పాలస్తీనాలో జరుగుతున్న జాత్యహంకార హత్యాకాండను ఆపడంలో ఐక్యరాజ్యసమితి పూర్తిగా విఫలమైంది. నిరాధార ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడిని అపహరించి ఆ దేశంలో ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపించడాన్ని నిలువరించలేకపోయింది.
మరో విచిత్రం ఏమిటంటే, ఐక్యరాజ్యసమితిలోని అత్యధిక సభ్యదేశాల ఇష్టానికి వ్యతిరేకంగా క్యూబాపై నిర్హేతుక ఆంక్షలు విధిస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయింది.
ఇరాన్‌పై అకారణ యుద్ధాన్ని గానీ, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేలా ఇరుపక్షాల మధ్య ఒక ఒప్పందం కుదర్చడంలో గానీ ఐక్యరాజ్యసమితి పూర్తిగా విఫలమైంది.
ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఐక్యరాజ్యసమితి వల్ల ప్రయోజనం ఏమిటి? ఒకవేళ ప్రయోజనం నామమాత్రమే అయితే దానిని రద్దు చేయవచ్చు కదా. ఆ స్థానంలో ప్రపంచ దేశాల సమన్వయం కోసం మరింత ప్రాతినిధ్యం వహించే సంస్థ ఏర్పాటుకు ఎందుకు కృషి చేయకూడదు? అసలు ఐక్యరాజ్యసమితిని రద్దు చేసి, రాక్ఫెల్లర్ నుంచి మొదట కొనుగోలు చేసిన భవనాన్ని అమ్మి, ఆ వచ్చిన డబ్బును అవసరమైన దేశాలకు విరాళంగా ఇవ్వాలనేది నా చిన్న ప్రతిపాదన.
అమెరికా ప్రయోజనాల సాధనంగా ఐరాస
ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో రెండు ప్రధాన ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఒకటి, ప్రముఖ యుద్ధ నేరస్తుడిగా కీర్తి పొందిన సతన్యాహు (నెతన్యాహు) ప్రసంగించడానికి వేదికపైకి రాగానే, మెజారిటీ దేశాల ప్రతినిధులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. 2023 తర్వాత నుంచి ప్రతి ఏటా ఇలాగే జరుగుతోంది.
రెండోది, అతని మార్గదర్శి డొనాల్డ్ ట్రంప్ అదే వేదికపై ‘ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నాశనం చేయాలా? అదీ త్వరగా చేయాలా?’ లాంటి ఊహాగానాలు చేశారు. ఇక క్యూబా విషయానికొస్తే, ‘పూర్తిగా పతనావస్థకు చేరిన దేశం’గా పేర్కొంటూ అక్కడికి ‘స్వేచ్ఛ రాబోతోంది’ అని ట్రంప్ భరోసా ఇస్తున్నారు. దీనికి ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి తీవ్రంగా స్పందించి, ఘాటుగా సమాధానమిచ్చారు.
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా తన ప్రసంగంలో క్యూబా ద్వీపాన్ని అణచివేయడానికి అమెరికా విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ, ఆ దేశానికి బలమైన మద్దతునిచ్చారు. అది అప్పుడు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఆచరణలో పెద్దగా ప్రభావం చూపలేదు.
ఇవి ప్రధాన అంశాలు కావడానికి ఒక కారణం ఉంది. నేడు ఐక్యరాజ్యసమితి ఎలా తయారైందో ఈ పరిస్థితులే కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అంతేకాదు, ఎఫ్డీఆర్(అవును, ఆయనే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్) ఈ సంస్థ ఎలా ఉండాలని కోరుకున్నారో ఇవి స్పష్టం చేస్తున్నాయి.
అమెరికా తన విధానాలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేసేలా ఒక పదునైన ఆయుధంగా యూఎన్ మారాలన్నదే ఆయన ఉద్దేశం. ఇది అందుకు పెద్ద భిన్నంగా ఏమీ లేదు. మొదటి ప్రపంచ యుద్ధం, వెర్సాయ్ ఒప్పందం తర్వాత ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ ఏర్పాటైంది. ఆ సంస్థ ప్రధానంగా అమెరికా విధానాలనే అమలు చేయాలని నాడు వుడ్రో విల్సన్ కూడా కోరుకున్నారు.
ఈ రెండు సందర్భాల్లోనూ (లీగ్ ఆఫ్ నేషన్స్, ఐక్యరాజ్యసమితి) ఒకే విధమైన పరిస్థితి ఉంది. ఈ అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుపై వ్యతిరేకత అమెరికా లోపలి నుంచీ వచ్చింది.
