ఆటవిక నియమాలు అమలు జరిగే ప్రపంచంలో తిరిగి భారతదేశం పొయ్యి వెలిగించుకునేందుకు కట్టెపుల్లలు ఏరుకునే దుస్థితికి నెట్టబడుతోంది.
భారత విదేశాంగ మంత్రి ఎట్టకేలకు తాను కోరుకున్నది సాధించుకున్నారు. కానీ దాంతో ఏమి చేయాలో తెలీని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌లు ప్రారంభించిన యుద్ధం దశ, దిశ తెలీకుండా సాగుతున్న స్థితిలో విశ్వగురువుగా తనను తాను చెప్పుకుంటున్న మోదీ కూడా ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారు.
ఇరాన్ మెరుగైన సామర్థ్యం, ప్రతిభా పాటవాలతో యుద్ధంలో ఓడిపోకుండా నిలబడింది. దాంతో విమర్శకులందరి నోళ్లకూ తాళం పడింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఓడిపోకుండా యుద్ధంలో నిలిచి ఉండటమే ఘన విజయమని పలువురు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆటవిక రాజ్యానికే ఓటు
పోలిక కోసమే చెప్పినా భారత విదేశాంగ మంత్రి ఆటవిక రాజ్యానికే ఓటు వేస్తామని ఓ సందర్భంలో చెప్పారు.
నిర్దిష్ట నిబంధనలు, నియమాలు, చట్టాల ఆధారంగా నడిచే ప్రపంచం తన విశ్వసనీయతను కోల్పోయిందనీ, అటువంటప్పుడు ఆటవిక రాజ్యమే మేలు అన్న భావనతో జైశంకర్ పై వ్యాఖ్య చేశారు.
మ్యూనిచ్ సమావేశంలో ఛలోక్తి
2025 ఫిబ్రవరిలో మ్యూనిచ్‌లో జరిగిన అంతర్జాతీయ రక్షణ వ్యూహాలకు సంబంధించిన సమావేశంలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ చర్చాగోష్టిలో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పై వ్యాఖ్యలు చేశారు.
ఈ చర్చాగోష్టిలో పాల్గొన్న యూరోపియన్ ప్రతినిధి ప్రపంచం యథాతథ స్థితిలో కొనసాగాలంటే కనీసం కొన్ని నియమ నిబంధనలు పాటించటం అవసరమని వాదించారు. అటువంటి నియమ నిబంధనలు లేకపోతే ప్రపంచం ఆటవిక రాజ్య దశకు దిగజారుతుందని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా జోక్యం చేసుకుంటూ భారత విదేశాంగ మంత్రి ఆటవిక రాజ్యమైనా తమకు ఓ మేరకు సమ్మతమేనని ఛలోక్తి విసిరారు.
సాన్నిహిత్యంపై అంచనాలు
ఈ ఛలోక్తి విసిరేటప్పుడు అప్పుడే కొత్తగా రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆటవిక చక్రవర్తి ప్రవర్తన ఎలా ఉంటుందన్న విషయంలో జైశంకర్ ఊహకు అంది ఉండకపోవచ్చు.
ట్రంప్, మోదీల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని జైశంకర్ ఈ వ్యాఖ్య చేసి ఉండొచ్చు.
వారిద్దరి బంధం ఎంత గొప్పదో తర్వాతి పరిణామాలు రుజువు చేశాయి. ఆటవిక రాజు దయా దాక్షిణ్యాలు ఉంటే ఇక కావల్సింది ఏముంది అని జైశంకర్ భావించి ఉండొచ్చు.
భారత్‌కు ముప్పుతిప్పలు
కానీ విముక్తి దినోత్సవ సుంకాల పేరుతో ఆటవిక రాజు తాండవం మొదలు పెట్టిన తర్వాత కానీ మోదీ, జైశంకర్ ద్వయానికి తెలిసిరాలేదు.
మొదటిగా ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్యంలో ఆటవిక రాజ్యం స్థాపించారు. అప్పటి వరకూ అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తున్న నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. అప్పటి వరకూ అమెరికా వివిధ ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ఇచ్చిన హామీలను కూడా ట్రంప్ ఉపసంహరించుకున్నారు.
తమకేదో ఆటవిక రాజ్యంలో పెద్ద పీట వేస్తారని ఆశించినా అంతిమంగా భారతదేశాన్ని నానా ముప్పుతిప్పలు పెట్టారు ట్రంప్.
