అమెరికా-ఇజ్రాయెల్ అక్షంతో లోతైన కూటమి, ఎక్కడో ఒకచోట భారతదేశపు పటిష్టమైన బహుళ-సమతుల్య విధానాన్ని, దేశీయ స్థూల ఆర్థిక పునాదులను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.
ఇరాన్ ఘర్షణ మొదలై నాలుగు వారాలవుతున్నా, ఇది త్వరలో ముగుస్తుందనే అంచనాలు క్షేత్రస్థాయిలో వాస్తవాల కంటే ఊహాగానాల పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
యుద్ధం త్వరలోనే ముగుస్తుందని పదేపదే చెబుతున్నప్పటికీ, జరుగుతున్న పరిణామాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి.
ప్రపంచ ఇంధన, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో, ప్రస్తుత ఈ వైషమ్యం సుదీర్ఘమైన క్షీణదశ యుద్ధంగా మారుతుందనే భయాలను పెంచుతూ ఇరాన్ తన పోరాటాన్ని విస్తృతం చేస్తున్నట్టు కనబడుతోంది.
పశ్చిమాసియాతో భారతదేశపు సంబంధాలు చాలా కాలంగా ‘ఇంధన భద్రత’ అనే కోణం నుంచే మూల్యాంకనం చేయబడ్డాయి. ఆ కోణం ఇప్పుడు సరిపోదు.
సముద్రయాన అభద్రత, ప్రతీకార దాడులు, కారిడార్లకు అంతరాయాల రూపంలో గల్ఫ్ అంతటా పెరుగుతున్న ప్రస్తుత తీవ్రత ఒక లోతైన వ్యవస్థాగత వాస్తవాన్ని బయటపెట్టింది.
ఆ ప్రాంతంతో భారతదేశపు అనుసంధానం కేవలం చమురుకే పరిమితం కాలేదు, అది కనెక్టివిటీ నెట్‌వర్క్‌లు, రెమిటెన్సుల ప్రవాహం(విదేశీ చెల్లింపులు), డిజిటల్ మౌలిక సదుపాయాలు, రక్షణ సరఫరా గొలుసులతో అంతకంతకూ లోతుగా ముడిపడి ఉంది.
ఈ మార్పు చాలా ముఖ్యమైనది ఎందుకంటే, చమురు దిగుమతుల కంటే ఈ అనుసంధానాలు పైకి తక్కువగా కనిపిస్తాయి కానీ, ఇవి వ్యవస్థాగతంగా చాలా లోతుగా పాతుకుపోయాయి.
కాలక్రమేణా వేరే మార్గాల ద్వారా సర్దుబాటు చేసుకోగలిగే ముడి చమురు సరఫరా మాదిరిగా కాకుండా, ఈ నెట్‌వర్క్‌లు సంస్థాగతమైనవి, మౌలిక సదుపాయాలతో కూడినవి అంతేకాకుండా, జనాభాతో ముడిపడినవి.
కాబట్టి సంక్షోభ పరిస్థితుల్లో వీటిని ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయడం చాలా కష్టం.
ఇటీవలి గణాంకాలు ఈ ముప్పు తీవ్రతను ఎత్తి చూపుతున్నాయి.
భారతదేశంలో 806 మిలియన్ల(80.6 కోట్లు) ఇంటర్నెట్ వినియోగదారులు(55.3% చొచ్చుబాటు), ఏటా $120 బిలియన్లకు పైగా వస్తున్న రెమిటెన్సులతో, భారతదేశపు ఆర్థిక నిర్మాణం ఇప్పుడు ప్రపంచంతోనూ, ప్రత్యేకించి పశ్చిమాసియా స్థిరత్వంతోనూ లోతుగా ముడివేసుకుని ఉంది.
దీని ఫలితంగా వెనువెంటనే వచ్చే అంతరాయం కంటే, దీర్ఘకాలిక భౌగోళిక-రాజకీయ ఒత్తిడి వల్ల వ్యవస్థాగతమైన పెళుసుదనం ఏర్పడుతుంది. ఈ సంఘర్షణ ఎక్కువకాలం సాగితే, న్యూఢిల్లీపై పడే పరిణామాలు తక్షణ ప్రభావాల కంటే చాలా లోతైన నిర్మాణాత్మక ప్రభావాన్ని చూపుతాయి.
అనుసంధానం, కారిడార్ల భౌగోళిక-రాజకీయాల పెళుసుదనం
అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్(ఐఎన్ఎస్టీసీ), చాబహార్ పోర్ట్ వంటి కారిడార్లపై ఆధారపడిన భారత అనుసంధాన వ్యూహం, ఆయా భౌగోళిక మార్గాల స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. ఆ అంచనా ఇప్పుడు ఒత్తిడికి లోనవుతోంది.
