల హక్కులు కాదు. తమకున్న రాజకీయ హక్కు ద్వారా సాధించుకున్నవి కావు. పౌరసత్వం దయతో ఇచ్చే హక్కుగా మారుతుంది. సంక్షేమం దానంగా మారుతుంది.
ఇటువంటి పాలనలో ఓటుహక్కు రద్దుచేయగల హక్కుగా మారుతుంది. కేవలం సంక్షేమ పథకాలపై ఆధారపడి బతుకులీడ్చే ప్రజలకు తమదైన రాజకీయ అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు.
ఇంకా చెప్పాలంటే, అటువంటి బలమైన రాజకీయ అభిప్రాయాలు వారికి శాపంగా మారతాయి కూడా.
అటువంటి వారు తమకు దక్కిన సహాయం ఆధారంగా ఓటు వేయటానికి బదులు తమకు కలిగిన అసౌకర్యం ఆధారంగా ఓటుహక్కును వినియోగిస్తారు.
ఊపిరి మాత్రమే తీసుకోవడానికి ఉపయోగపడే సంక్షేమ పథకాల స్థానంలో, గౌరవంగా బతకటానికి కావాల్సిన మార్గాలను డిమాండ్ చేస్తుంది.
సంపద పంపిణీ కోసమో, డిమాండ్ చేసేవారితోనో లేదా పాలకవర్గ భావజాలాన్ని ప్రశ్నించే వారితోనో జతకడతారు.
ఎంపిక చేసిన దాతృత్వంతో ప్రజలను కట్టడి చేయటానికి అలవాటుపడిన ప్రభుత్వాలకు ప్రజలు తమ హక్కును ఉపయోగించుకునే అవకాశం కల్పించే ఎన్నికలు సమస్యగా మారతాయి.
భారీ ఎత్తున ఓటుహక్కు రద్దన్నది సంక్షేమ పథకాలతో విభేదించే చర్య కాదు. ఈ రెండు చర్యలు పరస్పరం పూరకాలే. ఒకదాన్నొకటి సమర్ధించుకునే చర్యలే.
ఓటు వేయని వాళ్ళను కూడా పాలించవచ్చు. ఓటుహక్కు లేదా తమ ఓటు హక్కుతో ప్రభుత్వాలను మార్చే సామర్థ్యం లేని వారికి కూడా సంక్షేమ తాయిలాలు అందించవచ్చు.
ప్రజలకు రాజకీయ హక్కులు బేరసారాలాడే శక్తికి ఉన్న పునాదిని తొలగిస్తే ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయటం ప్రభుత్వాలకు మరింత తేలిక.
ఇటువంటి ప్రభుత్వాలకు కావాల్సింది పౌరులు కాదు. మౌనంగా, చెప్పింది చెప్పినట్లు వినే, కృతజ్ఞతా భావంతో ఉండే లబ్ధిదారులు మాత్రమే కావాలి.
ఇటువంటి చర్యల ఫలితంగా రాజకీయ సమూహం స్వభావం నిర్ణయాత్మకంగా మారిపోతుంది.
ప్రజల నుంచి రాజ్యం అధికారం సంతరించుకుంటుందన్నది ప్రజాస్వామ్య సారాంశం. ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు/పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.
ఓటింగ్ ద్వారా ప్రజలు ప్రభుత్వంపై అజయాయిషీ చేస్తుంటారు.
రాజకీయ అభిప్రాయం స్థానంలో సంక్షేమం, ప్రాతినిధ్యం స్థానంలో ఆధారపడే లక్షణం ముందుకొచ్చినపుడు ప్రజాస్వామ్యం కాగితాలకే పరిమితం అవుతుంది. వాస్తవిక ప్రజాస్వామ్యం శూన్యమవుతుంది.
