ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం కొవ్వు కలిసిందంటూ రాష్ట్ర రాజకీయాల్లో రగిల్చిన మతోన్మాదపు చిచ్చు, పదహారు నెలల తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దాఖలు చేసిన ఛార్జిషీటుతో చల్లారిపోవాల్సింది.
ఎందుకంటే, ఆ నివేదిక మతపరమైన భ్రమలన్నింటినీ పటాపంచలు చేస్తూ అత్యంత సాధారణమైన, కానీ భారీ లాభాలు ఆర్జించిన ఒక ఆర్థిక నేరాన్ని బయటపెట్టింది.
అక్కడ వాడింది జంతువుల కొవ్వు కాదు; కంటికి కనిపించని “వర్చువల్” డెయిరీలు, షెల్ కంపెనీలు, హవాలా లావాదేవీలు, రాజకీయ నాయకులకు వంతపాడే బ్యూరోక్రాట్లు, ల్యాబ్ పరీక్షలను కళ్లుగప్పేందుకు పామాయిల్‌కు ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్లను కలిపి సృష్టించిన కృత్రిమ రసాయన మిశ్రమం- ఇదీ వాస్తవం.
తన ఆరోపణల వెనుక ఉన్న పునాదిని ఫోరెన్సిక్ ఆధారాలతో సహా సిట్ నివేదిక కుప్పకూల్చిన తర్వాత, అనుభవజ్ఞుడైన ఒక పాలకుడు వ్యవస్థాగత సంస్కరణల వైపు అడుగులు వేస్తాడని ఎవరైనా ఆశిస్తారు.
కానీ దానికి భిన్నంగా, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి “మహాపాపం” అంటూ తన మతపరమైన వాక్చాతుర్యాన్ని మరింత పెంచారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా ఆముక్తమాల్యదను ఉటంకిస్తూ, దేవుడి ఆస్తిని దుర్వినియోగం చేస్తే జరిగే అనర్థాల గురించి హెచ్చరించారు.
కనీసం పైకి అయినా లౌకిక, ప్రాంతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ(టీడీపీ), తన సొంత దర్యాప్తు సంస్థలు వాస్తవాలను నిర్ధారించిన తర్వాత కూడా, ఈ మతతత్వ వివాదాన్ని ఎందుకు సజీవంగా ఉంచాలనుకుంటోంది?
ఈ ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే, అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఆస్తిపాస్తులున్న ప్రాదేశిక పెత్తందారీ వర్గాలకు ‘సత్యం’ పట్ల ఏమాత్రం గౌరవం ఉంటుందనే అమాయకపు నమ్మకాన్ని ముందుగా మనం వదిలించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని పాలక వర్గాలకు, సిట్ నివేదికలోని అంశాలు చర్యలు తీసుకోవాల్సిన వాస్తవాలు కావు; సైద్ధాంతికంగా పక్కదారి పట్టించాల్సిన ఒక పాలనాపరమైన అసౌకర్యం మాత్రమే.
“గొడ్డు మాంసం” అనే కట్టుకథను పదే పదే ప్రచారం చేయడం వెనుక చాలా లోతైన వ్యవస్థాగత, రాజకీయ అవసరం ఉంది.
ఇది నయా ఉదారవాద దోపిడీకి, పాలక వర్గాల అంతర్గత కుమ్ములాటలకు, రాజ్యం క్రమంగా ఫాసిస్టీకరణ చెందుతున్న విధానానికి కచ్చితమైన కూడలిలో పనిచేస్తోంది.
నయా ఉదారవాద పొగతెర
కల్తీ లడ్డూ వివాదం ప్రాథమిక ఉద్దేశ్యం- ప్రజల దృష్టిని మళ్లించే ఒక ఆయుధంగా పనిచేయడమే. నిజానికి సిట్ ఛార్జిషీటు, చంద్రబాబు నాయుడు ఎంతగానో ఆరాధించే ప్రైవేటీకరించిన ప్రొక్యూర్మెంట్, “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”, కాంట్రాక్ట్ వ్యవస్థల “సామర్థ్యం” అనే నమూనాపై మోపబడిన వ్యవస్థాగత అభియోగం.
కేవలం కూరగాయల నూనెలు, రసాయనాలతో జరిగిన స్కామ్ ప్రజల్లో సహజమైన విరక్తిని మాత్రమే కలిగిస్తుంది.
