కాలక్రమేణా పునరావృతమయ్యే మూలధన సంచిత ప్రక్రియను పరిగణలోకి తీసుకుందాము. విషయాలకు నిర్దిష్టత ఇవ్వడానికి, స్థిర మూలధనం 80గానూ అస్థిర మూలధనం 20గానూ, మొత్తం సామాజిక మూలధనం 100కి సమానం అనుకుందాము. అదనపు విలువ రేటు 100 శాతంగా ఉండనివ్వండి.
ప్రతి సంవత్సరం ఆస్తి మూలధనం 20 శాతానికి సమానమైన అదనపు విలువను ఇస్తుంది. ఐదు సంవత్సరాలలో ఆసలు మూలధనంపై సంపాదిచిన అదనపు విలువే 100 శాతం అవుతుంది. అదనపు విలువ పెట్టుబడిదారునికి చేరుతున్నందున, అతను దానిని ఉత్పత్తిలో పెట్టుబడి పెడుతున్నందున, అతను తన అధికారం క్రింద ఎక్కువమంది కార్మికులను తీసుకురాగలడు. మూలధన సంచితం ఆవిధంగా పెట్టుబదిదారుని నియంత్రణా ప్రాంతాన్ని విస్తరిస్తుంది. అంతేకాకుండా, కార్మికులపై ఆధిపత్యం వహించడానికి పెట్టుబడిదారుడి శక్తిని పెంచుతుంది.
పెట్టుబడిదారీ విధానం తర్కంలో అంతర్లీనంగా ఉన్న అపహాస్యం ఏమిటంటే ‘ఒక సంవత్సరపు అదనపు శ్రమతో కార్మికవర్గం సృష్టించిన పెట్టుబడి గమ్యం తరువాతి సంవత్సరంలో అదనపు కార్మికులను నియమించడం.’
పెట్టుబదిదారీ ఉత్పత్తి ముందుకు సాగినకొద్దీ పోగుపడిన అదనపు విలువ మొత్తం సామాజిక మూలధనంలో మరింత ప్రబల శక్తి అవుతుంది. ప్రాథమిక లేదా ఆదిమ మూలధన సంచితం ఫలమైన, అసలు మూలధనం ద్వారా లెక్కించబడిన ఈ నిష్పత్తి చాలా చిన్నదిగా మారుతుంది. అంతేకాకుండా సున్నా వైపు వెళ్ళే ధోరణి కలిగి ఉంటుంది. మళ్ళీ సంఖ్యా దృష్టాంతం సహాయపడుతుంది. ఐదేళ్ళలో అసలు మూలధనం ఉత్పత్తి చేసిన అదనపు విలువ రెండోదానికి సమానమని పైన చెప్పిన ఉదాహరణలో చూశాము.
ప్రతిసంవత్సరం అదనపు విలువలోని సగ భాగాన్ని అనుత్పాదకంగా పెట్టుబడిదారీ వర్గం ఖర్చుబెట్టి మిగిలిన సగ భాగాన్ని పెట్టుబడిగా పెడుతుందని ఊహించు కుంటే, పది సంవత్సరాల కాలంలో అసలు మూలధనం ఉత్పత్తి చేసిన మొత్తం మూలధనం 100కు సమానం అవుతుంది. అదనంగా, అసలు మూలధన శాఖలన్నీ, అవే ఎక్కువ అదనపు విలువను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో కొంత భాగం మూలధనంగా మారుతుంది, మరింత అదనపు విలువను పుట్టిస్తుంది, ఇది ఇలా సాగుతూనే ఉంటుంది.
పరిణామంగా, సమాజంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి ఆధిపత్యం వహించడంతో ‘గత చెల్లించని శ్రమ యజమాని, నిరంతరం పెరుగుతున్న స్థాయిలో జీతం చెల్లించని కార్మికుల శ్రమను బలవంతంగా స్వాధీనం చేసుకోడానికి ఏకైక షరతు. ఒక పెట్టుబడిదారుడు ఎంత ఎక్కువగా మూలధన సంచితం చేయగలిగితే అంత ఎక్కువగా మూలధన సంగ్రహం చేసుకోగలడు.’ అతనికి ఆ మిగులు ఇవ్వబడుతుంది.
స్పష్టంగా ఒక ముఖ్యమైన పరివర్తన సంభవించింది. మనం సాధారణ సరుకుల ఉత్పత్తి నియమాలతో ప్రారంభించాము. సరుకులు వాటి విలువకు మారకమవుతాయని ఊహించాము. ప్రస్తుత విశ్లేషణలో కూడా సరుకుల మారకం వాటి విలువకే తగినట్లు జరుగుతంది. విడివిడిగా జరిగిన ప్రతి లావాదేవీ సమాన మార్పిడి నియమానికి అనుగుణంగా ఉంటుంది. ఇంకా మొత్తం సమాజంలో ఎవరైనా కార్మిక వర్గానికీ, పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య సంబంధాలను పరిశీలిస్తే, అక్కడ స్పష్టంగా స్పష్టమైన మారకం మాత్రమే ఉంది. మొదటిది శ్రమలు అన్నిటినీ చేస్తుంది, వాటి నుంచి విలువ, అదనపు విలువ ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా రెండవది అదనపు విలువ పైన ఆధారపడి జీవిస్తుంది. అదనపు విలువను(మూలధన రూపంలో సంచితం చేసుకుంటుంది) పోగుచేసుకుంటుంది.
