ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల అనంతరం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు- క్రమంగా భారతదేశ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. చాలా నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆలస్యమవుతుండగా, వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేశారు. మున్ముందు ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో పూణే నగరంలోని 22 గ్యాస్ దహనవాటికలను మున్సిపల్ కార్పొరేషన్ తాత్కాలికంగా మూసివేసింది.
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగిన తర్వాత, పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధ వాతావరణం ఇప్పుడు నేరుగా భారత ఇంధన రంగంపై పడుతోంది.
అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వంటగ్యాస్(ఎల్పీజీ) లభ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది.
పలు మీడియా కథనాల ప్రకారం, గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం, చమురు సంస్థలు ఆంక్షలు విధించాయి.
దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నగరాల్లో ఎల్పీజీ కొరత: బుకింగ్ తర్వాత సుదీర్ఘ నిరీక్షణ
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ముంబైలో ఇప్పటికే వంట గ్యాస్ కొరత మొదలైంది. సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత కనీసం రెండు నుంచి ఎనిమిది రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
సోమవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో గ్యాస్ దొరకదేమోనన్న ఆందోళనతో జనం ఒక్కసారిగా బుకింగ్‌లు చేయడం పెరిగింది.
మరోవైపు, ఇళ్లలో ఇప్పటికే రెండు సిలిండర్లు ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్తగా బుక్ చేసుకునేందుకు ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారని ఆ కథనం పేర్కొంది.
డీలర్లు చెబుతున్న సమాచారం మేరకు, వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారాలు తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.
కొన్ని వాణిజ్య సంస్థలు బ్లాక్ మార్కెట్లో గృహ వినియోగ సిలిండర్లను కొనుగోలు చేసే అవకాశాలు లేకపోలేదని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరమని కొందరు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్‌లో వాణిజ్య ఎల్పీజీ సరఫరా నిలిపివేత..
ది ట్రిబ్యూన్ కథనం ప్రకారం, పశ్చిమాసియాలో పరిస్థితులు చేయిదాటుతుండటం, ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు(ఓఎంసీలు) కీలక నిర్ణయం తీసుకున్నాయి.
పంజాబ్‌లో గృహావసరాలకు మినహా మిగతా అన్ని రకాల(నాన్-ఎక్సెంప్టెడ్) ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను తక్షణమే నిలిపివేశాయి.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, 19 కిలోల వాణిజ్య సిలిండర్, 47.5 కిలోల సిలిండర్, 425 కిలోల జంబో సిలిండర్ల కొత్త సరఫరా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిచిపోనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 33 కోట్ల గృహ వినియోగదారులకు వంట గ్యాస్ నిరంతరాయంగా అందేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పైగా, గ్యాస్ సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు సిలిండర్ల బుకింగ్‌పై కొన్ని పరిమితులను సైతం విధించారు.
బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆఫ్‌లైన్ బుకింగ్‌లను స్వీకరించవద్దని చమురు సంస్థలు ఏజెన్సీలను ఆదేశించాయి.
ప్రతి డెలివరీకి ఓటీపీ ధృవీకరణను తప్పనిసరి చేశాయి.
అలాగే, వినియోగదారులకు బయోమెట్రిక్ లేదా డిజిటల్ కేవైసీ విధానాన్ని కూడా పూర్తి చేయడం తప్పనిసరి చేశారు.
పూణేలో గ్యాస్ ఆధారిత దహనవాటికల మూసివేత..
ఈ ఇంధన సంక్షోభం ప్రభావం కేవలం ఇళ్ల వంటశాలలు, వ్యాపార సంస్థలకే పరిమితం కాలేదు. పూణేలోని అతిపెద్ద దహనవాటికలలో ఒకటైన ‘వైకుంఠ ధామ్’లో గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు డెక్కన్ హెరాల్డ్ వెల్లడించింది.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మార్చి 5న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో ఇళ్ల వంటగ్యాస్(ప్రొపేన్, బ్యూటేన్) సరఫరాకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పూణే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు.
దీంతో గృహేతర అవసరాలకు గ్యాస్ లభ్యత బాగా తగ్గిపోయింది.
సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వైకుంఠ ధామ్‌లో రోజుకు సగటున 20కి పైగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి.
ప్రస్తుతం గ్యాస్ ఆధారిత ఫర్నేసులను మూసివేసినప్పటికీ, విద్యుత్, కట్టెలతో కాల్చే సంప్రదాయ దహనవాటికలు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి.
రిపబ్లిక్ న్యూస్ కథనం ప్రకారం, భవిష్యత్తులో ఎల్పీజీ కొరత మరింత తీవ్రం కావచ్చన్న ఉద్దేశ్యంతో పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఏకంగా నగరంలోని 22 గ్యాస్ ఆధారిత దహనవాటికలను తాత్కాలికంగా మూసివేసింది.
అయితే ఎలక్ట్రిక్, సంప్రదాయ దహనవాటికల్లో సేవలు కొనసాగుతున్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం- నగరంలో మొత్తం 22 గ్యాస్ దహనవాటికలు, 12 విద్యుత్ దహనవాటికలు, ఒక హైబ్రిడ్ కేంద్రం ఉన్నాయి.
వీటితో పాటు 149 సాంప్రదాయ దహన సంస్కార స్థలాలు ఉండగా, వాటిలో 33 చోట్ల కాలుష్య నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
ప్రపంచ ఇంధన సంక్షోభం భయాలు..
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను కుదిపేస్తున్నాయి. సరఫరాలో అవాంతరాలు ఏర్పడటం, చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.
ఫిబ్రవరి 28న ఇరాన్ సైనిక స్థావరాలు, అగ్ర నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ఈ తాజా యుద్ధం మొదలైంది.
అప్పటి నుంచి ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదే ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
వాస్తవానికి, దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే భరోసా ఇచ్చింది.
అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు, ఆంక్షలు అమలువుతుండటంతో పలు ప్రాంతాల్లో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
పశ్చిమాసియాలో ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, భారతదేశంతో సహా అనేక దేశాలు ఇంధన సరఫరాతో పాటు ధరల పెరుగుదల విషయంలో మరిన్ని కఠిన సవాళ్లను ఎదుర్కోక తప్పదని నిపుణులు భావిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
