దురదృష్టవశాత్తు మొగలులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను జాతీయ తిరుగుబాట్లు కావని, హిందువులైన సైన్యాధికారులు రెండు వైపుల పోరాడిన చెదురుమొదురు ఘర్షణలేనని అర్బన్ నక్సల్స్ భావిస్తారు.
ముందుగా చెప్పాలంటే, భారతదేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చిందని 2014లో కాదని అర్బన్ నక్సల్స్ వాదిస్తారు. ఇంతకన్నా దేశవ్యతిరేక చర్య ఏముంటుంది? ఆ కాలంలో భారతదేశంపై దండెత్తిన అనేక సాయుధ బృందాలలో మొగలులు ఒక బృందం మాత్రమేనని అంటారు. అంతేకాకుండా భారతదేశ దేశ సంపదను కొళ్లగొట్టి మరో దేశంలో స్వర్గధామాలు నిర్మించుకునే బదులుగా; తమ దేశంలోని సైనికులు, పరిపాలనాధికారులు, కళాకారులు, రక్త సంబంధీకులందరినీ మొగలులు దోపిడీ చేయడానికి బదులు సొంత మనుషులుగా భావించారని- వాళ్లు ఇక్కడే బ్రతికారు. ఈ దేశాన్ని నిర్మించారు. తరం తర్వాత తరం ఇక్కడే చనిపోయారని అర్బన్ నక్సల్స్ చెప్తారు.
ఇదేలా సాధ్యమబ్బా?
భారతదేశ సంపదను తరలించుకుపోయిన పాలనకు ముందు ప్రపంచ స్థూలోత్పత్తిలో నాల్గొవవంతు సంపద భారతదేశంలోనే ఉన్నదని, 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో గెలుపొందిన తర్వాత సుంకాలు వసూలు చేసుకునే హక్కును సంపాదించిన తర్వాత బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని కొల్లగొట్టిందని అర్బన్ నక్సల్స్ భావిస్తారు.
ముస్లింల పాలనలో జరిగిన ఘాతుకాలను ఇంతకంటే మించి ఎవరైనా కీర్తంచగలరా?
విదేశీ వలస పాలనకు వ్యతిరేకంగా దేశంలో- మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, వర్గాలు, స్త్రీ- పురుష భేదాలు పక్కన పెట్టి సాగిన అఖిల భారత జాతీయ విముక్తి పోరాటం 1857లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా మొదలై; 1947లో బ్రిటిష్ ప్రభుత్వం దేశం విడిచి వెళ్లేంత వరకు సాగిందని అర్బన్ నక్సల్ నమ్ముతారు. ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి 18వ శతాబ్దంలో కొంతమంది ప్రాంతీయ రాజులు, సామంతులు వలస ప్రభుత్వంతో చేతులు కలిపారని కూడా అర్బన్ నక్సల్ విశ్వసిస్తారు.
వాస్తవం ఇలా ఉండగా సుల్తాన్- మొగలు వంశ పాలనలో దేశాన్ని కడగండ్ల పాలు చేశారని ఓ వాదన చెలామణిలో ఉంది. దురదృష్టవశాత్తు మొగలులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను జాతీయ తిరుగుబాట్లు కావని, హిందువులైన సైన్యాధికారులు రెండు వైపుల పోరాడిన చెదురుమొదురు ఘర్షణలేనని అర్బన్ నక్సల్స్ భావిస్తారు.
స్వాతంత్ర పోరాటంలో వీసమెత్తు పాత్ర పోషించకపోగా, వివిధ సందర్భాలలో వలసపాలకులతో మిలాఖతైన వారి నుంచి దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని; వీరి ఆలోచనలు ఉదారవాద గాంధీయన్ ఆలోచనలకు పూర్తిగా భిన్నమైనవని అర్బన్ నక్సల్స్ భావిస్తారు.
నిజమైన భారతీయత ఓ కులాధిరత అస్తిత్వంలోనో, మతాధిరత అస్తిత్వంలోనో ఉండదని భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన సమ్మిళిత సాంస్కృతిక సహజీవనంలో ఉంటుందని భావిస్తారు. హిందూరాష్ట్ర వాదమే జాతీయతగా భావించే వారికి ఈ విశ్లేషణ మింగుడు పడదు.
ఈ కుహనా జాతియవాదులు ఇంతటతితో ఆగలేదు. నాగరికత ద్వారా నిర్మితమైన హిందుత్వ అస్తిత్వాన్ని, రాజ్యాంగం ద్వారా నిర్మితమైన గణతంత్ర భారత అస్తిత్వం మసకబారుతున్నదనే మరో వాదన ముందుకు తెస్తారు. నాగరికత ద్వారా నిర్మితమైన అస్తిత్వం ధర్మగురువులు లేదా బాబాలు, స్వయంప్రకటిత ధర్మప్రవక్తలు, సన్యాసినులు ఇచ్చే తీర్పులు, చేసే తీర్మానాల కంటే, భిన్నంగా రాజ్యాంగం కులమతాలకతీతంగా పౌరులందరికీ సమాన పౌరసత్వం, హక్కులు, అవకాశాలు, చట్టబద్ధమైన పాలన ఆధారంగా గణతంత్ర భారత అస్తిత్వం నిర్మితమౌతుంది.
