20వ శతాబ్ది చివర్లో జరిగిన మేధో చర్చలలో వాషింగ్టన్ కన్సెన్సస్ ఒక మంత్రదండంలాగా పనిచేసింది. వాషింగ్టన్ కన్సెన్సస్లో కీలకమైనవి 10 అంశాలు.
ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థ స్థూల స్థిరత్వానికి, మార్కెట్ ఆధారిత అభివృద్ధి వ్యవహారాలకు, సంక్షోభంలో ఉన్న దేశాలను గట్టెక్కించడానికి ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ పరిష్కారంగా కనిపించింది. 1989లో జాన్ విలియంసన్ ఈ పదాన్ని ప్రతిపాదించారు.
ఇందులో భాగంగా ద్రవ్య క్రమశిక్షణ, ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతల పునఃనిర్ణయం, తక్కువ మొత్తంలో ఎక్కువ మంది దగ్గర నుంచి పన్ను వసూలు చేసేలా పన్నుల సంస్కరణలు, వడ్డీరేట్ల సరళీకరణ, పోటీతో కూడిన విదేశీ మారకం రేట్లు, విదేశీ వాణిజ్యంపై సుంకాల రేట్లు తగ్గించడం ద్వారా వాణిజ్య సరళీకరణ; దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షల సరళీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, వివిధ రంగాలలో పెట్టుబడులపై ఉన్న ఆంక్షల సడలింపు, ఆస్తి హక్కుల సంరక్షణ వంటి విధానాలు సార్వత్రిక ఆమోదాన్ని పొందాయి.
వివిధ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారానికి పశ్చిమ దేశాలు అనుసరించిన ఈ విధానాలే శాశ్వత, తిరుగులేని పరిష్కారాలని ప్రతిపాదించబడ్డాయి.
సారాంశంగా ఆంక్షల సడలింపు, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలుగా ఈ ప్రతిపాదనలు ప్రాచుర్యం పొందాయి.
మూడు దశాబ్దాల తరువాత జరుగుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రతిపాదనలకు కాలం చెల్లినట్టు కనిపిస్తోంది.
ఈ విధానాల ఆవిర్భావం – వారసత్వం
వాషింగ్టన్ కన్సెన్సస్ కేవలం సాంకేతిక పాలనా నిపుణుల చొరవతో ముందుకు వచ్చింది కాదు. దీనికి ఓ రాజకీయ నేపథ్యం ఉన్నది. చరిత్ర ఉన్నది.
దేశాలు ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో ముందుకు వచ్చింది.
ఈ సంస్కరణలతో పాటు షరతులు కూడా వెన్నంటి వచ్చాయి. ఆయా స్టేక్ హోల్డర్స్ మధ్య బేరసారాలకు తెర తీశాయి.
ఒకసారి మార్కెట్లకు రెక్కలిస్తే అవి తెచ్చిపెట్టే అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అంతో ఇంతో అందించవచ్చన్నది ఈ శక్తుల నమ్మకం.
రీగన్, థాచర్‌లు ఆయా దేశాల్లో అమలు చేసిన సర్దుబాట్లే ఈ ఏకాభిప్రాయానికి సంబంధించిన సైద్ధాంతిక భూమికగా మారాయి.
ద్రవ్య పరమైన పొదుపు చర్యలు, నియంత్రణల రద్దు, ప్రైవేటీకరణ, వాణిజ్య సరళీకరణ విధానాలు ఈ సైద్ధాంతిక భూమికగా మారాయి.
ఈ విధానాలను లోతుగా అధ్యయనం చేయకుండానే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు, వాటి ప్రాంతీయ రూపాలైన ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వివిధ దేశాల్లో 1980ల దశకంలో అమలు చేశాయి.
వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి, అనిశ్చితికి సమాధానంగానే ఆయా దేశాలు ఈ విధానాలను తలకెత్తుకున్నాయి.
విపరీత ధోరణులకు దారి తీసిన విధానాలు..
