Reading Time: 7 minutes
ఒక సంస్థగా 1925 నుంచి 47 మధ్య కాలంలో ఆరెస్సెస్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఏ ఉద్యమంలోనూ భాగస్వామి కాలేదు.
నేడు తిరుగులేని దేశభక్తులుగా తమకు తాము కితాబులిచ్చుకుంటున్న రాజకీయ పక్షం దేశంలో ఉత్తుంగతరంగంలా ఎగిసిన వలస ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో వీసమెత్తు పాత్ర పోషించలేదని తెలిస్తే విస్మయంచెందక తప్పదు. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గోల్వాల్కర్ ఏకంగా బ్రిటిష్ వ్యతిరేక జాతీయవాదం హానికరమని ప్రకటించారు.
‘‘భౌగోళిక జాతీయవాదం, ఉమ్మడి శతృవు అన్న భావనల పునాదిగా నిర్మితమైన భారత జాతీయత హిందూ జాతీయతలోని సానుకూల అంశాలు, ప్రేరణ పొందాల్సిన అంశాలను మరుగునపడేసింది. దాంతో దేశంలో జరుగుతున్న ‘‘అనేక జాతీయోద్యమాలు’’ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలుగా మిగలిపోయాయి. బ్రిటిష్ వ్యతిరేకతే దేశ భక్తిగా, జాతీయవాదంగా గుర్తించబడింది. ఈ ప్రతీఘాత జాతీయవాదమే యావత్ స్వాతంత్య్రోద్యమం నడకనూ, దానికి నాయకత్వం వహించిన వారినీ, ప్రజలనూ ప్రభావితం చేసింది. (బంచ్ ఆఫ్ థాట్స్, పే. 152- 153)’’
కానీ నిజాలు ఇలా ఉన్నాయి: హిందూమహాసభకు, జనసంఘ్‌కు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతికంగా, నిర్మాణపరంగా వెన్నుదన్నుగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను కేబీ హేగ్డేవార్ 1925 సెప్టెంబరు 25న ప్రారంభించారు. అప్పటి నుంచీ 1947 వరకూ దేశంలో కాంగ్రెస్, మరో పార్టీ లేదా స్వాతంత్య్రోద్యమంలో బలిదానాలు గావించిన ఏ బృందమైనా ఇచ్చిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లో ఆరెస్సెస్ ఎన్నడూ భాగస్వామి కాలేదు.
తనంతట తానుగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఉద్యమానికీ పిలుపునివ్వలేదు. ఏ ఒక్క ఉద్యమాన్నీ నిర్మించలేదు. కనీసం ఆకాలీలు 1924- 25లో గురుద్వారాల సంస్కరణ ఉద్యమానికైనా సిద్ధమైంది. కానీ ఆరెస్సెస్ ఈ మాత్రం కార్యాచరణకు కూడా సిద్ధం కాలేదు. లేదా ఆకాలంలో విప్లవకారులు చేపట్టినట్లు బ్రిటిష్ అధికారులను హతమార్చే చర్యలకు కానీ, గదర్ వీరుల తరహాలో తిరుగుబాటు కోసం కానీ, వలసదారుల్లోనూ, సైన్యంలోనూ ప్రభుత్వ వ్యతిరేకత పెంపొందించేందుకు కానీ ప్రయత్నం కూడా లేదు. జాతీయతే తమ ధర్మమని చెప్పుకుంటున్న వీరి గత చరిత్రను చూస్తే తలెత్తే ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.
జాతీయోద్యమానికి దూరంగా ఉండి కూడా జాతీయవాదులమని చెప్పుకోగల ఘనత..
ఆరెస్సెస్ ఆశయం, ఆచరణ అంతా ఒంటెత్తుపోకడతో కూడిన ధార్మిక జాతీయవాదమన్న వాస్తవాన్ని గ్రహించినప్పుడు పై ప్రశ్నలకు సమాధానాలు గుర్తించటం తేలికే. మన వారసత్వమైన జాతీయోద్యమం ఈ ధార్మిక జాతీయవాదాన్నే మతోన్మాదమ గుర్తించింది. అది భారత జాతీయవాదం కాదని స్పష్టం చేసింది. ఆరెస్సెస్ మౌలిక లక్ష్యం ఒక్కటే. ముస్లిం ఆధిపత్యం బూచిని చూపించి హిందూ సమాజాన్ని ఐక్యం చేయటం, ఆ పేరుతో హిందూ సమాజాన్ని తన మతోన్మాద రాజకీయాల వైపు ఆకర్షించటం. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవార్ ఆరెస్సెస్‌ను ప్రారంభించటానికి ముందు నాగపూర్‌లో కాంగ్రెస్‌లో ఓ మధ్యంతర శ్రేణికి చెందిన నాయకుడు కూడా. సహాయ నిరాకరణ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు.
