“మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గమే మాకు పెద్ద మార్గదర్శకం. ఆయన తపన, సత్యాచరణ, ప్రేమతో నిరసన ద్వారా సామాజిక మార్పు సాధ్యమని గాంధీ నిరూపించారు. ప్రేమ ద్వారా సాధించిన విజయమే చిరకాలం నిలిచే విజయమని ఆయన జీవితం చెప్పింద”ని విఖ్యాత మార్టిన్ లూథర్ కింగ్ అంటారు.
గాంధీజీ ఉదయించి 156 సంవత్సరాలు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో స్వరాలు మారాయి, తరాలు మారాయి, తత్వాలు మారాయి, శాస్త్ర సాంకేతికతలు సైతం కాంతి వేగంతో రోజురోజుకు మారుతూనే ఉన్నాయి. కానీ, గాంధీజీ జీవన నడవడిక, బోధనలు యావత్ ప్రపంచానికి నేటికీ అనుసరణీయం- విశ్వ వ్యాప్తం.
గాంధీజయంతి సందర్భంగా, ఆయన ఆత్మకథ “The story of My experiments with truth” పుస్తకంలోని కొన్ని అంశాలను గుర్తుచేసుకొని ప్రేరణ పొందుదాం. నేటికీ ఆ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా వుంటూ దాదాపు ప్రపంచ ప్రముఖ భాషల్లో అనువాదమైంది. బైబిల్ స్థాయి పుస్తకంగా గాంధీజీ “సత్యశోధన”ను కొంతమంది ప్రపంచ ప్రముఖులు నేటికీ భావిస్తున్నారు.
కాలాతీత వ్యక్తి మహాత్మా గాంధీ..
“రక్త మాంసాలతో కూడిన గాంధీలాంటి యుగపురుషుడు ఈ భూమిపై నడిచాడంటే రేపు రాబోయే తరాలు నమ్మవు” అని మహాత్ముడికి విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అక్షర శ్రద్దాంజలి ఘటించారు.
“కాల పరిణామంలో తరాల ఆలోచనలు మారుతుంటాయి. మరి నా జీవితపు సందేశం ఎంతవరకు కాలాతీతంగా నిలుస్తుంది?” అనుకోని, భావితరాలు తన ఆత్మకథను ఎందుకు తెలుసుకోవాలనే ప్రశ్నను- తనకు తానే గాంధీ వేసుకున్నారు.
అందుకే తన జీవితాన్ని ఓ శాస్త్రవేత్తలా విశ్లేషించి ఇలా ఆరంభించారు: “ఆత్మకథ రాయాలని నేను అనుకోలేదు. నేను అనేక సమయాల్లో ఎన్నో సత్యప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాలని ఆత్మకథగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితం అటువంటి పలు సత్యప్రయోగాలతో నిండి ఉంది “.
“I have nothing new to teach the world. Truth and non-violence are as old as the hills.”
మొదట దైవమే సత్యమనే దశ నుంచి తన అనుభవాలతో సత్యమే దైవమనే స్థాయిని పొంది, సత్యమయం కావడానికి అహింసయే ఏకైక మార్గం అంటారు గాంధీజీ.
“సుమారు పదమూడోయేట నాకు పెండ్లి అయింది. పదమూడేళ్ల వయస్సులో జరిగిన నా పెళ్లిని సమర్థించుకునేందుకు నైతిక కారణం ఒక్కటి కూడా లేదు” అంటూ ఆనాటి బాల్య వివాహాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“ఏ సమయంలో నేను మేల్కొని వుండాలో, ఆ సమయంలో నా మనస్సు భోగవాంఛలకు లోబడింది” అంటూ తన తండ్రి మరణించిన సంఘటనను గుర్తుచేసుకుంటూ చాలా బాధపడ్డారు.
“నేను ఒక సామాన్య విద్యార్థిగానే వుండేవాడిని” అని రాసుకున్న ఆయన గురించి ప్రపంచంలోని వివిధ రంగాల్లో ప్రముఖులు సైతం పుస్తకాలు రాసేలా చరిత్రను శాసించారు. అందుకే , “నీ జననం సాధారణమే కావచ్చు. కానీ నీ మరణం చరిత్ర సృష్టించాలనీ”అని అబ్దుల్ కలాం అంటారు.