ఆర్థిక సుస్థిరతకు హామీ ఇస్తూ అమలు జరిగిన ఈ విధానాలు అంతకంతకూ ఆర్థిక వ్యవస్థలను అస్థిరత పాలు చేయటంతో పాటు అనేక విపరీత ధోరణులకు కూడా దారి తీశాయి.
1997లో బ్యాంకాక్‌లో తలెత్తిన ఆసియన్ టైగర్స్ ఆర్థిక సంక్షోభం, 2008 నాటి సబ్ ప్రైమ్ సంక్షోభం ఈ విధానాల్లోని లోపాలను బట్టబయలు చేశాయి.
1999, 2003లలో ప్రపంచ వాణిజ్య సంస్థ అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించడానికి సంబంధించి ఒక ఒప్పందానికి, ఏకాభిప్రాయానికి రాలేకపోవటం వాషింగ్టన్ ఏకాభిప్రాయంలో ఉన్న మరో లోపాన్ని బట్టబయలు చేసింది.
వర్ధమాన దేశాల, సంపన్న దేశాల వాణిజ్య ప్రయోజనాల మధ్య ఉన్న వైరమే ఈ వైఫల్యానికి కారణం. ఈ వైరుధ్యాలను డొనాల్డ్ ట్రంప్ ఎన్నడూ పరిష్కరించే ప్రయత్నం చేయలేదు.
ఈ వాషింగ్టన్ ఏకాభిప్రాయంలో అత్యంత వినాశకర కోణం ఏమిటంటే పారిశ్రామికీకరణను తిరస్కరించడం.
సంపన్న దేశాల బ్రెట్టన్ వుడ్స్ కవలలు ముందుకు తెచ్చిన ఈ వ్యూహాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ మరింత పకడ్బందీగా అమలు చేయడం ప్రారంభించింది.
వాణిజ్య సంబంధిత పెట్టుబడి విధానాలు(ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్), వాణిజ్య సంబంధిత మేధో సంపత్తి హక్కులు(ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) వంటి ఆంక్షల కారణంగా వర్ధమాన దేశాలలో స్వతంత్ర విధానాలు రూపొందించుకునే స్వేచ్ఛ, విధానపరమైన వెసులుబాటు మృగ్యమయ్యాయి.
దాంతో వర్ధమాన దేశాలు పారిశ్రామికంగా దివాలా తీశాయి.
సంస్థాగత సర్దుబాట్లు ఆర్థిక అసమానతలు..
వాషింగ్టన్ కన్సెన్సస్ ముందుకు తెచ్చిన మరొక మూఢ నమ్మకం ఏమిటంటే, మార్కెట్‌కు సంపూర్ణ స్వేచ్ఛ కల్పించడానికి ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు తొలగించాలన్నది.
మార్కెట్ వ్యవస్థలు బలహీనంగా ఉన్నచోట్ల, పటిష్టంగా లేని దేశాలలో కూడా ఇదే సూత్రాలను అమలు జరపాలని వాషింగ్టన్ బలవంతం చేసింది.
మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా పూర్తిగా ప్రయాణం చేయని ఆఫ్రికా దేశాలలో కూడా ఇవే తరహా విధానాలు అమలు జరగడం దీనికి ఉదాహరణ.
అభివృద్ధి పరుగులు తీస్తున్నంతవరకు అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరుతాయని, అందువల్ల ఆర్థిక అసమానతల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎంఎఫ్ గత కొన్ని దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ వచ్చింది.
కానీ పేద దేశాలలో అమలు జరిగిన సంస్థాగత సర్దుబాట్లు ఆర్థిక అసమానతలు నష్టదాయకమైనవి అని తేల్చాయి.
ప్రత్యేకించి కనీస మార్కెట్ ప్రమాణాల పునాదులు లేని ఆర్థిక వ్యవస్థలలో ఈ సంస్థాగత సర్దుబాట్లు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు నష్టదాయకంగా పరిణమించాయి.
