సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నప్పటికీ, తుపాకీ కన్నా పుస్తకమే ఎంతో శక్తివంతమైనదని భగత్ సింగ్ బలంగా నమ్మారు.
విజయవంతమైన విప్లవానికి మేధో చైతన్యమే నిజమైన, శాశ్వతమైన పునాది అని తను విశ్వసించారు.
యువతలో రాజకీయ అవగాహన లోపిస్తే, భవిష్యత్తులో అవినీతి వ్యవస్థకు వారు కేవలం మూగ ప్రేక్షకులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
సుదీర్ఘమైన, కల్లోలభరితమైన భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ‘షహీద్-ఎ-ఆజం’ భగత్ సింగ్ అనగానే, తను చేసిన వీరోచిత సాయుధ విప్లవ చర్యలే ముందుగా గుర్తుకొస్తాయి.
అయితే, తనను కేవలం ఒక సాయుధ విప్లవకారుడిగా మాత్రమే చూడటం తన అసలైన వారసత్వాన్ని పరిమితం చేయడమే అవుతుంది.
వాస్తవానికి అపారమైన సైద్ధాంతిక లోతు, విప్లవం పట్ల అంకితభావం కలగలిసిన ఒక అరుదైన ‘పండిత-విప్లవకారుడు’ భగత్ సింగ్.
ఒక విజయవంతమైన విప్లవానికి మేధో చైతన్యమే నిజమైన, శాశ్వతమైన పునాది అని తను విశ్వసించారు.
ఒక దేశ భవిష్యత్తు కేవలం యుద్ధభూముల్లోనే కాదు, తరగతి గదుల్లోనూ- ఆ విద్యాసంస్థల్లో పెంపొందే రాజకీయ చైతన్యంలోనూ రూపుదిద్దుకుంటుందనే దృఢ నిశ్చయంతో తను పనిచేశారు.
1920వ దశకంలో, భారతదేశం అత్యంత కీలకమైన చారిత్రక సంధి దశలో ఉన్న సమయంలో- భగత్ సింగ్ విద్యార్థి రాజకీయాలను ఒక వ్యాపకంగానో, అదనపు కార్యకలాపంగానో లేదా చదువుకు ఆటంకంగానో చూడలేదు.
దానికి బదులుగా, భారత సమాజ సమగ్ర పునర్నిర్మాణానికి అదొక అత్యవసరమైన పునాదిగా ఆయన భావించారు.
1928 జూలైలో ‘కీర్తి’ పత్రికలో ప్రచురితమైన తన చారిత్రాత్మక వ్యాసం “విద్యార్థులు – రాజకీయాలు”లో ఈ విప్లవాత్మక దృక్పథం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ రోజుల్లో బ్రిటిష్ వలస ప్రభుత్వం, కొంతమంది సంప్రదాయవాద భారతీయ విద్యావేత్తలు- విద్యార్థులు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కావాలని పట్టుబట్టేవారు.
భగత్ సింగ్ ఈ అభిప్రాయంతో తీవ్రంగా విభేదించారు.
వలస పాలనా యంత్రాంగాన్ని నడిపించడానికి అవసరమైన గుమస్తాలను లేదా ప్రభుత్వానికి విధేయులుగా ఉండే ఉద్యోగులను తయారు చేయడం విద్య అసలు లక్ష్యం కాదని ఆయన వాదించారు.
దీనికి విరుద్ధంగా, మాతృభూమి ఆవేదనను అర్థం చేసుకుని, దానికి కారణమైన వ్యవస్థలను కూలదోసే ధైర్యం ఉన్న చైతన్యవంతమైన పౌరులను తీర్చిదిద్దే సాధనంగా తను విద్యను చూశారు.
లాహోర్: ఉద్యమానికి మేధో కేంద్రం
భగత్ సింగ్ రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, తన ఆలోచనలకు రూపునిచ్చిన అప్పటి పరిస్థితులను పరిశీలించడం ముఖ్యం.
20వ శతాబ్దం ప్రారంభం నాటికి లాహోర్ నగరం కేవలం బ్రిటిష్ ప్రభుత్వానికి పరిపాలనా కేంద్రంగానే కాకుండా భారతదేశంలో ఎదుగుతున్న మేధో, విప్లవ చైతన్యానికి ప్రధాన కేంద్రంగా మారింది.
1921లో సహాయ నిరాకరణ ఉద్యమం ముగిసిన తరువాత, వలస పాలన ప్రభావం లేని స్వతంత్ర విద్యాసంస్థల అవసరం ఏర్పడింది.
