రష్యా, అమెరికా మధ్య ఇప్పటివరకు మిగిలి ఉన్న చివరి వ్యూహాత్మక ఆయుధ నియంత్రణ ఒప్పందం ‘‘న్యూ స్టార్ట్’’ను మరో సంవత్సరం పాటు పొడిగించాలని పుతిన్ ప్రతిపాదించారు.
అయినప్పటికీ, ట్రంప్ ఏకపక్షంగా రద్దు చేశారు. దీంతో ప్రపంచ అణ్వాయుధ పోటీ మళ్లీ మొదలవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
సోషల్ మీడియాలో ట్రంప్ రాస్తూ, “న్యూ స్టార్ట్(యునైటెడ్ స్టేట్స్కు నష్టాన్ని కలిగించిన ఒప్పందం, మిగతావన్నీ పక్కన పెడితే, తీవ్రంగా ఉల్లంఘించబడుతోంది)ను పొడిగించే బదులు, భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు కొనసాగే కొత్త, మెరుగైన, ఆధునీకరించబడిన ఒప్పందం గురించి మన అణు నిపుణులు కృషి చేయాలి” అని పేర్కొన్నారు.
రష్యా, అమెరికా మధ్య కొత్త వ్యూహాత్మక ఆయుధ నియంత్రణ ఒప్పందం చైనా భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ అభిప్రాయం.
తన మొదటి పదవీకాలంలోనే ఆయన దీని కోసం పిలుపునిచ్చినట్లు గుర్తుచేసుకున్నారు.
ఇప్పటికీ అదే అభిప్రాయంతో ట్రంప్ ఉన్నట్టు, న్యూ స్టార్ట్ గడువు ముగియడానికి ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఓ ప్రకటన చేశారు.
“విస్తారమైన ఆయుధ నిల్వలను కలిగి ఉండి, ఇంకా వాటిని పెంచుకుంటున్న చైనాను చేర్చుకోకుండా 21వ శతాబ్దంలో నిజమైన ఆయుధ నియంత్రణ అసాధ్యమని(ట్రంప్)గతంలో స్పష్టం చేశారు” అని ఆ ప్రకటన స్పష్టం చేస్తోంది.
పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ట్రంప్ న్యూస్టార్ట్ ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ప్రస్తావించి ఉండవచ్చు.
అయినప్పటికీ, “మా చైనా మిత్రుల అణు సామర్థ్యం యునైటెడ్ స్టేట్స్, రష్యాతో పోల్చలేనిది. అందువల్ల వారు ఈ అంశంపై చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడరు. దీనిని తగనిదిగా భావిస్తారు. మేము వారి వైఖరిని గౌరవిస్తాము” అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆ మరుసటి రోజు ప్రకటించారు.
ఇది కొత్త ఆయుధ నియంత్రణ విధానంలోకి చైనాను లాగాలనే అమెరికా ప్రయత్నంపై రష్యా వైఖరిని స్పష్టం చేస్తుంది.
వివిధ నివేదికలు ఏం తెలియజేస్తున్నాయంటే..
అమెరికా యుద్ధ శాఖ చైనాపై కాంగ్రెస్కు సమర్పించిన తాజా వార్షిక నివేదిక అనంతరం రూబియో ‘‘చైనా వేగంగా ఆయుధ నిల్వలను పెంచుకుంటోంది’’అని ఆందోళన వ్యక్తం చేయడంలో ఆశ్చర్యం లేదు.
యుద్ధ శాఖ నివేదిక ప్రకారం, ‘‘చైనా 2024 నాటికి 600 కంటే తక్కువ అణ్వాయుధాలను తయారు చేసింది. అంతకు ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఉత్పత్తి రేటు తక్కువగానే ఉంది. అయినప్పటికీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఎ) అణ్వాయుధ విస్తరణను పెద్ద ఎత్తున కొనసాగిస్తోంది.’’