అయితే అప్పట్లో హిందూ మహాసభ నాయకుడుగా ఉన్న బీఎస్ మూంజీకు గట్టి అనుయాయులుగా హెగ్డేవార్ ఉన్నారు. మూంజీ ఇటలీ వెళ్లి ముస్సోలిని కూడా కలిసి వచ్చారు. ఇటలీలోని ఫాసిస్టు సంస్థలను అధ్యయనం చేశారు. వాటి నిర్మాణం, పనితీరుచూసి స్ఫూర్తి పొందారు. మూంజీ 1923లో వీడీ సావర్కార్ ప్రచురించిన హిందూత్వ గ్రంథం నుంచి స్ఫూర్తి పొందారన్న అభిప్రాయం ఉంది. ఆ పుస్తకం 1923లో పుస్తకరూపంలో వచ్చినా అంతకు ముందే చలామణిలో ఉంది. ఈ పుస్తకంలోనే హిందూత్వ మౌలిక సిద్ధాంతం వివరించారు సావర్కార్. భారతదేశం హిందువులకు మాత్రమే చెందిన దేశం, పుణ్యభూమి, పితృభూమి భారతదేశం అయినవారే హిందువులు, ముస్లింలకు ఈ దేశంలో స్థానంలేదు. క్రైస్తవులకు స్థానంలేదు. ఈ ప్రమాణాల్లో ఇమిడే వాళ్లే భారతీయులు.
ఆరెస్సెస్ ఏర్పడిన రెండేళ్లకే దేశంలో సైమన్ వ్యతిరేక ఉద్యమం పెల్లుబికింది. కానీ ఈ ఉద్యమంలో ఆరెస్సెస్ మచ్చుకు కూడా కనిపించలేదు. మరికొంత కాలం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా లాహోర్‌లో జరిగిన వార్షిక కాంగ్రెస్ సమావేశాల్లో జవహర్లాల్ నెహ్రూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంపూర్ణ స్వాతంత్య్రమే లక్ష్యమని ప్రకటించారు. 1930 జనవరి 26 స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలని, దేశంలో గ్రామ గ్రామాన త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రజలందరూ ప్రతిజ్ఞ పూనాలని కూడా నిర్ణయించబడింది.
ఆరెస్సెస్ కూడా సంపూర్ణ స్వాతంత్య్రం లక్ష్యానికి కట్టుబడి ఉంది కాబట్టి జెండా ఎగురవేస్తామని అయితే తాము ఎగురవేసే జెండా త్రివర్ణపతాకం కాదనీ, కాషాయ ధ్వజమనీ హెగ్డేవార్ ప్రకటించారు. తాము జాతీయవాదులమని చెప్పుకుంటూనే అసలైన జాతీయోద్యమానికి దూరంగా ఉండే ఆరెస్సెస్ స్వభావానికి ఇది చక్కని ఉదాహరణ. 

ఇదేవిధంగా అదే సంవత్సరం శాసనోల్లంఘనోద్యమం జరుగుతున్నప్పుడు- ఈ ఉద్యమంలో తాను వ్యక్తిగా పాల్గొంటాననీ, ఓ సంస్థగా ఆరెస్సెస్ ఈ ఉద్యమానికి దూరంగా ఉంటుందని హెగ్డేవార్ ప్రకటించారు. తన నిర్ణయానికి అనుగుణంగానే హెగ్డేవార్ ఆరెస్సెస్ అధినేత పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగతంగా తాను జాతీయవాదిని అని చెప్పుకోవడానికి తాను జైలుకు కూడా వెళ్లారు. ఆ విధంగా జైళ్లల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను ఆరెస్సెస్ వైపు ఆకర్షించేందుకు హెగ్డేవార్ ప్రయత్నించారని ఆయన జీవిత చరిత్ర రచయిత రాశారు.
దేశంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించేందుకు హెగ్డేవార్ సుముఖంగా లేకపోగా వలసపాలనను ఓ అనూహ్య ఘటనగా వర్ణించారని చెప్పేందుకు ఆధారాలున్నాయి. 1939లో కాంగ్రెస్ అధ్యక్షపదవికి రాజీనామా చేసి సుభాష్ చంద్రబోస్‌ను కలవడానికి కూడా హెగ్డేవార్ సిద్ధం కాలేదన్నది కూడా వాస్తవమే. సుభాష్ చంద్రబోస్ 1939లో హెగ్డేవార్ మిత్రుడైన గోపాల్ ముకుంద్ హుద్దార్ను బొంబాయిలో కలిసి తనకు హెగ్డేవార్‌తో భేటీకి అవకాశం కల్పించమని కోరారు.
సుభాష్ కోరిక మేరకు హుద్దార్ దియోలాలి వెళ్లారు. ఆ సమయంలో హెగ్డేవార్ తన ఓ సంపన్నుడైన మిత్రుని ఆశ్రయంలో ఉన్నారు. హెగ్డేవార్కు సుభాష్ కోరిక తెలియచేసి వెనక్కు వచ్చిన హుద్దార్ చూడ్డాని ఆయన చాలా మందితో ఉల్లాసంగా మాట్లాడుతూ ఆరోగ్యపరంగా కుశలంగానే ఉన్నట్లున్నారు. కానీ ఆరోగ్యం బాగాలేదు అన్న సాకుతో బోసు అభ్యర్థనను తిరస్కరించారని తెలిపారు. ఈ మధ్యకాలంలో వెలువడుతున్న హిందూత్వ నేతల గురించిన వ్యాఖ్యానాల్లో ఈ విషయానికి ఎక్కడా తావుండదు.
హిందూ మహాసభను విమర్శించిన సుభాష్ చంద్రబోస్..
సుభాష్ చంద్రబోస్‌ను 1940ల్లో హిందూ మహాసభ అధ్యక్షుడుగా ఉన్న సావర్కార్ కలిసిన విషయం గురించి చిలువలు పలువలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎక్కడి వరకూ వెళ్లిందంటే, అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధంలో ఓ శిబిరంగా ఉన్న జర్మనీ, జపాన్‌లను కలిసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు సిద్ధం కావల్సిందిగా సావర్కారే సుభాష్ చంద్రబోస్‌కు సలహా ఇచ్చారని చెప్పేదాకా. పైగా బోసుకు, భగత్ సింగ్‌కు, ఖుదీరాం బోసుకు కూడా సావర్కారే ప్రేరణ అని కూడా వింత వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.
సుభాష్ చంద్ర బోస్ కుటుంబ సభ్యులు, ఇతర విప్లవకారుల వారసులు, మరికొంతమంది వ్యాఖ్యాతలు ఈ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టారు. సావర్కార్ పట్ల సుభాష్ చంద్రబోస్ ఎంత కటువుగా ఉండేవాడో బోస్ చరిత్ర నుంచి కొన్ని పేజీలు, అధ్యాయాలు తిరగేసి మరీ హిందూత్వవాదుల ప్రచారానికి అడ్డుకట్ట వేశారు.
చారిత్రక వాస్తవాలు ఇలా ఉన్నాయి: 1940ల్లో బోస్ అరెస్టు కావడానికి ముందు సావర్కార్‌ను, జిన్నాను కలిశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఐక్య సంఘటన నిర్మిద్దామని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని బోస్ తన స్వీయ చరిత్ర నా పోరాట చరిత్ర రెండో భాగంలో వివరించారు. ఆ సమయంలో జిన్నా బ్రిటిష్ సహకారంతో స్వతంత్ర పాకిస్తాన్ కలను సాకారం చేసుకునే విషయం ఆలోచిస్తుంటే సావర్కార్ మాత్రం ప్రపంచ పరిణామాల గురించి ఏ మాత్రం ధ్యాస లేకుండా ఆరెస్సెస్ శ్రేణులు బ్రిటిష్ సైన్యంలో చేరటం ద్వారా సాయుధ శిక్షణ పొందవచ్చన్న ఆలోచనతో ఉండిపోయారని స్పష్టంచేశారు.