దానికి ప్రతిస్పందనగా లాలా లజపతి రాయ్ లాహోర్లో ‘నేషనల్ కాలేజీ’ని స్థాపించారు. ఆనాటి ప్రభుత్వ విద్యాసంస్థలకు స్వదేశీ, విప్లవాత్మక ప్రత్యామ్నాయంగా ఇది ఏర్పాటైంది.
సుఖ్దేవ్, భగవతి చరణ్ వోహ్రా, ఎహసాన్ ఇలాహివంటి తన సన్నిహితులతో భగత్ సింగ్ కలిసి, సంఘటిత విద్యార్థి శక్తికి ఉన్న విప్లవాత్మక సామర్థ్యాన్ని నేషనల్ కాలేజీ ప్రాంగణంలోనే అర్థం చేసుకోవడం ప్రారంభించారు.
బ్రిటిష్ వారి నియంత్రణలో ఉన్న ప్రభుత్వ కళాశాలల పాఠ్యాంశాలకు, నేషనల్ కాలేజీలోని పాఠ్యప్రణాళికకు చాలా తేడా ఉండేది.
ఇక్కడ భారత చరిత్ర, ప్రపంచ విప్లవ ఉద్యమాలు, అర్థశాస్త్రంపై ప్రత్యేక దృష్టి సారించారు.
భగత్ సింగ్ సైద్ధాంతిక ఎదుగుదలకు, తన తదనంతర రచనలకు ఈ విద్యాభ్యాసమే బలమైన మేధోపరమైన పునాది వేసింది.
ఈ క్రమంలోనే, విద్యార్థులలో బయటపడని ఒక ప్రత్యేకమైన శక్తి దాగి ఉందని, దేశవ్యాప్తంగా నిరంతర చైతన్యాన్ని రగిలించడానికి అవసరమైన సమయం, సామర్థ్యం వారి వద్దే ఉన్నాయని తను గ్రహించారు.
ఈ శక్తిని సరైన మార్గంలో నడిపించడానికి, భగత్ సింగ్ 1926లో ‘నౌజవాన్ భారత్ సభ’ను స్థాపించారు.
ఇది కేవలం విద్యార్థులకే పరిమితం కానప్పటికీ, యువతే ఇందులో ప్రధాన భాగం.
లౌకికవాదం, శాస్త్రీయ ఆలోచనల ఆధారంగా యువతలో ఒక ప్రపంచ స్థాయి దృక్పథాన్ని పెంపొందించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం.
మతతత్వం, మూఢనమ్మకాలు భారతీయ యువత తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా అడ్డుకుంటున్న సంకెళ్లని భగత్ సింగ్ బలంగా నమ్మారు.
అందుకే, మతాన్ని పూర్తిగా వ్యక్తిగత విషయంగా పరిగణించి, ఒక ఐక్య జాతీయ శక్తిగా ఏకం కావాలని తను విద్యార్థులకు పిలుపునిచ్చారు.
స్వతంత్ర నిర్వాహకుడిగా విద్యార్థి
స్వాతంత్య్రోద్యమానికి భగత్ సింగ్ చేసిన సేవలు కేవలం రచనలు, ప్రసంగాలకే పరిమితం కాలేదు; తన గొప్ప నైపుణ్యం, దార్శనికత కలిగిన నిర్వాహకుడు కూడా.
ఒక విద్యార్థి ఉద్యమం ప్రభావవంతంగా పనిచేయాలంటే, దానికి ఒక పటిష్టమైన వ్యవస్థీకృత నిర్మాణం, స్వయంప్రతిపత్తి(స్వాతంత్ర్యం) రెండూ అవసరమని తను గుర్తించారు.
తన ఆలోచనలకు అనుగుణంగానే తన ‘ఆల్ పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
విద్యార్థి సంఘాల పట్ల తన దృక్పథం చాలా స్పష్టంగా ఉండేది. అవి ఏ రాజకీయ పార్టీకి తోక సంఘాలుగా మారకూడదని తను కోరుకున్నారు.
విద్యార్థి సంఘాలు స్వతంత్రంగా ఉండాలని, తమ సొంత మేధోపరమైన, రాజకీయ దిశానిర్దేశాన్ని తామే చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని తను విశ్వసించారు.