భారతీయుల హక్కుల కోసం, అధికారాల కోసం ఎంత గట్టిగా ఉద్యమిస్తానో వారిని సంస్కరించడానికి అంతగా కృషి చేస్తూ వుంటానని- బ్రిటిష్ వారికి బోధపడేలా పారిశుద్ధ్య ఉద్యమాన్ని గాంధీ నడిపి పర్యావరణపు పరిశుభ్రత పాటించడం గురించి ఆనాడే ఆచరించి చూపారు.
“మనలో నిద్రావస్థలో వున్న మంచి భావాలను, గుణాలను మేల్కొలపగల శక్తి కలవాడే”కవి అంటూ జాన్ రస్కిన్ రచించిన “Unto the Last” పుస్తకం తనపై చూపించిన ప్రభావాన్ని వివరించారు. “సదాగ్రహా”న్ని సత్యాగ్రహమని మార్చి భవిష్యత్తు తరాలకు దారి చూపే బలమైన కాంతిజనకాన్ని అందించారు.
మన స్వాతంత్ర్య సంగ్రామంలోనే కాదు; నేటికీ సత్యాగ్రహమనేది అసమానతలు, అస్పృశ్యత విధానాలు, వివక్షతలు, అమానవీయ ఘటనలు వంటి తదితర అనాగరిక అంశాలపై యుద్ధం చేస్తూనే ఉంది.
“ప్రజలు నన్ను ఎంత పొగడినా, ఆ పొగడ్త నన్ను ఏమరుపాటులో పడవేయదు. అటువంటి పొగడ్త నా మదిలో గుచ్చుకుంటూ వుంటుంది. మనస్సులోని వికారాలను జయించడం ప్రపంచాన్ని శస్త్రాస్త్రాల యుద్ధంలో జయించడం కంటే కష్టమైనదని నాకు కలిగిన అనుభవం. నా మనస్సులో గల వికారాలను చూసి సిగ్గుపడ్డాను. కానీ ధైర్యం మాత్రం సడలనీయలేదు. సత్యశోధన కావించుతూ రసానందం పొందాను” అంటూ తను అందరిలాంటి వాడినేనని, కానీ నిత్యం పరిపూర్ణత్వం కోసం శూన్యం పొందడానికి ప్రయత్నిస్తున్నానని పుస్తకం ముగింపులో అంటారు.
1893 జూన్ 7వ తేదీ రాత్రి, పీటర్ మారిట్జ్ బర్గ్ రైల్వేస్టేషన్లో ‘మహాత్మా గాంధీ’అని ప్రపంచానికి తెలిసిన ఒక యువ భారతీయ న్యాయవాది రైలు నుంచి విసిరివేయబడ్డారు. అతను శ్వేత జాతీయులు మాత్రమే వుండే బోగీ నుంచి కదలడానికి నిరాకరించారు” అంటూ ఓ బక్క పలుచని వ్యక్తి గురించి రాసిన మాటలు కొన్ని తరాలుగా ప్రభావితం చేస్తున్నాయి.
“వెయ్యేళ్ల తర్వాత కూడా ఆ వెలుగు ఈ దేశంలో కనిపించి, ప్రపంచం చూసి అసంఖ్యాక హృదయాలకు ఓదార్పునిస్తుంది” అంటూ భారత ప్రథమ ప్రధాని నెహ్రూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం “The light has gone out” అక్షరాల నిరూపించబడింది.
గాంధీజీ జయంతి లేదా వర్థంతిని పురస్కరించుకుని; నేటితరం విద్యార్థులకు, యువకులకు గాంధీజీ ఆత్మకథ పుస్తకాలను బహుమతిగా ఇద్దాం. ఆయన కలల సౌధంలో జీవిస్తూ ఆయన ఆశయాలకు ప్రాణం పోద్దాం. ఎందుకంటే:
“Some men changed their times
One man changed the world for all times.”
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
