లాభాల రేటు క్షీణించే ధోరణి సూత్రాన్ని, లాభాల రేటు తగ్గడానికి కారణభూతమైన ఇతర శక్తుల నుంచి తప్పక వేరు చేసి చూడాలని మనం ఇంతకుముందు గుర్తించాము. ప్రత్యేకించి, సంచిత రేటు గణనీయంగా పెరగడం ద్వారా వేతనాల తాత్కాలిక పెరుగుదల, లాభాల రేటులో అటువంటి(తాత్కాలిక) క్షీణతకు ఒక ముఖ్యమైన వనరు. పెట్టుబడి మొదటి సంపుటిలో ఈ అంశాన్ని కొంత సుదీర్ఘంగా మార్క్స్ పరిశీలిస్తాడు.
కొన్ని( ప్రత్యేక) పరిస్థితులలో “సంచిత స్థాయి అకస్మాత్తుగా విస్తరించబడుతుంది. కార్మికుల డిమాండు సరఫరాను మించి ఉండవచ్చు, అందువల్ల వేతనాలు పెరగవచ్చు” అని మార్క్స్ చెప్తాడు. కానీ ఇది లాభాల రేటు క్షీణతకు దారితీసినా అటువంటి క్షీణత తాత్కాలిక దృగ్విషయమౌతుంది. లాభదాయకతకు ముప్పు వచ్చిన వెంటనే పెట్టుబడి పోగుబడడం మందగిస్తుంది. ఇంకా ఎక్కువగా, అధికవేతనాలను ఎదుర్కొంటున్న పెట్టుబడిదారుడు, యాంత్రీకరణను, ఇతర శ్రమ తగ్గించే పరికరాలను ఆశ్రయిస్తాడు. ఈ రెండు పరిణామాలూ వేతనాలను తగ్గించడానికి, లాభాల రేటును పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి.
“పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ యంత్రాంగాలు తాత్కాలికంగా సృష్టించిన చాలా అడ్డంకులను తొలగిస్తాయి. మూలధన స్వీయ- విస్తరణ అవసరాలకు అనుగుణమైన స్థాయికి శ్రమ ధర మళ్ళీ పడిపోతుంది.” మార్క్సు ఇక్కడ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన మూల సూత్రం లేదా ధోరణితో కాక, స్పష్టంగా స్వల్పకాలంతో వ్యవహరిస్తున్నాడు. అతని చర్చ భావం, ఈ ప్రక్రియ(లాభాల రేటులో తాత్కాలిక క్షీణత) స్వీయ దిద్దుబాటు చర్యే కాక దానిని త్వరితంగా చేస్తుందని సూచిస్తున్నది.
వేతనాల పెరుగుదలతో ముడిపడి ఉన్న లాభాల రేటు క్షీణించడం క్షణికావేశంలో అధిక సంచిత(మూలధనం పోగుబడే) రేటు ద్వారా తీసుకువచ్చిన స్వల్పకాలిక వ్యాపార చక్రం; పెరుగుదల దశ ముగింపును తెలియజేస్తుందే కానీ పెట్టుబడిదారీ విధాన ఆర్ధిక సంక్షోభానికి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించదు. మూలధన సహజ కూర్పులో పెరుగుదల కారణంగా వచ్చిన లాభాల రేటు తగ్గే ధోరణి, కార్మిక ఉత్పాదకత పెరుగుదల ద్వారా తగినంతగా భర్తీ కాదనేది పూర్తిగా వేరే విషయం. ఉత్పత్తి శక్తుల అభివృద్ధిలో పెట్టుబడిదారీ క్రమంలో స్వాభావికంగా ఉన్న ప్రాథమిక వైరుధ్యాన్ని అటువంటి క్షీణించే ధోరణి వ్యక్తపరుస్తుంది.
ఐహిక క్షీణత..
