“బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా.. హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బెస్టురా..” ఈ పాట చరణాలు మూడు దశాబ్దాల కింద తెలుగు సమాజంలో సంచలన చర్చకు తెర తీశాయి. 1990లనాటికి తెలుగు సినిమా నడవడి వేరేగా ఉన్నది. శివ సినిమా అనంతరం చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సినిమా ఆ నాటి తరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటికీ నాలుగు దశాబ్దాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం బలంగా నిర్మితమై ఉన్న కాలమది.
అదే సమయంలో విడుదలైన అంకుశం సినిమా రాజకీయ వ్యవస్థను, నాయకుల వ్యవహారశైలిని చర్నాకోలాతో చర్రుమని చరిచింది. ఈ సినిమా హిట్టయ్యింది. రామిరెడ్డిని హిరో రాజశేఖర్ పరిగెత్తిస్తూ కొట్టిన దృశ్యమే సినిమాకు హైలెటయ్యింది. అందులోని సాహిత్యమూ రాజకీయవ్యవస్థను నిలేసి రెండు చెంపలను వాయించింది. కానీ, నాటి యువతరాన్ని పట్టి ఊపిన సినిమా “శివ”. ఆనాటికున్న విలువలను ఈ సినిమా ధ్వంసం చేసిందని చాలామంది అన్నారు. అయినా సినిమాను ఆదరించేవారు ఆదరించారు. సినిమా వల్ల వర్మకు పేరొచ్చింది, నిర్మాతకు డబ్బులూ వచ్చాయి.
కీలకమైన మార్పులు వస్తోన్న కాలం..
ప్రభుత్వాలు ఏడాదికోసారి మారడం ఆనవాయితీగా ఉన్న కాలమది. రౌడీలూ, గుండాలే సామాజికవ్యవస్థలో చక్రం తిప్పుతున్న ఒకానొక సన్నివేశం. ఆనాటికి బీసీ రిజర్వేషన్ల చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. దళిత, బహుజన ఉద్యమాలు తమ ఉనికిని బలంగా వినిపిస్తోన్న నేపథ్యమది. వామపక్ష ఉద్యమాలు సమస్యలపై పోరాడుతున్న కాలమూ అదే. సినిమాలో అసభ్య సాహిత్యంపైన, పాత్రల సంభాషణలపైనా నిరసనలు వ్యక్తమైన కాలం కూడా అదే.
ఇదంతా మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దూసుకురావడానికి ద్వారాలు తెరుస్తోన్న సమయం. ప్రపంచ మార్పుల ప్రభావాలు మెల్లమెల్లగా భారతదేశంపై ప్రసరిస్తున్న కాలం. బహుళధృవ ప్రపంచం నుంచి ఏకధృవ ప్రపంచం వైపు ద్వారాలు తెరుచుకుంటున్న సందర్భమూ అదే. సరిగ్గా ఇదే సమయంలో ఈ రెండు సినిమాలు తెలుగు సినీ తెరపై సంచలనాలు నమోదు చేశాయి.
ముద్ర వేసిన అంశం..
శివ సినిమాలో ఉన్న రౌడీజం, సామాజిక బాధ్యతారాహిత్యాన్ని నాటి పౌర సమాజం తీవ్ర అభ్యత్రం చెప్పింది. అంకుశం సినిమాను చూసి వదిలేసింది. శివ సినిమా అందులో సైకిల్ చైను సీన్ తెలుగునాట కోట్లాది మంది మస్తిష్కాలలో ముద్ర వేసుకున్న ఒకానొక అంశం. ఈ సినిమా ఈ మధ్యే మళ్లీ రిలీజ్ అయ్యింది.
తొంభైలో ఉన్నంత ఊపు ఈ సినిమాకు ప్రస్తుతం రాలేదు. అంకుశం సినిమాను మించిన రాజకీయ వ్యంగ్యాత్మక చిత్రంగా కూడా రాలేదు. ఈ రెండు సందర్భాలు, ఈ రెండు సినిమాలు తెలుగువారు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకు?
