తెలుగు వారి మొదటి తీయని పర్వమే
యుగయుగాల ఈ ఉగాది యనగ
మనిషి తత్వమునకు మాన్యత గూర్చెడి
వేడుకలకు నెలవు, ప్రేమ కొలువు
షష్టి వత్సరములు, షడ్రుచుల్, షడ్వర్గ
శత్రువులకు గుర్తు; సాంఖ్య శాస్త్ర,
కాలచక్రములను మేలమాడెడి పర్వ
మే ఉగాది జనుల మేలు గోరు
శ్రేష్ఠ వత్సరంబు శ్రీ పరాభవ యన
పదిలముగను నడుచు బాట జూపు
మంచి చేయగ అవమానమ్ములైనను
లెక్క గొనక నుతుల కెక్క దగును
కనగ తీపి పులుపు కారము వగరుయున్
చేదు తెలుసుకొనుచు మోద మలర
ఉప్పు తగినయంత యున్ననే రుచికర
మగు ఉగాది తెలుపు నారు రుచులు
చవులు కలుగ జేయు వివిధానుభవములే
ఆరు రుచులు మనిషి తీరు తెలుపు
అన్ని రుచుల నెరిగి అడుగు ముందుకు వేయి
శ్రీ పరాభవమ్ము శ్రేయమిచ్చు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
