ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ వాణిజ్యం బలంగా కనిపిస్తున్నాయి. కానీ వాటికి ఆధారమైన పునాదులు మాత్రం బలహీనంగా ఉన్నాయనీ జేపీ మోర్గాన్ నివేదిక తెలియజేసింది.
అనేక సమస్యల మధ్య కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన దిగుమతి సుంకాల విధానానికి అమెరికా కోర్టులు కొన్ని పరిమితులు విధించాయి. అయినప్పటికీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో దిగుమతులపై సుంకాలు గత అనేక దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి.
ఇరాన్ యుద్ధం కారణంగా 1970ల తర్వాత చమురు మార్కెట్లకు అతిపెద్ద అంతరాయం ఏర్పడింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేటికీ కొనసాగుతున్నది.
ఈ రెండు పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఎరువులు, ఇంధనం సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇంకోవైపు, ప్రభుత్వాల అప్పులు భారీగా పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయ బాండ్ మార్కెట్లలో పెట్టుబడిదారులు తమ బాండ్లను పెద్ద ఎత్తున అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఆర్థిక మార్కెట్లలో ఆందోళన పెరిగింది. అయినప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆశ్చర్యకరంగా నిలకడగా కొనసాగుతోందనీ ఆ నివేదిక పేర్కొంది.
గత నెలలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు 40 నెలల్లో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని జేపీ మోర్గాన్ సంస్థ తయారు చేసిన “కొనుగోలు మేనేజర్ల సూచీ” పేర్కొంది.
రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వస్తు వాణిజ్యం కూడా మరింత వేగంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మొత్తంగా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుమారు 3 శాతం వార్షిక వృద్ధిని సాధించవచ్చని అంచనా.
వచ్చే వారం బ్యాంకాక్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు(డబ్ల్యూబీ) సమావేశాలు జరగనున్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా వృద్ధి చెందుతోంది?
భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలను ఈ సమావేశాల్లో పాల్గొనే విధాన నిర్ణేతలు చర్చించబోతున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్న ప్రభుత్వాలు:
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడంలో ప్రభుత్వాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. చాలా కాలంగా ప్రభుత్వాలు పర్యావరణానికి హాని తగ్గించే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం వైపు మారడానికి ప్రయత్నిస్తున్నాయి.
అదే సమయంలో చమురు, సహజ వాయువు నిల్వలను పెంచుకోవడం, అవసరమైనప్పుడు వాటిని విడుదల చేయడం వంటి చర్యలు చేపట్టాయి.
ఈ చర్యల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు కొంతమేర రక్షణ లభించింది. అంతేకాకుండా, ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాలు ప్రజలపై పడుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు కొన్ని ఆర్థిక సహాయ పథకాలను అమలు చేశాయి.
ఫలితంగా వినియోగదారులు భరించాల్సిన అదనపు ఖర్చులు కొంత మేర తగ్గాయి.(నేడు ధరల పెరుగుదల పెట్టుబడిదారీ దేశాలన్నిటిలో ఒక ప్రధాన సమస్యగా ఉంది).
ప్రైవేటు కంపెనీల పాత్ర:
ఈ పరిస్థితిలో ప్రైవేటు కంపెనీలు చూపిన చొరవ ప్రశంసనీయం. అమెరికా దిగుమతి సుంకాలు, అంతర్జాతీయ రాజకీయ సమస్యల వల్ల వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు కంపెనీలు త్వరగా కొత్త సరఫరాదారులను వెతుక్కున్నాయి.
వస్తువులను వేరే దేశాల నుంచి కొనుగోలు చేయడం, పాత వాణిజ్య మార్గాలకు బదులుగా కొత్త మార్గాలను ఉపయోగించడం ప్రారంభించాయి.
ఉదాహరణకు హార్ముజ్ జలసంధి ద్వారా చమురు, సహజ వాయువు, రసాయనాల రవాణా తగ్గిపోవడంతో, కెనడా నుంచి కజకిస్థాన్ వరకు కొన్ని దేశాల ఉత్పత్తిదారులు తమ ఎగుమతులను పెంచారు. అంటే, ఒక ప్రాంతం నుంచి వస్తువులు సరిగా అందకపోతే, మరో ప్రాంతం నుంచి వాటిని తెప్పించుకోవడం ద్వారా కంపెనీలు తమ వ్యాపారాన్ని కొనసాగించగలిగాయి.