ఖైదీగా ఉన్న కాలంలో సావర్కార్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. జైలు నుంచి 1937లో విడుదల కాగానే ఆయన్ను హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఎన్నుకోవటం, ఆరేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగటం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. చివరికి ఆనారోగ్యంతో ఆయన తన బాధ్యతలు విడనాడాల్సి వచ్చింది. తొలుత అండమాన్ జైలు నుంచి తర్వాత ఎరవాడ జైలు నుంచి సావర్కార్‌ను విడుదల చేయటానికి ముందు ఆయన విస్పష్టంగా తాను బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏ రాజకీయ కార్యాచరణలోనూ భాగస్వామిని కానని రాతపూర్వక హామీ ఇచ్చారన్నది చరిత్ర నమోదు చేసిన సత్యం.
సావర్కార్ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం..
ఆయన తన దైనందిన కార్యకలాపాలు నడుపుకోవడానికి పారితోషికం కూడా ముట్టేది. హిందూ మహాసభ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సావర్కార్ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరుజాతులని ఆయన తీర్మానించారు. ఈ విషయంలో జిన్నా కంటే ముందే సావర్కార్ ఈ రాగం అందుకున్నారు. తర్వాతనే జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని అనుసరించటం మొదలు పెట్టారు. హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఆయన చేసిన ఉపన్యాసాలన్నింటా ముస్లిం వ్యతిరేకత, కాంగ్రెస్ వ్యతిరేకత, గాంధీ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
రెండో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత బ్రిటిష్ పాలన పట్ల ఆరెస్సెస్, హిందూ మహాసభ అభిప్రాయాల్లోని తేడాలు, వైరుధ్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. దేశంలో రాజకీయ పక్షాల అభిప్రాయాలు తెలుసుకోకుండానే భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామిని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మంత్రిమండలులు రాజీనామా చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేయటంతో ఏర్పడిన ఖాళీలను మతోన్మాద శక్తులు భర్తీ చేశాయి. తన స్వభావానికి తగ్గట్టుగానే ముస్లిం లీగ్ కూడా ప్రభుత్వాలు ఏర్పాటులో సహకరించేందుకు సిద్ధమైంది.
ఈ ప్రయత్నంలో తాను కూడా వెనకంజ వేసేది లేదన్నట్లు హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్న సావర్కార్ 1939లోనే ఒకవేళ కాంగ్రెస్ మంత్రివర్గాల నుంచి వైదొలగితే తాము ఆ స్థానాన్ని భర్తీ చేయానికి సిద్ధమని, హిందువులు, బ్రిటిష్ ప్రభుత్వం మిత్రులని ప్రకటించారు. (అప్పటి వైస్రాయి బ్రిటిష్ ప్రభుత్వంలో హోంమంత్రికి జెట్లాండ్కు రాసిన లేఖ, 7 అక్టోబరు 1939, జెట్లాండ్ పత్రాలు, 18వ సంపుటి. రీల్ 9).
బ్రిటిష్ వారికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించాలని, ఈ నిర్ణయాన్ని సామ్రాజ్యవాదంతో మిలాఖత్ కావటంగా ప్రచారం చేసే మూర్ఖుల మాటలు వినొద్దని సావర్కార్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సైన్యంలో కూడా చేరాలని ఆయన హిందువులకు పిలుపునిచ్చారు. సైన్యంలో ముస్లింల పాత్ర ఆహ్వానించదగినది కాదనీ, హిందువులను సైనిక విద్యల్లో సిద్ధహస్తులను చేయాలన్న తన సైద్ధాంతిక అవగాహనకు కొనసాగింపుగానే సావర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అవగాహనకు లోబడే హిందూమహాసభ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో చేరింది. కొన్ని చోట్ల ముస్లిం లీగ్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయటానికి వెనకాడలేదు.
బెంగాల్లో ఫజులుల్ హక్ నేతృత్వంలోని ప్రభుత్వంలో హిందూమహాసభ నేత శ్యాం ప్రసాద్ ముఖర్జీ మంత్రిగా కూడా వ్యవహరించారు. 1940 ముస్లిం లీగ్ వార్షిక సమావేశాల్లో ఫజులుల్ హక్ స్వతంత్ర పాకిస్తాన్ తీర్మానం ప్రతిపాదించిన నాయకుడు. 1942లో కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం జాతీయోద్యమాన్ని దారుణంగా అణచివేసి నాయకులందరినీ జైళ్లల్లో కుక్కుతున్న తరుణంలో అటు హిందూమహాసభ, ఇటు ముస్లిం లీగ్‌లు రెండూ అధికార భాగస్వామ్యంలో తలమునకలై ఉన్నాయి.
