గుర్జర్లు లేదా గుజ్జర్లు నివసించే ప్రాంతమే గుజరాత్ అయ్యింది. పశుపాలన, వ్యవసాయం ఒకప్పుడు వీరి వృత్తి.
గుర్జర్లు అనేది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు. వివిధ మతాల, వివిధ భాషల సమూహం. వీరిలో హిందువులు, ముస్లింలు, సిక్కులూ ఉన్నారు.
వీరు గోజ్రి, గుజరాతి, హిందీ, కశ్మీరీ, పంజాబి, ఉర్దూ, పాస్‌తో, హరియాణవీ, సింధి, భోజ్‌పురి, మరాఠీ, బెలూచివంటి అనేక భాషలు మాట్లాడుతారు.
ఇండియాతోపాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోనూ వీరి జనాభా ఉంది. వీరిలో రాజపుత్రులు, జాట్లు, ఆహిర్లు, ఇండో ఆర్యన్లు కలగాపులగంగా ఉన్నారు.
ఇప్పుడు రాజస్థాన్ ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు(సాశ 570) గుర్జర్ల రాజ్యం ఉండేది. ఈ గుర్జర్ అనే పదం మొట్టమొదట బాణుడి హర్ష చరిత్ర(సాశ 630)లో కనిపిస్తుంది.
హర్ష చక్రవర్తి కాలంలో భారత్‌లో పర్యటించిన చీనీ యాత్రికుల రచనల ప్రకారం, ఆ రోజుల్లో ఆ ప్రాంతాన్ని “బుద్ధ దేశ్” అని పిలిచేవారు.
కాలక్రమంలో అక్కడ “భిన్నత్వంలో ఏకత్వం” ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, ఇప్పుడేమిటీ ఈ గుజరాతీ దేశ నాయకులు భిన్నత్వాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారా? ఆలోచించదగిన విషయమే కదా?
మొఘల్ చరిత్ర, అక్బర్ సార్వజనీనత
భారత దేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల జాబితా చూస్తే, మొదట మనకు తైమూర్ కనిపిస్తాడు.
అతని కొడుకు బాబర్, బాబర్ కొడుకు హుమాయూన్, హుమాయూన్ కొడుకు అక్బర్ ది గ్రేట్.
అక్బర్ తర్వాత జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ చివరగా బహదూర్ షా జఫర్లు ఈ దేశాన్ని పరిపాలించారని చిన్నప్పుడు మనం చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.
రాబోయే తరాలు ఈ విషయాలు తెలుసుకోగలరో లేదో తెలియదు.
ఎందుకంటే, ప్రస్తుత ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లోని విషయాలు మార్చేస్తోంది.
అసలు మొఘలుల చరిత్రే ఎవరూ చదువుకోకూడదన్నది వారి ఉద్దేశం.
కానీ, వారికి మన మీద- అంటే వారి భావ జాలాన్ని ఆమోదించని వారి మీద ఎందుకంత అక్కసో తెలియదు.
గుజరాత్ వారు గతంలో కొన్ని శతాబ్దాల పాటు ముస్లిం పాలకుల ఏలుబడిలో ఉన్నారు. ముస్లిం పాలకులు వీరిని పీడించిన విషయం చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు.
సరే ఈ విషయాలు అలా ఉండనిచ్చి, మొఘలుల వివరాల్లోకి వెళితే, ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
అందరిలోకి అక్బర్- “అక్బర్ ది గ్రేట్” అనిపించుకున్నాడు. ఎందుకంటే, ఆయన పాటించిన పరమత సహనం, హిందూ రాజపుత్ర స్త్రీని వివాహమాడడం, హిందువుల ఆధ్యాత్మిక రచనలు ఉర్దూలోకి అనువదింపజేసుకుని విషయాలు తెలుసుకోవడం- అలాగే భారతీయ సంస్కృతిలో భాగమైన “భిన్నత్వంలో ఏకత్వాన్ని” కాపాడడానికి ఇతోధికంగా కృషి చేయడంవంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
గుజరాత్ భౌగోళిక, రాజకీయ చరిత్ర
ఇక గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర చూద్దాం- గుజరాత్ జునాఘడ్ శిలాఫలకాల వల్ల- సాశ 4-5 శతాబ్దాలలో ఇది బౌద్ధుల రాజ్యమని తేలింది.