శివ సినిమాను మించిన జీవిత విధ్వంస దృశ్యాలు జనం రోజూ చూస్తూనే ఉన్నారు. అంకుశంలాంటి నిజజీవితా సంఘర్షణలు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టే వీటి గురించి కొత్తగా ఆలోచించి చర్చించే తీరికా, ఓపికా ప్రజలకు లేదు. అంతేకాదు, వీటి లోతుపాతులను విశ్లేషించే సామాజిక చలనశీల ఉత్ప్రేక శక్తులు లేవూ. కేవలం మూడు దశాబ్దాల కాలం తెలుగునాట వచ్చిన మార్పిది.
నాటికి నేటికున్న తేడా..
1940 నుంచి 1980ల వరకు నాటి సినిమా సామాజిక జీవనమూ సమాంతరంగా సాగినట్టుగా కనిపిస్తాయి. 1929- 30లో వచ్చిన మాలపిల్ల మొదలు 1979లో వచ్చిన ప్రెసెడింట్ పేరమ్మ వరకు చాలా సామాజిక సమస్యలను, సాంస్కృతిక అంశాలను నాటి తెలుగు సినిమా ఒడిసిపట్టుకున్నది. నేటి మాదిరిగా సోషల్ మీడియా ప్రభంజన ప్రభావం నాటి తరంపై లేదు. రాజకీయాలు నేటి మాదిరిగా అత్యంత ఖరీదైనవిగా లేవు. ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలనే పదబంధాలూ ఆనాడు లేవు. కథనే హీరో. సమాజ సమస్యనే సినిమా కథ. కాబట్టే, నేడున్నంతగా తిరోగమన ప్రభావాన్ని నాటి సినిమా సమాజంపై చూపించలేదు.
కాలంతో పాటు మనమూ మారాలి, అన్నీ మారుతున్నాయి. మారకుంటే ఎలా? ఇలాంటి రొడ్డకొట్టుడూ డైలాగ్లు ఇప్పుడు పదేపదే వినిపిస్తున్నాయి. నాడైనా నేడైనా వ్యాపారమే సినిమా అంతిమ లక్ష్యం. కానీ, బాధ్యత, సమాజం పట్ల గౌరవం, స్త్రీల పట్ల మర్యాద రాజకీయాలలోనూ, సినిమాలలో నాడు కనిపించేది. నేడు ఈ రెండూ లేవు. బహుశా అందువల్లే కావచ్చు. శివ సినిమా రీరిలిజ్ సంచలనానికి తావులేని చడీచప్పుడూ కాకుండా సైకిల్ చైన్ తెగిపోయింది.
మార్పు ప్రకృతి ధర్మం..
తోలుబొమ్మలాటలూ, భజనలూ, భక్తి గీతాలు ఇవే సమాజ చైతన్య మాత్రలు. కొన్ని సందర్భాలలో నర్మగర్భంగా, మరికొన్ని సందర్భాల్లో సూటిగా సమాజాన్ని ప్రశ్నించే వేదికలుగా కూడా అవుండేవి. సినిమా మాధ్యమం ప్రభలంగా ఆవిర్భవించినంతరం ప్రేక్షకుల అభిరుచులను, ఆలోచనలను ఇది ప్రభావితం చేసింది. ఓటీటీలు వచ్చిన తర్వాత పఠనమూ, పరిశీలన, విశ్లేషణ, బాగా కొరవడింది.
ఈ నేపథ్యంలోనే కొన్నికొన్ని సినిమాలు ఆధునిక సమాజాన్ని తట్టి లేపుతున్నాయి. కొన్ని సినిమాలు హృదయాన్ని ఊపి లేపుతున్నాయి. అందులో జైభీం, తాజాగా విడుదలైన బైసన్లాంటి సినిమాలు ఆధునిక సమాజం ఆలోచనలకు కొత్త తొవ్వను చూపిస్తున్నాయి.
శివ సినిమా, అంకుశం సినిమా కథలు జీవితంలో రొటీన్ అవ్వడం వల్ల పట్టింపు లేదు. కానీ, ఇన్ని అననుకూలతల మధ్య ఈ తరం సినిమా సరికొత్త దిశగా సామాజిక చైతన్యపు వారధిగా ముందుకు సాగుతున్నది. మార్పు అనివార్యం, మార్పు నిరంతంర. ఇది ప్రకృతి ధర్మం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