ఎటువంటి నాటకీయ పరిణామాలు అవసరం లేకుండానే నియంతృత్వం
విధివిధానాల పేరుతో జరుగుతున్న నాటకం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. ఎక్కడా అత్యవసర పరిస్థితి విధింపు ప్రకటనలు లేవు. రాజ్యాంగాన్ని నిషేధించింది లేదు. వీధుల్లో యుద్ధ టాంకుల గస్తీ లేదు. చడీచప్పుడు లేకుండా అమలు జరుగుతున్న గణాంకాలు, తనిఖీలు, విధివిధానాలు, పరిపాలనాపరమైన పద్ధతులు, ఆదేశాలతో ప్రజాస్వామ్యం పలుచబారుతోంది.
లైన్లకు లైన్లే రద్దు చేయబడుతున్నాయి, తొలగించబడుతున్నాయి. ప్రమాణాలు పదేపదే సవరణకు గురవుతున్నాయి. ఫారాలు తిరస్కరణకు గురవుతున్నాయి. ఏడు దశాబ్దాలకుపైగా నిర్మించుకుంటూ వచ్చిన రాజకీయ సమూహం సాంకేతిక అనివార్యత రూపంలో అమలు జరుగుతున్న ఆదేశాల ద్వారా సంకుచితమైపోతోంది. ఇదేమీ ప్రజలకు ఇచ్చిన రాజకీయ అవకాశం కాదు. చడీచప్పుడు కాకుండా అమలు జరుగుతున్న నియంతృత్వం ఇది. స్వచ్ఛమైన, కల్తీలేని, సమర్ధవంతమైన నియంతృత్వం.
ఈ రకంగా సమస్యను సాంకేతికమైనదిగా, సంక్లిష్టమైనదిగా ప్రదర్శించడం కాకతాళీయం కాదు. ఇది పాలకులకు ఒక అనివార్యమైన నిర్ణయం. ఓటర్ల జాబితాను సమగ్రంగా లోప రహితంగా తయారు చేస్తున్నామన్న ముసుగులో ఓటుహక్కును రద్దు చేయటం. రాజకీయ వెలివాడల నిర్మాణం చేస్తున్నామని చెప్పకనే చేస్తున్నారు. అలాంటప్పుడే ప్రతిఘటన మూగోబోతుంది. సాంకేతిక లోపం పేరుతో జరుగుతున్న హక్కుల హననాన్ని పౌరులు కూడా అంగీకరిస్తారు. మొత్తం ఓటర్ల జాబితాను సమూలంగా మార్చేస్తున్నామంటే ఎదురయ్యే స్పందన వేరు. ప్రజాస్వామ్యానికి పొడుస్తున్న కత్తి పొట్ల నొప్పి తెలీకుండా ఎక్కించే మత్తుమందు పేరుకు పరిపాలనా పరచర్యలు.
బాహాటంగా అనని వేటకంటే ఈ రకమైన పరిపాలన చలాయించుకోవడం తేలికైన పని. అత్యవసర పరిస్థితి విధిస్తే ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. సాంకేతిక మార్గాల్లో అవే విధానాలు అమలు చేస్తే ఎలాంటి ఆగ్రహావేశాలకు ఉద్యమాలకు తావుండదు. కేవలం కంప్యూటర్లో తయారయ్యే కాగితాలు పట్టికల్లో కోట్లమంది మాయమవుతున్నపుడు రావల్సిన స్పందన రాదు. ఆగ్రహం అవధులు దాటదు. తిరగదోడాలన్న రాజకీయ అలోచన కూడా అసాధ్యంగా మారెంత వరకు ఆగ్రహం గూడు కట్టుకుంటూ ఉంటుంది.
రాజ్యాంగపరమైన సవాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ మనందరి ముందుకు తెస్తున్న కీలక ప్రశ్న ఒక్కటే. జనగణన లేకుండా, పార్లమెంటులో చర్చ లేకుండా, పారదర్శకత లేకుండా అర్థవంతమైన విధివిధానాలు లేకుండా ఆరున్నర కోట్ల మంది ఓటర్ల ఓటు హక్కు రద్దు చేయగలిగినపుడు సార్వత్రిక ఓటు హక్కనే భావనకు ఏమైనా అర్థం మిగిలి ఉంటుందా?