తర్వాత సాశ 8-9 శతాబ్దాల నాటికి అది గుర్జర ప్రతీహారుల పాలన కిందికి వచ్చింది. తర్వాత సోలంకి, వాఘేలా వంశపు రాజులు పాలిస్తూ వచ్చారు.
1299 సాశలో ఢిల్లీ సుల్తాన్ అలా ఉద్దీన్ ఖిల్జీ, అప్పటి వాఘేలా రాజును ఓడించి, గుజరాత్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
అప్పటి నుంచి అంటే 13వ శతాబ్దం నుంచి అది ముస్లింల పాలన కిందే ఉండిపోయింది.
తర్వాత 1411లో అహ్మద్ షా అనే రాజు తన పేరు మీద అహ్మదాబాద్ నగరం ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి పాలించాడు. 16వ శతాబ్దం చివరి నాటికి ఆ ప్రాంతమంతా మొఘలుల ఆధీనంలోకి వచ్చింది.
18వ శతాబ్దపు మధ్యలో మరాఠాలు ఏదో కొద్దికాలం స్వాధీనం చేసుకున్నారు. కానీ, 1818 నాటికి గుజరాత్ ప్రాంతం బ్రిటీష్‌వారి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గుజరాత్ ప్రావిన్స్‌ను బొంబాయి స్టేట్‌లో కలిపారు. 1956లో కచ్, సౌరాష్ట్రలు కూడా అందులో కలిశాయి.
అయితే 1960 మే 1న బొంబాయి స్టేట్ విడిపోయి గుజరాత్, మహారాష్ట్రలుగా ఏర్పడ్డాయి.
భాషల ఆధారంగా దేశంలో రాష్ట్రాల విభజన జరుగుతూ వస్తున్న కారణంగా- గుజరాతీ, మరాఠీ భాషలు మాట్లాడే వారు విడిపోయారు.
జహంగీర్ నామాలో ‘గుజరాత్’ ప్రస్తావన
మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలిస్తున్న సమయంలో ఈ “గుజరాత్” అనే పదం రూపుదిద్దుకుందని “జహంగీర్ నామా”లో ఉంది. దీని హిందీ అనువాదం మున్షీ దేవీ ప్రసాద్ కృత్ చేశారు. అందులోని 51వ పేజీలో పూర్తి వివరాలు ఉన్నాయి. జహంగీర్ చక్రవర్తి మాత్రమే కాదు, రచయిత కూడా! ఆయన తన ఆత్మకథను “తుజుక్ ఏ జహంగీరి” పేరుతో రాసుకున్నాడు. అదే “జహంగీర్ నామా”గా ప్రసిద్ధి పొందింది. దీన్ని ఇంగ్లీష్ అనువాదం వీలర్ ఎం థాక్స్టన్ చేశారు.
జహంగీర్ నామాలో అక్బర్ ప్రసక్తి, ఆయన కట్టించిన కోట ప్రసక్తీ ఉన్నాయి. అక్బర్ ఒకసారి కశ్మీర్‌కు ప్రయాణమై పోతూ మార్గమధ్యంలో చీనాబ్ నది ఒడ్డుకు వచ్చాడు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయి, అక్కడ ఒక ఖిల్లా(కోట) కట్టించుకుంటే బాగుంటుందనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, నిజంగానే అక్కడ కోట కట్టించాడు.