సెనేట్‌లోని రిపబ్లికన్లు మనసులో ఇంకా ‘ఏకాంతవాదులుగానే’ (ఇతర దేశాల వ్యవహారాలకు దూరంగా ఉండాలనే భావనతో) ఉన్నారు. అందుకే వారు విల్సన్ ప్రణాళికను అడ్డుకుని నాశనం చేశారు.
ఇక రూజ్వెల్ట్ వారసుడు హ్యారీ ట్రూమన్ విషయానికొస్తే, ఆయన ఐక్యరాజ్యసమితి స్థాయిని తగ్గించారు. 1950–53 నాటి కొరియా అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవడానికి యూఎన్‌ను వాడుకున్నప్పటికీ, ఆయన దాని ప్రాధాన్యాన్ని తగ్గించారు. దానిని నిస్సందేహంగా వాడుకోవచ్చు, అయితే అది ఎప్పుడూ ఒక ద్వితీయ శ్రేణి సాధనంగానే మిగిలిపోవాలి.
డీన్ అచెసన్ తన రచనల్లో ఒక విషయాన్ని గట్టిగా చెప్పారు. ‘సమస్యలతో సతమతమవుతున్న ప్రపంచానికి ఐక్యరాజ్యసమితి అమెరికా అందించిన గొప్ప కానుక అనడంలో సందేహం లేదు. కానీ, దాని రూపకల్పనకు నాకు ఏమాత్రం సంబంధం లేదనే విషయంలో చిన్నపాటి అనుమానం కూడా అవసరం లేదు’ అని ఆయన చమత్కారంగా స్పష్టం చేశారు.

వీటో రాజకీయాలు.. నాటో ఆధిపత్యం
మొదటి నుంచి ఐక్యరాజ్యసమితి నిర్మాణం అప్రజాస్వామికంగానే ఉంది. భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) శాశ్వత సభ్యదేశాలన్నీ రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాలే. వాటిలో ఏ ఒక్క దేశం ‘వీటో’ అధికారాన్ని వాడినా, ఎలాంటి చర్యలనైనా ఆపేయవచ్చు.
ఇజ్రాయెల్‌పై అత్యంత స్వల్పమైన చర్యను కూడా అమెరికా వీటో చేయడంతో, ఈ సంస్థ నవ్వులపాలైంది. ఇక సర్వసభ్య సమావేశం(జనరల్ అసెంబ్లీ) కేవలం అలంకారప్రాయం మాత్రమే. దానికి ఏమాత్రం అధికారం లేదు.
క్యూబాపై ఆంక్షలను ఎత్తివేయాలని ఐరాస భారీ మెజారిటీతో ఓటు వేయవచ్చు. కానీ, ఆచరణలో దానికి ఎలాంటి విలువా లేదు.
కొన్ని దశాబ్దాల నుంచి అమెరికా అధ్యక్షులు తమ చీకటి పనులను భద్రతా మండలితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కానిచ్చేశారు. ఇరాక్‌లో బుష్ జూనియర్, పాలస్తీనా–ఇరాన్లలో ట్రంప్, సతన్యాహు ఇలాగే వ్యవహరించారు. ఇక్కడ ఏకపక్ష ధోరణి లేదా శ్వేతసౌధం ఆధిపత్యమే చెల్లుబాటు అవుతోంది.
2003లో ఇరాక్‌పై దండెత్తడానికి భద్రతా మండలి అనుమతి ఇస్తుందో లేదో బుష్‌కు అనుమానమే. ఒకసారి ఇరాక్‌పై బాంబులు వేసి ఆక్రమించుకున్న తర్వాత మాత్రం కథ మారింది. పదుల వేల మంది ఇరాక్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో, ఆ దేశ ఆక్రమణకు యూఎన్ఎస్సీ ఏకగ్రీవంగా, ఎంతో గర్వంగా మద్దతు తెలిపింది.
అమెరికా ఆర్థిక ప్రయోజనాలు, అమెరికా భద్రత రెండూ ఒకటేనని అప్పట్లో రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అంగీకరించినట్లయింది.
ఈ మద్దతు లభించినప్పటికీ, ఐక్యరాజ్యసమితిని అమెరికా తన ఆధిపత్యానికి ప్రధాన సాధనంగా ఎన్నడూ చూడలేదు. నాటో, తమ నియంత్రణలో ఉన్న ఇతర కూటముల ద్వారానే తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవచ్చని అమెరికా నేతల నమ్మకం.