నిజానికి క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తుందని ఊహించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ‘‘అటువంటి ఉద్యమాన్ని ఏ ప్రభుత్వమైనా విచక్షణ లేకుండా అణచివేయాలి. కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నించినా బెంగాల్లో ఈ ఉద్యమం వేళ్లూనుకోకుండా చూస్తాము’’ అని రాశారు. (ఈ విషయంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని అప్పట్లో ఢాకా విశ్వవిద్యాలయంలోనూ, శాంతినికేతన్లో అధ్యాపకుడుగా పని చేస్తున్న గెసెప్పో తుక్కి వ్యాఖ్యానించారు. తుక్కి బెంగాల్లో ఫాసిస్టు సిద్ధాంతం వ్యాప్తికి కృషి చేసిన ప్రముఖుల్లో ఒకరు. కసోలరి రాసిన ఇన్ ది షాడోస్ ఆఫ్ స్వస్తిక పుస్తకం నుంచి).
ముస్లిం లీగ్‌తో ప్రభుత్వాలు ఏర్పాటు చేయటానికి వెనకాడని హిందూ మహాసభ..
రెండో ప్రపంచ యుద్ధకాలంలో సింధ్ రాష్ట్రంలోనూ, వాయువ్య రాష్ట్రంలోనూ ముస్లిం లీగ్‌తో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటానికి హిందూ మహాసభ ఏ మాత్రం వెనకాడలేదు. 1940 నాటికే పాకిస్తాన్ ఏర్పాటు తమ లక్ష్యమని ముస్లిం లీగ్ ప్రకటించింది. ఇంకా చెప్పాలంటే సింధ్ అసెంబ్లీలో జీఎం సయ్యద్ ప్రతిపాదించిన ‘భారతదేశంలోని ముస్లింలు వేరే జాతి’అన్న తీర్మానాన్ని ఆమోదించిన మంత్రివర్గంలో హిందూమహాసభ కూడా భాగస్వామి.
హిందూ మహాసభ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేసిన మాట నిజమే. కానీ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసేందుకు మాత్రం సిద్ధం కాలేదు. అటు ముస్లిం లీగ్, ఇటు హిందూ మహాసభ బ్రిటిష్ వారికి స్నేహ హస్తం అందిస్తూ కాంగ్రెస్‌ను శతృవుగా చూడటం, అదే సమయంలో తమను తాము జాతీయవాదులుగా ప్రకటించుకోవటం ఆసక్తికరమైన విషయం. హిందూమహాసభ హిందూజాతీయవాదాన్ని ముందుకు తెస్తే ముస్లిం లీగ్ ముస్లిం జాతీయవాదాన్ని ముందుకు తెచ్చింది.
ఎవరు ఏమి చెప్పుకుంటున్నప్పటికీ వలస కాలం నాటి భారత చరిత్రకు సంబంధించినంతవరకూ జాతీయోద్యమం ప్రధాన స్రవంతిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ బ్రిటిష్ వలస పాలన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ముస్లిం లీగ్, హిందూ మహాసభలు మాత్రం మతోన్మాద రాజకీయాలను విస్తరించే లక్ష్యంతో పని చేశాయన్నది అక్షర సత్యం. ఈ మతోన్మాద శక్తులు బ్రిటిష్ వారికి ఎంతగా వత్తాసు పలికినా 1946లో జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూడక తప్పలేదు. అన్ని రాష్ట్రాల్లో కలిపి మూడు సీట్లు మాత్రమే గెలిచారు మతోన్మాదులు. (1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 489 స్థానాలకు ఎన్నికలు జరిగితే హిందూ మహాసభ గెలిచింది కేవలం 10 సీట్లు మాత్రమే) ఈ విధంగా హిందువులతో సహా దేశమంతా ఈ మతోన్మాద శక్తులను సంపూర్ణంగా తిరస్కరించటంతో గంగవెర్రులెత్తిన హిందూమతోన్మాదులు తమ గాంధీని హత్య చేయటం ద్వారా తమ తిరస్కారానికి ప్రతీకారం తీర్చుకున్నారు.