కృత్రిమ మేధస్సు:
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో పెడుతున్న భారీ పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి మరో ముఖ్యమైన కారణంగా మారాయి.
ఏఐ సాంకేతికతకు అవసరమైన చిప్లు, సర్వర్లు, సర్క్యూట్ బోర్డుల కోసం డిమాండ్ పెరిగింది. దీనివల్ల ఆసియా దేశాల ఎగుమతులు పెరిగాయి.
ఐరోపాలో ప్రత్యేక పరికరాలను తయారు చేసే కంపెనీలకు కూడా ప్రయోజనం కలిగింది.
అమెరికాలో డేటా సెంటర్లు, వాటికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణంపై భారీగా ఖర్చు చేస్తున్నారు. అమెరికా దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పెట్టుబడులు అక్కడి పారిశ్రామిక ఉత్పత్తిని పెంచుతున్నాయి.
ఈ పెట్టుబడుల వల్ల స్టాక్ మార్కెట్లు కూడా పెరిగాయి. షేర్ల విలువ పెరగడంతో పెట్టుబడిదారుల సంపద పెరిగింది. వారు ఎక్కువగా ఖర్చు చేయగలగడం వల్ల ప్రజల వినియోగం, వ్యాపార కార్యకలాపాలకు కూడా మద్దతు లభించింది.
అనుకూల పరిస్థితులు:
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగుండటానికి ప్రభుత్వాలు, కంపెనీలు చేసిన ప్రయత్నాలే కాకుండా, కొన్ని అనుకూల పరిస్థితులు కూడా కారణమయ్యాయి.
అమెరికా డాలర్ బలహీనపడటం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గింది. అమెరికా సుంకాల విధానానికి చట్టపరమైన అడ్డంకులు, కోర్టుల్లో ఎదురైన సవాళ్ల కారణంగా ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినమైన సుంకాల విధానాన్ని అమలు చేయడంలో కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక సమస్యలు కొనసాగుతున్న సమయంలో ఏఐ రంగంలో పెట్టుబడులు పెరగడం ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నది.
అయితే, ఈ అనుకూల పరిస్థితులు ఎప్పటికీ కొనసాగుతాయని భావించకూడదు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదాలు:
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దాని పునాదులు బలంగా లేవు. ప్రభుత్వాల అప్పులు భారీగా ఉన్నాయి. వాటిపై వడ్డీలు చెల్లించడానికి ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అప్పులు ఎక్కువగా ఉన్న ప్రభుత్వాలపై బాండ్స్ మార్కెట్లలో పెట్టుబడిదారుల సహనం తగ్గుతోంది.
మరోవైపు, ప్రజాదరణ కోసం పనిచేసే రాజకీయ నాయకులు ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి అవసరమైన కఠిన నిర్ణయాలను వ్యతిరేకించవచ్చు. దీనివల్ల ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం మరింత కష్టమవుతుంది.
ఇరాన్ యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే, ఇప్పటివరకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపయోగపడిన చమురు నిల్వలు, ఇతర రక్షణ వనరులు క్రమంగా తగ్గిపోతాయి.
ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడుల్లో ఏఐ పాత్ర పెరుగుతున్నందున, ఈ సాంకేతికత విషయంలో కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి.
ఉదాహరణకు ఏఐపై అతిగా అంచనాలు పెట్టుకోవడం, ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేయడం, ఏఐ పెట్టుబడుల నుంచి ఆశించిన లాభాలు రాకపోవడం.
ఏఐ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కంపెనీలు నిరాశకు గురవుతాయి.
ఇలాంటి సమస్యలు తలెత్తితే, వాటి ప్రభావం ఒక్క కంపెనీకి లేదా ఒక్క దేశానికే పరిమితం కాదు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా వ్యాపించవచ్చు.
గత అనుభవాలు:
ఇప్పటివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలను తట్టుకుని నిలబడింది. అయితే భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలంటే ప్రభుత్వాలు కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవడం అవసరం.
1. అత్యవసర పరిస్థితుల కోసం నిధులు ఉంచుకోవాలి. ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రజలకు, వ్యాపారాలకు సహాయం చేయడానికి ప్రభుత్వాల వద్ద కొంత ఆర్థిక వెసులుబాటు ఉండాలి.
