గత ఐదు సంవత్సరాలుగా బల్గేరియాను మధ్య-కుడి, ఉదారవాద-సంస్కరణవాద, సాంకేతికవాద కూటముల మిశ్రమం నడిపించింది.
బల్గేరియా పార్లమెంటరీ తాజా ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు రూమెన్ రాదేవ్ నేతృత్వంలోని మధ్య-వామపక్ష కూటమి స్పష్టమైన విజేతగా నిలిచింది.
తద్వారా ఐదేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ విభజనకు తెరపడిందని బల్గేరియా దేశ కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
సోమవారం అన్ని బ్యాలెట్లను లెక్కించిన తర్వాత, ప్రోగ్రెసివ్ బల్గేరియా కూటమి 44.6% ఓట్లను పొందిందని ఫలితాలు చూపించాయి.
ఇది సీనియర్ నాయకుడు బోయ్కో బోరిస్సోవ్ మధ్య-కుడి జీఈఆర్బీ పార్టీ, ‘వీ కంటిన్యూ ది చేంజ్’ పార్టీ నేతృత్వంలోని పాశ్చాత్య అనుకూల సంస్కరణవాద కూటమి కంటే సుమారు 30 శాతం పాయింట్లు అధికం.
ఆ పార్టీలు వరుసగా 13.4%, 12.6% ఓట్లతో దాదాపు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. బోరిస్సోవ్ తన ఓటమిని అంగీకరించి, రాదేవ్కు అభినందనలు తెలిపారు.
తాజా ఫలితాల ప్రకారం, 240 స్థానాలున్న సభలో మరో రెండు పార్టీలు కూడా సీట్లు గెలుచుకున్నట్లు తెలుస్తోంది.
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సోమవారం రాదేవ్కు ఆయన ఎన్నికల విజయంపై అభినందనలు తెలిపారు.
“బల్గేరియా ఐరోపా కుటుంబంలో ఒక గర్వించదగిన సభ్యురాలు. మన ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బల్గేరియాతోపాటు ఐరోపా శ్రేయస్సు, భద్రత కోసం కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
యూరోపియన్ మార్గంలో పయనం..
రాదేవ్ షరతులతో కూడిన “యూరోపియన్ మార్గాన్ని” వాగ్దానం చేశారు. తమ పార్టీ విజయాన్ని రాదేవ్ నిస్సందేహమైనదిగా, “అవిశ్వాసంపై ఆశ సాధించిన విజయం, భయంపై స్వేచ్ఛ సాధించిన విజయం”గా అభివర్ణించారు.
బల్గేరియా “తన యూరోపియన్ మార్గంలో కొనసాగడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది” అని ఆయన అన్నారు.
“నన్ను నమ్మండి. బలమైన బల్గేరియాకు, బలమైన యూరప్‌కు విమర్శనాత్మక ఆలోచన, ఆచరణాత్మకత అవసరం. నియమాలు లేని ప్రపంచంలో నైతిక నాయకురాలిగా ఉండాలన్న తన సొంత ఆశయానికి యూరప్ బలైంది” అని రాదేవ్ విలేకరులతో అన్నారు.
రష్యా అనుకూల ముద్ర – ఆందోళనలు..
తన అధ్యక్ష పదవీకాలంలో, రాదేవ్ రష్యా పట్ల సానుభూతిపరుడిగా పేరు పొందారు.
రష్యా పూర్తిస్థాయి దండయాత్రకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధానికి సైనిక సహాయం పంపాలన్న ఈయూ ప్రయత్నాలను ఆయన పదేపదే వ్యతిరేకించారు.
ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం వల్ల బల్గేరియా యుద్ధంలోకి లాగబడే ప్రమాదం ఉందని ఆయన తరచుగా వాదించారు.
అంతేకాకుండా, ఈ సంఘర్షణ నుంచి బయటపడటానికి ఒక మార్గంగా రష్యాతో చర్చలను తిరిగి ప్రారంభించడాన్ని సమర్థించారు.
యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సోఫియా కార్యాలయ అధిపతి, సిమియోనోవా మాట్లాడుతూ, రాదేవ్ తరచుగా రష్యా అనుకూల ప్రకటనలు చేస్తూ, స్వదేశంలో భారీ విజయం సాధించినందున ఆయనను “కొత్త ఓర్బాన్”తో పోల్చినప్పటికీ (ఓర్బాన్ ఏప్రిల్ 12న హంగేరి ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన ప్రధాని) ఇప్పుడు ఆయన ఇతర యూరోపియన్ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా బాహ్య చట్టబద్ధతను పొందడానికి ప్రయత్నించే అవకాశం ఉందని అన్నారు.
“కనీసం తన యూరోపియన్ సహచరులతో జరిపే సంభాషణలలోనైనా, రాదేవ్ బహిరంగంగా ఓర్బాన్ తరహా వాక్చాతుర్యాన్ని అవలంబించే అవకాశం లేదు. ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక మద్దతు లేదా రష్యాపై ఆంక్షలకు సంబంధించి ఆయన చేసే విమర్శలు ప్రధానంగా దేశీయ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటాయి” అని సిమియోనోవా అన్నారు.
ప్రధాని పదవిపై గురి..
ప్రధానమంత్రి పదవిని ఆశించేందుకు రాదేవ్ అధ్యక్ష పదవిని విడిచిపెట్టారు.