లాభాల రేటు పడిపోయే ధోరణిని సూచించే ఈ సూత్రం ఎలా పనిచేస్తుంది? లాభాల రేటు “ఐహిక క్షీణతగా” చాలా మంది దీనిని వివరించారు. అంటే, లాభాల రేటు ఒక చారిత్రక కాలంలో క్రమేణా క్రమంగా, నిరంతరం క్షీణిస్తుందని చెప్పడం. అటువంటి వివరణ ఆధారంగా, తగినంత కాలం పాటు మూలధనంపై లాభాల రేటును వివిధ(పాయింట్ల వద్ద) సందర్భాలలో లెక్కించడం ద్వారా ఈ సూత్రాన్ని నిరూపించడానికి లేదా ఖండించడానికి అనుభవపూర్వకంగా ప్రయత్నాలు జరిగాయి. ఆ సూత్ర వివరణ ప్రామాణికతను లేదా ఇతర విషయాలను అటుంచి, వ్యాపార సంబంధ డేటా నుంచి మార్క్సిస్టు భావనకు ఏదో కొంత దగ్గరగా మొత్తం సామాజిక మూలధనంపై సగటు లాభాలను లెక్కించడంలో ఉన్న ప్రమాదాలు చాలా ఉన్నాయి.
ఈ వాస్తవం అటువంటి ప్రయత్నంలో ఫలితాలను ఆ సూత్రానికి రుజువనో మరో విధంగానో వెల్లడించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. అయినప్పటికీ, మరింత ముఖ్యంగా ఆ వ్యాఖ్యానం కూడా ప్రశ్నార్ధకంగా కనిపిస్తున్నది. అ సూత్రంపై మార్క్స్ చర్చను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే లాభాల రేటు క్షీణించే ధోరణి నియమిత కాలంలో సంభవించే ఆర్ధిక సంక్షోభాల ద్వారా తనను తాను వ్యక్తపరుస్తుంది. అంతేకాకుండా, క్రమంగా తిరగబడుతుంది. ఈ క్రింది విధంగా సుమారుగా వివరించవచ్చునని ఆ చిత్రం తనకు తానుగా సూచిస్తున్నది.
దీర్ఘకాలిక పెట్టుబడిదారీ విస్తరణ ప్రక్రియ కొంత కాలం పురోగతిలో ఉంటే యాంత్రీకరణ ద్వారా ఉత్పాదక శక్తులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంటే సహజ మూలధన కూర్పు పెరుగుతున్నది. కొత్త, ‘ముమ్మర మూలధనం అవసరమయ్యే’ ఈ ప్రక్రియకు అవసరమైన పెట్టుబడులను కనీసం ఈ మూడు కారణాలవలన పెట్టుబడిదారులు పెడుతున్నారు.
(i) పెట్టుబడిదారీ పోటీకి ఇది అవసరం; (ii) ప్రారంభంలో అధికంగా అందుబాటులో ఉన్న అదనపు కార్మికుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోవడంతో వేతనాలు పెరగడం ప్రారంభమౌతుంది; (iii) అదనపు విలువను గ్రహించే పరిస్థితులు – అంటే ఉత్పత్తి చేసిన సరుకులను వాటి ఉత్పత్తి ధరల వద్ద లేదా కొంచెం దగ్గరగా అమ్మడానికి పరిస్థితులు – అనుకూలంగా ఉండడం, అలాగే కొనసాగుతుందని పెట్టుబడిదారీ వర్గం భావించడం.
కానీ, పైన పేర్కొన్న శక్తుల కారణంగా పెట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడులు ముందుగానో లేదా తరువాతో కార్మికుల ఉత్పాదకతలో సంపూర్ణ పెరుగుదలను ఇవ్వవు. తుదకు పెట్టుబడిదారీ విధానంలో చేసిన సాంకేతిక మార్పులు సామాజిక ప్రయోజన ప్రణాళికలో చేసినవి కాదు. కానీ, అసమాన పెట్టుబడిదారులు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు. అందువలన, సామాజిక శ్రమ ఉత్పాదకత మొత్తం పెరుగుదల, సాంకేతిక మార్పులను తీసుకురావడానికి ఖర్చు చేసిన పెట్టుబడులకు లాభదాయకంగా ఉంటుందని ఎటువంటి హామీ లేదు. దీనికి విరుద్ధంగా, పైన పేర్కొన్న విధంగా, దీర్ఘకాలిక పెట్టుబడిదారీ విస్తరణ దశలో ఉత్పాదకత పెరుగుదల తగినంతగా లేని కారణంగా సాధారణంగా లాభం రేటు పడిపోయే సందర్భం ఒకటి వస్తుంది.