2024లో ఐఎన్ఎస్టీసీ ద్వారా సరుకు రవాణా 26.9 మిలియన్ టన్నులకు చేరుకోగా, చాబహార్ పోర్ట్ ద్వారా ఇప్పటివరకు 8 మిలియన్ టన్నుల రవాణా జరిగింది(2024-25లో 2.23 మిలియన్ టన్నులు).
ఈ లెక్కలు క్రమంగా పెరుగుతున్న కార్యకలాపాలను సూచిస్తున్నాయి. కానీ యుద్ధ పరిస్థితుల్లో ఈ మార్గాల ఆర్థిక ప్రయోజనాలు క్షీణించిపోతున్నాయి.
గల్ఫ్‌లో నౌకల యుద్ధ ప్రమాద బీమా ప్రీమియంలు వాటి విలువలో 0.25% నుంచి దాదాపు 3%కి పెరిగాయి. అంటే $250 మిలియన్ల చమురు ట్యాంకరు ఒకసారి ప్రయాణించడానికి $7.5 మిలియన్లు అదనంగా ఖర్చవుతుంది.
ఇలాంటి పెంపుదల కారిడార్ల పోటీతత్వాన్ని నేరుగా దెబ్బతీస్తుంది, ఈ పెట్టుబడులకు కారణమైన తక్కువ ఖర్చు అనే ప్రయోజనాన్ని తుడిచిపెట్టేస్తుంది.

అదే సమయంలో, ప్రపంచ కనెక్టివిటీ వేగంగా విస్తరిస్తోంది. 2025 నాటికి దాదాపు 6 బిలియన్ల మంది (ప్రపంచ జనాభాలో 74%) ఆన్‌లైన్‌లోకి వస్తారని అంచనా.
భారతదేశంలో 1.12 బిలియన్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉండగా, వాటిలో 92% బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కలిగి ఉన్నాయి. అయితే ఈ విస్తరణ విరుద్ధంగా దుర్బలత్వాన్ని కూడా పెంచుతోంది.
దాదాపు 99% ఖండాంతర డేటా ప్రవాహం సముద్రగర్భ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. వీటిలో చాలా వరకు యుద్ధ ప్రమాదాలున్న సముద్ర మార్గాల గుండానే వెళ్తాయి.
కాబట్టి ఎర్ర సముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లోని అంతరాయాలు కేవలం ఓడల రవాణాకే కాదు, డేటా, డిజిటల్ వాణిజ్య ప్రవాహాలకు కూడా ప్రమాదకరమే.
ఈ కారణ సంబంధం చాలా స్పష్టం: వ్యాపార కారిడార్లు, డిజిటల్ ప్రవాహాలు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌ల ద్వారా భారతదేశం ప్రపంచంతో తన అనుసంధానాన్ని ఎంతగా పెంచుకుంటూ పోతే, అదే సమయంలో ఆ నెట్‌వర్క్‌లలో దాగి ఉన్న భౌగోళిక-రాజకీయ ప్రమాదాన్ని కూడా దేశంలోకి అంతగా దిగుమతి చేసుకుంటోంది.
విదేశీ చెల్లింపులు: కేంద్రీకృత ప్రమాదంతో కూడిన స్థిరత్వం
భారతీయులు విదేశాల నుంచి పంపించే చెల్లింపులు(రెమిటెన్సులు) దేశానికి అత్యంత స్థిరమైన బాహ్య వనరుగా కొనసాగుతున్నాయి.
2023లో అల్పాదాయ, మధ్యతరగతి దేశాలకు ఈ చెల్లింపులు $656 బిలియన్లకు చేరగా, అందులో భారతదేశ వాటా $125 బిలియన్లకు పైగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరానికి ఇది సుమారు $136 బిలియన్లకు చేరుకుంటుంది.
ఈ విదేశీ చెల్లింపులు భారతదేశ కరెంట్ అకౌంట్లో దాదాపు 10% ఫైనాన్స్ చేస్తున్నాయి. అంతేకాకుండా, వాణిజ్య లోటులో 47% మేర పూడుస్తున్నాయి.
తద్వారా దేశీయ వినియోగానికి, విదేశీ మారకద్రవ్య స్థిరత్వానికి ఇవి ఒక ముఖ్యమైన కవచంగా పనిచేస్తున్నాయి.