కార్మిక వర్గం నుంచి పెట్టుబడిదారీ వర్గం అదనపు విలువను స్వాధీనం చేసుకోవడంలోని వాస్తవ సంబంధాన్ని నిజానికి సరుకుల సమాన మార్పిడి దాచిపెడుతుంది. ‘ప్రతి ఒక్కరికీ వారి శ్రమ ప్రకారం’ అన్నది సరుకుల అమ్మకందారునికీ, కొనుగోలుదారునికీ మధ్య సంబంధంలోని నియమం. కానీ వర్గాల మధ్య సంబంధంలో ఇతరుల శ్రమ ద్వారా(పెట్టుబడిదారులకు) ఆస్థిగా నియమం మారుతుంది.
మార్క్స్ ఈ విధంగా చెప్పాడు: మొదటగా, ఆస్తి హక్కులు మనిషి స్వంత శ్రమపై ఆధారపడి ఉన్నట్లు మనకు అనిపించాయి. సమాన హక్కులు కలిగిన సరుకుల యజమానులు మాత్రమే ఒకరిని మరొకరు ఎదుర్కొన్నందున, ఇతరుల సరుకులను ఒక మనిషి స్వాధీనం చేసుకోగలిగిన ఏకైక సాధనం తన స్వంత సరుకులను పరాయీకరణ చేయడం మాత్రమే అయినందున; వాటిని శ్రమతో మాత్రమే భర్తీ చేయడం సాధ్యమైనందున, కనీసం కొంత మేరకు అటువంటి ఊహ అవసరం.
అయితే ఇప్పుడు చెల్లించని ఇతరుల శ్రమను లేదా దాని ఉత్పత్తిని పెట్టుబడిదారుడు స్వాధీనం చేసుకునే హక్కుగా ఆస్తి మారింది. తన స్వంత ఉత్పత్తిని తానే స్వాధీనంలో ఉంచుకోవడం కార్మికునికి అసాధ్యమయ్యింది.
ఆ విధంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి నియమాలు, సాధారణ సరుకుల ఉత్పత్తి నియమాలకు వ్యతిరేకమైనవి. ఇంకా అవి సరుకుల ఉత్పత్తి ఆధారంగానే ఉత్పన్నమౌతున్నాయి. ఏ ఒక్క ఒంటరి లావాదేవీ సరుకుల ఉత్పత్తి నియమాన్ని ఉల్లంఘించకపోవచ్చు. అయినా కార్మికుడు ఉత్పత్తి చేసిన అదనపు విలువను పెట్టుబడిదారుడు స్వాధీనం చేసుకోగలదు: ‘ప్రతి ఒంటరి (వస్తు) మార్పిడిలోనూ మార్పిడి నియమాలను అనుసరించినప్పుడు, సరుకుల ఉత్పత్తికి సంబంధించిన ఆస్తి హక్కులను ప్రభావితం చేయకుండానే స్వాధీనం చేసుకునే విధానం విప్లవాత్మకమైనది.’
మనం వివరించిన ఈ మొత్తం ఫలితాల సమితి, సమాన మార్పిడి పరిస్థితులలో కూడా అది అదనపు విలువ సృష్టికి మూలం అయినందున శ్రమ శక్తిని సరుకుగా అమ్మకాలు కొనుగోళ్ళను వెన్నంటి వస్తుంది. శ్రమ శక్తి సరుకుగా మారినప్పుడు మాత్రమె సరుకుల ఉత్పత్తే సాధారణీకరించబడుతుంది.
మూలధన సంచితం– ‘సంయమనం’..
కార్మికుల శ్రమ వలననే అదనపు విలువ కానీ మూలధన సంచితం కానీ సాధ్యమయ్యాయని బ్రిటీష్ శాస్త్రీయ అర్ధ శాస్త్రవేత్తలు స్మిత్, రికార్డోలు గుర్తించారు. కానీ ఆ తరువాత అనుసరించిన పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్తలు పెట్టుబడిదారీ మూలధన సంచితాన్ని పెట్టుబడిదారీ వర్గం ‘సంయమనం’ అని పిలవబడినదానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేశారు.
తాము సంపాదించిన అదనపు విలువను తినడం మానివేయడం వలన పెట్టుబడిదారులు మూలధన సంచితాన్ని చేశారని వారు భావించారు. మరొక మాటలో చెప్పాలంటే పెట్టబడిదారుల, తమ మూలధనాన్ని తద్వారా తన భవిష్యత్ అదనపు విలువను పెంచుకోవడానికి వినియోగాన్ని వాయిదా వేసిన బాధను అనుభవించాల్సిన చర్య, పొదుపు ఫలితంగా పెట్టుబడిదారులు మూలధన సంచితమని సూచించడం జరిగింది.
మార్క్స్ వ్యంగ్యంగా చెప్పినట్లు, ‘ అతను (పెట్టుబడిదారుడు) చేకూర్చుకున్న నివాళి భాగం, దేన్నైతే అతను మూలధన సంచితం చేశాడో దానిని అతను తినక పోవడం వలన పొదుపు చేశాడని, అంటే అతను పెట్టుబడిదారుని కర్తవ్యాన్ని నిర్వహించి, తనను తానూ ధనవంతుడిని చేసుకున్నాడని చెప్పడం జరిగింది.
ఈ ‘సంయమనం’ వాదనలో, పెట్టుబడిదారీ వర్గం సంగ్రహించిన అదనపు విలువను తమ వినియోగాన్ని వాయిదా వేయడంలో అనుభవించిన బాధకు ప్రతిఫలంగా చూడడం పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్తలందరి ధోరణి అయ్యింది, సాంప్రదాయక జ్ఞానం వలే ఇప్పటికీ కొనసాగుతున్నది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 36వ భాగం, 35వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
