దుర్గా, కాళీ రెండూ ఒక విశాల కథనంలో పాత్రాలు. సామాన్య మానవులు ఆ కథనంలో తమ కోసం ఒక చోటు కోరుకుంటారు. పూజ అనేది ఆ కథలో ప్రవేశించేందుకు సాధనం.
సప్తమి గడిచిన తర్వాత కొన్నిరోజులకు తన పుట్టిల్లును విడిచి భర్త శివుని దగ్గరకు దుర్గాదేవి వెళ్లిపోతుంది. మహాలయ అమావాస్య నుంచి షష్టిదాకా కూతురు పుట్టింటికి వచ్చిన ఆనందంతో రోజులు నిండిపోతాయి. ఆ తర్వాత ఆమె తప్పనిసరిగా వెళ్లిపోతుందనే దానిని ఎదుర్కొనే మనోనిబ్బరాన్ని పోగేసుకోవడం మొదలుపెట్టాలి.
నా వరకు నాకు నా బాల్య జ్ఞాపకాల నుంచి దుర్గాపూజ విడదీయలేనిది. నేను చిన్నగున్నప్పుడు మా అమ్మ స్నానం చేసి చండీ జపంలో కూర్చునేది. దశాబ్దాలుగా ఈ సమయాల్లో పేజీలు తిప్పి నలిగిన పేజీల “దుర్గాసప్తసతి” పాత ప్రతి ఎప్పుడూ ఆమె ముందుండేది. ఆమె కన్నులు మూసి పఠనం చేసేది. ఆమె మొఖమంతా భక్తితో నిండి ఉండేది. ఆమె స్తోత్రంలో మునిగి కూర్చున్నప్పుడు, స్నానం చేసిన ఆమె ఒత్తైన జుట్టులో నీటి బిందువులు మెరిసేవి. ఈ కాలంలో దేవుడితో ఆమె ఏ వ్యక్తిగత సంభాషణలు జరిపేదో మనకు తెలియదు. సివాన్‌లోని మా ఇంటిలో ఒక మూల ఈ సన్నివేశం జరిగేది. ఈ క్రతువు కోసం మేము ఎప్పుడూ ఎర్రమందారాలను తెచ్చేవాళ్లం.
ఆ తర్వాతి కాలంలో చంఢీగఢ్లోని మా పెద్దన్న, ఆయన భార్య ఇల్లు వైశాల్యం పెరిగినప్పుడు, మా అమ్మ దేవీదేవతలకు కూడా స్థలం దొరికింది. వాళ్లు సొంతిల్లు కట్టుకున్నాక, తన జీవిత చరమాంకంలో తను కొలిచే దేవతలకు ఒక మొత్తం గదిని కేటాయించారు. అమ్మ దేవతాగణం పెరుగుతూ పోయింది. అఖిల దేవతా కుటుంబం పెరుగుతూనే ఉంటుందని మేము అమ్మను ఆటపట్టించేవాళ్లం. చాలా రోజుల తర్వాత, చివరికి రాముడికి కూడా దేవతలగదిలో చోటు దొరికింది. దుర్గాదేవే కేంద్ర దేవతగా ఉండేది. అన్ని సంవత్సరాలు అమ్మ పఠనం కొనసాగింది. ఇంటి వాతావరణాన్ని అగరవత్తుల సువాసన మార్చేసేది. జీవితపు సాధారణత్వాన్ని అది పవిత్రంగా పునీతం చేసేది
సివాన్‌లో ఉత్సవాలు గొప్పగా జరిగేవి. కానీ మా దృష్టిలో దియోఘర్ పూజల్లో ఎప్పుడూ ఏదో ప్రత్యేకత ఉందనిపించేది. సెలవుల్లో తరుచుగా మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినప్పుడు, మేము ఒక పందిరి నుంచి మరో పందిరికి తిరుగుతూ ప్రతిదానిలోనూ దేవతలను పోల్చి చూసేవాళ్లం. ప్రతి దుర్గాదేవి ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉండేది. ప్రతి మొఖం ప్రత్యేకభావాన్ని ప్రకటించేది.