ఆ ప్రాంతంలో గుర్జర్ల/ గుజ్జర్ల జనాభా ఎక్కువ కాబట్టి దాన్ని ఆయన గుజరాత్ అన్నాడు. కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత, ఆ ప్రాంతంలో దారి దోపిళ్లకు పాల్పడేవారిని “గుజ్జర్లు” అనేవారు. అక్బర్ కట్టించిన ఆ కోట, పరిసర ప్రాంతాలు గుజ్జర్లు తలదాచుకోవడానికి పనికొచ్చింది.
అయితే, ఇండియా- పాకిస్తాన్ల విభజన సమయంలో ఆ కోట, ఆ పరిసర ప్రాంతాలూ పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాయి. మిగిలిన గుజరాత్, భారత్‌లో మహారాష్ట్రతో కలిసి ఉండేది. భాషా ప్రతిపదికన రాష్ట్రాలు విడిపోయినప్పుడు గుజరాత్- మహారాష్ట్ర విడిపోయాయి.
చరిత్రను చెరపలేము – మొఘలులతో రాజపుత్రుల సంబంధాలు
మొఘలులంటే, ముస్లింలంటే మండిపడే ఆర్ఎస్ఎస్- బీజేపీ ప్రభుత్వం తక్షణం గుజరాత్ పేరు మార్చుకోవాలి కదా? ఎందుకంటే ఆ ప్రాంతాన్ని గుర్తించి, దానికి ఆ పేరు పెట్టినవాడు అక్బర్ చక్రవర్తి. ఆ ప్రాంతంలో ఉన్న గుర్జర్ల- గుజ్జర్ల జనాభాకు ప్రాధాన్యమిచ్చి ఆ పేరుకు రూపకల్పన చేయడమే కాకుండా, దాన్ని ఒక ప్రత్యేక పరగణాగా కూడా ప్రకటించాడు.
మరి అక్బర్‌పై తమ కోపం ప్రకటించాలంటే తక్షణం గుజరాత్ పేరు మార్చాలి. లేదా దేశంలో ఇటీవల మార్చి, కొత్తగా పెట్టిన పేర్లను రద్దు చేయాలి. పాత పేర్లను యథాతథంగా ఉండనీయాలి.
జహంగీర్ నామా 22-25 పేజీలలో ఉన్న సమాచారం ప్రకారం, హిందూ రాజులు మొఘలులకు అణిగిమణిగి ఉన్నారే. కుచ్వాహ్ రాజ్‌పుత్ మాన్సింగ్ కుటుంబం మూడు తరాలుగా మొఘలుల సేవలో నిమగ్నమై ఉన్నారు.
మాధవ్ సింహ్ జగన్నాథ్, రాజా మనోహర్, రాణా సాగర్, రాజా బీర్ సింహ్ దేవ్ మొదలైన వారంతా మొఘలుల వద్ద గులాంగిరి చేసినవారే. ఆనాటి మొఘల్ చక్రవర్తులతో సత్సంబంధాలు నెలకొల్పుకుని, తమ ఆడ బిడ్డల్ని వారికిచ్చి పెండ్లి చేయడానికి ఉత్సాహపడ్డవారే- మరి, వారి వారసులే ఇప్పుడు ముస్లిం విరోధులు ఎందుకయ్యారూ?- అన్నది మన ప్రశ్న.
ఆత్మ విమర్శ చేసుకునే పనే లేదా? గతాన్ని శాశ్వతంగా పాతిపెట్టడం ఏ ప్రభుత్వాలకూ చేత కాదు. ప్రభుత్వాలు తాత్కాలికం, చరిత్ర శాశ్వతం.
బ్రిటీష్ కాలం నాటి ముద్రలు – ఆధునిక ఆరోపణలు
తాము గుజ్జర్లమని ఛాతీలు విరుచుకుని గర్వంగా చెప్పుకునేవారు కొంచెం ఆలోచించాలి. గుజ్జర్ల పూర్వీకులంతా దారి దోపిడీదార్లు అన్నది గుర్తుంచుకోవాలి. ఆ సంప్రదాయం ఈ నాటికీ కొందరు గుజరాతీయులు కొనసాగిస్తున్నారు. బ్యాంకులు లూటీ చేసి, లక్షల కోట్లు దోచుకుని పారిపోయిన వారంతా గుజరాతీయులే. వారికి తగిన రక్షణ కల్పించిన భారత ప్రధాని గుజరాతీయుడే.