వలస రాజ్యాల ఆలోచన..
వాణిజ్య సుంకాల విషయంలో ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో అనుభవం ద్వారా తెలుసుకున్నప్పటికీ భౌగోళిక రాజకీయాల్లో కూడా జైశంకర్ అదే సూత్రానికి, విశ్వాసానికీ కట్టుబడి ఉన్నారా అన్న సందేహం కలుగుతోంది.
2025 మ్యూనిచ్ సమావేశాల సందర్భంగా ఆటవిక రాజ్యాన్ని అక్కున చేర్చుకుంటున్నట్టు చెప్పారు జైశంకర్.
కానీ ఏడాది తిరక్క ముందే అదే మ్యూనిచ్ సమావేశాల్లో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో మార్కో చేసిన ఉపన్యాసంతో ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో అర్థమైన వారంతా ఖంగు తిన్నారు.
ప్రపంచాన్ని తిరిగి వలసలుగా మార్చి పాదాక్రాంతం చేసుకుంటామని రూబియో నిస్సిగ్గుగా ప్రకటించారు.
దక్షిణార్ధ గోళంలోని దేశాలను కేవలం 20వ శతాబ్దం ఆరంభం నాటికి ఉన్నట్లు సామంత రాజ్యాలుగా మార్చుకుంటామని ప్రకటించారు.
ఈ మహత్తర కర్తవ్యంలో భాగస్వాములు కావటం ద్వారా యూరప్ తన పాత కాలపు వలసలను తిరిగి దక్కించుకోవచ్చన్న రూబియో మాటలు విన్నప్పుడు సభికులు ముక్కున వేలేసుకున్నారు.
కొత్త ప్రపంచ క్రమం
కేవలం అప్పటి వరకూ అమల్లో ఉన్న నిర్దిష్ట విధి విధానాలు, నియమ నిబంధనలకు లోబడి ఉన్న అంతర్జాతీయ సంబంధాలను, వ్యవహారాలను తోసిరాజని వాటి స్థానంలో నూతన ప్రపంచ క్రమాన్ని నిర్మించాలని రూబియో ప్రతిపాదిస్తున్న విషయాన్ని గుర్తు తెచ్చేందుకు మాత్రమే మ్యూనిచ్ సమావేశాల్లో రూబియో ఉపన్యాసాన్ని ప్రస్తావిస్తున్నాను.
ఇదే వైఖరికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అందిపుచ్చుకున్నారు. నిజానికి అదో గుర్తు పెట్టుకోవల్సిన సందర్భం.
స్పందించలేని పరిస్థితిలో..
ఇక ఆ ఆటవిక రాజ్యం మన కళ్ల ముందే ఆవిష్కృతమవుతోంది. మరి మన విశ్వగురువుకు మాత్రం ఏమి చేయాలో పాలుపోవటం లేదు. మౌనముద్ర దాల్చి ఉన్నారు.
ఆటవిక రాజ్యానికి నాయకత్వం వహిస్తున్న పెద్ద మనిషి పెద్ద రాయిని పగలగొట్టి వర్ధమాన దేశాలపైనే కాక అభివృద్ధి చెందిన సొంత మిత్ర దేశాలపైనా విచ్చలవిడిగా విసురుతున్నారు. అతని విషయంలో ఎలా స్పందించాలో కూడా అర్థం కాని స్థితిలో భారత పాలకులున్నారు.
అడవిలో దారేది?
మరి మన అత్యంత ప్రియమైన విదేశాంగ మంత్రి ఈ అడవి నుండి దారెలా కనుక్కుంటారు? ఎలా బయటపడతారు?
రష్యా సంవాదంలో చేదు అనుభవం
ఇక్కడ మరో గమ్మత్తైన వింత పరిణామం ఉన్నది. ఈ మధ్యనే రష్యా సంవాదం పేరుతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో చోటుచేసుకున్న పరిణామం ఇది.
ఈ సమావేశాన్ని కూడా అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. దానికి కావాల్సిన ఆర్థిక సహాయసహకారాలు అందించింది మాత్రం భారత విదేశాంగ శాఖ.
గతంలో చైనా ఆర్థిక శక్తిగా ఎదుగుతుంటే చూస్తూ ఊరుకున్నట్లు భారత దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతుంటే చూస్తూ ఊరుకునే సమస్యే లేదని అమెరికా విదేశాంగ శాఖ ఉపకార్యదర్శి బాహాటంగా స్పష్టం చేశారు.