పంజాబ్లో అప్పటివరకు చెదురుమదురు నిరసనలుగా ఉన్న విద్యార్థి ఉద్యమం- ఒక వ్యవస్థీకృత, క్రమశిక్షణ కలిగిన విద్యార్థి సంఘంగా రూపాంతరం చెంది, దేశవ్యాప్తంగా ఒక ఆదర్శ నమూనాగా నిలిచింది.
1927లో స్థాపించిన లాహోర్ విద్యార్థి సంఘం ఈ మార్పుకు తొలి, ముఖ్యమైన ఉదాహరణ. దాని పనితీరు కేవలం చదువులకే పరిమితం కాకుండా, “స్వేచ్ఛ, సంస్కృతి, శాంతి” వంటి విస్తృతమైన ఆదర్శాలపై దృష్టి సారించింది.
1936 నాటికి, ‘ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఏఐఎస్ఎఫ్)’ ఏర్పాటుతో ఈ ప్రాంతీయ శక్తి ఒక జాతీయ ఉద్యమంగా మారింది.
భగత్ సింగ్ సమకాలికుడు, నేషనల్ కాలేజీ విద్యార్థి, ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా ఎదిగిన ప్రబోధ్ చంద్ర- 1938లో తాను రాసిన “స్టూడెంట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా” పుస్తకంలో ఆ కాలపు పరిస్థితులను వివరంగా వర్ణించారు.
విశ్వవిద్యాలయాలు ఇకపై సమాజానికి దూరంగా ఉండే ఒంటరి దీవుల్లా కాకుండా, రాజకీయ పోరాటానికి క్రియాశీల వేదికలుగా మారాయని, విద్యార్థులు సామాజిక మార్పుకు కీలక సాధనాలుగా మారాలని ఆశించినట్టు తన రచనలు స్పష్టం చేస్తున్నాయి.
సైమన్ కమిషన్ – ‘బాంబు ఆరాధన’
1928లో సైమన్ కమిషన్ రాకతో లాహోర్ విద్యార్థి ఉద్యమం అసలు బలం పరీక్షకు గురైంది. అక్టోబర్ 30న లాలా లజపతి రాయ్ నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు ఒక భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఆ సందర్భంగా జరిగిన క్రూరమైన పోలీసు లాఠీచార్జి, ఆ గాయాల కారణంగా ఆ తర్వాత లాలాజీ మరణించడం యువతను తీవ్రంగా కుదిపేసింది.
అప్పటికే రహస్య విప్లవ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్న మాజీ విద్యార్థి భగత్ సింగ్కు, ఈ సంఘటన కేవలం ఒక అణచివేత చర్యగానే కాకుండా, తీవ్రమైన జాతీయ అవమానంగా అనిపించింది.
జెఏ స్కాట్, జాన్ సాండర్స్వంటి బ్రిటిష్ అధికారుల క్రూరత్వం- వలస పాలన అణచివేత ముందు అహింసా పద్ధతులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయన్న కఠోర వాస్తవాన్ని యువతకు కళ్లకు కట్టింది. ఈ అనుభవం తరువాత, ఉద్యమం విప్లవాత్మక సోషలిజం వైపు బలంగా మళ్లింది.
సెంట్రల్ అసెంబ్లీ బాంబు దాడి, ఆ తర్వాత జరిగిన చారిత్రాత్మక విచారణ సమయంలో భగత్ సింగ్ చెప్పిన “చెవిటివారికి వినపడాలంటే పెద్ద శబ్దం చేయాలి” అనే ప్రసిద్ధ వాక్యంలో ఈ మార్పు స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
ఈ కాలాన్ని ప్రస్తావిస్తూ, లాహోర్లోని హాస్టళ్లలో అహింసా తత్వాన్ని “బాంబు సంస్కృతి” భర్తీ చేసిందని ప్రబోధ్ చంద్ర రాశారు.
దాదాపు ప్రతి విద్యార్థి గదిలోనూ భగత్ సింగ్ చిత్రాలు కనిపించేవి. దేశం బానిసత్వంలో మగ్గుతున్నప్పుడు మౌనంగా ఉండటానికి నిరాకరించిన విద్యార్థి ఉద్యమంలో ఆవిర్భవిస్తున్న ‘వర్గ చైతన్యానికి’ ఇది ప్రతీక.
సాండర్స్ హత్య తర్వాత భగత్ సింగ్, తన సహచరులు అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు- లాహోర్లోని హాస్టళ్లు, రహస్య గృహాలే వారికి ఆశ్రయం, రక్షణ కల్పించాయి.