ఎందుకంటే ప్రైవేటు దోపిడీకి రాజ్యం కేవలం ఒక ఫెసిలిటేటర్‌గా పనిచేసే వ్యవస్థలో ఇది చాలా సాధారణమైన వ్యవహారం.
దీనికి ఒక అవినీతి విచారణ సరిపోతుంది. కానీ ‘గొడ్డు మాంసం’ అనే ప్రచారంలో ఒక అద్భుతమైన సైద్ధాంతిక రసవాదం దాగి ఉంది.
ఇది ఒక సాధారణ ఆర్థిక నేరాన్ని ఏకంగా ఒక ‘నాగరికతా ముప్పు’ స్థాయికి తీసుకెళ్లి, పవిత్ర యుద్ధానికి ఆహ్వానం పలుకుతుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న బహిరంగమైన, భారీ ‘ప్రాథమిక మూలధన సంచయనం’ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ పొగతెర అత్యవసరం.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడింది ప్రజాస్వామ్య పునరుద్ధరణ పట్ల ఉన్న ఆకస్మిక ప్రేమతో కాదు; వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా నమూనా పట్ల ఆస్తిపాస్తులున్న వర్గాల్లో ఏర్పడిన సామూహిక భయంతో.
జగన్ అమలు చేసిన సంక్షేమ విధానాలు అవినీతిమయమైనవి, ఆశ్రిత పక్షపాతంతో కూడినవి, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉద్దేశించినవి అనడంలో సందేహం లేదు.
కానీ, అందులో రాష్ట్ర వనరులు కొంతవరకైనా అట్టడుగు వర్గాలకు పంపిణీ అయ్యాయి.
సాంప్రదాయ వ్యవసాయ-వాణిజ్య వర్గాలకు, వారి భావజాలానికి ప్రాతినిధ్యం వహించే కార్పొరేట్ మీడియాకు, మూలధనానికి అందాల్సిన మిగులు కిందిస్థాయికి మళ్లించబడటం ఏమాత్రం సహించలేని విషయం.
జగన్ “ఖజానాను ఖాళీ చేస్తున్నారని”, ఆంధ్రప్రదేశ్‌ను “శ్రీలంక”లా మారుస్తున్నారని సృష్టించబడిన ప్రచారం పూర్తిగా కల్పితమైనది.
మనుషుల మనుగడ కంటే మూలధన సంచయనానికే పెద్దపీట వేసే వ్యవస్థను తిరిగి తీసుకురావడాన్ని చట్టబద్దం చేయడానికే ఈ ప్రచారాన్ని వాడుకున్నారు.
నేడు “వికసిత్ ఆంధ్ర”, టెక్నాలజీ పాలన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ప్రజా సంపదను నిర్దాక్షిణ్యంగా బదిలీ చేసే ప్రక్రియ సాగుతోంది.
LIFT 4.0 విధానం కింద టాప్-టైర్ ఐటీ కంపెనీలకు అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం, పోటీ సమాఖ్యవాదం పేరుతో సాగుతున్న ఈ దోపిడీకి పరాకాష్ట.
ఖర్చులు, నష్టాలను(భూమి, నీరు, వనరులు) ప్రజల పరం చేస్తూ, లాభాలను మాత్రం తనకు ఇష్టమైన కాంట్రాక్టర్-కార్పొరేట్ కూటమికి కట్టబెట్టే చంద్రబాబు క్లాసిక్ మోడల్ ఇది.
మరోవైపు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడపడానికి డబ్బు లేదని చెబుతూ వాటి ప్రైవేటీకరణను ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయడానికి నిధులు లేవని చేతులెత్తేస్తోంది.
మూలధన వ్యయం, ప్రాధాన్యత అంతా అమరావతి చుట్టూనే కేంద్రీకృతమైంది. కానీ ఆశ్చర్యకరంగా, అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు మాత్రం 1700 కోట్ల రూపాయలు మంత్రదండం వేసినట్లు పుట్టుకొస్తాయి.
తన బంధువులకు చెందిన గీతం ప్రైవేటు విశ్వవిద్యాలయానికి విశాఖపట్నంలో 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేయడానికి ప్రయత్నించడం మరో ఉదాహరణ.