వీటన్నిటికీ మించి వాషింగ్టన్ కన్సెన్సస్ రూపొందించిన విధానం కూడా వివాదాస్పదంగా మారింది.
పశ్చిమ దేశాలు ఈ సూత్రీకరణలను ఆచరణాత్మక అంశాలుగా మార్చే క్రమంలో వర్ధమాన దేశాలతో చర్చలు, సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఈ ఎజెండాను ఆయా దేశాలపై రుద్దాయి.
దీంతో వివిధ దేశాలు పొందిన అనుభవాలు సమగ్ర సమీక్షకు ప్రేరేపించాయి.
తూర్పు ఆసియా దేశాలు, పినోచెట్ నేతృత్వంలోని చిలీలో మార్కెట్లను స్వేచ్ఛగా వదిలేసే ప్రయత్నంతో పాటు రాజ్య ప్రేరేపిత పారిశ్రామిక విధానం కూడా అమల్లోకి వచ్చింది.
తూర్పు ఐరోపా దేశాలు, మాజీ సోవియట్ యూనియన్ దేశాలలో ఈ విధానాల అమలు సామాజిక ఆందోళనలకు, ఉద్యమాలకు కారణమైంది.
కోల్పోయిన విశ్వాసం
బ్రెట్టన్ వుడ్స్ కవలలు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ అమలు జరిపిన రూళ్లకర్ర సిద్ధాంతాలతో వర్ధమాన దేశాలు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యాయి.
1990ల దశకం నుంచి దక్షిణార్ధ గోళంలోని దేశాలలో జరుగుతున్న ఆందోళనలు, ప్రజా ఉద్యమాలు ఈ రూళ్లకర్ర సిద్ధాంతాల అమలుకు ఎదురైన ప్రతిస్పందనలే.
ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలకు 1970ల నుంచి వామపక్షాలు నాయకత్వం వహిస్తే, 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత తలెత్తిన ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలకు జాత్యహంకార, వలసల వ్యతిరేక శక్తులు నాయకత్వం వహించాయి.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాషింగ్టన్ కన్సెన్సస్ ముందుకు తెచ్చిన విధానాల వైఫల్యమే.
అమెరికాను మళ్ళీ అగ్రరాజ్యంగా చేద్దాం, బ్రెగ్జిట్ వంటి నినాదాలు ఈ వైఫల్యాలకు దర్పణం పడుతున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలేవీ వాషింగ్టన్ కన్సెన్సస్ ప్రతిపాదించిన సూత్రీకరణలను, విధానాలను, ప్రతిపాదనలను అమలు చేయట్లేదు.
రెండో ప్రపంచ యుద్ధానికి ముందు పారిశ్రామికీకరణ రంగంలో అద్భుత పురోగతి సాధించిన అమెరికా గానీ, జపాన్ గానీ, ఈ దేశాల్లో ప్రభుత్వ అజమాయిషీ, జోక్యంతోనే పారిశ్రామిక రంగం అభివృద్ధి అయ్యింది.
నేడు సరిగ్గా ఈ దేశాలే, తమ దేశాలు అగ్రరాజ్యాలుగా అవతరించడానికి అనుసరించిన విధానాలనే మిగిలిన దేశాలు అనుసరించకూడదని అడ్డుకుంటున్నాయి.
20వ శతాబ్దం చివరి దశాబ్దాల్లో వాషింగ్టన్ కన్సెన్సస్ పెత్తనం చేసి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం దీనికి కాలం చెల్లింది. ఇపుడు ప్రపంచం నూతన ఏకాభిప్రాయ సాధన కోసం ఎదురుచూస్తోంది. ఈ నూతన ఏకాభిప్రాయ సాధన మరింత సమ్మిళితమైనదిగానూ, వివిధ దేశాల ప్రత్యేకతలకు అనుగుణంగా ఉండేదిగానూ, వాస్తవాలకు దర్పణం పట్టేదిగానూ, బహుళ ధ్రువ, పర్యావరణ సంక్షోభం ఎదుర్కొంటున్న, డిజిటల్ రంగం విస్తరించిన కాలానికి తగ్గ విధానాలకు ఈ నూతన ఏకాభిప్రాయం వేదికగా వ్యవహరించాలి.
