పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇప్పటి వరకు సైనిక లక్ష్యాలకు దాడులు పరిమితమయ్యాయి.
ఇజ్రాయెల్- అమెరికా సేనలు ఇరాన్లో విద్యుత్, తాగునీటి సరఫరా, పాఠశాలలు వంటి పౌర సేవలపై దాడులు ఎక్కు పెట్టడంతో ఇరాన్ కూడా దాడికి ఎంచుకుంటున్న లక్ష్యాల పరిధిని విస్తరించింది.
తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రెండు అమెజాన్ డేటా సెంటర్లపై షాహెద్ డ్రోన్లతో దాడి చేసింది. బహ్రెన్‌లో మరో డేటా సెంటర్‌పై కూడా క్షిపణి దాడులు జరిగాయి.
ఇరాన్లో పౌర సేవలపై దాడులు నిలుపుదల చేయకపోతే రానున్న కాలంలో మరిన్ని డేటా సెంటర్లు, అమెరికా బహుళజాతి సంస్థలకు చెందిన ఆర్థిక వాణిజ్య కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
యుద్ధ కాలంలో వాణిజ్య, ఆర్థిక కేంద్రాలపై ఒక దేశం దాడి చేయడం ఇదే ప్రథమం.
ఇప్పటి వరకు ఇంటర్నెట్ సంబంధిత సేవలపై సైబర్ నేరగాళ్లు మాత్రమే దాడి చేసే వాళ్లు.
ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యానికి అనుబంధంగా ఉన్న డేటా సెంటర్‌పై ఉక్రెయిన్‌కు చెందిన హ్యాకర్లు దాడి చేసి కీలకమైన సైనిక సమాచారాన్ని ధ్వంసం చేశారు.
కానీ, క్షిపణులు, డ్రోన్లతో భౌతికంగా వాణిజ్య కేంద్రాలపై దాడికి పాల్పడడం ఇదే మొదటిసారి.
కృత్రిమ మేధ, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో డేటా సెంటర్లు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల గమనానికి కీలకమైన వేదికలుగా మారుతున్నాయి.
ఇరాన్, వెనిజులా వంటి దేశాలలో సైనిక దాడులకు లక్ష్యాలను ఎంచుకోవడంలో అమెరికా సైన్యం కృత్రిమ మేధను పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నది.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుత యుద్ధంలో పైచేయి సాధించాలంటే, అమెరికా- ఇజ్రాయెల్ సైన్యాలకు సహకారిగా ఉన్న డేటా సెంటర్లను ధ్వంసం చేయాలని ఇరాన్ నిర్ణయించుకున్నది.
అయితే బహ్రెన్లోనూ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ ఉన్న డేటా సెంటర్లు అమెరికా సేనలకు ఏ మేరకు సహకరించాయన్న విషయంలో స్పష్టత లేదు.
మరోవైపు అమెరికాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఉన్న ఆర్థిక సంబంధాలను దెబ్బతీయడం ఇరాన్ దాడులలో ఒక కీలకమైన వ్యూహంగా ఉన్నది.
ఈ పరిణామాలు పరిశీలిస్తే, నేరుగా సైనిక వ్యవహారాలతో సంబంధం లేకపోయినా డేటా సెంటర్లు తక్షణ యుద్ధ వ్యూహాలలో లక్ష్యాలుగా మారబోతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది.
డేటా సెంటర్లు- క్లౌడ్..
వివిధ దేశాలలో ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తక్షణ కాల అంచనా వేయడానికి డేటా సెంటర్లను అమెరికా ఉపయోగించుకుంటోంది.
అంతేకాక, ఆధునిక కృత్రిమ మేధ సేవలను వాడుకుని లిప్తపాటులో భారీ సైనిక లక్ష్యాలపై దాడి చేసేలా యుద్ధ వ్యూహానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తుంది.
వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అర్ధరాత్రి అపహరించుకుపోవడానికి, ఇరాన్లో దాడుల లక్ష్యాలను ఎంపిక చేసుకోవడానికి అవసరమైన నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఆంత్రోపిక్ క్లౌడ్ అనే కృత్రిమ మేధ సాధనాన్ని అమెరికా ఉపయోగిస్తోంది.
కృత్రిమ మేధ కారణంగా లక్ష్యాల ఎంపిక, దాడులు వేగవంతమయ్యాయి. కానీ, ఈ కృత్రిమ మేధ సాధనాలు ఏ యుద్ధ విమానంలోనూ, యుద్ధ నౌక నుంచో వినియోగించబడేవి కావు.
ఈ సేవలను వినియోగించుకునే వాళ్లు భారీ సమాచారాన్ని స్వల్ప కాలంలో విశ్లేషించి ఓ నిర్ధారణకు వచ్చి తక్షణ దాడులకు ఏవి లక్ష్యాలుగా ఉంటాయో గుర్తించగలుగుతారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు వివిధ సాఫ్ట్వేర్ ఉపకరణాలతో పాటు ప్రభుత్వాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని కూడా భద్రం చేస్తాయి.
