దేశంలోని పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. చేదు వాస్తవాలను కప్పి పుచ్చి, తేనె పలుకులతో ప్రజలను పాలక పక్షాలు మోసగిస్తున్నాయి.
కొన్ని వందల మందికో లేదా వేల మందికో ఉపాధి కల్పిస్తామని చెపుతూ; వేల కోట్ల విలువైన భూములను, అంతే విలువైన పన్ను రాయితీలను ప్రైవేటు కార్పొరేట్లకు అయాచితంగా కట్టబెట్టడమే ఒక ఎత్తు అనుకుంటే- “ఈ దేశం ఏమైపోతే మాకేం, పర్యావరణం ప్రమాదంలో పడితే మాకేం, తర్వాతి తరాలు ఏమైపోతే మాకేం, మా కమిషన్లు మాకందితే చాలు” అన్నట్టుగా అధికారంలో ఉన్న నాయకులు వ్యవహరిస్తున్నారు.
ప్రకృతి వనరులను దోచిపెట్టే కుట్ర…
కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదిస్తున్న ‘అభివృద్ధి’ ప్రాజెక్టులు, ప్రణాళికలు పర్యావరణ విధ్వంసానికి దారితీసేవే. మౌలిక సదుపాయాల కల్పన పేరిట ప్రతిపాదిస్తున్న, ఏర్పాటు చేస్తున్న భారీ ప్రాజెక్టులు, కొత్తగా వెలుస్తున్న కంపెనీలు- అన్నీ కూడా ప్రకృతిని, చెట్లను, అడవులను, వన్యప్రాణులను, పంచభూతాలను హరించే విధంగా ఉన్నాయి. అయితే, భారతదేశంలో పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తక్కువ. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రభుత్వాలు ప్రజలకు తాయిలాల వల విసురుతూ ఉంటాయి.
ఫలానా కంపెనీని స్థాపించడం వల్ల ఆయా ప్రాంతాల్లో జనజీవనంలో మార్పు వస్తోందని- ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రజలను దువ్వుతుంటారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే.
పాలకులకు అధికారం కావాలి. అధికారం కోసం ప్రజలకు హామీ ఇవ్వాలి. అందుకోసం దివిని భువికి తీసుకొస్తామని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగానే ప్రకృతి వనరులు, ముఖ్యంగా భూమి, నీరు కొందరికే చెందే విధంగా వ్యవస్థలు తయారవుతున్నాయి. ప్రకృతి వనరుల మీద సార్వజనీన హక్కులు క్రమంగా బలహీనపడుతున్నాయి.
ప్రపంచ దేశాలన్నీ ఛీ పొమ్మంటే- మనోళ్లు ఆహ్వానిస్తున్నారు..
ప్రపంచంలో ప్రముఖ దేశాలెన్నో ఛీ కొట్టిన వాటిని మనోళ్లు రారమ్మని ఎదురేగి స్వాగతిస్తారు. అమెరికాలాంటి అగ్రదేశాలకు మనోళ్ల గురించి బాగా తెలుసు, కాసులకు కక్కుర్తి పడి దేశానికి ద్రోహం చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడరని, అందుకే దశాబ్దాల కిందటే అక్కడ నిషేధించిన మందులను ఇక్కడ యథేచ్ఛగా అమ్ముకుంటారు. అక్కడ ప్రయోగశాలల్లో తిరస్కరించి, పనికి రావని ప్రకటించిన విత్తనాలను మన దేశానికి అంటగట్టి అమ్ముకుంటారు.
ఇప్పుడు వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న అదానీ గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే, గతంలో ఐర్లాండ్‌లో ఇలాగే గూగుల్ కంపెనీ డేటా సెంటర్ పెడతామంటే ఆ దేశం తీవ్రంగా వ్యతిరేకించింది. నెదర్లాండ్స్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మెటా కంపెనీ ప్రయత్నిస్తే, ఆ దేశం కూడా తమ కొద్దు పొమ్మంది. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు వ్యతిరేకంగా వందలాది ఉద్యమ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ విషయాలేమీ మన పాలకులు మనకు చెప్పరు. చెబితే ఎలా? మనం చైతన్యమైతే ఎలా? వారికొచ్చే వందల, వేల కోట్ల కమిషన్లు రాకుండా పోతాయి కదా..! తర్వాత తరాల సంగతి వారికెందుకు. ఇప్పడు వారు. వారి కుటుంబాలు కోట్లకు పడగలెత్తాలి.
ఈ స్వార్థ, సంకుచిత రాజకీయాలే భవిష్యత్తులో మన దేశాన్ని దారుణమైన స్థితిలోకి నెట్టివేయనున్నాయి. అదేమిటి పెద్దపెద్ద కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే, ఈ పిచ్చి వాగుడు ఏమిటనుకుంటున్నారా?