నయా ఉదారవాద వాగ్దానాలకు, అట్టడుగు వర్గాల దుర్భర వాస్తవాలకు మధ్య అంతరం వేగంగా పెరుగుతున్నప్పుడు; పాలనాపరమైన వైఫల్యాలు ప్రాణాలను బలిగొంటున్నప్పుడు(2026 జనవరిలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట లాంటివి), పాలక వర్గాలకు ప్రజలను ఎప్పుడూ ఒక భావోద్వేగ స్థితిలో ఉంచాల్సిన అవసరం ఉంటుంది.
‘అపవిత్రమైన దేవుడు’ అనే భూతం ప్రజల నుంచి ప్రశ్నించని విధేయతను డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగం, సంక్షేమ పథకాల కోత లాంటి సహేతుకమైన ప్రశ్నలను ఇది అణిచివేస్తుంది.
చరిత్రను చెరిపివేయడం – ‘నాగరికతా పరాయివాడు’
ఈ “జంతువుల కొవ్వు” ప్రచారం వెనుక ఉన్న రెండవ ప్రధాన ఉద్దేశ్యం, అవినీతికి ఉన్న వ్యవస్థాగత కొనసాగింపును కప్పిపుచ్చడం.
దర్యాప్తులో సిట్ వెలికితీసిన ఒక అత్యంత అసౌకర్యమైన వాస్తవం ఏమిటంటే, భోలే బాబా కార్టెల్ టీటీడీ సరఫరా వ్యవస్థలోకి చొరబడింది 2019 ఫిబ్రవరిలోనే.
అంటే, అది కచ్చితంగా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది.
సిట్ నివేదికను పూర్తిగా అంగీకరించడమంటే, టీటీడీ వ్యవస్థాగత రక్షణలు ఈ రెండు ప్రభుత్వాల హయాంలోనూ పూర్తిగా విఫలమయ్యాయని ఒప్పుకోవడమే.
కాంట్రాక్టర్-బ్యూరోక్రాట్ కూటమికి రాజకీయ పక్షపాతం ఉండదు; వారు టీడీపీ పసుపు జెండాల కింద ఎంత అద్భుతంగా వ్యాపారం చేస్తారో, వైసీపీ ఫ్యాన్ గుర్తు కింద కూడా అంతే అద్భుతంగా చేస్తారు.
కానీ, జనం మనసుల్లో “హిందూ వ్యతిరేకి”గా ముద్రపడిన జగన్ ప్రభుత్వానికి ఈ “గొడ్డు మాంసం” వ్యవహారాన్ని ఆపాదించడం ద్వారా, చంద్రబాబు తన సొంత ప్రభుత్వ చారిత్రక వైఫల్యాన్ని అత్యంత చాకచక్యంగా సమాధి చేస్తున్నారు.
అంతేకాదు, ఈ ఆరోపణ కేవలం ప్రసాదం పవిత్రతకు సంబంధించినది కాదు; అది తన రాజకీయ ప్రత్యర్థి మతపరమైన గుర్తింపును లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన ఒక సూక్ష్మమైన అస్త్రం.
ఆధిపత్య కులాలు తమ బంధుప్రీతి నెట్‌వర్క్‌ల ద్వారా వనరులను గుత్తాధిపత్యం చేసే ఆంధ్రప్రదేశ్‌లో, ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే కేవలం అతని అవినీతిని ఎత్తిచూపితే సరిపోదు.
ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాలు అవినీతిమయమేనని ఓటర్లకు తెలుసు. అందుకే, వైసీపీ కేవలం ఒక దోపిడీ ముఠా మాత్రమే కాదని, సనాతన ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడానికి వచ్చిన ఒక ‘నాగరికతా పరాయివాడి'(ఒక క్రిస్టియన్) నాయకత్వంలోని ముఠా అని చిత్రించడానికి ఈ “గొడ్డు మాంసం” ప్రచారాన్ని వాడుకుంటున్నారు.
ఇది సవర్ణ, ఎగువ మధ్యతరగతి వర్గాల్లోని మతపరమైన పక్షపాతాలను సమర్థవంతంగా రెచ్చగొడుతుంది.
‘కృత్రిమ రసాయనాలు’ అనే సైంటిఫిక్ వాస్తవాన్ని అంగీకరిస్తే, ఈ శక్తివంతమైన మతపరమైన ఆయుధాన్ని చేజార్చుకున్నట్లే.