కొన్ని రోజుల క్రితం నాటో ప్రధాన కార్యదర్శి బహిరంగంగా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దురాక్రమణలో ప్రతి ఒక్క నాటో దేశం సహాయం చేసిందని ఆయన చెప్పారు. ఆయనేమో రుట్టే అనే ఒక డచ్ రాజకీయ నాయకుడు, అమెరికాకు తలొగ్గి ఉండేవాడు. ఎర్డోగాన్ దీనికి భిన్నంగా ఎంత అరిచి గీ పెట్టినా పట్టించుకోనవసరం లేదు. ఉక్రెయిన్ విషయంలోనూ ఇదే పరిస్థితి.
ప్రస్తుతం జరుగుతున్న ఈ రెండు యుద్ధాలూ నాటో ద్వారా అమెరికా చేస్తున్న యుద్ధాలే. పైకి రక్షణ కూటమిగా చెప్పుకునే ఈ సంస్థ, సిగ్గులేకుండా అమెరికా సామ్రాజ్యవాదానికి పనిచేసే ఒక సాధనం. అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి మనకు ఒక ‘స్పాటో’ (SPATO – సౌత్ పసిఫిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) అవసరం.
ఈ వారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ జరిపిన సమావేశం చాలా కీలకమైనది. అమెరికా, చైనాల మధ్య శాంతియుత సహజీవనం గురించి జిన్‌పింగ్ చెప్పే మాటలకు నేటి అమెరికా పాలకుల వద్ద పెద్దగా విలువ లేదని ఆయనకు కచ్చితంగా తెలిసే ఉంటుంది.
గోర్బచేవ్ చేసిన ‘ఉమ్మడి యూరోపియన్ నివాసం’ అనే విజ్ఞప్తిని కూడా ఈయూ ఉన్నత వర్గాలు అలాగే తిరస్కరించాయి. రష్యాను నాటోలో చేర్చుకోవాలంటూ యెల్ట్సిన్ చేసిన అభ్యర్థనకు యూరప్ రాజధానుల్లోని దౌత్య కార్యాలయాల్లో బిగ్గరగా నవ్వుతూ ఎగతాళి చేశారు. వాళ్లు అప్పుడు ఎందుకు అలా తిరస్కరించారో, ఎగతాళి చేశారో అర్థమైంది.
అయితే, అమెరికా అత్యంత ప్రీతిపాత్రంగా ఆమోదించిన రెండు ఐక్యరాజ్యసమితి సంస్థలు మాత్రం ఆర్థికపరమైనవే. అవి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు. అయితే, ట్రంప్ సుంకాల పిచ్చి వల్ల ఏదో ఒక దశలో ప్రపంచ బ్యాంకు నుంచి కొద్దిపాటి స్పందన రావచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వాదనను సూటిగా, స్పష్టంగా ముందుపెట్టింది శామ్యూల్ హంటింగ్టన్.
‘స్వేచ్ఛా ప్రపంచం’ వెనుక భద్రతా వలయం
“రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండు దశాబ్దాల పాటు ప్రపంచ రాజకీయాల్లో అమెరికా శక్తి విస్తరించింది. సోవియట్ యూనియన్, చైనా కమ్యూనిస్టు దేశాలకు వ్యతిరేకంగా ఇతర ప్రభుత్వాలతో కూటముల వ్యవస్థను నిర్మించాలనే ఆసక్తి అమెరికాకు బలంగా ఉండేది. ఇవే (వ్యాపార) బహుళజాతి సంస్థల ఎదుగుదలకు అవసరమైన మౌలిక రాజకీయ పరిస్థితులను సృష్టించాయి.
పశ్చిమ యూరప్, లాటిన్ అమెరికా, తూర్పు ఆసియా దేశాలన్నీ ఈ పరిధిలోకి వచ్చాయి. దక్షిణాసియాలోని చాలా భాగం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలు కూడా ఇందులోనే ఉన్నాయి. వీటిని మర్యాదపూర్వకంగా ‘స్వేచ్ఛా ప్రపంచం’ అని పిలిచేవారు. కానీ, వాస్తవానికి అది కేవలం ఒక భద్రతా మండలం మాత్రమే.
ఈ మండలంలోని దేశాల ప్రభుత్వాలు రెండు విషయాలను తమ ప్రయోజనాలకు అనుకూలమైనవిగా భావించాయి.
(ఎ) మొదటిది, తమ దేశ స్వాతంత్ర్యానికి వాషింగ్టన్ (అమెరికా) ఇచ్చే స్పష్టమైన లేదా పరోక్ష హామీని అంగీకరించడం. కొన్ని సందర్భాల్లో తమ ప్రభుత్వ అధికారానికి కూడా అమెరికా హామీని అంగీకరించాయి.
