గర్జించే గగనతలంలో
యుద్ధ విమానాల గర్జనల మధ్య
గాలిలో ఎగిరేది పతాకమా?
లేదా పసిపాపల ప్రాణాలా?
మట్టిలో కలిసేది
సైనికులు, సామాన్యుల దేహాలా?
లేదా కన్నతల్లుల కడుపు కోతలా?
విసిరిన బాంబు పేలుడు
ఒక్క క్షణం శబ్దమే కావచ్చు
కానీ
దాని ప్రతిధ్వని
తరాల తరబడి
కన్నీటి నదులై ప్రవహిస్తుంది
సరిహద్దుల రేఖల కోసం
రక్తంతో గీసిన గీతలు…
ఎప్పుడైనా శాంతి పువ్వులు పూయించాయా?
లేక ద్వేషపు ముళ్లనే నాటాయా?
ఒక గుండె ఆగిపోతే
ఒక కుటుంబం శ్వాస ఆగిపోతుంది
ఒక నగరం బూడిదైపోతే
ఒక దేశం మానవత్వం బూడిదవుతుంది
“విజయం” పేరుతో
వెన్నెలను కాల్చేసినవారు!
నిశీధి నిశ్శబ్దంలో
నిద్రపోగలరా?
పొగమంచులో కనిపించేది
వీరుల ప్రతిమలే కాదు
వితంతువుల మౌనం
అనాథల ఆర్తనాదం
అమాయకుల కన్నీటి గీతలు
చివరికి
యుద్ధం గెలిచిందేమో గానీ
మనిషి మాత్రం ఓడిపోయాడు
రక్తపు వర్షం కురిసిన నేలపై
పుట్టేది పూలు కాదు ప్రశ్నలే..
అవి ఇంకా అడుగుతూనే ఉన్నాయి…
“ప్రాణం కన్నా గొప్పది
ఏ అధికారం?
మనిషి కన్నా పెద్దది
ఏ సరిహద్దు?”
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