ఈ నూతన ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నంలో రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో అనూహ్య విజయాలు సాధించిన దక్షిణ కొరియా, తైవాన్, చైనాలు సంపన్న దేశాల సరసన చేరటానికి దారితీసిన విధానాలను, వాటి అనుభవాలను మదింపు చేయాల్సిన అవసరం ఉన్నది.
ఈ విధానాలను పునఃపరిశీలించాలన్నంత మాత్రాన 20వ శతాబ్దిలో అమలు జరిగిన విధానాలను మక్కీకి మక్కీ పునఃప్రతిష్టించాలని కాదు. వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే క్రమంలో 20వ శతాబ్దిలో అమలు జరిగిన మౌలిక సూత్రాలను స్వీకరించాలి.
విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ జోక్యం, మౌలిక రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు, బాలారిష్టాలు ఎదుర్కొంటున్న పరిశ్రమలకు రక్షణ నేటి అవసరాలు.
అదే సమయంలో డిజిటల్ ట్రేడ్, పర్యావరణ సమస్యలు, కృత్రిమ మేధ వంటి ఆధునిక పరిణామాల నేపథ్యంలో అవసరమైన విధానాలు రూపొందించేందుకు సృజనాత్మకత అవసరం.
ప్రస్తుతం రెండు ధోరణులు కనిపిస్తున్నాయి:
వాషింగ్టన్ కన్సెన్సస్ అనంతర అవగాహన రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వాల జవాబుదారీతనం, సామాజిక భద్రత, ఆదాయ పంపిణీ రాజకీయాలు ఈ అవగాహనలో కీలక అంశాలుగా ఉన్నాయి.
మరో ధోరణి చైనా ముందుకు తెస్తున్న అవగాహన. ఈ అవగాహన ప్రకారం రాజ్య ప్రేరేపిత జోక్యం, పారిశ్రామిక విధానాలు, పరిమిత రాజకీయ సరళీకరణలతో కూడిన నూతన ప్రత్యామ్నాయాన్ని చైనా ముందుకు తెస్తోంది.
20వ శతాబ్ది సరళీకరణ విజయ ప్రవాహంగా ఉంటే, 2020 దశకం నాటికి ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ యుద్ధాలతో ఈ విజయానికి గండి పడింది.
సుంకాలు ట్రంప్ నాయకత్వంలో శిక్షలుగా మారుతున్నాయి. దేశీయ రాజకీయాల్లోనే కాక అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఆత్మరక్షణ విధానాలు ఆయుధాలుగా మారుతున్నాయి. సరఫరా వలయాలన్నీ పునర్నిర్మాణం అవుతున్నాయి.
కాకపోతే మెరుగైన సేవలు అందించటానికి కాదు. రక్షణ కవచాలు మారుతున్నాయి. ఆధిపత్య సాధనాలుగా అవతరిస్తున్నాయి.
ఆర్థిక జాతీయవాదం తిరిగి వెర్రి తలలు వేయటంతో వాషింగ్టన్ ఏకాభిప్రాయానికి పునాదులుగా ఉన్న ఇచ్చిపుచ్చుకునే బేరసారాలు, సరఫరా వ్యవస్థలు సంపద సృష్టి కేంద్రాలుగా పని చేయటానికి బదులు విఫల విధానాలుగా తెరమీదకు వచ్చాయి.
ఆర్థిక జాతీయవాదం తలకెక్కిన సార్వభౌమ దేశాలు అంతర్జాతీయ వివాదాల్లో ఆత్మరక్షణకు బదులు దుందుడుకుతనానికి పెద్ద పీట వేస్తున్నాయి.