డేటా సెంటర్ల వల్ల నష్టాలు..
డేటా సెంటర్లు ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంటాయి కాబట్టి; విద్యుత్‌ను అధిక ఉత్పత్తి చేసి, అదనంగా మిగుల్చుకునే దేశాలు సైతం డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి.
మరో విషయమేంటంటే, డేటా సెంటర్లలో కూలింగ్ కోసం లక్షల లీటర్ల నీటి వినియోగం అవసరమౌతుంది. దీనివల్ల స్థానికంగా నీటి కొరత ఏర్పడటంతో పాటు భూగర్బజలాలు క్షీణిస్తాయి. ఈ విషయంపైనే ఇటీవల పలు దేశాల్లో ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేశారు.
హార్డ్‌వేర్ ఫ్రీక్వెంట్ అప్‌గ్రేడ్‌తో వృథా అయిన ఈ-వేస్ట్ గణనీయంగా ఏర్పడుతుంది. స్థానికంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. భారీ కూలింగ్ సిస్టమ్స్ వల్ల స్థానిక వాతావరణం తాపన ఎక్కువ అవుతుంది. దీని ప్రభావం జలవాయు పరిస్థితులపై పడే ప్రమాదం ఉంది.
పార్టీలు ఏవైనా పాలసీ ఒకటే..
చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంకేతిక దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ- కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్‌ప్రెసిడెంట్ బికాస్ కోలీ, గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వాల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.
అమెరికా వెలుపల అతి పెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో నాడు మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేస్తే, ఇప్పుడు గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందంతో భారత్‌లో తొలి ఏఐ నగర నిర్మాణానికి పునాదిపడిందని చంద్రబాబు తనదైన శైలీలో మాట్లాడారు. ఇదే సమయంలో వైసీసీ కూడా స్పందించింది. గూగుల్ డేటా సెంటర్ అనేది నిజానికి అదాని డేటా సెంటర్ అని, ఇది జగన్ పాలనలో ప్రారంభమే అయిందని, అప్పుడే అనుమతులు ఇచ్చామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు ఏవైనా వారి పాలసీ మాత్రం ఒకటే- ప్రజలందరికీ చెందాల్సిన ప్రకృతి వనరులను కొంతమందికే అందిచడం, స్థానిక వనరులను కొల్లగొట్టటానికి హక్కులు ప్రసాదించటం. వైజాగ్ డేటా సెంటర్ ఘనతను పాలక, ప్రతిపక్షాలు ఎవరికి వారు తమ ఖాతాలో వేసుకోవడానికి పోటీ పడుతున్నారు.
పాలక- ప్రతిపక్ష పార్టీ నాయకులకు కనీసం ఈ డేటా సెంటర్ల వల్ల భవిష్యత్తులో పర్యావరణానికి జరిగే హాని గురించి ఏ మాత్రం కనీస జ్ఞానం లేదు. సామాన్య ప్రజలకు ఇంకేం తెలుస్తుంది. అందుకే పాలకుల కల్లబొల్లి మాటలు నమ్మేస్తారు. నిజానికి వైజాగ్ డేటా సెంటర్లో 200 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు రావు. దాని కోసం మన ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమి, దాదాపు 22 వేల కోట్ల రూపాయలు సబ్సిడీని ఇస్తోంది.
ఇతర దేశాలు గూగుల్‌ను ఎందుకు వ్యతిరేకించాయి?
ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంపై ప్రస్తుతం పర్యావరణవేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటును గతంలో కొన్ని దేశాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో భాగంగా ఆందోళనలు చేయడంతో ఆయా దేశాలలో గూగుల్ సంస్థ ఏర్పాటు నిలిచిపోయింది. ఇదంతా ఆయా దేశాల ప్రజల పర్యావరణ చైతన్యంతో జరిగింది.
స్థానిక ప్రజల వ్యతిరేకతతో ఇండియానా పోలిస్‌లో గూగుల్ భారీ డేటా సెంటర్ నిర్మాణ ప్రణాళిక నిలిచిపోయింది. ఫ్రాంక్లిన్ టౌన్షిప్ ప్రాంతంలో 468 ఎకరాల డేటా సెంటర్ కోసం రీజోనింగ్ ప్రతిపాదనను గూగుల్ ఉపసంహరించిందని 2025 సెప్టెంబర్‌లో జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో ప్రకటించారు. భారీ నీటి- విద్యుత్ వాడకం, ఉద్యోగ కల్పన తక్కువగా ఉండటం, పర్యావరణ నష్టాలు; ఇవన్నీ అక్కడి ప్రజలకు ఆందోళన కలిగించాయి.
ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ వినియోగించే నీళ్ళు రోజుకు 2- 3 మిలియన్ గ్యాలన్లు ఉండటంతో, ఈ ప్రభావం తమ వ్యవసాయంపై పడే ప్రమాదం ఉందని, దీంతో పాటు స్థానికంగా నివాసం ఉండే ప్రజలు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడతామని భావించారు. “మీ ఇంటర్నెట్ కోసం మా నీరు, భూమి, విద్యుతు ఎందుకు?” అంటూ ప్రజలు ప్రశ్నించారు. దీంతో ప్రజాఉద్యమానికి తలొగ్గి గూగుల్ తన ఒప్పందం రద్దు చేసుకుంది.
నెదర్లాండ్స్‌లో స్థానిక ప్రజలు, రైతు సంఘాలు హైపర్‌స్కేల్ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి టెక్ కంపెనీలు విస్తారంగా డేటా సెంటర్లు నిర్మించేందుకు యత్నించాయి. స్థానిక ప్రజలు టెక్ కంపెనీల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, అత్యధిక నీటి వనరుల వినియోగం, భూముల కేటాయింపు, విద్యుత్ వినియోగం వల్ల తమ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని భావించి ఆందోళనకు దిగారు. టెక్ కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు ట్రాక్టర్లతో రోడ్లను దిగ్బంధించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రజాభీష్టాన్ని గుర్తించి టెక్ కంపెనీల ఏర్పాటును రద్దు చేసింది.
2021లో మెటా సంస్థ డేటా సెంటర్‌ను తాత్కాలికంగా నిషేధించింది. డేటా సెంటర్ల ఏర్పాటుపై(2024-25) మరింత కఠిన నిబంధనలను ప్రవేశపెట్టారు.
దక్షిణ అమెరికాలోని ఉరుగ్వేలో గూగుల్ ప్రతిపాదించిన డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీవ్రమైన ప్రజావ్యతిరేకతకు కారణమైంది. 2024లో ఈ ప్రాజెక్ట్‌కు నీటిని కేటాయించటంపై స్థానిక ప్రజలు పోరాటం కొనసాగించారు. ప్రజా పోరాటానికి తలొగ్గి అక్కడి ప్రభుత్వ సూచనల మేరకు గూగుల్ తన నీటి వినియోగాన్ని క్రమబద్దీకరించుకొని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.
అమెరికా తర్వాత ఏపీలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలియని విషయం ఏమిటంటే, అమెరికాలోనే డేటా సెంటర్లకు వ్యతిరేకంగా 142 ఉద్యమ సంఘాలు పనిచేస్తున్నాయి.
2023- 2025 మధ్య కాలంలో అమెరికాలో 64 బిలియన్ విలువ కలిగిన డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లు ప్రజా వ్యతిరేకతతో నిలిచిపోయాయి. ఈ విషయంపై డేటా సెంటర్ వాచ్ వెలువరించిన నివేదికలో అమెరికాలోని అరిజోనా, మిజూరీ, ఇండియానాతో పాటు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్లు నిలిచిపోయాయి.
ప్రజా చైతన్యంతోనే ప్రతిఘటన..
భవిష్యత్తు తరాల భద్రత కోసం మేధావులు, పర్యావరణ వేత్తలు డేటా సెంటర్లపై ప్రజల్లో విస్తృతంగా అవగాహనను కల్పించాలి, వాటివల్ల జరిగే నష్టాలను తెలియజేయాలి. ప్రజా చైతన్యంతోనే ఇటువంటి శక్తులను ప్రతిఘటించగలుగుతాం. విదేశాల్లో తన్ని తరిమికొట్టినట్టుగానే పర్యావరణానికి తీవ్ర హాని చేసే ఇటువంటి కంపెనీలు మూటాముల్లె సర్దుకుని పారిపోయేలా చేయాలి.
ఉద్యోగ కల్పన అనే మత్తు మందుతో మనను జోకొట్టి, దేశ ప్రజల భద్రతకే ఎసరు పెట్టే ఇటువంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలి. నాయకులకేం, వారు వేల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారు. ఇక్కడ ఏదైనా ప్రతికూల పరిస్థితులు వస్తే ఝూమ్మని విమానంలో ఎగిరిపోయి విదేశాల్లో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటారు. కాని ఈ భూమిని నమ్ముకుని, ఇక్కడే నివసించే సామాన్య ప్రజానీకం సంగతేంటి? వారి భద్రతకు ముప్పు వాటిల్లే ఎటువంటి చర్య అయినా యావత్ భారత ప్రజానీకం ఒక్కటై ఎదురుతిరగాలి. ఈ మట్టిని, ఈ నేలను కాపాడుకోవాలి. ఇది మన కనీస కర్తవ్యం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