ఆరెస్సెస్ కూడా 1930- 32 మధ్యకాలంలో దేశాన్ని కుదిపేసిన శాసనోల్లంఘన ఉద్యమంలో భాగస్వామి కాలేదు. తర్వాత జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ భాగస్వామి కాలేదు. జాతీయత, జాతీయవాదం గురించిన ఆరెస్సెస్ వాగాడంభరంతో ఆ సంస్థ పట్ల ఆకర్షితులైన యువతకు మాత్రం రానున్న మహత్తర పోరాటానికి వీలుగా తమ శక్తియుక్తులు పదిలపర్చుకోవాలని ఆరెస్సెస్ పిలుపునిచ్చింది. ఆరెస్సెస్ గురించి హోంశాఖ రూపొందించిన నివేదికలో ‘‘(1942 నాటి) ఉద్యమం సందర్భంగా జరిగిన ఓ సంఘ్ సమావేశంలో సంఘ్ శ్రేణుల్లో కాంగ్రెస్ పిలుపుకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఆయా శ్రేణులు ఈ నిర్ణయాన్ని అమలు చేశాయి’’ అని నివేదించింది.
అప్పటి బొంబాయి రాష్ట్ర హోంకార్యదర్శి హెచ్‌వీఆర్ అయ్యంగార్ 1944 ఫిబ్రవరి 16న రాసిన లేఖలో ‘‘సంఘ్ తనను తాను చట్టం కట్టుబాటుకు లోబడి ఉంచుకుంది. ప్రత్యేకించి 1942లో మొదలైన అల్లర్లలో పాల్గొనకుండా దూరంగా ఉంది. (హోం డిపార్ట్మెంట్ (ప్రొసీడింగ్స్) 28/08/1942(పొలిటికల్(1) ఫైల్ 28/03/1943 (పొలిటికల్(1)’’.
చివరి మాటగా చెప్పాలంటే ఒక సంస్థగా ఆరెస్సెస్ 1925- 47 మధ్యకాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఏ పోరాటంలోనూ, ఉద్యమంలోనూ పాల్గొనలేదు అని నిర్ధారించవచ్చు.
కానీ, 1946లో దేశంలో మతకల్లోలాలు పరాకాష్టకు చేరినప్పుడు మాత్రం ఆరెస్సెస్ అకస్మాత్తుగా తెరమీదకు వచ్చింది. ఈ పోరాటం కోసమే ఆరెస్సెస్ ఎంతకాలంగానో ఎదురు చూస్తోంది. మతోన్మాద కలహాలు చెలరేగుతున్నప్పుడు హిందువులను సంరక్షించే సంస్థగా తనను తాను చిత్రీకరించుకోవటం తేలికైన పని. దేశ విభజనకు ముందు, తర్వాత జరిగిన మతకల్లోలాల సమయంలో ఆరెస్సెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన రెచ్చగొట్టుడు ప్రసంగాలు, రచనలకు సంబంధించి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి.
మహాత్మ గాంధీయే మతోన్మాద శ్రేణులకు ప్రధాన లక్ష్యంగా మారారు. ఆయన ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి ఎన్నో తప్పుడు పనులు చేశారని దుష్ప్రచారం జరిగింది. త్రివర్ణపతాకం జాతీయ పతాకంగా తిరస్కరిస్తూ 1947 ఆగస్టులో ఆర్గనైజర్‌లో వ్యాసాలు రాశారు. చివరకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఈ దేశానికి త్రివర్ణపతాకం జాతీయ పతాకం కాదని, కాషాయ జెండా లేదా భాగ్వాధ్వజమే హిందువుల నుంచి గౌరవం అందుకోగలిగిన జెండా అని ప్రకటించారు. శ్యామ్ ప్రసాద్ మాటల్లో ‘‘మూడు అన్నది దుర్లక్షణం. మూడు రంగుల జెండా అంటే ఈ దేశానికి ఎప్పుడైనా నష్టజాతకమే.’’
2002 వరకూ జాతీయ జెండా ఎగురవేయని ఆరెస్సెస్..
ఆరెస్సెస్ తన విశ్వాసాలకు అనుగుణంగానే 2002 వరకూ ఎన్నడూ జాతీయజెండా ఎగురవేయలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో అనేక ఒత్తిళ్ల నడుమ త్రివర్ణపతాకం ఎగురవేయటానికి సిద్ధమైంది.