ఆమె మహిశాసురమర్దిని. మహిషుడిని నిర్మూలించింది. కానీ దానికంటే కూడా మేము ఆమెను మేన బిడ్డ ఉమగానే చూసేవాళ్లం, దియోఘర్ పందిళ్లల్లో కొంతమంది స్తోత్రం ధరించే వాళ్లు. మొదటి రోజు నుంచి ప్రారంభించే వాళ్లు. అష్టమి నవముల్లో వాళ్లు ధరించేటప్పుడు వాళ్ల కళ్ల నుంచి కన్నీళ్లు రాలడం చూసి మేము ఆశ్యర్యపోయేవాళ్లం. బిడ్డ దుర్గాదేవి దేవత దుర్గమ్మ భర్తయింటికి తిరగివెళ్లి పోతుందనే ఆలోచనే అంతగా కదలించేది. మా చిన్నప్పుడు మాకది చాల కుతూహలాన్ని రేకెత్తించేది. ఆ తర్వాతకాలంలో లొంగుబాటు గురించి, మతవిశ్వాసాల రూపాంతరీకరణ గురించి ఆలోచించే సందర్భంగా మారింది.
“అమ్మ” ఎప్పుడూ ఈ పందిళ్లలోకి వెళ్లేది. డోలు చప్పుళ్లు, అగరువత్తుల సుగంధం, దూపం చిమ్మెలు పట్టుకుని జనం లయగా జరిగే నృత్యాన్ని కలిసి శరీరాన్ని జలదరిపంచేసేవి. అమ్మకు తనను ఒంటరిని చేసే ఆరాధన సరిపోదు, సామూహికంగా కూడా చేయటం అవసరం. అయినాగాని దుర్గా పూజ కేవలం ప్రార్థనలు పూజలే కాదు. అది నృత్యం, గానం, నాటకం జనం ఒకచోట చేరడానికి సంబంధించిన ఉత్సవం. అది అనుబంధాలని పునురుద్ధరించుకునే కాలం.
దుర్గాదేవి శక్తి స్వరూపం. కాబట్టి బలి జరగాలి. బలిదానం చేయకుండా నవమి ఎట్లా ముగుస్తుంది? మా దుర్గాదేవి శాఖాహారి కాదు. అయినా కానీ, ఈ బలి క్రతువును ఎన్నడూ ఒక హింసగా చూడలేదు.
పూజ అనేది ఒక ఏకాంతత్త్వం ఒక సామూహికత్వపు అల్లిక. అందులో మన అల్పత్వం గురించి అవగాహనను, అదేసమయంలో దుర్గాదేవిలో సంబంధపు ఔనత్యాన్ని తెలుసుకోవడం- ఈ రెండింటి మధ్య వైరుధ్యం లేదు. పదిరోజులూ ఉండే పవిత్రత, వైభవాలకు ఒక లయ అవసరం. కనుకనే దశమినాడు దుర్గాదేవిని నిమజ్జనం చేసే మేము ఇంటికి తిరిగి వచ్చాక ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. లయ ఏదో తప్పినట్టు ఉంటుంది. అగరవత్తుల వాసన వెలసిపోతుంటే ఆ పదిరోజుల మార్గదర్శకత కరిగిపోతుంది.
బహుశా ఈ నిష్క్రమణ ఆకస్మికం కాకుండా ఉండటం కోసమే దశమి నుంచి కాళీ పూజ దాకా ఒక ప్రయాణం సృష్టించబడింది. కాళీ భీతి గొల్పుతుంది. కానీ, ఆమె కూడా ఎప్పుడూ హింసకు తల్లికాదు.
దుర్గా, కాళి ఒక సుదీర్ఘ కథనంలో పాత్రలు. ఆ కథనంలో సాధారణ మానవులు తమ కోసం చోటు వెతుక్కుంటారు. ఆ కథలో ప్రవేశించడానికి పూజ ఒక సాధనం. తమ అల్పత్వాలను అధిగమించడానికి అయోగ్యతల నుంచి స్వేచ్ఛ పొందడానికి ఒక పెద్దశక్తిని ఊహించుకోవడానికి ఇవన్నీ మన మానవజాతి లక్షణాలు కావా? తనకంటే గొప్పదానితో సంబంధంతోనే మానవత్వం తయారయ్యింది. దీనికి నమ్రతకావాలి. ఉత్కృష్టతను భరించడానికి మనల్ని సిద్ధం చేసేది ఈ నమ్రతే.
ఢిల్లీలో సప్తమి ప్రొద్దున్నే నేను ఆలోచిస్తూ కూర్చున్నాను. మహాలయ అమావాస్య వేకువజామునే నిండిపోయే ఆ ఖంగుమనే మంత్రోచ్ఛారణ విని సంవత్సరాలయ్యింది. ఢాకా, కలకత్తా, పాట్నా నుంచి గొంతుల్ని మారెడిమోకి కలిపే ఒక పవిత్రదారం అది. దాని చుట్టుత చేరే వాళ్లం మేము. చండీస్తోత్ర పఠనం ఒక పవిత్ర విషయాన్ని అల్లుకుంటూ ఆ తల్లి ఆగమనానికి భూమిక సిద్ధం చేసేవాళ్లం.
