హోమర్ కంటే ఎంతో కాలం ముందే, మెసొపొటేమియాలో ఒక మహిళ తాను రాసిన వాటి కింద తన పేరు రాసుకునేది. ఆమె పేరు ఎన్హెడుఅన్నా. క్రీస్తుపూర్వం 23వ శతాబ్దంలో ‘ఉర్’ నగరానికి ప్రధాన పూజారిణిగా ఉన్న ఈమె, చరిత్రలో మనకు తెలిసిన మొదటి రచయిత్రి. మట్టి పలకలపై చెక్కిన ఆమె రాతలు, తొలి నాగరికతల నుంచే ఆలోచనల్లో, మతంలో, రాజకీయాల్లో మహిళలు పాలుపంచుకున్నారని మనకు గుర్తుచేస్తాయి.
సాహిత్య చరిత్రలో ఆమె పేరు కనిపించకుండా పోవడం, జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడంలో మహిళలను ఎప్పటి నుంచో వెనక్కి నెట్టేస్తున్న తీరును చూపిస్తుంది.
పాశ్చాత్య సాహిత్యంలోని ప్రసిద్ధ కవుల నీడలో చాలా కాలం మరుగున పడిపోయినా, చరిత్రలో మనకు తెలిసిన మొదటి రచయిత్రి మాత్రం ఎన్హెడుఅన్నానే.
నాలుగు వేల ఏళ్లకు పూర్వమే, మెసొపొటేమియాలో ఈ ప్రధాన పూజారిణి తన రాతలపై తన పేరు వేసుకుని, కవిత్వాన్ని, అధికారాన్ని, ఆధ్యాత్మికతను కలిపి ఒక గొప్ప సాహిత్య సంపదను వదిలివెళ్లారు.
చరిత్రలో మొదటి రచయిత ఎవరు అని అడిగితే, మనకు తరచుగా హోమర్ గుర్తుకొస్తారు. ప్రాచీన గ్రీస్‌కు చెందిన ఆ అంధ కవి రూపం, పాశ్చాత్య సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానంలో ఉంటుంది.
కానీ నిజానికి మనం ఇంకా చాలా వెనక్కి వెళ్లాలి. గ్రీస్‌ను దాటి, అక్షరమాల పుట్టకముందే కాలానికి వెళ్లి, రాతకు పుట్టిల్లైన ప్రాచీన మెసొపొటేమియా వైపు చూడాలి. అక్కడ, నాలుగు వేల ఏళ్లకు పూర్వమే, ఒక మహిళ తాను రాసిన దానికి తన సొంత పేరు పెట్టుకుంది. ఆమే ఎన్హెడుఅన్నా.
ఎన్హెడుఅన్నా క్రీస్తుపూర్వం 2300 ప్రాంతంలో, ఇప్పటి దక్షిణ ఇరాక్‌లో ఉన్న ‘ఉర్’ నగరంలో నివసించేవారు. ఆమె ఎన్నో కారణాల వల్ల ప్రత్యేకంగా నిలుస్తారు. ఆమె చంద్ర దేవుడైన ‘నన్నా’కు ప్రధాన పూజారిణి. ఆ పదవి వల్ల ఆమెకు చాలా రాజకీయ, మతపరమైన అధికారం ఉండేది. అంతేకాదు, మొదటి మెసొపొటేమియా సామ్రాజ్యాన్ని స్థాపించిన అక్కాద్ రాజు సార్గాన్ కూతురు కూడా ఆమే. అన్నింటికంటే ముఖ్యంగా, మత, రాజకీయపరమైన, కవితాత్మకమైన లోతు ఉన్న గొప్ప సాహిత్య రచనలు చేసిన కవయిత్రి.
‘ఎన్హెడుఅన్నా’ అనేది ఆమె అసలు పేరు కాదు, అది ఒక మతపరమైన బిరుదు మాత్రమే. దానికి “ప్రధాన పూజారిణి, ఆకాశానికి అలంకారం” అని అర్థం. ఆమె అసలు పేరు ఏమిటో ఇప్పటికీ తెలియదు. కానీ ఆమె చారిత్రక ప్రాముఖ్యంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఎన్హెడుఅన్నా రాశారు, తన రాతలపై సంతకం చేశారు, అవి తన సొంత ఆలోచనల నుంచి పుట్టినవని చెప్పుకున్నారు. దీనివల్ల, తన పేరుతో ఒక సాహిత్య రచనను మిగిల్చిన మొదటి వ్యక్తి ఆమె అయ్యారు.
రాత, అధికారం, ఆధ్యాత్మికత
క్రీస్తుపూర్వం నాలుగో సహస్రాబ్ది మధ్యకాలం నుంచే ‘క్యూనిఫాం’ (మేకుల్లా ఉండే అక్షరాలు) రాత వాడుకలో ఉండేది. ఆర్థిక లెక్కలు రాయడానికి, పన్నులు వసూలు చేయడానికి, పశువులను లెక్కపెట్టడానికి ఒక పరిపాలనా సాధనంగా ఇది మొదలైంది. కానీ ఎన్హెడుఅన్నా కాలానికి వచ్చేసరికి, మతపరమైన, తత్వశాస్త్ర, కళాత్మక భావాలను వ్యక్తం చేయడానికి కూడా దీన్ని వాడటం మొదలుపెట్టారు. రాతపనికి, ధాన్యానికి, జ్ఞానానికి అధిదేవత అయిన ‘నిసాబా’తో ముడిపడి ఉన్న ఒక పవిత్ర కళగా అది ఉండేది.