తన రెండవ పదవీకాలం ముగియడానికి కొన్ని నెలల ముందు, జనవరిలో, ఎక్కువగా లాంఛనప్రాయమైన అధ్యక్ష పదవికి రాదేవ్ రాజీనామా చేసి, ప్రధానమంత్రిగా మరింత శక్తివంతమైన పాత్రలో ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రయత్నం ప్రారంభించారు.
62 ఏళ్ల మాజీ ఫైటర్ పైలట్, బల్గేరియన్ వైమానిక దళ కమాండర్‌గా నియమితులవడానికి ముందు, 2003లో యూఎస్ ఎయిర్ వార్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని పొందారు.
దేశంలోని కులీనవర్గ అవినీతికి ఆయన ముగింపు పలుకుతారని ఆశించేవారు ఒకవైపు, ఆయన యూరో వ్యతిరేక, రష్యా అనుకూల అభిప్రాయాలకు మద్దతు ఇచ్చేవారు మరోవైపుగా ఆయన మద్దతుదారులు చీలిపోయారు.
అవినీతిపై సమరం..
దేశవ్యాప్త అవినీతి వ్యతిరేక నిరసనలు ప్రధానంగా లక్షలాది మంది యువతను వీధుల్లోకి తీసుకురావడంతో, బల్గేరియాలోని గత సంప్రదాయవాద ప్రభుత్వం డిసెంబర్లో కూలిపోయింది.
పాతుకుపోయిన మాఫియాకు, ఉన్నత స్థాయి రాజకీయ నాయకులతో వారికున్న సంబంధాలకు తాను వ్యతిరేకినని రాదేవ్ ప్రకటించుకోవడంతో, ఆయన ప్రజాదరణ ఒక్కసారిగా పెరిగింది.
ప్రచార సభలలో ఆయన, “అవినీతిమయమైన, కొద్దిమంది కులీన పాలన నమూనాను రాజకీయ అధికారం నుంచి తొలగిస్తానని” శపథం చేశారు.
నాటో, ఈయూ సభ్య దేశమైన బల్గేరియా, అవినీతిని అరికట్టనందుకు; చట్టబద్ధమైన పాలనలో లోపాలు ఉన్నందుకు పదేపదే విమర్శలకు గురైంది.
బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ వెస్సెలా చెర్నేవా మాట్లాడుతూ “రాదేవ్ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన పని విదేశాంగ విధానం కాదని, అమెరికా- బ్రిటన్‌లచే అవినీతి ఆరోపణలపై ఆంక్షలు విధించబడిన ఒలిగార్క్, బోరిసోవ్, మూవ్మెంట్ ఫర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ నాయకుడు డెలియన్ పీవ్స్కీల నియంత్రణ నుంచి బల్గేరియన్ సంస్థలను విముక్తి చేయడమేనని అన్నారు.
“దానికోసం పార్లమెంటులోని ‘వి కంటిన్యూ ది చేంజ్’ అనే సంస్కరణవాద, యూరోపియన్ అనుకూల కూటమి నుంచి ఆయనకు మద్దతు లభిస్తుంది” అని చెర్నేవా జోడించారు.
బహుశా దీని అర్థం, ఏళ్ల తరబడి విచ్ఛిన్నమైన పార్లమెంట్లకు ముగింపు పలకడమే కావచ్చు.
2021 నుంచి 65 లక్షల జనాభా ఉన్న ఈ దేశం బలహీనమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన విచ్ఛిన్నమైన పార్లమెంట్లతో సతమతమవుతోంది.
వాటిలో ఏ ఒక్కటీ వీధి నిరసనలు లేదా పార్లమెంట్‌లోని తెరవెనుక ఒప్పందాల వల్ల కూలిపోవడానికి ముందు ఏడాది కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయింది.
ప్రజల్లో మిశ్రమ స్పందన..
అంతం లేనట్లుగా సాగుతున్న ఈ ఎన్నికల జూదంతో విసిగిపోయిన ప్రజలు, తాజా ఎన్నికల ఫలితాలపై మిశ్రమ భావాలతో స్పందించారు. “అన్నింటికంటే ముఖ్యంగా, మేము మరింత స్థిరమైన న్యాయ వ్యవస్థను, సంస్థలపై విశ్వాసం నిజంగా పునరుద్ధరించబడాలని ఆశిస్తున్నాము.
ఇప్పటి వరకు, అవి వివిధ వ్యక్తులచే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారిలో చాలామంది ప్రస్తుత ఫలితాల నుంచి మనం చూడగలిగినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి వైదొలిగారు” అని సోఫియాకు చెందిన 37 ఏళ్ల దుకాణ సహాయకురాలు నికోలెటా డిమిట్రోవా అన్నారు.
55 ఏళ్ల అకౌంటెంట్ స్వెటా జార్జియేవా అంత ఆశాజనకంగా లేరు. “మనం నిజంగా మెరుగైన జీవితాన్ని గడుపుతామని నేను ఆశిస్తున్నాను. కానీ దీర్ఘకాలం పాటు స్థిరత్వం ఉంటుందని నాకు నమ్మకం లేదు. బహుశా మేము మళ్లీ ఓటు వేయాల్సి ఉంటుంది” అని అన్నారు.
న్యూయార్క్ పత్రిక సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
