పరిశీలనలో ఉన్న సరుకుల ఉత్పత్తికి అవసరమైన మొత్తం(ప్రత్యక్ష, పరోక్ష) శ్రమ కాలం వాటి వినియోగం వల్ల తగ్గినప్పుడు మాత్రమే ఉత్పత్తిలో యంత్రాలను వాడడం జరుగుతుందని పైన మనం చర్చించాము. యంత్రాల వినియోగం వల్ల స్థానభ్రంశం జరిగిన(కోల్పయిన)శ్రమ కన్నా తక్కువ శ్రమనే వెచ్చించాలని దాని అర్ధం.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం లోపలే యంత్రాల వినియోగానికి మరింత అడ్డంకి ఉంది. పెట్టుబడిదారుడు కార్మికునికి అతను చేసిన శ్రమ విలువను మాత్రమే చెల్లిస్తాడు. ఈ విషయాన్ని స్పష్టం చెయ్యడానికి మరొకమారు సంఖ్యా ఉదాహరణను ఉపయోగిద్దాము.
ఒక యంత్రం నిర్మించడానికి 100 శ్రమ గంటలు పడతాయని అనుకుందాము. అదనపు విలువ రేటు 100 శాతం అనుకుందాము. అందుచేత కార్మికుడు తానూ శ్రమించిన ప్రతి గంటకూ అర్ధ గంట శ్రమ విలువను మాత్రమే పొందాడు. సరుకులు వాటి విలువ వద్దనే అమ్మబడతాయని ఊహించుకున్నందున ఈ యంత్రాన్ని కొనడానికి పెట్టుబడిదారునికి 100 శ్రమ గంటల విలువ వద్ద ధర పడుతుంది.
మరొకవైపున కార్మికులను ప్రత్యక్షంగా పనిలో పెట్టుకోవడానికి వెచ్చించిన అదేమొత్తం విలువతో పెట్టుబడిదారుడు ఉత్పత్తిలో కార్మికుల నుంచి 200 ప్రత్యక్ష శ్రమ గంటలను పొందగలడు. అందుచేత దాని వినియోగ జీవితకాలంలో 200ప్రత్యక్ష శ్రమ గంటల కన్నా ఎక్కువగా ఆదా చేస్తేనే యంత్రాలను కొనడం లాభదాయకమని పెట్టుబడిదారుడు కనుగొంటాడు. మార్క్స్ చెప్పినట్లు ‘యంత్రం విలువకూ అది భర్తీ చేసిన శ్రమ సమయం విలువకూ ఉన్న వ్యత్యాసమే పెట్టుబడిదారునికి యంత్రాన్ని వినియోగించడంలో ఉన్న పరిమితి’.
పని పరిస్థితులపై ప్రభావం/ కార్యనిర్వాహక నిబంధనలపై ప్రభావం..
ఇప్పుడు మనం కార్మికవర్గంపై యంత్రాల, ఆధునిక పరిశ్రమ ప్రభావానికి సంబంధించిన కొన్ని అంశాల వైపు దృష్టి సారిస్తున్నాము. యంత్రాల అభివృద్ధి పనిభారాన్ని తగ్గించడం, నైపుణ్య అవసరాలను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా మహిళల, పిల్లలు ఉపాధిని సాధ్యం చేస్తుంది. ఇది శ్రమ శక్తి సరఫరాను విస్తారంగా పెంచి, ప్రతి కార్మికుని వేతనాన్ని తగ్గించడానికి దారితీస్తుంది.
యంత్రాలను వాడడానికి ముందు శ్రమ శక్తి విలువకు సమానంగా పెట్టుబడిదారుడు వేతనంగా కార్మికునికి చెల్లించేది కార్మికుని, అతని కుటుంబాన్నీ పునరుత్పత్తి చేయడానికి సరిపోయేది. యంత్రాలను ఉపయోగించడంతో కార్మికుని కుటుంబం మొత్తం పెట్టుబడిదారుని కొరకు పనిచేస్తున్నది. కానీ స్త్రీలకూ, పిల్లలకూ చాలా తక్కువ వేతనం చెల్లిస్తున్నారు.