సుంకాలు, పారిశ్రామిక రాయితీలు, ఆర్థిక విధానాలను రాజకీయ సాధనాలుగా మార్చుకునే ధోరణికి ప్రతీకలుగా మారుతున్నాయి. అమెరికాకు ఉన్న వ్యూహాత్మక సానుకూలతను తిరిగి సంతరించుకునే ప్రయత్నంలో స్వల్పకాలిక నష్టాలకు ట్రంప్ సిద్ధమవుతున్నాడని వీరు విశ్వసిస్తున్నారు.
1990ల దశకంలో ఉదారవాద విధానాలు సార్వత్రిక లక్ష్యంగా ఉంటే, 2025 నాటికి మన ప్రయోజనాలు కాపాడే మార్గం ఏమిటన్నది మౌలిక ప్రశ్నగా మారింది.
తేలిపోతున్న అబద్ధాల బుడగలు
నూతన ఏకాభిప్రాయ సాధన దిశగా ప్రపంచం కదులుతోందా? ఇప్పటికిప్పుడే అవునని చెప్పలేము.
ఈ మొత్తం అనుభవంలో ముందుకు వచ్చింది ఏ ప్రభుత్వం అయినా అనుసరించే విధానాలు ఆయా దేశాల ప్రత్యేకతలకు అనుగుణంగా ఉండాలన్న వాస్తవికత.
ద్రవ్య జవాబుదారీ విధానాలు ఎంత అవసరమో, నిర్దిష్ట లక్ష్యాల సాధనకు ప్రభుత్వ పెట్టుబడులు కూడా అంతే అవసరం అన్నది వర్తమాన విధాన ప్రాధాన్యతల్లో వాస్తవిక దృక్పథంగా మారింది.
వనరుల వినియోగంలో మార్కెట్ల సామర్థ్యం అమోఘమైనది.
కాకపోతే మార్కెట్లు కూడా నిర్దిష్ట విధాన చట్రాల పరిధిలో నడుచుకోవాలి. వాణిజ్యం వృద్ధి కారకమే కానీ, దేశ రక్షణ సవాళ్లు ఎదుర్కొంటున్నపుడు వ్యూహాత్మకంగా అంతర్జాతీయ వాణిజ్యం నుంచి ఓ దేశం తనను తాను విడగొట్టుకోవచ్చు. రాజకీయ ప్రాధాన్యతలు సుంకాలను సమర్థిస్తాయి.
సరళీకరణ, ప్రైవేటీకరణ, నియంత్రణల రద్దు అనే సూత్ర త్రయం పరిధిలో ఉన్న అనేక విధానపరమైన కోణాలను ఆయా ప్రభుత్వాలు ఆయా అవసరాల నేపథ్యంలో ముందుకు తెచ్చాయి.
ఈ గందరగోళ ప్రపంచంలో సుదీర్ఘ కాలం కఠోర శ్రమ చేయకుండా విజయాల వైపు నడిపించే విధానాలను రూపుదిద్దలేము. అటువంటి విధానాలు దేశాల సామర్థ్యాలు, ప్రపంచ రాజకీయాలు విధించే పరిమితులు, రాజకీయ వాస్తవికతకు లోబడి ఉంటాయి.
ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు చరమాంకానికి చేరాయని అర్థం కాదు. ఈ సూత్ర త్రయం అనుసరిస్తే ఏ దేశ అవసరాలైనా ఇట్టే తీరిపోతాయన్న భ్రమలకు కాలం చెల్లింది. అభివృద్ధి చెందాలన్నది ప్రతి దేశానికీ ఉండే ఆదర్శం, లక్ష్యం. కానీ అన్ని దేశాలు ఇప్పటి వరకూ అమలు చేస్తూ వచ్చిన విధాన గందరగోళం నుండి బయటపడి, ఆయా దేశాలు తమ ప్రాధాన్యతలు, అవసరాలకు తగ్గట్టు విధానాలు ఎంచుకోవాల్సిన తరుణంలోకి ప్రవేశిస్తున్నాము.
అనువాదం: కొండూరు వీరయ్య
ది వైర్ తెలుగు పాఠకులకు ఈ వ్యాసాన్ని ది హిందూ సౌజన్యంతో అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