కాపు సామాజిక సమీకరణ – హిందుత్వ ప్రైవేటీకరణ
తన మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న మెజారిటేరియన్ (ఆధిక్య మతతత్వ) పులి మీద స్వారీ చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. రిజర్వేషన్లు, రాష్ట్ర అధికారంలో వాటా కోరుతూ, ఉగ్రమైన సమీకరణల చరిత్ర కలిగిన, స్థానికంగా ఆధిపత్యం చలాయించే అభివృద్ధి చెందుతున్న కాపు సామాజిక వర్గానికి జనసేన పార్టీ ఒక రాజకీయ వాహనంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రకంగా నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన బీజేపీ, తమ సామాజిక ఇంజనీరింగ్‌ను అమలు చేయడానికి ఒక స్థిరమైన, కేంద్రీకృతమైన ఓటు బ్యాంకు కోసం వెతుకుతోంది.
స్థానిక భౌతిక ఆధిపత్యం రాజ్యమేలే మన ఎన్నికల వ్యవస్థలో కాపులు వారికి అద్భుతమైన అవకాశంగా కనిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన, కానీ ఎన్నికల పరంగా అద్భుతమైన సామాజిక ఇంజనీరింగ్‌కు తెరతీశారు.
కాపుల స్థానిక సామాజిక ఆధిపత్యాన్ని, జాతీయ స్థాయి హిందుత్వ భావజాలంతో మమేకం చేయడం, హిందూ ధర్మ రక్షకుడిగా కాషాయ వస్త్రాలు ధరించి, “సనాతన ధర్మ రక్షణ బోర్డు” ఏర్పాటును డిమాండ్ చేయడం ద్వారా కళ్యాణ్ రాజకీయ కేంద్రాన్ని మార్చేస్తున్నారు.
ఇక్కడ ఒక చారిత్రక వ్యంగ్యం ఏమిటంటే, ఈ బోర్డు డిమాండ్ 1987 నాటి హిందూ దేవాదాయ చట్టం ప్రజాస్వామిక, లౌకిక స్ఫూర్తిని ధ్వంసం చేయడమే.
వంశపారంపర్య ధర్మకర్తల వ్యవస్థను రద్దు చేసి, ఆలయ బోర్డుల్లో ఎస్సీ/ఎస్టీలకు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించిన ఆ చట్టాన్ని తెచ్చింది స్వయంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కావడం గమనార్హం.
చంద్రబాబు తన మిత్రపక్షాన్ని చూసి భయపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న సహజ సామాజిక పునాది, తన సొంత పునాదితో ప్రమాదకరమైన స్థాయిలో కలుస్తోందని ఆయన గ్రహించారు.
“జంతువుల కొవ్వు” వాక్చాతుర్యాన్ని వదిలిపెట్టి శాస్త్రీయ వాస్తవాన్ని అంగీకరిస్తే, తాను హిందూ ధర్మ రక్షణలో ‘మెతక’ వైఖరితో ఉన్నాననే ముద్ర పడి, జనసేన ఆ సైద్ధాంతిక స్థలాన్ని ఆక్రమిస్తుందని ఆయన భయం. అందుకే, బీజేపీ-జనసేన వేగంగా ఆక్రమిస్తున్న భావజాల స్థానాన్ని ముందస్తుగా కైవసం చేసుకోవడానికి బాబు ‘పోటీ మతతత్వానికి’ పాల్పడుతున్నారు.
సామ్రాజ్యవాద గొడుగు – ‘సాఫ్ట్ హిందుత్వ’ చారిత్రక తప్పిదం
ఈ స్థానిక రాజకీయ సమీకరణలన్నింటికీ పైన, దేశ రాజధానిలోని సామ్రాజ్యవాద కేంద్రంపై ప్రాంతీయ బూర్జువా వర్గానికి ఉన్న నిర్మాణాత్మక ఆధారపడటం ఉంది.
కమ్మ పెత్తందారీ వర్గం దేశవ్యాప్తంగా సాగిస్తున్న తమ వ్యాపార సామ్రాజ్యాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్రాథమిక మూలధన సంచయనం నిరాటంకంగా కొనసాగాలంటే మోదీ ప్రభుత్వ ఆశీస్సులు తప్పనిసరి.