నిజమే, మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది- కుతంత్రాలకు, దోపిడికి మరో పేరు గుజరాత్ అనేది రుజువైంది.
ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటన పరిగణనలోకి తీసుకోవాలి. ఆయన అంటాడూ, “అరవై యేళ్లుగా ఒక గాంధీ ఈ దేశం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకుని పారిపోలేదు. కానీ, ఎనిమిది సంవత్సరాలలో ముగ్గురు గుజరాతీ మోదీలు ఈ దేశం నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకుని పారిపోయారు” అని. అది మరి గుజ్జర్ల వంశం కదా. తమ వారసత్వాన్ని వారు నిలబెట్టుకుంటున్నారు? వారి దోపిడీకి గురవుతూ, వారితో మోసపోతూ ఉండడం ఈ దేశ ప్రజలకు అవసరమా?
గుర్జర్లు లేదా గుజ్జర్లు అంటే- విద్రోహ చర్యలకు పాల్పడేవారు అని బ్రిటీష్ రచయితలే చరిత్రలో నమోదు చేశారు. అలాగే, వందేళ్ల తర్వాత కూడా గుజ్జర్లను “క్రిమినల్ ట్రైబ్స్”అని ముద్ర వేశారు. కుట్రలు, కుతంత్రాలు, మోసపూరితమైన చర్యలకు పాల్పడే నేర ప్రవృత్తి గలవారు-అని రాస్తూనే ఉన్నారు.
గుజరాత్ నేపథ్యం గురించి, ఆ ప్రాంతవాసుల గురించి చరిత్రనంతా నేను తవ్వి తీసింది ఇందుకే- పాఠకులకు ఈ విషయం అర్ధం చేయించడానికే.
అయితే, గుజరాత్ పౌరులంతా మోసకారులని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆ మాట కొస్తే మహాత్మా గాంధీ గుజరాత్ వాడే. మోసాలు చేసేవారిని మాత్రమే క్షమించరాదన్నది నా ఉద్దేశం.
ఈ “క్రిమినల్ ట్రైబ్స్”కు సంబంధించిన సమాచారం నెట్లో ఉంది. ఉత్సుకత గలవారు వెతికి చదువుకోవచ్చు.
సూటిగా చెప్పుకోవాలంటే, దేశంలో బ్యాంకులు ఖాళీ చేసిన వారైనా, ప్రపంచ కుబేరుల జాబితాలో పేరు నమోదు చేసుకున్న వారైనా, దేశ నాయకులై అబద్ధాలతో అధికారం చలాయిస్తున్నవారైనా అందరికందరూ గుర్జర్లే/ గుజ్జర్లే/ గుజరాతీయులే.
అక్బర్ కాలం నుంచి కొనసాగుతున్న వారి పూర్వీకుల వృత్తిని కొనసాగిస్తున్నవారే- వారి బండారం బయట పడుతుందనే కాబోలు, మొఘలుల చరిత్ర పాఠ్యాంశాల్లోంచి తొలగిస్తున్నారు. కాల ప్రవాహంలో అన్నీ మారుతూనే ఉంటాయి. ఒకప్పటి బుద్ధ దేశ్ తర్వాత కాలంలో గుర్జర్ దేశ్ అయ్యింది. ఇది ఇలాగే మోసకారుల నిలయంగా ఉండిపోవాలని ఈ దేశ ప్రజలు కోరుకోవడం లేదు.
పరిస్థితులు పునరావృతమై, మళ్లీ మానవీయ విలువలతో కూడిన “బుద్ధ దేశ్” ఎందుకు కాకూడదు? అని అనుకుంటున్నారు, కావాలని ఆశిస్తున్నారు కూడా.
(వ్యాస రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