2. ప్రభుత్వ అప్పులను నియంత్రించాలి. అప్పులు నిరంతరం పెరుగుతూ ఉంటే, వాటిపై వడ్డీలు చెల్లించడం కష్టం అవుతుంది. ప్రభుత్వాలు తమ అప్పులను నియంత్రించలేకపోతే, ప్రభుత్వ బాండ్ల మార్కెట్లలో మరో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చుల మధ్య సమతుల్యత ఉండాలి.
3. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై నమ్మకం పెంచాలి. కాబట్టి నమ్మకమైన ఆర్థిక సంస్కరణలు అవసరం.(సంస్కరణలను మానవీయ కోణంలో అమలు చేయాలని గతంలో పీవీ నరసింహారావు చెప్పారు. ఒకసారి కొరడా దెబ్బలకు అనుమతి ఇచ్చిన తర్వాత అమలు చేయాల్సినవాడు కొట్టాల్సిందే. నేడు దేశంలో జరుగుతున్న ఆందోళనల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ).
ప్రైవేటు కంపెనీలకు కూడా సహాయపడే కొన్ని చర్యలు తీసుకోవాలి.
1. వ్యాపార అడ్డంకులను తగ్గించాలి. ఉద్యోగులను నియమించుకోవడం, పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు కంపెనీలకు సులభంగా ఉండాలి.
2. అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచాలి. దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలంగా ఉంటే, ఒక దేశంలో సరఫరా సమస్య ఏర్పడినప్పుడు మరో దేశం నుంచి అవసరమైన వస్తువులను పొందడం సులభం అవుతుంది. (ప్రస్తుతం భారతదేశంలో మోదీ ప్రభుత్వం వీటిని అమలు చేస్తున్నది. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” పేర యజమానుల దుర్మార్గాలకు చట్టబద్ధత కలిగించడానికే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను అమలులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరొక అడుగు ముందుకేసి “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” పేర వేగంగా పరిశ్రమల అధిపతులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.)
రవాణా, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి:
మంచి రవాణా మార్గాలు, నమ్మకమైన ఇంధన సరఫరా ఉంటే కంపెనీలు సరఫరా సమస్యలను సులభంగా ఎదుర్కోగలవు.
సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నప్పుడు కంపెనీలకు ప్రత్యామ్నాయ మార్గాలు, ఇతర సరఫరాదారులు అందుబాటులో ఉండాలి. అప్పుడు అవి పరిస్థితులకు అనుగుణంగా త్వరగా మారగలవు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు అనుకూల పరిస్థితులు, ప్రభుత్వాల సహాయం, కంపెనీల చురుకుదనం వల్ల అనేక సమస్యలను తట్టుకుంది. కానీ భవిష్యత్తులో కూడా నిలకడగా ఉండాలంటే అనుకూల పరిస్థితులు మాత్రమే సరిపోవు.
ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి.(అంటే ప్రజా సంక్షేమం కోసం చేసే నిధులను భారీగా తగ్గించాలి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు నెట్టబడతారు. ప్రస్తుతం ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అదే చేస్తున్నది).
కంపెనీలకు వ్యాపారాన్ని విస్తరించడానికి సహకరించాలి.(భారతదేశంలో మోదీ ప్రభుత్వం ఈపాటికే దీన్ని అమలు చేస్తున్నది. పరిశ్రమలకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పారితోషికాల పేరున ధారాదత్తం చేస్తున్నది).
అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయాలి. రవాణా, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి.
(ఈ వార్తా కథనంలో చేసిన సూచనలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలు ఈపాటికే వివిధ దేశాలపై రుద్దుతున్న ఆంక్షలు. వాటి దుష్ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ వారంలో జరగనున్న ఈ సంస్థల సమావేశంలో వీటిని మరింత కఠినంగా, వేగంగా అమలుకు చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. కొత్త తరహాలో అదనపు భారాలు కూడా మోపే ప్రమాదం ఉంది. వాటికి వ్యతిరేకంగా సమైక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం, అలాగే మరింత విస్తృతస్థాయిలో మిలిటెంట్ పోరాటాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని ఈ వార్తా కథనం మనకు తెలియజేస్తున్నది).
ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో వచ్చిన ఈ వార్తకు తెలుగు అనువాదం: డి వెంకన్న.
ముఖ్య గమనిక: బ్రాకెట్లలో ఉన్న విషయాలు ది వైర్ తెలుగు అభిప్రాయాలు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
