‘మాగ్నా కార్టా అంటే ఏంటి?’ వార్తలను చదివే, చూసే సమకాలీన పాఠకులలో చాలామంది ఈ పదాన్ని విన్నప్పుడు ఇలాగే ప్రశ్నిస్తారు.
కానీ చరిత్ర, చట్టబద్ధమైన పాలన, పౌర హక్కులు, ప్రభుత్వ నిర్వహణలో రాజకీయాల కంటే నైతికతకే ప్రాధాన్యత ఉండాలని ఆశించే వారు మాత్రం అలా అడగరు.
యునైటెడ్ కింగ్డమ్ రాజు కింగ్ చార్లెస్ III, ఏప్రిల్ 28న వాషింగ్టన్ డీసీలో అమెరికన్ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు సభ కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది.
ఆయనకు తన దేశ చరిత్రపై మక్కువ ఎక్కువ. కింగ్ జాన్(క్రీశ 1167-1216) వారసుడిగా ఆయనకు ఆ మక్కువ ఉండక తప్పదు.
ఆ కింగ్ జాన్ కాలంలోనే ‘మాగ్నా కార్టా’ ఆవిష్కృతమైంది.
అసలు ‘జాన్ ఎవరు?’ అన్నది తదుపరి ప్రశ్న కావచ్చు. కింగ్ జాన్ ఎంతటి దురదృష్టవంతుడంటే, ఇంగ్లాండ్లో ఏ రాజుకూ మళ్ళీ ఆ పేరు పెట్టలేదు. ‘రెండవ కింగ్ జాన్’ అనే వ్యక్తి చరిత్రలో లేడు. కానీ తన దేశానికే కాకుండా ప్రపంచానికే ‘మాగ్నా కార్టా’ను అందించిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందారు.
చారిత్రక నేపథ్యం..
1215 జూన్ 15న విండ్సర్ సమీపంలోని రన్నిమీడ్ వద్ద కింగ్ జాన్ ముద్ర వేసిన ఈ 800 ఏళ్ల నాటి రాజశాసనం లాటిన్ భాష నుంచి పుట్టింది. లాటిన్లో దీని అర్థం ‘గొప్ప రాజ శాసనం’.
రాజకీయ హక్కుల పరిణామంపై ఆసక్తి ఉన్నవారికి మాగ్నా కార్టా అంటే ఒక ప్రతీక.
హక్కులు అనేవి ప్రజల సహజ సిద్ధమైన అధికారాలని, అవి ఏదో ఒక వ్యక్తి లేదా ప్రభుత్వ వ్యవస్థ చేతిలో నిరంకుశంగా ఉండకూడదని ఇది ఉద్ఘాటిస్తుంది.
తన వింత ప్రవర్తనతో అప్రతిష్ఠ పాలైన కింగ్ జాన్, తిరుగుబాటు చేసిన జమీందారులతో రాజీ పడాల్సి వచ్చింది.
రాజు తన అపరిమిత అధికారాలను వదులుకోవాలని, చట్టానికి లోబడి ఉండాలని వారు డిమాండ్ చేశారు.
తన ప్రసంగంలో మాగ్నా కార్టాను కింగ్ చార్లెస్ III ప్రస్తావించడం ద్వారా, రాజుకైనా లేదా నేటి కాలంలో ఎన్నికైన పాలకులకైనా అధికార పరిమితులు ఉంటాయని గుర్తుచేశారు.
అందుకే వాషింగ్టన్ డీసీలోని శాసనకర్తలు దీనిని ఉత్సాహంగా స్వాగతించారు.
భాషా నైపుణ్యం – అంతరార్థం..
బ్రిటిష్ రాజులు తమ ప్రసంగాలను స్వయంగా రాసుకుంటారా? అమెరికా వంటి దేశాల పర్యటనలో ప్రసంగాలను విదేశీ వ్యవహారాల కార్యాలయం రూపొందించే అవకాశం ఉంది.
