“నిలబడి నీళ్లు తాగే కంటే, పరిగెత్తి పాలు తాగడం మేలు”- ఇది తెలుగునాట పలువురి నోట నానిన మాట. ఇది తప్పని “పరిగెత్తాలి, పాలు తాగాలి” అనే ధోరణిని అవలంభిస్తున్నది ఈ తరం.
రాజకీయ నాయకులు ఈ రెండింటికి అతీతంగా కొన్ని సార్లు, వీటి సోయే లేకుండా మరికొన్ని సార్లు తమ భావాలను వ్యక్తీకరిస్తుంటారు. ఆచరణలో చూపిస్తుంటారు.
అయితే బీఆర్ఎస్ మాజీ నాయకులు కల్వకుంట్ల కవిత ఆలోచనా, ఆచరణ అంతుచిక్కడం లేదు.
నిలకడ, నిబద్ధత రాజకీయాలు చేస్తానని చెప్పుకుంటున్న ఆమె మాటలకు, చేతలకు పొంతన లేదు.
ఒకే ఒక వ్యక్తిగా పరిగెత్తి పాలు తాగుతానని ఒకసారి, నిలబడే నీళ్లు తాగడమే మేలనే అన్యాపదేశ మాటలు చాలా సార్లు చెప్పారు.
లిక్కర్ కేసులో క్లీన్ చీట్ అందుకున్న తర్వాత ఆమె మాట్లాడుతున్న మాటలు గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. అసలామే ఉద్దేశ్యమేమిటో అర్థం కావడం లేదని చాలా మంది అంటున్నారు.
ఎవరూ అడగకుండానే, ఎవరూ డిమాండ్ చేయకుండానే చాలా విషయాలను ఆమె మీడియా ముఖంగా వెల్లడించారు. అందులో తెలంగాణ ఉద్యమకారులు, బీసీలు, ఎస్సీలు, మహిళా సాధికారతవంటి విషయాలు ఉన్నాయి.
సామాజిక సమతూకానికా? లేకా రాజకీయ అవసరమా?..
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఎవరూ డిమాండ్ చేయకుండానే అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం పక్కన అతిచిన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ఏర్పాటు చేశారు. ఈ చర్యపై తీవ్ర విమర్శలను ఆమె ఎదుర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు సముచితమైన గౌరవం ఇవ్వాలనే ఆలోచన మంచిదే.
కానీ, ఆచరణే అభ్యంతరకరమని అప్పట్లోనే చాలా మంది బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ విమర్శలపై ఆమె పెద్దగా స్పందించలేదు.
అంతకంటే కూడా దళిత ఎజెండాను తానే ముందుకు తీసుకువెళ్తున్నానే సంకేతాలను ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె తాపత్రయం సామాజిక సమతూకానికా? లేకా రాజకీయ అవసరమా? అనే చర్చ కూడా నాడు సోషల్ మీడియా కేంద్రంగా జరిగింది. దీనిపైనా ఆమె స్పందించలేదు.
మహిళల సమస్యలు, వారి హక్కులు- ఆత్మగౌరవం తదితర అంశాలను ప్రధాన ఎజెండాగా చేయాలని అనుకున్నారు.
ఏ సామాజిక వర్గం మహిళల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నారో చెప్పాలని బహుజనుల వాదుల నుంచి ఆమెకు ప్రశ్న ఎదురయ్యింది.
ఈ విషయంలోనూ విస్పష్టంగా భవిష్యత్తు ఆలోచనను వ్యక్తీకరించలేకపోయారనే అభిప్రాయం రాజకీయ పండితుల్లో ఉన్నది.
ఆత్మగౌరవమున్న మహిళగా కవిత..
తాజాగా వెలుగుమట్ల ఘటన గురించి ఆమె ప్రత్యక్ష ఆందోళనకు పూనుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అయినప్పటికీ, ఆత్మగౌరవమున్న మహిళగా సానుకూలతను పొందారు. దీనికి ప్రధాన భూమిక లిక్కర్ కేసు నుంచి బయటపడిన అనంతర పరిణామం.