ఇటువంటి క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటాయి.
ముందుముందు నెట్‌ఫ్లిక్స్‌లో మనం చూడబోయే సిరీస్‌లు కానీ సినిమాలుగానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచే మన కంప్యూటర్లకు దిగుమతి కానున్నాయి.
ఇటువంటి డేటా సెంటర్లపై దాడి చేయడం ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ డేటా సెంటర్లతో అనుసంధానమైన పౌర సేవలకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
కృత్రిమ మేధ ఆర్థికాభివృద్ధికి సాధనంగా మారితే ఆ సాధనాన్ని ఆచరణలో పెట్టేవి ఈ డేటా సెంటర్లే.
ఈ డేటా సెంటర్లు అందించే ఇంటర్నెట్ తదితర సేవల కారణంగానే కృత్రిమ మేధ పని చేస్తుంది.
ఉదాహరణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని డేటా సెంటర్లపై ఇరాన్ దాడి చేసినప్పుడు ఆ దేశంలో స్థానికంగా బ్యాంకు లావాదేవీలకు పెద్ద ఎత్తున ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో డేటా సెంటర్లపై దాడి చేయడమంటే, కేవలం సైనిక వనరులపై దాడి చేయడం మాత్రమే కాదు.
సమాజంపై విస్తృత ప్రభావం కలగజేసే లక్ష్యంతో దాడి చేయడమే అవుతుంది.
అమెరికా మిత్రులపై దాడి..
జస్ట్ సెక్యూరిటీ పరిశోధకులు 2026 మార్చి 12న విడుదల చేసిన ఒక విశ్లేషణలో, ప్రభుత్వ సైనిక విభాగాలకు చెందిన సమాచారాన్ని, దేశ భద్రతకు సంబంధించిన విషయాలను అమెరికా రక్షణ శాఖ నిర్మించే క్లౌడ్ బేస్‌లలో భద్రం చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
“ఇటువంటి సున్నితమైన సమాచారాన్ని గల్ఫ్ దేశాలలోని అమెజాన్ వెబ్ సర్వీస్ డేటా సెంటర్లో భద్రం చేయడానికి ప్రభుత్వ ప్రత్యేక అనుమతులు కావాలి. అటువంటి అనుమతులు ఇచ్చారో లేదో తెలియదు” అని కూడా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా శత్రు సేనలకు సహాయ సహకారాలు అందిస్తున్న డేటా సెంటర్లను లక్ష్యంగా పెట్టుకుని దాడి చేస్తామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ సైన్యం ప్రకటించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని డేటా సెంటర్‌పై దాడి జరిగిన పది రోజుల తర్వాత “ఈ ప్రాంతంలోని శత్రు దేశాలకు సంబంధించిన ఐటీ మౌలిక సేవలపై దాడి చేయనున్నాము” అని ఇరాన్ వార్తా సంస్థ ప్రకటించింది.
డేటా సెంటర్లపై దాడికి రక్షణపరమైన కారణాల కంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో అమెరికాకు చెందిన భారీ టెక్ కంపెనీలు గల్ఫ్ దేశాలలో డేటా సెంటర్ల రూపంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి.
అమెరికా- గల్ఫ్ దేశాల సహకారం పేరుతో నడుస్తున్న ఈ పెట్టుబడుల ప్రవాహంలో భాగంగా కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఉపకరణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఎగసిపడుతున్న యుద్ధ జ్వాలల నేపథ్యంలో ఇటువంటి భారీ పెట్టుబడులు, వాటి మన్నిక, రక్షణ ప్రశ్నార్థకం కానున్నాయి.
తేలికపాటి లక్ష్యాలు..
ఈ డేటా సెంటర్లు దేశ భద్రతకు, ఆర్థిక రంగానికి, సామాజిక సేవలకు కీలకమైన సాధనాలుగా ఉన్నాయి. దీంతో ఈ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమంటే ఆయా దేశాలు అనుసరిస్తున్న యుద్ధ వ్యూహంలో మౌలికమైన మార్పులు రానున్నాయని అర్థం చేసుకోవాలి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని పలు లక్ష్యాలపై ఇరాన్ వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. వీటిలో అత్యధిక సంఖ్యలో క్షిపణులను ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేసిన ఆ రక్షణ కవచాన్ని ఛేదించి అరబ్ ఎమిరేట్స్‌లోని సున్నితమైన డేటా సెంటర్లను, విమానాశ్రయాలను, హోటళ్లను అగ్గిపాలు చేశాయి.
ఇటువంటి డేటా సెంటర్లకు వైమానిక, గగనతల దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం అంత తేలికైన పనేమీ కాదు.
అందువల్లనే ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఇటువంటి డేటా సెంటర్లు సైనిక దాడులకు లక్ష్యాలుగా మారుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఏఐ ఆధారిత ఉపకరణాలు, క్లౌడ్ అనుబంధ సేవలు పెరుగుతూ ఉండడంతో రానున్న కాలంలో యుద్ధ లక్ష్యాలుగా మారనున్నాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