శ్రమ శక్తి సరఫరా పెరిగిన, యాంత్రీకరణ ద్వారా దాని డిమాండుకు తగిన ఫలితంగా చివరకు పురుషుల వేతనాలు కూడా తగ్గుతాయి. ఆ విధంగా వారందరూ పనిచేస్తున్నందున కార్మికుని మొత్తం కుటుంబ ఆదాయం పెరిగినా పెట్టుబడిదారుని కొరకు కార్మికుని కుటుంబం మొత్తం చేస్తున్న శ్రమతో పోల్చినప్పుడు ఈ పెరుగుదల చాలా స్వల్పం/ తక్కువ.
యంత్రాల రాకతో పెట్టుబడిదారీ వర్గం కొరకు చాలా ఎక్కువ అదనపు శ్రమ చేస్తుంది. ఆ విధంగా, కార్మికులు పెరిగిన ఉత్పాదకత, వేతన కార్మికుల సరఫరాను పెంచడం రెండింటి ద్వారా యంత్రాలు దోపిడీ స్థాయిని పెంచడానికి తోడ్పడతాయి.
చారిత్రకంగా యంత్రాలు కూడా పనిదినం పొడవు పెంచడానికి డిమాండ్లకు(తరచూ విజయవంతంగా) దారితీస్తుంది. గడిచిపోయిన ప్రతి నిమిషమూ పాతబడిపోవడం ద్వారా క్షీణించి అవి పనికిరాకుండా పోయే అవకాశం ఉన్న కారణంగా పెట్టుబడిదారుడు ఒక్క నిమిషం కూడా విలువైన యంత్రాలను వృధాగా ఉంచడానికి ఆందోళన చెందుతాడు.
యంత్రం ఉత్పాదకతను పెంచుతూనే అది మొత్తం మూలధన వ్యయంలో స్థిర మూలధనానికీ, అస్థిర మూలధనానికీ మధ్య నిష్పత్తిని కూడా పెంచుతుంది. ఇందులో ప్రాథమిక వైరుధ్యం ఉంది, పెరిగిన ఉత్పాదకతతో అదనపు విలువ పరిమాణం పెరగగా స్థిర మూలధనానికీ అస్థిర మూలధనానికీ మధ్య ఉన్న నిష్పత్తి వ్యతిరేకదిశలో పనిచేస్తుంది.
600 రూపాయలు స్థిర మూలధనంగానూ 400 రూపాయలు అస్థిర మూలధనంగానూ చేసిన మొత్తం వ్యయం 1,000 రూపాయలు 50 మంది కార్మికులను దోపిడీ చేయడాన్ని అనుమతించి ఉండవచ్చు. యంత్రంతో చేయడాన్ని అదే మొత్తం మూలధన వ్యయంతో, ఈ నిష్పత్తి 800 రూపాయలు స్థిర మూలధనంగానూ, 200 రూపాయలు అస్థిర మూలధనంగానూ మారి కేవలం 25 మంది కార్మికులను మాత్రమే దోపిడీ చేస్తుంది.
‘సాపేక్ష అదనపు విలువనే కాక స్థూల/సంపూర్ణ అదనపు విలువను పెంచటం ద్వారా, తగ్గిపోయిన దోపిడీకి గురయ్యే కార్మికుల సంఖ్యకు సంబంధించిన నష్టాన్ని భర్తీ చేయడానికి వీలుగా తెలియకుండానే అయినప్పటికీ ఈ వైరుధ్యం పని దినాన్ని అధికంగా పొడిగించడం వైపు’ పెట్టుబడిదారుడిని నెడుతుందని మార్క్స్ వాదించాడు.
శ్రమను తీవ్రతరం చేయడం..