అమెరికా యుద్ధ శాఖ అంచనా ప్రకారం, 2020లో చైనా వద్ధ అణ్వాయుధాల నిల్వ 200 కంటే తక్కువగా ఉంది.
రానున్న దశాబ్ద కాలంలో రెండింతలు కావచ్చని అంచనా వేసింది.
అయితే 2030 నాటికి 1,000కు పైగా అణ్వాయుధాలను తయారు చేసే దిశగా పీఎల్ఏ ముందుకు సాగుతోంది.
అమెరికా యుద్ధ శాఖ అంచనా వేసిన దానికి భిన్నంగా ఒక దశాబ్ద కాలంలో పీఎల్ఏ నాలుగింతలు అణ్వాయుధాలను పెంచుకుంటోంది.
ఒప్పందం నుంచి చైనా నిష్క్రమించే అవకాశం
సంవత్సరానికి 80 చొప్పున అంటే ఉత్తర కొరియా వద్ద ఉన్న మొత్తం(50) కంటే ఎక్కువగా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న మొత్తం(90) కంటే తక్కవగా ఉత్పత్తి చేస్తూ 2030 నాటికి 800 కంటే ఎక్కువ అణ్వాయుధాలను కలిగి ఉంటుందని అమెరికా యుద్ధ శాఖ భావిస్తోంది.
ఇటీవలే ముగిసిన న్యూస్టార్ట్ ఏ సమయంలోనైనా రష్యా, అమెరికాల వద్ద 1,550 కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉండకుండా కట్టడి చేసింది.
చైనా ఇదే వేగంతో తన అణ్వాయుధ ఉత్పత్తిని కొనసాగితే 2035 నాటికి ఈ సంఖ్యను చేరుకోవచ్చు.
చైనా ప్రస్తుతం 4.5 రోజులకు ఒకటి చొప్పున అణ్వాయుధాలను తయారు చేస్తుందని అమెరికా ఆరోపణ.
ఇంతకంటే వేగంగా ఉత్పత్తిని కొనసాగిస్తే 1,550 సంఖ్యను అతి త్వరలోనే చేరుకుంటుందని వారి అంచనా.
అంతేకాకుండా ప్రస్తుతం అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న ప్రాంతీయ నియంత్రణ ఒప్పందం నుంచి చైనా నిష్క్రమించే అవకాశం కూడా ఉంది.
అమెరికా వ్యూహాలు ఎలా ఉండొచ్చంటే..
చైనాకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా మరిన్ని అణ్వాయుధాలను మోహరించవచ్చు, మరిన్ని అణ్వాయుధాలను తయారు చేయవచ్చు. అణ్వాయుధాలను పెంచుకోవడంలో జపాన్, దక్షిణ కొరియాలకు సహాయపడవచ్చు.
ఎక్కువ అణ్వాయుధాలను మోహరించడానికి లేదా మరిన్ని అణ్వాయుధాలను తయారు చేయడానికి న్యూస్టార్ట్ ఒప్పందం అడ్డుగా ఉండటంతో యూఎస్ దాని నుంచి తప్పుకున్నట్టు స్పష్టమవుతోంది.
తూర్పు ఆసియా దేశాలకు అణ్వాయుధ సాంకేతికను అందించడం కంటే, తన ఆయుధాలను పెంచుకోవడానికే ట్రంప్ మొగ్గుచూపుతున్నారు.
చైనాపై అణ్వాయుధ ఆధిపత్యం కొనసాగాలంటే, అమెరికాకు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలగి, అణ్వాయుధల సంఖ్యను పెంచుకోవడం; రెండవది చైనాను ఒప్పందాల పరిధిలోకి తెచ్చి కట్టడి చేయడం.
స్వేచ్ఛానువాదం: పీ నరసింహారావు, సీనియర్ జర్నలిస్టు, పోటీ పరీక్షల నిపుణులు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