మృగరాజు ప్రతినిధిగా ఈ సమావేశాలకు హాజరైన ఓ వ్యక్తి నుంచి మన విదేశాంగ శాఖ అటువంటి స్పందనను ఆశించిందా అని ఎవరైనా జైశంకర్‌ను ప్రశ్నించాలనుకోవటం పొరపాటు కాదు కదా.
వ్యూహాత్మక మౌనం
గత 13 నెలలుగా ఈ పిచ్చి రాజు, ఆయన రాజ్యం ప్రపంచంతో చెడుగుడు ఆడుకొంటోంది. ఇప్పటి వరకూ ట్రంప్ ప్రతిపాదించిన అటవీ నీతిలో భాగంగా ఇరాన్, వెనిజులా, లెబనాన్, గాజా, క్యూబాల్లో అగ్రరాజ్యం సాగిస్తున్న నరమేధం పట్ల భారత ప్రభుత్వం వ్యూహాత్మక మౌనాన్ని పాటించింది.
కల్లుతాగిన కోతి చందంగా వ్యవహరిస్తున్న ఈ మృగరాజు ఇప్పటి వరకూ కొన్ని నియమ నిబంధనలకు లోబడి కొనసాగిస్తున్న తన ఆధిపత్యం స్థానంలో నిర్నిరోధమైన ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు. ఆ దట్టమైన అడవిలో అంతర్జాతీయ సంబంధాల గురించి కొత్త పరిభాష తయారవుతోంది. ఇక్కడ మృగరాజు దేశాలను బాంబులు వేసి మరీ రాతియుగం కాలానికి నెట్టేస్తామని ఘీంకరిస్తున్నారు.
పరుగులు తీస్తున్న ఇంధన సంక్షోభం
మరోవైపు అటువంటి బాంబు దాడి అవసరం లేకుండానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాతియుగం వైపు పరుగులు తీస్తోంది.
ప్రపంచమంతా చమురు, ఇంధన వనరుల కొరతతో అల్లాడుతోంది. త్వరలో గ్యాస్, పెట్రోల్ కూడా రేషన్ పద్ధతిలో ఇవ్వడం మొదలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఎరువుల కొరత భారతదేశం వంటి పేద దేశాలు, అధిక ప్రజానీకం ఉన్న దేశాల్లో ఆహార సంక్షోభానికి, ఆకలి చావులకు తెర తీసే అవకాశం కనిపిస్తోంది.

1973, 1979లలో ప్రపంచం చవి చూసిన ఇంధన సంక్షోభం కంటే ప్రస్తుతం చవిచూడబోయే ఇంధన సంక్షోభం భయంకరంగా ఉండబోతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అధిపతి ఫతీహ్ బిరోల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1973, 1979 సంక్షోభాల సమయంలో కేవలం రోజుకు ఐదు మిలియన్ బారెళ్ల చమురు మార్కెట్లోకి రాకుండా ఆగిపోయిందనీ, కానీ ఈ సారి తొలి వారాల్లోనే 12 మిలియన్ బారెళ్ల చమురు మార్కెట్లోకి ప్రవేశించకుండా ఆగిపోయిందని, రానున్న కాలంలో ఈ మోతాదు మరింత పెరగనున్నదని ఆయన హెచ్చరించారు.
వెనక్కి నెట్టేస్తున్న విధానాలు
భారతదేశంలో వంట గ్యాస్ కొరత కారణంగా జనం తిరిగి గ్రామాలకు వెళ్లటం ప్రారంభించారు. దాదాపు ఎనిమిది కోట్ల గ్రామీణ కుటుంబాలు తిరిగి వంటచెరకు పై ఆధారపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఈ ఆటవిక రాజ్యం భారతదేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు వెనక్కి నెట్టేయనున్నది.
ఎంత వెనక్కు నెట్టేయనున్నదంటే దేశం అన్నం వండుకోవడానికి వంటచెరకు కోసం చెట్లు పుట్టల వెంట తిరిగేంత వెనక్కు నెట్టేయనున్నది.
తాను సంతోషంగా కౌగిలించుకోవడానికి సిద్ధపడిన ఆటవిక రాజ్యంలో తన అనుభవాలేమిటో చెప్పమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఏదో ఒక నాడు పార్లమెంట్లో ప్రతిపక్షం నిలదీయాలి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