(బి) రెండోది, తమ భూభాగంలోకి అమెరికా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రవేశించడానికి అనుమతించడం. అమెరికా సంస్థల లక్ష్యాల సాధనకు ఈ అనుమతి ఉపయోగపడింది.”
ఐఎఫ్ స్టోన్ అన్నట్లుగా, ఈ ‘పాక్స్ అమెరికానా'( అమెరికా ఆధిపత్య శాంతి) అనేది వేరేదేమీ కాదు. అది ‘స్టాండర్డ్ ఆయిల్, చేజ్ మాన్‌హట్టన్ బ్యాంక్, పెంటగాన్ల “అంతర్జాతీయవాదం”‘ మాత్రమే.
స్వదేశంలో సంస్కరణలు.. విదేశాల్లో విధ్వంసం
అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ పీటర్ గోవన్, ‘న్యూ లెఫ్ట్ రివ్యూ’ పత్రికలో ఐక్యరాజ్యసమితిపై ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. అందులో ఆయన ఈ సంస్థ చరిత్రను సునిశిత దృష్టితో కళ్లకు కట్టినట్లు వివరించారు.
స్వదేశంలో ‘న్యూ డీల్’ విధానాల ద్వారా అమెరికా సామాజిక–ప్రజాస్వామ్య సంస్కరణలు అమలు చేసింది. విదేశాల్లో మాత్రం దోపిడీ, విధ్వంసాలకు పాల్పడేదని ఆయన ఎత్తిచూపారు.
శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే, ఎఫ్డీఆర్ (FDR – రూజ్వెల్ట్) అన్నింటికంటే ముందుగా అమెరికా సైనిక శక్తిని భారీగా పెంచాలనుకున్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ఆయన క్యూబాలో 1933 నాటి విప్లవాన్ని అణచివేయడానికి సమ్నర్ వెల్లెస్ను పంపారు. అక్కడ బటిస్టా నియంతృత్వాన్ని ప్రతిష్ఠించారు.
నికరాగువాలో సోమోజా వంటి కీలుబొమ్మ పాలకులను పెంచి పోషించారు. స్వదేశంలో క్యాథలిక్ ఓట్లు అవసరం కాబట్టి, స్పెయిన్ అంతర్యుద్ధ సమయంలో ఆ దేశ రిపబ్లిక్ ప్రభుత్వానికి ఆయుధాలు అందకుండా నిషేధించారు. తద్వారా నియంత ఫ్రాంకోకు సాయం అందేలా జాగ్రత్త పడ్డారు.
నిజానికి ఫాసిజం అంటే రూజ్వెల్ట్కు పెద్దగా భయమేమీ ఉండేది కాదు. ఇటలీ నియంత ముస్సోలినీతో ఆయన సంబంధాలు అద్భుతంగా ఉండేవి. ఫ్రాన్స్‌లోని నాజీ అనుకూల ‘విచీ’ ప్రభుత్వాన్ని కూడా ఒక సాధారణ దౌత్య భాగస్వామిగానే చూశారు.
మరోవైపు నాజీ జర్మనీ విషయంలో మాత్రం ఆయన వైఖరి వేరుగా ఉండేది. యూదు శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి ఆయన ఇష్టపడనప్పటికీ, నాజీ జర్మనీని మాత్రం అడ్డుఅదుపు లేని విస్తరణవాద ముప్పుగా చూశారు.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో నాటి నావికాదళ నేపథ్యం ఉన్న చర్చిల్ కూడా జర్మనీని ఇలాగే చూశారు. అందుకే, యూరప్‌లో యుద్ధం మొదలవగానే—అమెరికా ఇంకా ఆ యుద్ధంలోకి దిగకముందే—రూజ్వెల్ట్ ప్రభుత్వం యుద్ధానంతరం ఏర్పడబోయే కొత్త ప్రపంచం వైపు దృష్టి సారించింది. అది అమెరికా నాయకత్వంలో నడిచే ఒక కొత్త ప్రపంచం.
నాటోపాలిటనిజం.. కూలిపోతున్న ఐరాస
20వ శతాబ్దం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో, అమెరికాకు జర్మనీ ఏకీకరణ సమస్య ఎదురైంది. కానీ వైట్‌హౌస్ బృందం దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. అమెరికా తన సైనిక దళాలను వెనక్కి తీసుకునే ఉద్దేశం కానీ, నాటోను రద్దు చేసే ఆలోచన కానీ ఏమాత్రం లేదు. అంటే, జర్మనీకి అసలైన సార్వభౌమాధికారం కూడా ఉండదని అర్థం.