తుపాకుల కంటే పుస్తకాలకే ప్రాధాన్యం
సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించినప్పటికీ, తుపాకీ కన్నా పుస్తకమే ఎంతో శక్తివంతమైనదని భగత్ సింగ్ బలంగా నమ్మారు.
“విద్యార్థులు – రాజకీయాలు” అనే తన వ్యాసంలో తను స్పష్టంగా ఒక హెచ్చరిక చేశారు. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చేవారు, వాస్తవానికి భవిష్యత్తులో ప్రభుత్వ అధికారాన్ని ఎన్నటికీ ప్రశ్నించని ఒక బానిస తరాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తను ఎండగట్టారు.
యువతలో రాజకీయ అవగాహన లోపించడం వల్ల, భవిష్యత్తులో అవినీతి వ్యవస్థకు వారు కేవలం మూగ ప్రేక్షకులుగా మిగిలిపోతారని తను హెచ్చరించారు.
కేవలం భావోద్వేగపూరితమైన నినాదాలకు కొట్టుకుపోవద్దని భగత్ సింగ్ విద్యార్థులకు సూచించారు. దానికి బదులుగా మార్క్సిజం, సోషలిజం, అంతర్జాతీయ రాజకీయాలను శ్రద్ధగా అధ్యయనం చేయాలని వారిని ప్రోత్సహించారు.
తన దృష్టిలో, యువత కేవలం వాక్చాతుర్యానికి తప్పుదోవ పట్టకుండా ఉండాలంటే ‘భావోద్వేగాల’ కన్నా ‘హేతుబద్ధతకే’ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం.
తన జైలులో ఉన్నప్పుడు కూడా వందలాది పుస్తకాలు చదివారన్న వాస్తవాన్ని బట్టి ఆయనకున్న మేధో నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది.
ఏ రూపంలో ఉన్న నిరంకుశత్వాన్నైనా ఎదిరించడానికి “విమర్శనాత్మక దృక్పథం, స్వతంత్ర ఆలోచన” అనేవి అత్యంత ప్రాథమికమైన, ప్రభావవంతమైన ఆయుధాలని తను గట్టిగా నమ్మారు.
భవిష్యత్తు కోసం ఒక వారసత్వం
ఈ రోజుల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు లేదా క్యాంపస్ కార్యకలాపాల గురించి చర్చ వచ్చినప్పుడల్లా సహజంగానే భగత్ సింగ్ జ్ఞాపకాలు మెదులుతాయి.
విద్యా నైపుణ్యాన్ని, సామాజిక బాధ్యతను సమతుల్యం చేయడంలో తను ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులను చదువు మానేయమని తను ఎన్నడూ కోరలేదు; ప్రపంచం పట్ల అవగాహనతో, బాధ్యతతో ఉంటూనే చదువుకోమని ప్రోత్సహించారు.
విద్యను కేవలం ఉద్యోగం కోసం కాకుండా, సమాజంలోని అత్యంత అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడే సాధనంగా మార్చడంలోనే తన వారసత్వపు నిజమైన గొప్పదనం దాగి ఉంది.
ప్రబోధ్ చంద్ర తన రచన ముగింపులో ఒక గంభీరమైన విషయాన్ని ప్రస్తావించారు. అదేమిటంటే, తన మాతృభూమి విముక్తికి దోహదపడని విద్యార్థిని రాబోయే తరాలు ‘ద్రోహి’గా ముద్రవేస్తాయి.
నేటి విద్యార్థులు కూడా అటువంటి కీలకమైన సంధి దశలోనే నిలబడి ఉన్నారు. విద్యాసంస్థల స్వయంప్రతిపత్తి కోసం జరిగే పోరాటం, ఒకరకంగా భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం జరిగే పోరాటమే.
భగత్ సింగ్ కేవలం ఒక జెండా కోసం కాదు- ప్రతి భారతీయుడు స్వేచ్ఛగా ఆలోచించడానికి, ప్రవర్తించడానికి, జీవించడానికి ఉన్న హక్కు కోసం ప్రాణాలర్పించారు.
సమాజంలో ఎదురయ్యే ప్రశ్నల నుంచి వెనుతిరగకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలనుకునే వారందరికీ తను ఒక మార్గదర్శి.
అంతిమంగా “ఇంక్విలాబ్ జిందాబాద్” అనేది కేవలం ఒక నినాదం కాదు, అది ప్రతి చైతన్యవంతమైన విద్యార్థి అంతరంగంలో ప్రతిధ్వనించే ఒక న్యాయమైన, సమానత్వ భవిష్యత్తు గురించిన స్వప్నం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