కానీ ఇపుడొక భిన్నమైన నిశ్శబ్దం. ఒక పండుగ ముగిసిన తర్వాత సహజమైన శూన్యం కాదు. ఆ పండుగ సారాంశం ఎగిరిపోయిన శూన్యం.
అసలు మన పూజకు ఏమైంది?
ఒకప్పుడు శ్లోకాలు ప్రసారం చేసే వాయుతరంగాలు, వార్తా పత్రికలు ఇప్పుడు రోజువారీ విషాన్ని సరఫరా చేస్తున్నాయి. మహాలయ నాటి నుంచి ఒక విభిన్నమైన ఉచ్ఛారణ మొదలయింది. అది ఆవాహన చేసేది కాదు- బహిష్కరించేది, ద్వేషపూరితమైనది.
ముస్లింలను వ్యాపారాల నుంచి ప్రక్షాళ చేయటం, హింస చేయడానికి ముందస్తు తయారీకి గర్భా నృత్యం, దేవి స్వచ్ఛత పేరిట జీవనోపాధుల విధ్వంసం. ఒక శక్తిగా ఒక సహానుభూతిగా పండుగకు కేంద్రస్థానంలో ఉండేటటువంటి దివ్యమైన స్త్రీత్త్వపు పూజ- ఒక అస్త్రంగా మారింది. ఇపుడది అధిక సంఖ్యాకుల ఆధిక్యతను ప్రకటించే క్రతువుగా మారిపోయింది. మన అల్పబుద్ధికి, క్రూరత్వానికి ప్రతీకగా మన ఉమ్మడి అసమ్మతి ప్రదర్శంచబడుతోంది.
ఈ దేవతకు భక్తులుగా ప్రకటించుకునే వాళ్లు, తనను అత్యధికంగా అపవిత్రం చేసేవాళ్లు కూడా. వాళ్లు అధికారం అహంకారపు మత్తులో మునిగి ఒక ఆరాధనకు కాకుండా ఒక భయంకరమైన ఆత్మలేని అమానవీయ సమూహాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రతువునంతా తొలిచేసి దాని హృదయం స్థానంలో విద్వేషపు రాతిహృదయం పెట్టారు.
ఈ బాధాకరమైన ప్రశ్నలే మనకు మిగిలిపోయాయి. ఆ తల్లి ఈ అపహాస్యాన్ని చూస్తున్నదా? మనందరం ఆమె పిల్లలమే కదా? మరి ఆమె పిల్లల్ని వేధించడానికి ఆమె పేరును వాడుకోవడాన్ని చూస్తూ ఉండిపోతున్నదా? ద్వేషం మాత్రమే నిండిపోయిన వారి హృదయాలలో తన అనిత్యపు సారాంశాన్ని పెంచేది సాకేది రక్షించేది, అన్నింటినీ లీనం చేసుకునేదైన తన సారాంశాన్ని ఆ భక్తులలో ఆవాహన చేయలేదా ఆమె? ఆమె అసలు ఎందుకు తిరిగి వస్తున్నది? ఒక సాన్నిహిత్యం కరువైన సమాజాన్ని తన యాచనల పట్ల కూడా భీతావాహమైన ఉదాసీనతగల సమాజాన్ని, ఆమె దేనికి ప్రతీకగా నిలబడిందో దాన్నింతటినీ ఆ ఆరాధనంతటినీ ఒక అవహేళనగా తయారు చేసిన సమాజాన్ని ఆమె ఎందుకు సందర్శిస్తున్నది.
సుపరిచితమైన లంగరులు పోయాయి. అమ్మ, బాబుజీలు జ్ఞాపకాల ఆకృతులుగానే ఇప్పుడు మిగిలారు. మరి దుర్గా? ఆమె కూడా దూరం అయ్యిందనిపిస్తుంది. ఆమె స్ఫూర్తిని వాళ్లు తీసేస్తున్నారు. కేవలం విగ్రహాలు మిగిలాయి. అందమైన ఖాళీ మూర్తులు, వీటి వెనుక అణిచివేసే గొప్పఖాళీతనం వేలాడుతున్నది. పూజ ప్రారంభమైయ్యింది. కానీ నేను నాకు తెలిసిన దేవతా స్ఫూర్తి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాను.
అనువాదం: దేవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