సార్వత్రిక ఓటుహక్కు అన్నది అలంకారప్రాయమైనది కాదు. వలస పాలన నుంచి విడగొట్టున్న భారత గణతంత్రానికి వ్యవస్థాపక పునాది. అప్పటి వరకు ప్రజలుగా మిగిలిపోయిన భారతీయులు ఈ హక్కు ద్వారానే ఓటర్లుగా మారారు.
భారతీయులందరూ కలిసి తమ ఉమ్మడి సార్వభౌమత్వం ద్వారానే ఈ గణతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారనేందుకు నిలువెత్తు తార్కాణం. పరిమిత ఓటు హక్కు ఇచ్చిన వలసపాలన కంటే స్వతంత్ర భారతాన్ని విలక్షణమైనదిగా నిలబెట్టిన పరిణామం, నిర్ణయం ఈ సార్వత్రిక ఓటు హక్కు.
ప్రభుత్వం ఎంతగా విధానాలు, పద్ధతులను సాకుగా చూపి లక్షలు, కోట్ల మంది ఓటర్లను తొలగించిప్పుడు భారత గణతంత్రానికి బీటలు వారాయి. మౌలిక ప్రశ్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది కాదు. ఎన్నికల్లో ఎవరు పాల్గొనగలుగుతున్నారన్నదే. ఒకసారి ఓటర్ల సంఖ్య పాలకుల ఇష్టం వచ్చినట్టు మారుతూ ఉంటే, మార్చగల విషయంగా మారిపోయినపుడు ఎన్నికలు రాజ్యం కోరుకున్న ఫలితాలని మాత్రమే ఇస్తాయి.
ఇది ప్రజా సార్వభౌమత్వాన్ని సంస్కరించడం కాదు. ఆ అవగాహన నుంచి వైదొలగటం. అసౌకర్యంగా మారిన ఓటర్లను పౌరులుగా గుర్తించారాదని నిర్ణయించిన ప్రజాస్వామ్యాలు అక్కడితో ఆగవు. ఒక్కో అడుగు ముందుకేస్తాయి. సార్వత్రిక హక్కు విశేష అధికారం ద్వారా మాత్రమే ప్రసాదించబడే హక్కుగా ఓటు మారటం వరకూ.
భారత గణతంత్రం ముందు ఉన్న సవాలు ఒకటే: పరిపాలనా పరమైన చర్య ముసుగులో ఇంత భారీ స్థాయిలో ఓటర్లను తొలగించే అధికారాన్ని ప్రశ్నించకుండా వదిలేయటమా లేక అటువంటి అర్థం లేని అధికారాలను సవాలు చేసి తిరిగి ఓటుహక్కును సార్వత్రిక రాజ్యాంగపరమైన హక్కుగా మిగిల్చుకోవడానికి పోరాడటమా ? అన్నదే సవాలు. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం ఓటుహక్కు కలిగిన వారికి తమహక్కుల ప్రదర్శన వేదికగానూ, ఓటు హక్కు కోల్పోయిన వారికి శిక్షగా మారుతుంది. రెండో పని జరగాలంటే కొంత ధైర్యం కావాలి. రాజకీయ సాహసోపేత నిర్ణయం కావాలి. మొదటి పని జరగాలంటే ఇపుడు జరుగుతున్న పరిపాలన చర్యలను యధాతధంగా వదిలేయటం.
ఆరున్నర కోట్ల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం కేవలం గణాంకాలను సరిచేయడం కాదు. ఓటర్లు కత్తిరింపుకు గురవుతున్నపుడు, పౌరసత్వం తాత్కాలికంగా మారుతున్నపుడు, హక్కులను తిరగదోడ గలుగుతున్నపుడు, ప్రజాస్వామ్యం కరి మింగిన వెలగపండవుతుంది. పదజాలంగా ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ పరమార్థం మారిపోతుంది.
అనువాదం: కొండూరి వీరయ్య
మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయడండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