యంత్రం, ఆధునిక పరిశ్రమలను సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి సాధనాలుగా వినియోగించడం ఆ విధంగా పనిదినాన్ని పొడిగించడం ద్వారా దాంతోపాటు సంపూర్ణ విలువను కూడా విస్తరించడానికి ఒత్తిడి తీసుకువస్తుంది. ఏమైనప్పటికీ ఇంతకు ముందు పేర్కొన్న కారణాల వల్ల వర్గ పోరాటంలో అభివృద్ధి చెందుతున్న కార్మికవర్గ సంస్థ వలననూ, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం విస్తరించిన పునరుత్పత్తిని నిశ్చయం చేయడానికి కావలసిన కార్మికవర్గాన్ని పునరుత్పత్తి చేయవలసిన అవసరం వలననూ పనిదినాన్ని పొడిగించడానికి అనివార్యమైన పరిమితులు తలెత్తుతాయి. దీనికి చారిత్రకంగా తీవ్రంగా అనుసరించిన ప్రత్యామ్నాయం శ్రమను తీవ్రతరం చేయడం. ఇది శ్రమ కొలతకు కొత్తకోణాన్ని జోడిస్తుంది.
సాధారణంగా చెప్పాలంటే సాపేక్ష ఉత్పాదకత పెరిగిన ఉత్పాదకత ద్వారా జరుగుతుంది. వ్యయం చేసిన శ్రమ నుంచి ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ మనకు మిశ్రమ ఫలితం ఉంది. ఉత్పాదకతలో పెరుగుదలను వెన్నంటి శ్రమ తీవ్రత వస్తుంది. అంటే, ఒక నిర్దిష్ట సమయంలో శ్రమ వాస్తవ వ్యయం ఎక్కువ కావడం. పెరిగిన పనితీవ్రత స్వయంగానే పనిదినాన్ని కుదించడం ద్వారానే సాధ్యమవుతుంది. కొత్త సగటు పని తీవ్రతను మించి, ఈ పని తీవ్రతను పెంచడానికి పెట్టుబడిదారీ వర్గం మళ్లీ ప్రయత్నించడంతో తక్కువ నిడివిగల పనిదినానికై ఒత్తిడి పెరుగుతుంది.
మార్క్స్ ఈ విషయాన్ని క్లుప్తంగా ఇలా వివరించాడు: పని గంటలను పొడిగించడానికి మూలధనాన్ని కోరే ధోరణి ఎప్పటికీ నిషేధించబడిందనడంలో సందేహమేమీ లేదు. దానిని భర్తీ చేయడానికి శ్రమ తీవ్రతను క్రమపద్ధతిలో పెంచడం ద్వారానూ, యంత్రాలలోని ప్రతి మెరుగుదలనూ మరింత పరిపూర్ణంగా కార్మికుని అలసటకు గురిచేసేటందుకు సాధనంగా వాడడం, శ్రమ చేసే కాలాన్ని మళ్లీ తగ్గించే పరిస్థితికి దారితీయడం అనివార్యం.
ఆధునిక పారిశ్రామిక దశలో కర్మాగారం ఉత్పత్తి కొలమానం ప్రధానరూపం అవుతుంది. కర్మాగారంలో పని నిర్వహణ ఒకవైపున సహకార, సామాజిక శ్రమ అద్భుతం. మరొక వైపున దాని పెట్టుబడిదారీ లక్షణం రీత్యా అది కార్మికుని శ్రమను సమర్ధవంతంగా దోపిడీ చేసే ఒక భయంకర పరికరం. సజీవ, నిర్జీవ శ్రమల మధ్య సంబంధం సజీవ శ్రమపై నిర్జీవ శ్రమ పూర్తి ఆధిపత్యం. తయారీ విధానంలోలా కాకుండా సజీవ శ్రమ కదలికలను ఇప్పుడు యంత్రాల కదలికలను నిర్దేశిస్తుంది, నియంత్రిస్తుంది. మార్క్స్ వివరించినట్లు, అన్ని పెట్టుబడిదారీ ఉత్పత్తులలోనూ ‘పనిముట్లను పనివాడు పనిలో పెట్టడం కాకుండా పనిముట్లే పనివాడిని పనిలో పెడుతూ ఉండగా, కర్మాగార వ్యవస్థలోనే ఈ విలోమం మొదటిసారి సాంకేతికత, స్పష్టమైన వాస్తవికతను సంతరించుకుంది’.