అయితే, స్థూల స్థాయిలో ఈ బలం భౌగోళిక కేంద్రీకృత ప్రమాదాన్ని కప్పిపుచ్చుతోంది. 2023-24లో భారతదేశపు రెమిటెన్సులలో దాదాపు 38% గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచే వచ్చాయి. ఇక్కడ 9 మిలియన్లకు పైగా(90 లక్షలు) భారతీయులు ఉపాధి పొందుతున్నారు.
ఇలా ఒకే చోట కేంద్రీకృతం కావడం నిర్మాణాత్మక దుర్బలత్వానికి దారి తీస్తుంది.
విభిన్న మార్గాల్లో వచ్చే మూలధన పెట్టుబడుల మాదిరిగా కాకుండా, రెమిటెన్సులు ఆతిథ్య దేశాల లేబర్ మార్కెట్ స్థిరత్వంపై ఆధారపడి ఉంటాయి.
ఒక సుదీర్ఘ యుద్ధం వల్ల నిర్మాణం, సేవా రంగాల్లో ఉపాధికి విఘాతం కలుగుతుంది.
ఆర్థిక మందగమనం వల్ల వేతనాలకు, గగనతల- సముద్ర మార్గాల ఆటంకాల వల్ల వారి ప్రయాణాలకు అంతరాయం కలుగుతుంది.
తాత్కాలికంగా గగనతలాలను మూసివేయడం వంటి స్వల్పకాలిక పరిణామాలు కూడా రెమిటెన్సుల ప్రవాహాన్ని ఆలస్యం చేస్తాయి.
అన్నింటికంటే ముఖ్యంగా, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే కార్మికులను తిరిగి వెనక్కి పంపించే పరిస్థితి రావచ్చు, దాంతో కాలక్రమేణా ఈ ఆదాయ ప్రవాహం తగ్గిపోతుంది.
ఖర్చులు కూడా మరొక అడ్డంకిగా ఉన్నాయి. $200 డాలర్లు పంపించడానికి ప్రపంచ సగటు ఖర్చు ఇంకా 6.4 శాతంగానే ఉంది, ఇది ఐక్యరాజ్యసమితి లక్ష్యమైన 3 శాతం కంటే చాలా ఎక్కువ.
డిజిటల్ ఛానళ్లు దీన్ని 5 శాతానికి తగ్గిస్తున్నప్పటికీ, అనధికారిక బదిలీలు(హవాలా లాంటివి) కొనసాగుతుండటం వల్ల పూర్తి ప్రయోజనం చేకూరడం లేదు.
దీని అంతరార్థం చాలా సూక్ష్మమైనది. ప్రవాస భారతీయుల బలమైన పునాది వల్ల స్వల్పకాలంలో రెమిటెన్సులు బలంగానే కొనసాగవచ్చు.
అయితే, దేశీయ కారణాల వల్ల కాకుండా, బాహ్య భౌగోళిక-రాజకీయ కేంద్రీకరణ కారణంగా వాటిలో అస్థిరత పెరుగుతోంది.
డిజిటల్ మౌలిక సదుపాయాలు: వృద్ధి, వ్యవస్థాగత సైబర్ ముప్పు
భారతదేశపు డిజిటల్ పరివర్తన అత్యంత వేగంగా సాగుతోంది. 2024లో ప్రధాన నగరాల డేటా సెంటర్ల సామర్థ్యం దాదాపు 977 మెగావాట్లకు చేరింది. 2028 నాటికి ఇది 3.29 గిగావాట్లకు చేరుతుందని అంచనా. 2023లో $4.5 బిలియన్లుగా ఉన్న ఈ మార్కెట్ 2032 నాటికి $11.6 బిలియన్లకు చేరుతుందని అంచనా.
ఈ విస్తరణకు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ముంబైలో $8.3 బిలియన్లు, హైదరాబాద్‌లో $7 బిలియన్లు), మైక్రోసాఫ్ట్ (2030 నాటికి $17.5 బిలియన్లు), గూగుల్ (దాదాపు $15 బిలియన్ల AI/డేటా మౌలిక సదుపాయాలు) వంటి దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ప్రధాన కారణం.
దీంతో పాటుగానే భారతదేశపు పబ్లిక్ డిజిటల్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించాయి.
2025లో ఒకే నెలలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా 21.6 బిలియన్ల (2,160 కోట్లు) లావాదేవీలు జరిగాయి. దీనితో అది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా మారింది.
కానీ ఈ భారీ స్థాయి వ్యవస్థాగత ముప్పును సృష్టిస్తోంది. భారతదేశంలో సైబర్ దాడుల ఘటనలు 2022లో 1.03 మిలియన్ల నుంచి 2024 నాటికి 2.27 మిలియన్లకు పెరిగాయి.