బాబాలు, సన్యాసినులు, స్వయం ప్రకటిత ధర్మపరిరక్షకులను ఈ విధంగా తెగనాడితే భారతదేశం విశ్వగురువు ఎలా అవుతుంది? అర్బన్ నక్సల్స్ పాశ్చాత్య ఉదారవాద విలువల ప్రభావంతో కలుషితమైయ్యారు.
ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ముఖ్యంగా చట్టసభలు, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు సమానమైన అధికారాలు ఉంటాయని వాదిస్తారు. నాయకుడు ఎంత శక్తివంతుడైన ప్రజలను సమ్మోహనపరచగలవాడైనా, అతనికి ఈ వ్యవస్థలకు మించిన అతీత శక్తులు ఏవీ ఉండవని వాదిస్తారు. అటువంటి నాయకులు రాజ్యాంగ నిర్మిత వ్యవస్థలను బుట్టలో వేసుకోవడం తమ అప్రజాస్వామిక, చట్టవిరుద్ధ, కార్యకలాపాలను ప్రోత్సహించేలా మీడియా రంగాన్ని లోబరుచుకోవడాన్ని అర్బన్ నక్సల్స్ అంగీకరించరు. సైన్యంతో సహా రాజ్యాంలోని అన్ని వ్యవస్థలు భారతీయులమైన మనకు జవాబుదారీగా ఉండాలని బలంగా నమ్ముతారు.
మరింతదారుణమైన విషయమేంటంటే, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను(ఆర్టికల్స్ 38- 43 వరకు) ఉటంకిస్తూ దేశంలోని వనరులన్నీ ప్రజలకుక చెందినవేనని అసమానతలకు అడ్డుకట్టవేయాలని జాతీయవనరులపై గుత్తాధీపత్యం కూడదని, రాజ్యాంగంలోని నచ్చిన ఆర్టికల్స్‌ను ఉటంకిస్తూ ఆధిపత్య జనబాహుళ్యపు రాజకీయ భావావేశాలకు తూట్లు పొడుస్తూ ఉంటారు.
విద్యాసంస్థలను, బోధనా పద్ధతులను, బోధనా అంశాలను విద్యార్థులలో విమర్శనాత్మక తర్కబద్ధమైన ఆలోచనా ధోరణిని పెంపొందించేందుకు సాధనాలుగా వాడాలని అర్బన్ నక్సల్స్ వాదిస్తారు. వారి అభిప్రాయంలో విమర్శనాత్మక, తర్కబద్ధ ఆలోచనా విధానం రాజ్యాంగం నిర్దేశించిన కర్తవ్యం. కేవలం ‘జాతీయవాదుల’ సంకుచిత ప్రయోజనాలు నెరవేర్చే పావులుగా విద్యార్థులు మారకూడదని అర్బన్ నక్సల్స్ గట్టిగా నమ్ముతారు.
యుద్ధపరిస్థులలో మినహా దేశంలో శాంతియుతంగా సభలు, సమావేశాలు జరుపుకునే హక్కు రాజ్యాంగ ఉల్లంఘనలను సవాలు చేసే, అతిక్రమించే అన్నిరకాల సందర్భాలను, వ్యవస్థలను ప్రతిఘటించాలని కార్యనిర్వాహక వర్గ దాష్టీకాన్ని, అధికారిక అవినీతిని స్వార్థప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని, చట్టాలను వక్రీకరించే ప్రయత్నాలను కఠినంగా వ్యతిరేకిస్తారు.
ఈ విధంగా మూకదళాల మూఢత్వానికి, ప్రజల చట్టబద్ధమైన హక్కలకు మధ్య జరిగే ప్రయత్నాలకు వ్యత్యాసం ఉందని ప్రజల చట్టబద్ధమైన హక్కులను గుర్తించాల్సిందేనని అర్బన్ నక్సల్స్ వాదిస్తారు.
ధార్మిక విశ్వాసాలు కేవలం వ్యక్తిగత జీవితానికే పరిమితం కావాలని, లౌకిక రాజ్యాంగ నిర్దేశిత విలువల సంరక్షణకు విద్యావిధానాలకు విలువివ్వాలని; మతప్రబోధకులు ఎంత గొప్పవారైనా వారి ప్రచారాలు, అంచనాలు, సామాజిక జీవితాన్ని ప్రభావితం చేయరాదని అర్బన్ నక్సల్స్ గట్టిగా అభిప్రాయపడతారు. క్రమశిక్షణ, శాసనబద్ధమైన పాలన కోసం పట్టుబట్టి, శతాబ్దాల తరబడి ధర్మసూత్రాలు ప్రతిపాదించిన విషయాలను విస్మరిస్తూ దేశానికి అరిష్టంగా మారుతున్నారు.
అందుకే మీరు నిజమైన భారతీయులైతే మేము చెప్పినట్టు వినండి. చెప్పింది చేయండి. మీ భారతీయతను నిరూపించుకోండి!
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