ఆమె తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం, అంతకు పూర్వం- ఆమె చేసిన ఆత్మగౌరవ వ్యాఖ్యలు ప్రజలను ఆకట్టుకున్నాయి. మునుపటి వ్యతిరేకతను తగ్గించేలా ఉన్నాయి.
ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ, బీసీ ఎజెండా తనకు వంద అంశాల్లో ఒకటని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీసీ వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
గడిచిన రెండేళ్లుగా సామాజిక అంశాలు, బీసీల రాజకీయ భవిష్యత్తే తనకు ప్రధానమని చెప్పారు. ఇప్పుడు వందల్లో ఒకటని అన్నారు. అంటే, తన రాజకీయ ఎజెండాలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నారో చెప్పకనే చెప్పారు.
ఒక సంస్థ, ఒక రాజకీయ పార్టీ విశాలమైన ఎజెండాతో పని చేయవచ్చు తప్పులేదు. అది మంచిది కూడా. కానీ, ఎజెండాకు ఆయువు పట్టైన అంశాలను పూర్వపక్షం చేయడం ఏమిటనేదే ఇక్కడ ప్రశ్న.
తెలంగాణలో రాజకీయ వాటాల గురించి బీసీలు, దళితులు మాట్లాడుతున్నారు.
అంతేకాదు, ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ మేరకు ఫలితాలను కూడా సాధించారు. జనరల్ స్థానాల్లో మునుపెన్నడూ లేని విధంగా బీసీలు గెలుపొందారు. అరుదైన అంశమైనప్పటికీ, ఎస్సీలు కూడా కొన్ని ప్రాంతాల్లో గెలుపొందారు.
బలపడుతున్న బహుజన రాజకీయ ఆలోచన..
చాలా గ్రామాల్లో, మున్సిపాలిటిల్లో ఈ ఎన్నికల ఫలితాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మధ్య తరగతి ప్రభావితం చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ముఖ్యమంత్రి నిర్వహించిన సకల జనుల సర్వే బీసీ జనాభా ఎంత ఉందో చెప్పింది. అధికారిక లెక్కలు బయటికి రాకున్నా, వారు అమలు చేసిన పథకాల ద్వారా ఈ విషయం బలంగా వ్యక్తమైంది.
అనంతరం, తెలంగాణలో బహుజన రాజకీయ ఆలోచన బలపడుతూ వస్తున్నది. మూడు అసెంబ్లీ ఎన్నికలు, అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రాభల్యం కనబడింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ఫలితాలు పునరావృతం కాలేదు. ఈ విషయాలను కల్వకుంట్ల కవిత పరిగణలోకి తీసుకున్నారో లేదో తెలియదు. కానీ, తొలుత బీసీ ఎజెండా గురించి మాట్లాడారు. ఇప్పుడు తనకు ఆ విషయం అతి ప్రాధాన్యత కాదని తేల్చేశారు.
బీఆర్ఎస్ అధినేత, ఆయన కుటుంబీకులపై 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఇవాళ్టి అధికార పక్షం, నాటి విపక్షం- కాంగ్రెస్ ఒక ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.
మారుతున్న పరిణామాల్లో ప్రస్తుతం..
ఆ కుటుంబంలో అందరు పదవుల్లో ఉన్నారని, సంపాదించుకుంటున్నారని, కుటంబ పాలన అనే తదితర అంశాలను బలంగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంలోనే కవిత లిక్కర్ కేసు తెరపైకి వచ్చింది. అనంతరం వెలువడిని అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు ఎట్లా ఉన్నాయో అందరికి తెలుసు.
ఇప్పుడిప్పుడే, తన పట్ల ప్రజల్లో కొంత సానుకూలత వస్తున్నది. తనకు నైతిక మద్దతు లభించే పరిస్థితి రేఖా మాత్రంగా కనిపిస్తున్నది.
ఈ సందర్భంలోనే బీసీల ఎజెండా గురించి తన మనసులో మాటను కవిత చెప్పారు. ఏ ఉద్దేశంతో చెప్పిన ఈ వ్యాఖ్యలు, ఆమెకు నష్టం కలిగించేవే. అంతేకాదు, నిలకడైన పోరాటం, స్థిరమైన ఎజెండా ఈ రెండు తన వద్ద లేవని చాలామంది భావిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