ఈ లాభాల రేటులో క్షీణతే కొత్త పెట్టుబడులు రావడాన్ని తగ్గించడానికి, ఇప్పటికే పెట్టిన పెట్టుబడులకు కొంత నష్టం రావడానికి దారితీస్తుంది. మార్క్స్ ఎత్తి చూపినట్లు పెట్టుబడి దారులమధ్య పోటీ తీవ్రమౌతుంది.
“అన్నీ బాగా సాగుతున్నంతకాలం పెట్టుబడిదారీ వర్గ సోదరభావ వ్యాప్తిపై పోటీ ప్రభావం చూపుతుంది. తద్వారా ప్రతి పెట్టుబడిదారుడూ తన పెట్టుబడి పరిమాణానికి తగిన నిష్పత్తిలో ఉమ్మడి దోపిడీలో తన వాటా పొందుతాడు. కానీ అది ఇకపై లాభాలు పంచుకునే ప్రశ్నే కానప్పుడు, నష్టాలూ పంచుకోవలసి వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరూ తన వాటా నష్టాన్ని కనిష్టానికి తగ్గించుకోడానికి, మరొకరిపై దానిని తోసివేయడానికి ప్రయత్నిస్తారు.”
ఈ వివాదం ఎలా పరిష్కరించడం జరిగింది?
సాధారణ పెట్టుబడిదారీ వ్యాపార పరిస్థితులను(అంటే తగినంత లాభాల రేటును) ఎలా పునరుద్ధరించారు? సంక్షోభం ప్రారంభమవడంతో సాధారణ స్థితిని పునరుద్ధరించే అనేక పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడు ఉనికిలో ఉన్న అనేక సంస్థలు మూతపడతాయి, తద్వారా సామాజిక మూలధనంలో కొంత భాగం పనిచేయడం మానేస్తుంది. నిష్క్రియా మూలధనం దాని విలువను కోల్పోతుంది, పాక్షికంగా అరుగుదల ద్వారా, కానీ ఎక్కువగా పని లేకుండా ఉండి లాభం ఇవ్వలేని స్థితిలో ఉంటుంది. పెట్టుబడి భౌతికమైన ఉత్పత్తి సాధనం కాని పెట్టుబడి, కేవలం భవిష్యత్తులో లాభాలను కోరే రూపం(ఊహించిన ఉత్పత్తి మొదలైన వాటిపై ప్రోనోటు) సాధారణ లాభాల రేటు (అందువలన ఆశించిన లాభం రేటు) పడిపోగానే దాని విలువలో చాలా భాగం కోల్పోతుంది.
ధరలు తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, చాలా సందర్భాలలో అసాధారణంగా తగ్గిపోతాయి. తద్వారా సమాజంలోని వస్తువుల మూలధనం విలువ మొత్తంగా కూడా క్షీణిస్తుంది. ‘వస్తువుల ధర తగ్గుముఖం పట్టడంతో స్థిర, చలామణిలో ఉన్న మూలధన మూల విలువ క్షీణిస్తుంది. సంక్షోభం ప్రారంభమైనందున సాధారణ ధర సంబంధాలకు భంగం కలిగి, మూల ధన పునరుత్పత్తి ప్రక్రియతో జోక్యం చేసుకుంటుంది, నిలిపివేస్తుంది. వారు విక్రయించే వస్తువుల ధరల క్షీణత కారణంగా పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని తిరిగి పొందలేకపోతున్న పెట్టుబడిదారులు, మునుపటి మాదిరిగా అదేస్థాయిలో తమ పెట్టుబడులను స్పష్టంగా ఉత్పత్తి సాధనాలుగా తిరిగి మార్చలేరు.
ఇంకా వివిధ ఉత్పత్తి సాధనాలలో ఇమిడిఉన్న వారి ప్రస్తుత మూలధనం కూడా పెద్ద మొత్తంలో తన విలువను కోల్పోతుంది. చాలా మంది పెట్టుబడిదారులు తమ అప్పులను తిరిగి చెల్లించలేకపోవడంతో వరుస దివాలాలు చోటుచేసుకుంటాయి. రుణ వ్యవస్థ కుప్ప కూలుతుంది. ఇంతలో, మూలధన విలువలు క్షీణించడం, దివాలా అలలు లక్షలాది మంది కార్మికులను పని నుంచి తొలగించదానికి దారితీస్తాయి.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 59వ భాగం, 58వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