ఎందుకంటే అవి కేవలం ఒక రాజు మాటలు మాత్రమే కాదు, ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఉన్న ఒక శక్తివంతమైన దేశానికి ఇస్తున్న సందేశం. ఆ ప్రసంగంలో షేక్స్పియర్, ఆస్కార్ వైల్డ్, జార్జ్ ఆర్వెల్ వంటి మేధావుల భాషా చాతుర్యం కనిపిస్తుంది.
మాగ్నా కార్టాలోని మూడు నిబంధనలు నేటికీ బ్రిటన్ చట్టాలలో ఉన్నాయి. “ఏ స్వతంత్రుడిని కూడా చట్టబద్ధమైన విచారణ లేకుండా, దేశ చట్టాలకు విరుద్ధంగా బంధించడం, ఆస్తులను జప్తు చేయడం లేదా బహిష్కరించడం చేయకూడదు. మేము ఎవరికీ న్యాయాన్ని అమ్మము, నిరాకరించము, ఆలస్యం చేయము”అనేది అందులో ముఖ్యమైనది.
ప్రపంచవ్యాప్త ప్రభావం..
శతాబ్దాలుగా ఈ పదాన్ని చాలా మంది న్యాయానికి, మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా వాడుతున్నారు.
మహాత్మా గాంధీ: 19వ శతాబ్దపు చివరలో దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు, 1858 నాటి విక్టోరియా మహారాణి ప్రకటనను ‘మాగ్నా కార్టా’గా అభివర్ణించారు.
ఎలియనోర్ రూజ్వెల్ట్: 1948లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనను “ప్రపంచవ్యాప్త మానవాళికి అంతర్జాతీయ మాగ్నా కార్టా” అని పిలిచారు.
విన్స్టన్ చర్చిల్: ఇది “రాజును మించిన చట్టం” అని పేర్కొన్నారు.
నేటి కాలానికి సందేశం..
కింగ్ చార్లెస్ కేవలం చరిత్ర పాఠం చెప్పలేదు. ఆయన ప్రసంగం వెనుక ఒక లోతైన వ్యూహం ఉంది. అమెరికాలోని రిపబ్లికన్, డెమోక్రాటిక్ సభ్యులందరికీ వినబడేలా—”కార్యనిర్వాహక అధికారం కూడా తనిఖీలకు, సమతుల్యతలకు లోబడి ఉండాలి” అని ఆయన చెప్పినప్పుడు సభ లేచి నిలబడి చప్పట్లు కొట్టింది.
రాజు తనకంటే చట్టమే గొప్పదని చెప్పడం, నేటి పాలకుల నిరంకుశత్వానికి ఒక హెచ్చరికలా అనిపించింది.
ఈ సందేశం కేవలం అమెరికాకే కాదు, ప్రపంచవ్యాప్త పార్లమెంటులన్నిటికీ వర్తిస్తుంది. పాలకులు తమ ఇష్టానుసారం కాకుండా, ప్రజల ప్రతినిధులు చేసిన చట్టాలకు లోబడి పని చేయాలని, న్యాయం పారదర్శకంగా ఉండాలని ఇది గుర్తుచేస్తోంది.
ప్రజాస్వామ్యానికి మెజారిటీ ముఖ్యం కావచ్చు, కానీ 1975-77 మధ్య భారతదేశంలో ఎమర్జెన్సీ కాలంలో జరిగినట్లుగా “పార్లమెంటరీ మెజారిటీ” పేరుతో ప్రజాస్వామ్యాన్ని అణచివేయకూడదు. మతం, జాతి లేదా భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి పాలించడం కూడా తప్పే.
వారసత్వంగా వచ్చిన కిరీటాన్ని ధరించిన ఒక రాజు, ప్రజాస్వామ్య సత్యాలను ప్రపంచానికి గుర్తు చేయడం ఒక విచిత్రమైన, ఆహ్వానించదగ్గ పరిణామం. సత్యం ఎప్పుడూ గెలుస్తుందనే ఆశ ఉంది.
కే సత్యరంజన్ చేసిన ఈ అనువాద వ్యాసాన్ని ది హిందూ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