యంత్రాలు– పని విభజన..
యంత్రాలు శిల్పకళా నైపుణ్యాన్నీ, సామర్ధ్యాన్నీ భర్తీ చేస్తాయి. దానిఫలితంగా మొత్తం కర్మాగారంలో పనిని ఒకేలా చేసే, తక్కువ నైపుణ్యాన్ని సమానంగా చేసే ధోరణి ప్రత్యేక నైపుణ్యం గల కార్మికుల క్రమానుగత శ్రేణిని భర్తీ చేస్తున్నది. తయారీ ద్వారా ప్రారంభించబడిన నైపుణ్యం గల, నైపుణ్యం లేని కార్మికుల మధ్య వ్యత్యాసం లేకపోవడం, దాదాపు శారీరక శ్రమ చేసే కార్మికులందరినీ నైపుణ్యం లేనివారిగా చేసే ప్రక్రినుయ ఇక్కడ మరింత ముందుకు తీసుకు వెళ్ళారు. కొన్ని రకాల శారీరక, హస్తకళలు తొలగించబడుతుండగా, కొత్త రకాల నైపుణ్యం గల కార్మికులను సృష్టించే వ్యతిరేక ధోరణి అక్కడ ఉంది. మేధో, శారీరక శ్రమను మరింత వేరుచేయడంతో దీనికి సంబంధం ఉంది.
ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి అధికారిక విద్య, ఆచరణాత్మక శిక్షణ కొంత కాలం పాటు అవసరం. ఆధునిక పెట్టుబడిదారీ పరిశ్రమకు అవసరమైన ఉత్పత్తి కొరకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన్ని వర్తింపజేయడానికి ఆత్రుత పడడం శ్రామికులలో ఒక భాగానికి శాస్త్రీయ విద్యను అందించవలసిన అవసరాన్ని సూచిస్తున్నది. వేగంగా మారుతున్నా ఉత్పత్తి పద్ధతులకు సర్దుకుపోయే, వలస కార్మికుల సరఫరాకు పెట్టుబడిదారీ పరిశ్రమ అవసరాలు, కొనసాగుతున్న వర్గ పోరాటంలో కార్మికవర్గం పోరాడుతున్న లక్ష్యం కూడా సాధారణ విద్యా వ్యాప్తికి దారితీస్తాయి.
ఆ విధంగా వలస కార్మికులలో పెద్ద భాగాన్ని వారి నైపుణ్యాలను వాడుకలో లేకుండా చేయడం ద్వారా నైపుణ్యం లేని కార్మికులుగా చేస్తూనే, పెట్టుబడిదారీ ఆధునిక పరిశ్రమ కార్మికవర్గం లోపలా, కార్మికవర్గానికీ పారిశ్రామిక ఉపాధిలో నిమగ్నమైన పెటీ బూర్జువాల దొంతర మధ్య, కొత్త విభజనలను, వైరుధ్యాలను కూడా సృష్టిస్తుంది.
కార్మికుల కదలికలు దానికి లోబడి ఉండే విధంగా ఉన్న, యంత్రాల ఏకరీతి, నియంత్రిత కదలిక పరిస్థితులు, ప్రక్రియ కొనసాగింపు వగైరాలు ఉన్న ఆధునిక కర్మాగారంలోని శ్రమ ప్రక్రియకు ‘కార్మికుల కఠినమైన క్రమ శిక్షణ’ అవసరం. మార్క్స్ చెప్పిన విధంగా, ఈ పనిని కార్మికులను ఫోర్మెన్, చిన్న మైనారిటీ పర్యవేక్షకులుగానూ, దోపిడీకి గురయ్యే అధికశాతం ఆపరేటర్లు, ప్రైవేటు సైనికులు, పారిశ్రామిక సైన్యం సార్జెంట్లుగా విభజించడం ద్వారా సాధించబడుతుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 26వ భాగం, 25వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