ఇది దాడులు పెరగడాన్ని, అలాగే వాటి గురించి మెరుగ్గా రిపోర్ట్ చేయడాన్ని సూచిస్తుంది.
ఇక్కడ ఈ రెంటి మధ్య ఉన్న సంబంధం యాదృచ్ఛికం కాదు, నిర్మాణాత్మకమైనది.
డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించే కొద్దీ, దాడులకు ఆస్కారం ఉన్న ఉపరితలం పెరుగుతుంది(క్లౌడ్, ఫిన్‌టెక్, పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లు), వ్యవస్థాగత ప్రమాదం(ఆర్థిక నెట్‌వర్క్‌లు, ఐడెంటిటీ సిస్టమ్స్) అధికమవుతుంది, భౌగోళిక-రాజకీయ ముప్పు లోతుగా మారుతుంది(ప్రభుత్వాల మద్దతుతో జరిగే సైబర్ ఆపరేషన్లు).
2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా సైబరు నేరాల నష్టం ఏటా $10 ట్రిలియన్లను దాటుతుందని అంచనాలు సూచిస్తున్నాయి, ఇది ఈ ముప్పు స్థాయిని స్పష్టం చేస్తోంది.
2025-26లో సైబర్ భద్రతకు భారతదేశం రూ 782 కోట్లు కేటాయించడం వంటి విధానపరమైన స్పందనలు, డిజిటల్ విస్తరణ వేగంతో పోలిస్తే చాలా తక్కువే.
మౌలిక సదుపాయాల వృద్ధికి, భద్రతా సామర్థ్యానికి మధ్య అంతరం ఇంకా కొనసాగుతూనే ఉంది.
వాస్తవానికి, భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ఒక వ్యూహాత్మక సంపద, కానీ అందులోనే ముప్పు దాగి ఉంది. ఇక్కడ ఆర్థిక లాభాలతో పాటే వ్యవస్థాగత ప్రమాదం కూడా పెరుగుతోంది.
రక్షణ సామర్థ్యం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి ఉన్న పరిమితులు
భారతదేశపు రక్షణ రంగ స్థితి కూడా ఇటువంటి నిర్మాణాత్మక ఉద్రిక్తతలనే ప్రతిబింబిస్తోంది. 2025-26 కు గానూ ₹6.81 లక్షల కోట్ల($79 బిలియన్లు) రక్షణ బడ్జెట్‌తో భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద సైనిక వ్యయం చేసే దేశంగా నిలిచింది.
అయితే, ఇందులో కేవలం ₹1.8 లక్షల కోట్లు ($20.8 బిలియన్లు) మాత్రమే మూలధన వ్యయం కోసం కేటాయించబడింది.
ఈ అసమతుల్యత ఆధునీకరణకు అడ్డంకిగా మారుతోంది.
స్వదేశీకరణ(స్వయం సమృద్ధి) ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 8.2% వాటాతో (2021-25) భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా కొనసాగుతోంది.
ఆయుధ సరఫరాదారుల విషయంలో వైవిధ్యీకరణ జరుగుతోంది. రష్యాపై ఆధారపడటం దాదాపు 70% నుంచి 40%కి పడిపోయింది.
కానీ ఇంజన్లు, ఎలక్ట్రానిక్స్, ఆధునిక ప్లాట్‌ఫారమ్‌ల వంటి కీలక వ్యవస్థల కోసం ఇంకా విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.
ఇంజిన్ సరఫరా సమస్యల వల్ల తేజస్ ఫైటర్ జెట్ల ఉత్పత్తిలో జరుగుతున్న జాప్యం, పాక్షిక స్వదేశీకరణకు ఉన్న పరిమితులను స్పష్టం చేస్తోంది.
ఇటీవలి కాలంలో జరుగుతున్న యుద్ధాలు ఈ పరిమితులను బలోపేతం చేస్తున్నాయి. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలతో పాటు ప్రాంతీయ ఘర్షణలు మూడు ప్రధాన కార్యాచరణ మార్పులను వెలుగులోకి తెచ్చాయి.
తక్కువ ఖర్చుతో కూడిన, ఎక్కువ సంఖ్యలో వాడే ఆయుధాల (డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్స్) వైపు మొగ్గుచూపడం; ఏకీకృత వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థల ప్రాముఖ్యత; సైబర్, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాల ఆవశ్యకత.