వలసపాలన నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలను కోర్చి సాధించుకున్నదీ స్వాతంత్య్రమన్న అవగాహనతో చూసినప్పుడు 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో హిందువులు, ముస్లింలు భుజంభుజం కలిపి పోరాడిన దృశ్యాలు కళ్లముందు మెదులుతాయి. దాదాబాయి నౌరోజి, ఆయన సహచరులు ప్రతిపాదించిన సంపద తరలింపు సిద్ధాంతం మనల్ని కదిలిస్తుంది. ఈ సిద్ధాంతమే భారత జాతీయవాదానికి కావల్సిన ఆర్థిక పునాదులు సమకూర్చింది. జాతీయ కాంగ్రెస్ కేంద్రంగా అనేక విన్నూత్న ఉద్యమాలు కదలాడిన నేల కనిపిస్తుంది.
బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్‌లలో ప్రజలను వీధుల్లోకి తెచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం, మహాత్మ గాంధీ రాకతో రూపం, సారం మార్చుకున్న జాతీయోద్యమం, జలియన్ వాలాబాగ్ నరమేధం, గురు కథ మోర్చాల సందర్భంగా అహింసాయుతంగా సాగిన అకాలీల యాత్రలు, బార్డోలి రైతుల సాహసం, వలసపాలకుల వెన్నులో చలి పుట్టించిన ఉప్పు సత్యాగ్రహం, క్షమాభిక్ష అడగటానికి సిద్ధంకాని భగత్ సింగ్, ఆయన సహచరులను ఉరితీయటంపై నోరు మెదపని దేశం, క్విట్ ఇండియా ఉద్యమ నినాదం, అజాద్ హింద్ ఫౌజ్ తిరుగుబాటు, ఎర్రకోటలో సాగిన విచారణలు నడుమ నూతన భవిష్యత్తును అన్వేషిస్తూ స్వతంత్ర భారతం 1947 ఆగస్టు 15న ప్రారంభించిన కొత్త జీవితం ఓ సినిమా పనోరమలా రీలు తిరుగుతుంది.
నేడు తామే జాతీయవాదులమని గావుకేకలు పెడుతున్న వారికోసం బూతద్దం వేసి వెతికినా- పైన ప్రప్తావించిన సంఘటనలు, సందర్భాలు, పోరాటాల్లో ఎక్కడా కనిపించరు. ఈ వాస్తవం ఇలా ఉంటే ఇంటింటికీ త్రివర్ణపతాకమంటూ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల కోసం ఆర్భాటం చేస్తున్న వారికి ఈ స్వాతంత్య్రం వేలు, లక్షలమంది బలిదానాలతో సిద్ధించిందన్న కనీస జ్ఞానం ఉన్నదా? అనే సందేహం తలెత్తుతుంది. ఇలా బలిదానం ఇచ్చిన వారికి స్ఫూర్తిగా నిలిచింది మతోన్మాద జాతీయవాద దృక్ఫథం కాదు. భారతీయతా జాతీయవాదమే.
లేదా కనీసం మహోత్తుంగ తరంగంలా ఎగిసిన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకపోవటం తప్పే అన్న ఒక్క క్షమాపణ కానీ, జరిగిన లోపాలను గుర్తించి అంగీకరించే పెద్ద మనసు కానీ, మహాత్ముడిని హత్య చేసే స్థాయికి వెదజల్లిన మతోన్మాద విషబీజాలు, వాటి వలన కలిగిన నష్టం పట్ల కనీసం అపరాధభావన కానీ, స్వాతంత్య్ర సాధన అనంతరం 55 ఏళ్ల పాటు త్రివర్ణపతాకాన్ని ఎగురవేయటానికి మొరాయించిన ఆరెస్సెస్ తప్పిదం గురించి కానీ, కేవలం 1998లో కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మాత్రమే జాతీయ జెండానే నెత్తిన పెట్టుకుంటున్న తీరు గురించి కానీ ఎక్కడైనా పల్లెత్తు ప్రస్తావన లేకపోవటం గమనిస్తోంది ఈ దేశం.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత మృదులా ముఖర్జీ నాలుగు దశాబ్దాల పాటు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. జేన్ఎన్యూలో సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ విభాగానికి చైర్‌పర్సన్‌గానూ, సామాజిక శాస్త్రాల విభాగానికి డీన్‌గానూ, నెహ్రూ మెమోరియల్ లైబ్రరీకి డైరెక్టర్‌గానూ పని చేశారు.)
ఈ వ్యాసాన్ని ఇంగ్లీష్‌లో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