యూరోపియన్లు మొండికేయడాన్ని అమెరికా అనుమతించే రోజులు ఎప్పుడో పోయాయి. ఒకప్పుడు వారి ప్రవర్తనపై కిస్సింజర్ ఇలా ఫిర్యాదు చేసేవారు— ‘యూరోపియన్లు అయాచితంగా రక్షణ పొందుతున్నారు. బదులుగా ఏమీ ఇవ్వడం లేదు. వాళ్లు అచ్చం యుక్తవయసు కుర్రాళ్ల లాంటివారు. తమను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారు. అదే సమయంలో తల్లిదండ్రులను తంతారు.’ కిస్సింజర్‌కు అలవాటైన అతిశయోక్తి ఇది.
సాంస్కృతిక విప్లవానికి ఆజ్యం పోసిన చైనా యువతను, యూరోపియన్ ఉన్నత వర్గాలను ఆయన పొరపాటున ఒక్కటిగా ఊహించుకుని ఉండవచ్చు.
‘నాటోపాలిటనిజం: ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అట్లాంటిక్ కూటమి’ (Natopolitanism: The Atlantic Alliance Since the Cold War) అనే పుస్తకం నాటో గతం, వర్తమానాలపై వచ్చిన విమర్శనాత్మక వ్యాసాల చక్కని సంకలనం. దీన్ని ఎడిట్ చేయడంలో గ్రే ఆండర్సన్ ఎంతో నైపుణ్యం కనబరిచారు. ఇందులో ఎడిటర్ స్వయంగా రాసిన వ్యాసం మరీ ప్రభావవంతంగా ఉంది.
ఆండర్సన్ తన వ్యాసాన్ని ఇలా ముగించారు:
“తమది ‘చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కూటమి’ అని నాటో పెద్దలు గొప్పలు చెప్పుకోవచ్చు. అయితే తూర్పు యూరప్‌లో ఉదారవాద పునర్జన్మకు మంత్రసానిగా, ప్రపంచీకరణకు రక్షకభటుడిగా, అంతర్జాతీయ చట్టవిరుద్ధ చర్యలకు జైలర్‌గా వ్యవహరించింది. ఇలా దాని విభిన్న కార్యకలాపాలు, సొంత సూత్రాలకు అనుగుణంగా లేకపోయినా, ఆ కూటమిని నడిపిస్తున్న నాయకుడి (అమెరికా)కి తిరుగులేని ఆధిపత్యం ఉందని రుజువు చేస్తున్నాయి.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన మొదటి మూడు దశాబ్దాల్లో నాటో సభ్య దేశాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైంది. ఉత్తర అట్లాంటిక్ ఒప్పందం భౌగోళిక పరిధికి కేవలం పేరుకు మాత్రమే కట్టుబడి ఉంది. వాస్తవానికి ఎలాంటి హద్దులు లేని ఒప్పందంలోకి కొత్త సభ్యులను చేర్చుకున్నారు.
నాటోపై యూరోపియన్ యూనియన్ ఆధారపడే సంబంధం 2009 లిస్బన్ ఒప్పందంలో చట్టబద్ధమైంది. ఏ యూరోపియన్ భద్రతా విధానమూ అట్లాంటిక్ కూటమికి ఇచ్చిన హామీలకు ముప్పు కలిగించకూడదని ఆ ఒప్పందం స్పష్టంగా చెబుతోంది.
మిత్రదేశాలను క్రమశిక్షణలో ఉంచే యంత్రాంగంగా, వాటి మధ్య వివాదాలను పరిష్కరించే మధ్యవర్తిగా, సామ్రాజ్యవాద సమస్యలను చక్కదిద్దే సాధనంగా ఇది పనిచేసింది. యూరప్‌పై అమెరికా ఆధిపత్యాన్ని అమలు చేయడంలో దాని రికార్డును ఎవరూ కాదనలేరు.”
ఈ పుస్తకాన్ని ఎంతగా సిఫార్సు చేసినా తక్కువే. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి అసలు పాత్ర మరింత స్పష్టమయ్యే కొద్దీ, ఏదో ఒక రోజు అది కూలిపోక తప్పదు. చైనా, రష్యా, బ్రెజిల్ లేదా దక్షిణాఫ్రికా దేశాలు చొరవ తీసుకుని ఐక్యరాజ్యసమితి నుంచి వైదొలుగుతాయని నేను అనుకోవడం లేదు. కానీ అమెరికాకు దానిపై ఆసక్తి తగ్గితే మాత్రం అదే జరుగుతుంది. అప్పటివరకు వేచి ఉండటం విచారకరం. అందుకని ఐరాసను ఇప్పుడే రద్దు చేయాలి.
అనువాదం: టాన్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
