నేనెందుకు చదువుతాను?
చదవకుండా ఉండలేను కాబట్టి చదువుతాను!
నేర్చుకోవడానికి, ఎదగడానికి, నవ్వడానికి, స్ఫూర్తి పొందడానికి!!
ఇంత వరకూ నాకు తెలియని విషయాల్ని
అర్ధం చేసుకోవడానికి చదువుతాను
అనాలోచితంగా ఆత్మీయుల్ని విసుక్కున్నప్పుడు చదువుతాను
మథనపడడమూ, మననం చేసుకోవడమూ చదవడమే కదా?
భయంతోనూ, నిరాశా నిస్పృహలతోనూ
ముక్కలైపోతున్నట్లుగా అనిపించినప్పుడు
శక్తి కోసం చదువుతాను
ఈ ప్రపంచం మీద అమితమైన ఆగ్రహం
కలిగినప్పుడు చదువుతాను
అంతా సజావుగా ఉన్నప్పుడు కూడా
ప్రశాంతంగా చదువుతాను-
చర్మం, ఎముకలు, చూపులు, భావాలతో మాత్రమే
కాదుగదా నేను రూపొందిందీ?
కోర్కెలతో, ధ్యేయాలతో, మాటలతో కూడా కదా
నేను రూపొందిందీ?
నా హృదయంలో దాగి ఉన్న భావాల్ని, ద్యేయాల్ని
వ్యక్తీకరించడానికి మాటలు కదా కావాలీ?
మాటలు సజీవం- నేనూ సజీవం
నేను ఉన్న చోటే మార్పు కోసం నినదిస్తాను
నేను ఉన్న చోటే పిడికిళ్లు బిగిస్తాను
నా మాటలు మాత్రం విశ్వమంతా నినదిస్తాయి
నా మాటలే విశ్వమంతా పిడికిళ్లు బిగిస్తాయి
మాటలు సజీవం- నేనూ సజీవం
జీవాన్ని జీవంతో కలపడానికి చదువుతాను!
నేను ప్రేమించే కథ ఏదైనా కనిపించినపుడు
ఒకేపాట మళ్లీమళ్లీ పాడుకుంటున్నట్టు..
ఒకే కథ మళ్లీమళ్లీ చదువుతుంటాను..
ఆ పదాలతోనే నేను, కథలోకి ప్రవేశిస్తాను
ఆ పాత్రల్లో చేరి ఊపిరి పీలుస్తాను
వాటి నిర్వేదాన్ని, నిరాశల్ని నేను అనుభవిస్తాను
అవి ఏదైనా బుద్ధి తక్కువ పని చేయబోతే,
కోపంగా అరుస్తాను.. వాటితో పాటూ నేనూ ఏడుస్తాను
కాసేపటికి వాటితో పాటే మళ్లీ నవ్వుతాను
చదవడమంటే నాకు- ఒక మంచి స్నేహితుడితో గడిపినట్టుంటుంది!
పుస్తకం- ఒక మంచి మిత్రుడు!
అయితే ఆ అనుభూతిని ఆ స్థాయిలో
అందించే పుస్తకాలు చాలా ఉండవు!
జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవాలి!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