ముఖ్యంగా, చంద్రబాబు అమరావతి స్వప్నం అది ఒక పరిపాలనా రాజధానిగా కంటే- వ్యవసాయ, కాంట్రాక్టర్ల మిగులును కరిగించే ఒక బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా పనిచేస్తుంది -పూర్తిగా కేంద్ర ప్రభుత్వ భారీ ఆర్థిక సహాయం పైనే ఆధారపడి ఉంది.
ఆయన బీజేపీని దూరం చేసుకోలేరు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో మతతత్వ మంటలను రగులుస్తూ ఉంచడం బీజేపీ జాతీయ అజెండాతో సరిగ్గా సరిపోలుతుంది.
ఇది ఒక రకంగా ఢిల్లీ దర్బార్‌కు చంద్రబాబు చెల్లిస్తున్న సైద్ధాంతిక కప్పం.
కానీ, ఈ ‘సాఫ్ట్ హిందుత్వ’ వ్యూహం చారిత్రకంగా ఒక ప్రాణాంతక తప్పిదం.
“హిందూ గుర్తింపు మాత్రమే ప్రాథమిక రాజకీయ విభజన రేఖ అని, అది ఎప్పుడూ ముప్పులో ఉందనే” ఆర్ఎస్ఎస్/బీజేపీ కేంద్ర భావజాలాన్ని చట్టబద్ధం చేయడం ద్వారా, చంద్రబాబు స్వయంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ, లౌకిక రాజకీయాలకు సమాధి కడుతున్నారు.
మితవాదాన్ని సంతృప్తి పరచడానికి మధ్యవాద లేదా ప్రాంతీయ పార్టీలు మతతత్వ కార్డును ప్రయోగించిన ప్రతిసారీ, ప్రజలు చివరికి ఆ భావజాలానికి అసలైన వారసులనే ఎన్నుకుంటారు తప్ప, అవకాశవాద అనుకరితులను కాదని చరిత్ర నిరూపించింది.
అధికారం, కాంట్రాక్టులు, స్థానిక అవినీతి వాటాల కోసం టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య అనివార్యంగా ఘర్షణలు తలెత్తుతాయి(ఇది ఇప్పటికే జిల్లాల్లో కనిపిస్తోంది).
అప్పుడు, కేంద్రం నుంచి వచ్చే నిధులకు, “హిందూ” విజయాలకు బీజేపీ, జనసేన క్రెడిట్ తీసుకుంటాయి.
అదే సమయంలో, జనవరి నాటి తిరుపతి తొక్కిసలాటలాంటి పాలనాపరమైన వైఫల్యాలను, శాంతిభద్రతల క్షీణతను ప్రభుత్వంలో పెద్దన్నగా ఉన్న టీడీపీ ఖాతాలో జమచేస్తాయి.
రాజకీయ వాతావరణం మారి, పొత్తును తెంచుకునే సమయం ఆసన్నమైనప్పుడు, సంఘ్ పరివార్ కచ్చితంగా చంద్రబాబును పక్కనపెడుతుంది.
రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిపై ప్రేమ ఉన్నట్టు నటించిన “నకిలీ హిందువు”గా ఆయన్ను ముద్రవేసి, తామే ధర్మానికి నిజమైన రక్షకులుగా వారు తెరపైకి వస్తారు.
చివరికి “జంతువుల కొవ్వు” అనే కట్టుకథను టీడీపీ వదిలిపెట్టకపోవడం పాలకవర్గ రాజకీయాల్లోని ఒక విషాద పరిహాసం.
అధికారాన్ని దక్కించుకునే క్రమంలో, ఈ ప్రాంతీయ పెత్తందారీ వర్గం శాస్త్రీయ వాస్తవాలను, చారిత్రక వారసత్వాలను, సామాజిక సామరస్యాన్ని బలిపెట్టడానికి ఏమాత్రం వెనుకాడదని ఇది నిరూపిస్తోంది. కానీ, తమ తక్షణ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి రాష్ట్రంలోకి మెజారిటేరియనిజం అనే భూతాన్ని ఆహ్వానించడం ద్వారా, వారు తమను తామే భవిష్యత్తులో మింగేసే ఒక రాక్షసుడిని పెంచి పోషిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