ఈ నేపథ్యంలో చూస్తే, ఎన్హెడుఅన్నా పాత్ర చాలా విషయాలను బయటపెడుతుంది. ఆమె రాతల్లో గాఢమైన భక్తితో పాటు స్పష్టమైన రాజకీయ సందేశం కూడా ఉంటుంది.
ఒకే భాష, ఒకే నమ్మకం, ఒకే మత ఆలోచనల ద్వారా సుమేరియన్ నగరాలపై అక్కాద్ పాలనను సమర్థించుకునే సామ్రాజ్య ప్రణాళికలో ఆమె కవిత్వం కూడా ఒక భాగంగా ఉండేది.
ఒక గొప్ప సాహిత్య వారసత్వం
ఎన్హెడుఅన్నా రాశారని భావిస్తున్న రచనలు కొన్ని ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది ‘ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ ఇనన్నా’. ప్రేమ, యుద్ధాలకు దేవత అయిన ఇనన్నాను కీర్తిస్తూ రాసిన పొడవైన గీతం ఇది.
తాను ప్రవాసంలో ఉన్న సమయంలో దేవత సాయం కోరుతూ రాసిన ఈ గీతాన్ని, ఆమె అత్యంత వ్యక్తిగతమైన, శక్తివంతమైన రచనగా భావిస్తారు.
‘టెంపుల్ హైమ్స్’ అనే మరో రచన కూడా అందుబాటులో ఉంది. సుమేర్‌లోని వేర్వేరు దేవాలయాలు, దేవతలకు అంకితం చేసిన 42 గీతాల సమాహారం ఇది. వీటి ద్వారా ఎన్హెడుఅన్నా ఆ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మిక పటం గీశారు; మతానికి, రాజకీయ అధికారానికి మధ్య ఉన్న దగ్గరి సంబంధాన్ని స్పష్టం చేశారు.
తన ఇష్టదైవమైన నన్నాకు అంకితం చేసిన గీతంతో సహా, ఇంకొన్ని అసంపూర్ణ గీతాలు కూడా దొరికాయి. ఇవి కేవలం మతపరమైన రాతలు మాత్రమే కాదు; ఎన్నో సంకేతాలతో, భావోద్వేగాలతో, నిజమైన రాజకీయ దృష్టితో నిండిన గొప్ప రచనలు. దేవతలకు, మనుషులకు మధ్య; తన తండ్రి అయిన చక్రవర్తికి, జయించిన నగరాలకు మధ్య వారధిగా ఎన్హెడుఅన్నా కనిపిస్తారు.

ఆమె గురించి మనకు ఎందుకు అంతగా తెలియదు?
స్కూల్ పాఠ్యపుస్తకాల్లోనూ, చాలా యూనివర్సిటీల సాహిత్య పాఠ్యాంశాల్లోనూ ఎన్హెడుఅన్నా పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రాచీన చరిత్ర, జెండర్ స్టడీస్ రంగాలకు బయట ఆమె పేరు పెద్దగా ఎవరికీ తెలియదు.
సాంస్కృతిక చరిత్ర నుంచి మహిళల పేర్లను పద్ధతి ప్రకారం తుడిచివేయడం వల్లే ఆమెకు ఈ గుర్తింపు రాలేదా అని అడగడం సహేతుకమే.
కళా చరిత్రకారిణి అనా వాల్టియెర్రా లకల్లె చెప్పినట్లుగా, పురాతన కాలంలో మహిళలు చదవగలరని, రాయగలరని, ఆస్తులను నిర్వహించగలరని పురావస్తు ఆధారాలు ఉన్నప్పటికీ, శతాబ్దాల తరబడి మహిళా రచయితలు, కళాకారిణుల ఉనికిని అంగీకరించలేదు.
ఎన్హెడుఅన్నా ఏదో ఒక్కసారి మాత్రమే జరిగిన అరుదైన ఉదంతం కాదు. మతపరంగా, మేధోపరంగా మెసొపొటేమియా నాగరికత ఎదగడంలో మహిళలు చురుగ్గా పాల్గొన్నారని ఆమె జీవితం నిరూపిస్తోంది.
తన పేరుతో ఒక రచనపై సంతకం చేసిన మొదటి వ్యక్తి కావడం వల్ల, మానవ చరిత్రలో ఆమెకు తప్పకుండా ఒక ప్రత్యేకమైన స్థానం దక్కాలి.
ఆమె సాహిత్య చరిత్రలో ఒక పునాది లాంటి ఘట్టం కంటే ఎక్కువే. రాత సంస్కృతి మొదలైన తొలి రోజుల్లోనే సృష్టించే, ఆలోచించే, అధికారం చెలాయించే శక్తి మహిళలకు ఉందని ఆమె ఎంతో బలంగా చూపించారు.
మట్టి పలకలపై చెక్కిన ఆమె గొంతు, వేల ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా మన దాకా చేరింది. ఆమెతోనే చరిత్ర కేవలం మాటలతోనే కాకుండా, ఒక స్పష్టమైన గొంతుతో, జీవన అనుభవంతో, రాత పని పట్ల ఉన్న లోతైన స్పృహతో మొదలవుతుంది; వీటన్నింటికీ పూర్తి గుర్తింపు లభించాల్సిందే.
అనువాదం: శృంగవరపు రచన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