ఈ పోకడలు పటిష్టమైన పారిశ్రామిక పునాది, వేగవంతమైన ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశాలకు అనుకూలంగా ఉంటాయి. బయటి సరఫరా గొలుసులపై ఆధారపడే దేశాలకు కాదు.
“ఆత్మనిర్భర్ భారత్”, ఆయుధ కొనుగోళ్ల సంస్కరణల ద్వారా భారతదేశం విధానపరంగా ఈ లోపాలను సరిదిద్దే ప్రయత్నం ప్రారంభించింది. రక్షణ రంగ ఉత్పత్తి విస్తరించింది. 5,500 కంటే ఎక్కువ వస్తువుల దిగుమతులపై ఇప్పుడు ఆంక్షలు ఉన్నాయి. అయినా, సామర్థ్య లోపాలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి రక్షణ పరిశోధన, అభివృద్ధి(ఆర్&డీ) కోసం చైనా ఏటా వెచ్చిస్తున్న $40-45 బిలియన్ల ఖర్చుతో పోలిస్తే ఈ అంతరం స్పష్టంగా కనిపిస్తుంది.
దీని అర్థం భారతదేశానికి సామర్థ్యం లేదని కాదు, కానీ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, అది ఉద్దేశం కంటే అమలుపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని గుర్తించాలి.
పశ్చిమాసియాతో భారతదేశపు అనుసంధానాన్ని ఇప్పుడు కేవలం చమురుతో నిర్వచించలేము.
కనెక్టివిటీ, రెమిటెన్సులు, డిజిటల్ వ్యవస్థలు, రక్షణ సరఫరా గొలుసుల వంటి అనేక రంగాలలో అది లోతైన నెట్‌వర్క్‌ల ద్వారా ఆధారపడి ఉంది.
ఈ అనుసంధానాలు అభివృద్ధిని, సమైక్యతను పెంచాయి కానీ అదే సమయంలో బాహ్య దెబ్బలు/సమస్యలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు వ్యాపించే ప్రమాదాన్ని కూడా పెంచాయి.
కాబట్టి ఇక్కడి విధానపరమైన సవాలు, ఆ దేశాలతో సంబంధాలు తెంచుకోవడం కాదు.
ఈ పరస్పర ఆధారిత స్థితిలోనే ప్రమాదాలను నిర్వహించడం: అనుసంధాన మార్గాలను వైవిధ్యపరచడం, రెమిటెన్స్ కారిడార్లను విస్తృతం చేయడం, డిజిటల్ విస్తరణతో పాటే సైబర్ భద్రతను బలోపేతం చేయడం, వాస్తవిక కాలపరిమితుల్లో రక్షణ పారిశ్రామిక సామర్థ్యాన్ని వేగవంతం చేయడం.
అయితే, ప్రస్తుత ఈ సంక్షోభం నుంచి చూస్తే- నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బట్టి, అమెరికా-ఇజ్రాయెల్ అక్షంతో పెట్టుకున్న లోతైన సంబంధాలు భారతదేశపు పాత “బహుళ-సమతుల్య” విధానాన్ని దెబ్బతీశాయి.
గతంలో దేశీయ స్థూల ఆర్థిక ప్రమాదాలను, నిర్మాణాత్మక అసమతుల్యతలను చక్కగా నిర్వహించి, ఆర్థిక వ్యవస్థను లోతైన ఘాతాల నుంచి రక్షించడంలో ఆ విధానం విజయవంతమైంది.
ఇంతకుముందు జరిగిన గల్ఫ్ యుద్ధాలు భారతదేశాన్ని ప్రస్తుత సంక్షోభం స్థాయిలో ప్రభావితం చేయకపోవడానికి కారణం ఇదే.
ఇప్పుడు అమెరికన్లు, ఇజ్రాయెలీలతో ఉన్న లోతైన అనుబంధం వల్లే ఈ ముప్పు ఎదురవుతోంది.
ఈ అన్ని రంగాల్లో మధ్యస్థ-కాల వ్యవధిలో సానుకూల వృద్ధి ఉన్నప్పటికీ, వాటి స్థిరత్వంపై నమ్మకం ఏకరీతిగా లేదు.
భౌగోళిక-రాజకీయ ప్రమాదాల వల్ల ఇది మరింతగా ప్రభావితం అవుతోంది. ప్రస్తుత సంక్షోభం భారతదేశానికి కొత్త ముప్పులను సృష్టిస్తోందని చెప్పడం కంటే, ఇప్పటికే ఉన్న మన దుర్బలత్వాలను బయటపెట్టి వాటి తీవ్రతను పెంచుతోందని చెప్పడమే సబబు.
అనువాదం: దేవి
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

